Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 39


    మొత్తం ముగ్గురు దొంగల్లో ఇద్దరు పారిపోయారుగానీ ఒకడ్ని మాత్రం చెంచురామయ్య వెంబడించి పట్టుకున్నాడు.

    వాడు తప్పించుకోడానికి గింజుకుపోతూ తన చేతనున్న కత్తితో కాళ్ళమీద నరికాడు.

    ఆ బాధను తట్టుకోలేక ఆయన కిందపడిపోయాడు. దొంగ ఉడాయించాడు.

    అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో షుగర్ వ్యాధి బయటపడింది.

    "కాళ్ళు రెండూ తీసెయ్యాలి. లేకుంటే ప్రాణానికే నష్టం" అని డాక్టర్లంటే సరేననక తప్పలేదు.
    ఆయన కాళ్ళు రెండూ తీసేశారు.

    ఎప్పుడూ స్వశక్తితో బతికిన ఆయన నిరాసక్తంగా కదలకుండా పడుకోవాల్సివచ్చింది.

    కాంతమ్మ ఒక్కటే మామిడి తోపుల కావలిని తన నెత్తిమీద వేసుకుంది. రాత్రుల్లో కావలికిపోయి ఉదయం పూట ఇంటికి తిరిగొచ్చేది.

    ఆ దుర్బుద్ధి ఎలా పుట్టిందో తెలియదుగానీ ఆయనకి పెళ్ళాం మీద అనుమానం బయల్దేరింది. రాత్రుల్లో తనను ఒంటరిగా వదిలేసి కాపలా పేరుతో తోపుల్లోకి వెళ్ళి ఎవరితోనో సుఖిస్తూ వుందని ఆయన సందేహం దాంతో ఏదో కారణం పెట్టుకుని పెళ్ళాన్ని చావగొట్టేవాడు.

    పడకమీదనుంచి లేవలేకపోయినా పెళ్ళాన్ని అంతలాఘవంగా కొడుతున్నందుకు ఆయన్ని కొందరు మగమహారాజులు తెగ మెచ్చుకునే వారు.

    కానీ ఆయన చేతికి తెలిసీ దొరుకుతున్న కాంతమ్మను కొందరు పొగిడేవారు.

    కాళ్ళు పోబట్టి, ఆయనమీద ఆయనకి నమ్మకం తగ్గి నన్ను అనుమానిస్తున్నాడుగానీ లేకుంటే ఎంత మంచివాడు. కాళ్ళూ చేతులూ బాగున్నప్పుడు ఎప్పుడైనా నన్ను ఒక్కమాటైనా అనేవాడా.

    ఇప్పుడు కొడుతున్నాడు కొట్టనీ. ఆయనకి ఆ సంతృప్తి అన్నా లేకుంటే పిచ్చిపట్టిపోతుంది. ఆయనకి ఆ దుర్గతి రాకుండా వుండాలంటే నన్ను చంపేసినాసరే ఫరవాలేదు అనేది కాంతమ్మ.

    ఎదుటి వ్యక్తిని, అతని బాధనీ, అతని నిస్సహాయతనీ అంత బాగా అర్థం చేసుకున్న కాంతమ్మంటే చాలామందికి అభిమానం.

    అందుకే సంవత్సరం క్రితం చెంచురామయ్య చనిపోయినప్పుడు కాంతమ్మకి దెబ్బలు తప్పిపోయాయనే అందరూ సంతోషించారు.

    కానీ కాంతమ్మ మాత్రం కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. అంతగా ఆయన్ని ప్రేమించింది ఆమె.  అందుకే తనను ఆ వయసులో అనుమానించి చావగొట్టినా భరించింది.

    ఆయన చనిపోయి సంవత్సరం అయినరోజు ఊరినంతా పిలిచి భోజనాలు పెట్టింది. రాత్రి బుర్రకథను పెట్టించింది. ఆ రోజుల్లోనే బుర్రకథకు ఆదరణ తగ్గింది. కాంతమ్మ లాంటివాళ్ళు దానికి తిరిగి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్నారు.

    బుర్రకథ చెప్పడానికి వచ్చినవాళ్ళది గూడూరు. మహాపతివ్రత కావమ్మ కథ చెబుతున్నారు.

    అందుకే రాత్రి భోజనాలు ముగించగానే అమ్మా నాన్నా ఆ వీధికి వెళ్ళారు.

    నేను రావడం ఆలస్యమౌతుందని చెప్పి అమ్మా వాళ్ళని పంపించేశాను.

    భోజనం ముగించి ముఖం కడుక్కున్నాను. ఇక బయల్దేరడానికి తాళంకోసం వెదుకుతున్నాను.
    అప్పుడొచ్చాడు రమణ.

    బయటికి వెళుతున్నాను కాబట్టి లైట్లన్నీ ఆర్పేశాను. చిన్న బెడ్ లైట్ మాత్రం హాల్లో చీకటికున్న కనుగుడ్డులాగా వెలుగుతోంది.

    వేసవికాలం కాబట్టి మల్లెపూల వాసన గాలిలో కలిసిపోయి ముక్కులకి మత్తెక్కిస్తోంది. బయట ముగ్గుపిండిని ఆరబెట్టినట్టు వెన్నెల కాస్తోంది.

    అతను ఇంట్లోకి చొచ్చుకొచ్చి హాల్లోవున్న నులకమంచంమీద కూర్చున్నాడు.

    "బుర్రకథ దగ్గర మీ అమ్మానాన్నను చూశాను. ఇంక ఇంట్లో నువ్వు వంటరిగా వుంటావనే తలంపుతోనే వచ్చాను" అన్నాడు.

    ఎందుకనో నాకు భయం సన్నగా మొదలైంది.

    ఇంట్లో ముందుభాగమంతా బెడ్ లైట్ వెలుగూ, వెన్నెలా కలిసిపోయి బంగారుద్రావణం వున్న పింగాణీ పాత్రలా వుంది. గాలి అచ్చు రమణలాగే చొరవగా లోపలికి చొచ్చుకొస్తోంది.

    ఆ సమయంలో నాకు ఏం చేయాలో తోచలేదు. తాళంకోసం వెదకడానికి అవతలిగదిలోకి వెళ్ళాను. అదే నేను చేసిన తప్పు.

    నేనెప్పుడైతే లోపలికి వెళ్ళానో అతనూ నా వెనకాలే వచ్చాడు. మరీ లోభిలా వ్యవహరించే బెడ్ లైట్ కాంతి ఆ గదిలోకి ప్రసరించడంలేదు.

    మసక వెలుతుర్లో అతను నా వెనకాల వచ్చి నిలబడ్డాడు. అతని నుంచి వస్తున్న 'మగవాసన' నన్ను చుట్టుకుంటోంది. అతనికి సంబంధించిన ఎంతో కొంతభాగం నా జఘనభాగాన్ని నొక్కేస్తోంది.

    నేను ఫ్రీగానే వున్నా పూలదారాలతో నన్ను కట్టేసిపట్టు కదలలేకపోయాను. అతని రెండుచేతులూ నా ముందుకు వచ్చాయి.

    నా ఎదభాగాన్ని రక్షించే కోటలో వుండే కోటాచీర పైట ఏం అనుకుందోగానీ జారిపోయింది.

    దాన్ని సరిచేసుకొమ్మని మనసు హెచ్చరిస్తుండగా సర్రున చేయి పైకెత్తాను. నా ఉద్దేశ్యం గ్రహించిన అతని చేతులు మధ్యలోనే నా చేతిని పట్టుకున్నాయి. అదేం విచిత్రమో తెలియదుగానీ భయంతో ఎగిసిపడే వక్షస్థలం పైటనుంచి తనే తప్పుకుంటోంది. లోనెక్ జాకెట్ తన పనిని తాను నిర్వర్తిస్తున్నట్లు వీలైనంత ఎక్కువ భాగాన్ని బయటపెట్టేస్తోంది. గాలి పీల్చడం, వదలడం కూడా సంగీతంలా తోస్తోంది.

    నేనేం చేయదలుచుకున్నానో ఆ పనిని అతని చేతులు సక్రమంగా చేస్తున్నాయి. అయితే స్థలం అదే అయినా నే చేయాలనుకున్నపని వేరు. అతను చేస్తున్నది వేరు. నేను పైట వేసుకోవాలనుకున్నాను. అది అతనికి ఇష్టంలేదు.

    అతని చేతులు పియానోమీద నొక్కులు ప్రారంభించినట్టు కదులుతున్నాయి. నరాల్ని తీగలుగా చేసి మీటుతున్నట్లు తోచింది. నాకు ఏదో కావాలన్న కాంక్షను సిగ్గుగా అవయవాలు తెలియజేస్తున్నాయి.

 Previous Page Next Page