Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 38


     "నువ్వు పదవే అమ్మా కాసేపాగి వస్తాను " అని చెప్పి తల్లిని పంపించేశాడు రమణ.

    కొడుక్కి ప్రాణగండం తప్పిందన్న ఆనందంతో మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయింది అమె.

    అడవాళ్ళంతా తులసిచెట్టు దగ్గర చేరారు. తమకు తెలిసిన అనుభవాలను చెబుతున్నారు. అన్నీ తేళ్ళు కుట్టిన సంఘటనలకు సంబంధించినవే.

    మధ్యమధ్యలో ఎవరికి ఏ అనుమానం రాకుండా రమణ నన్ను చూస్తున్నాడు.

    బాగా రాత్రయిపోయింది. అందరికి నిద్రగా వుంది. ఒక్కొక్కరు తమ ఇళ్ళల్లోకి జారుకుంటున్నారు.

     "రమణా! ఇక నీకేం ఫరవాలేదుగానీ వెళ్ళిరా. ఆ వెళ్ళేప్పుడు శతరూపను ఇంటిదగ్గర దింపి వెళ్ళు " అంది కుసుమకూమారి.

     "సరే "  అని లేచాడు అతను.

    నేను వెనకే బయల్దైరాను.

    ఇల్లు దాటాం. పదడుగులు వేశాం. అక్కడ వేదవతి వాళ్ళ మల్లెచెట్టుంది. ముందు నడుస్తున్నవాడల్లా ఠక్కున అగి, నావైపు తిరిగి ఏం జరుగుతుందో ఊహించేలోపే నా దగ్గరికి వచ్చి గాడంగా బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు.

    మొత్తం భూభ్రమణమే ఆగిపోయినట్లనిపించింది నాకు. రక్తమంతా బుగ్గల్లోకి పాకి అక్కడ ఏదో తెలియని అనుభూతి గూడుకట్టుకుపోయినట్టు తోచింది. నా ఒక్కదానిమీదే చుక్కలవర్షం కురుస్తున్నట్టు అనిపించింది. పైట లోపల ఏదో అలజడి రేగినట్టు నా ఎద విప్పారింది. వయసు అందాలు పొంగి, జాకెట్టు నుంచి పైకి ఉబికి, ఇంత హంగామా సృష్టించిన రాకుమారుణ్ణి చూడాలని తహతహాలాడాయి. వర్షరుతువులో పుష్పించిన చెట్టులా అయిపోయాను.

     "గుడ్ నైట్ " అని అతను వడివడిగా నడిచిపోయాడు.

    నేను అక్కణ్ణించి కదలలేకపోయాను. కదిలితే ఆ పులకరింతంతా శరీరమంతా కొట్టుకుపోతుందేమోనన్న భయంతో అలా నిలబడిపోయాను. అడుగు తీసి అడుగేస్తే కోరికతో గిలకొట్టుకుంటున్న రక్తం మరి ప్రవహించకుండా అగిపోతుందేమోనన్న సందేహంతో నిలబడిపోయాను.

    అలా  ఎంతసేపు వున్నానో తెలియదు. ఇల్లు చేరేటప్పటికి అమ్మా నాన్నా గాఢనిద్రలో వున్నారు.

    ఏవో రెండు  మెతుకులు తిని నా మంచంమీద పడుకున్నాను. నిద్రరావడంలేదు.

    సుఖపడడానికి అయత్తమైన శరీరం ఇంకా ఏదో గాఢంగా కోరుకుంటోంది. కొత్త రుచులను అస్వాదించాలనుకుంటున్న అవయవాలు తమ  ఉనికిని  తెలియజేయడానికి మరింత  పొంగుతున్నాయి .ఏదో మధురమైన ఒత్తిడివడికోసం మొత్తం మనసంతా శరీరాన్ని ముందుకు తోస్తున్నట్టుంది. వెచ్చటిమంట నాచుట్టూ అలుముకున్న్టట్టు అనిపిస్తోంది.

    పాపం నిద్ర విసిగిపోయి నా నుంచి పారిపోయింది. ఆ రాత్రంతా ఏవేవో ఊహలు రంగురంగుల్తో కళ్ళముందు పరుచుకున్నాయి.

    మరుసటిరోజు నుంచి అతనికి ఎదురుపడడానికి ఏదోగా వుంది. అతను కనిపించగానే కనురెప్పలు సిగ్గుతో బరువెక్కి కళ్ళమీద వాలిపోయేవి. పాయసందొన్నెలాంటి బొడ్డు కితకితలకు లోనయ్యేది. అంతకు మించి ఒయ్యారాలు పోయే శరీరాన్ని మనసు బలవంతంగా ఆపేది.

    నాకూ అతనికీ మధ్య జరుగుతున్న ప్రేమాయణమంతా మా ఇద్దరికే సొంతమైనట్టు రహస్యంగా చూసుకునేవాళ్ళం. చూపులు మాట్లాడుకుంటాయన్న విషయం నాకప్పుడే అనుభవంలోకి వచ్చింది.

    మేమిద్దరం ఎప్పుడూ ఎదురుపడ్డా అతను గాఢంగా ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడేవాడు. నేను వినడం తప్ప తిరిగి జవాబు చెప్పేదాన్ని కాను. మా ఇద్దరికీ అంతగా ఏకాంతం కూడా దొరికేది కాదు.

    అయితే ఓరోజు మాత్రం అతను ఆ అవకాశాన్ని దొరక బుచ్చుకున్నాడు.

    ఆ రోజు నాకిప్పటికీ గుర్తే.

    పక్కవీధిలో వుండే చెంచురామయ్య సంవత్సరీకం. ఆయనకి భార్య, ఇద్దరు కూతుళ్ళు.

    చెంచురామయ్య మామిడి తోపులకు కావలి ఉండేవాడు. ఆయన జీవనాధారం అదే- కష్టజీవి - భార్య కాంతమ్మ కూడా ఆయనకి సరిజోడి- ఎంత రాత్రయినా భర్తతో సరిసమానంగా తోపుల కావలికాసేది.

    చిన్న వయసులోనే ఇద్దరి కూతుళ్ళకు పెళ్ళిచేసేశారు- ఇక మిగిలింది వాళ్ళిద్దరే.

    చిలకాగోరింకల్లా వుండే వాళ్ళ దాంపత్యంలో కష్టకాలం మొదలయ్యింది. ఆయనకి ఎప్పట్నుంచో షుగర్ వ్యాధి వుంది. అయినా ఆయనకి ఆ జబ్బు తనకు ఉన్నట్టు తెలియదు.

    ఓసారి మామిడితోపులో దొంగలుపడ్డారు. అది తెలుసుకుని చెంచురామయ్య, కాంతమ్మ దొంగల్ని తరుముతున్నారు.

 Previous Page Next Page