Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 38


    "వాడు అచ్చం నాలాగే ఉంటాడు. అవునా?"
    "లే.....ల్లేదు. నీలా ఉంటాడు?"
    "ఉంటాడు. కాదు ఉన్నాడు. కాని ఈ నాటకంలో నీకూ పాత్ర ఉందని నాకు ఇంతవరకూ తెలియదు."
    గౌతం కంఠంలో కోపం లేదు. బాధ ఉంది.
    "నాటకమా? ఏం నాటకం? నాకేం తెలుసు?"
    గౌతం రవి ముఖంలోకి లోతుగా చూసి అదోలా నవ్వాడు. రవి ఆ చూపుల్ని తప్పించుకుంటూ దిక్కులు చూడసాగాడు.
    రంగమ్మ టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది.
    "వెళ్తావేం! కూర్చో రవీ! టిఫిన్ తిని వెళ్ళు" ఆ కంఠంలోని ఆత్మీయత రవికి కంకరరాయిలా తగిలింది.
    "రా! కూర్చో!"
    రవి కూర్చున్నాడు. అపరాధిలా తల వంచుకొని కూర్చున్నాడు.
    ప్లేట్లలో దోసెలు పెట్టి చట్నీ వేశాడు. ఒక ప్లేటు తమ్ముడిముందుకు జరిపాడు. రెండోది తను తీసుకున్నాడు.
    "తిను రవీ!"
    గౌతం కంఠంలోని ఆప్యాయత కొరడా దెబ్బలా తగులుతోంది రవికి.
    "ఊఁ....తిను."
    రవి దోసె ముక్క నోట్లో పెట్టుకున్నాడు. గొంతు దిగడం లేదు. మంచినీళ్ళు తాగాడు.
    "రవీ!"
    "ఊఁ!" తల వంచుకొనే అన్నాడు రవి.
    "నీకేం కావాలో నాతో ఒక్కమాట చెప్పి ఉంటే సరిపోయేదిగా?"
    రవికి గుండె గొంతులోకి వచ్చినట్టుగా అయింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అక్కడినుంచి పారిపోవాలని ఉంది.
    "నా ఆస్తి కావాలంటే రాసి ఇచ్చేవాన్నిగా?"
    రవికి ఏం మాట్లాడాలో తోచడం లేదు. ఇరుకు గదిలో బంధించినట్టుగా ఉంది. ఊపిరి సలపనట్టుగా ఉంది.
    "అసలు నా ఉనికే నీ కిష్టం లేకపోతే, నాతో ఒక్కమాట అంటే సరిపోయేదిగా? నీకు దూరంగా వెళ్ళిపోయేవాన్ని."
    రవి గుడ్లు అప్పగించి చూశాడు. మాడు మీద ఎవరో గట్టిగా బాదినట్లు ఉంది.
    "అనవసరంగా కష్టాలు కోరి తెచ్చుకున్నావ్?"
    "నువ్వనే దేమిటో నాకు అర్ధం కావడం లేదు." అతి కష్టం మీద అన్నాడు.
    గౌతం నిర్లిప్తంగా నవ్వాడు. నిద్రపోయేవాణ్ణి లేపోచ్చు. నిద్రనటించేవాణ్ణి లోపలేం.
    "అతనితో నీకు పరిచయం ఎప్పటినుంచి?" గౌతం కంఠం మంద్రస్థాయిలో పలికింది.
    "ఎవరితో?" తడబాటును అణచుకుంటూ అన్నాడు.
    "గౌతం తో."
    "ఏ గౌతం తో?"
    "ఏ గౌతం?
    "నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావడం లేదు." టిఫిన్ వదిలేసి లేసి సింకు దగ్గరకు వెళ్ళాడు రవి.
    చెయ్యి కడుక్కుని వెళ్ళబోతున్న రవిని ఉద్దేశించి-"రవీ! ఒక్క మాట!"
    రవి నిల్చున్నాడు. ఇబ్బందిగా నిల్చున్నాడు.
    "ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. అతడి దగ్గరకు నన్ను తీసుకెలతావా."
    "అతడు-అతడంటావ్. ఎవరతను? నాకేం తెలియదు. నువ్వు తప్పు పని చేసి నన్ను నిందిస్తావేం?" రవి తిరగబడ్డాడు.
    అందుకు కారణం అన్నలోని మంచితనాన్ని భరించలేకనే. చెడునే కాదు కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి ప్రేమనూ మంచినీ కూడా భరించలేము. ముఖ్యం మనం ఘోర అపరాధం తలపెట్టిన వ్యక్తి చూపే మంచితనాన్ని, అదీ మనం చేసిన తప్పు తెలిసీ చూపించే ప్రేమను భరించడం దుర్భరం. రవి మానసిక స్థితీ అలాగే ఉంది.
    "ఇక ఆ విషయం వదిలెయ్. నాది ఒక కోరిక. తీరుస్తావా రవీ!" రవి మానసిక స్థితిని అర్ధం చేసుకొన్న గౌతం అన్నాడు.
    రవికి కడుపులో ఏదో కదిలినట్టయింది. మరికొంత సేపు అక్కడే ఉంటే ఏడుపువచ్చేస్తుందేమోనని భయం పటుకుంది.
    "చేస్తావా?"
    "చెప్పు!"
    "అరుణ మంచిపిల్ల. ఆ పిల్లకు ద్రోహం చెయ్యకు."
    ఓ నిముషం అన్న ముఖంలోకి చూసి గిర్రున తిరిగి చరచర బయటకి వెళ్ళిపోయాడు. స్కూటర్ స్టార్టయిన శబ్దం వినిపించింది.
    గౌతం నిట్టూర్పు విడిచాడు. అతనికి టిఫిన్ తినాలనిపించలేదు. లేచి చెయ్యి కడుక్కున్నాడు.
    తల్లి పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళాడు.
    "కన్నా! వచ్చావా? ఇలారా! కూర్చో!" అన్నది తల్లి.
    "ఎలా ఉందమ్మా?"
    "చావు రాకుండా ఉందిరా!"
    "అవేం మాటలమ్మా?"
    "ఇంకా ఏం చూడమంటావురా నాన్నా! నా కింత విషయం తెచ్చి పెట్టకూడదూ?
    "ఎందుకమ్మా అంత బాధపడ్తావ్?"
    "మొండి ముండను కనక ఇంకా బతికే ఉన్నాను. మరో తల్లయితే ఈ పాటికి గుండె పగిలి చచ్చేది. నేను ఎంత పాపం చేశానో! ఈనాడు ఈ విధంగా అనుభవిస్తున్నాను. ఇంకా ఏం చూడమంటావురా? నిన్ను జైల్లో చూసమంటావా?"
    "అమ్మా నేను ఆ పని చెయ్యలేదమ్మా!"
    "బాబూ! నాకు నువ్వు ఆ మాట చెప్పాలంట్రా? నా గుండె బద్దలైపోతుంది.  ఆ పని ఎవరు చేశారో నేను ఊహించగలను. వాన్ని.....వాన్ని...." ఆ పైకి మాటలు పెగల్లేదు."
    "అమ్మా ఉద్రేకపడకు."
    "ఉద్రేకపడను బాబూ! నేను ఆరోగ్యంగా ఉండాలి. నేను బతకాలి. నిన్ను రక్షించుకోవడానికి నేను బతకాలి." దృడంగా పలికింది అన్నపూర్ణమ్మ.
    "నన్ను నువ్వెలా రక్షిస్తావమ్మా!"
    "నేనే రక్షించగలను."
    "అంటే?"
    "వాన్ని-ఆ దుర్మార్గున్ని జైల్లో తోయిస్తాను." కోపంతో ఊగిపోయింది.
    "అంటే నువ్వు కోర్టులో-పదిమంది ముందు....."
    "అవును. కోర్టులో పదిమంది ముందు వాడెవడో చెప్తాను. నీ కంటే నాకు నా పరువు ప్రతిష్టలు ఎక్కువనుకున్నావా బాబూ! నిన్ను రక్షించుకుంటాను."
    "వద్దమ్మా! ఆ పని చెయ్యకు."
    "నో! నో! ఈ విషయంలో నేను ఎవరి మాటా వినను. నాకేం చెప్పకు వెళ్ళు....." దాదాపు అరిచినట్టే అన్నది అన్నపూర్ణమ్మ.
    గౌతం తల వంచుకొని ఆలోచిస్తున్నాడు.
    "నా బిడ్డను నేను రక్షించుకొంటాను. నన్నెవరూ ఆపలేరు. నా బిడ్డ నాకు కావాలి. నాకు పరువు వద్దు, ప్రతిష్టా వద్దు."
    "అమ్మా! అతడేవరమ్మా! నీ బిడ్డ కాడా?"
    "బాబూ!" వేటగాడి బాణం తగిలిన జంతువులా అరిచింది అన్నపూర్ణమ్మ.
    "అవునమ్మా! అతడూ నీ బిడ్డే. మొదటి బిడ్డ. తండ్రి లేడు. తల్లి ఉండీ లేనిదీ అయింది. అన్నయ్యకు తల్లిదండ్రుల ప్రేమ తెలియదు. అనాథగా బతికాడు. ఎన్ని అవమానాలకూ, తిరస్కారాలకూ గురి అయ్యాడో మనకు తెలియదు. అతడి మీద ప్రేమతోనేగా అదే పేరు నాకు పెట్టుకున్నావ్!"
    "బాబూ! నన్నెందుకురా అలా చిత్రహింస చేస్తున్నావ్?" అన్నట్టు మూగ పశువులా గౌతం ముఖంలోకి చూసింది తల్లి.

 Previous Page Next Page