ఆరోజు విపరీతమైన తలనొప్పి వళ్ళునొప్పులు లేస్తూనే మొదలయ్యాయి. కాఫీతో మాత్ర వేసుకున్నాక కాస్త తగ్గి సెలవెందుకు పెట్టడం అని ఆఫీసుకి వెళ్ళిపోయింది. లంచ్ టైమ్ వరకు అతి కష్టంమీద కూర్చుని ఇంక చేతకాక సెలవుపెట్టి ఇంటికెలా ఆటోలో వచ్చి చేరిందో కూడా తెలియనట్టు వచ్చి పక్కమీద వాలిపోయింది. ఆ పడుకోవడం ఏ అర్ధరాత్రో దాహంతో మెలకువ వచ్చింది. లేచి నీళ్ళు తాగాలన్న తల తిరిగిపోయి పక్కమీద మళ్ళీ కూలబడి విపరీతమైన తలనొప్పి, వళ్ళునొప్పులు, వళ్ళు జ్వరంతో పేలిపోతుంది. ఎలాగో కుర్చీపట్టుకుని నిలబడి గ్లాసుతో నీళ్ళు తాగింది. ఇంట్లో మాత్ర ఏదీ కనపడక అలాగే మళ్ళీ పక్కమీద వాలిపోయింది.
ఉదయం పాలవాడు పెట్టిన పాలప్యాకెట్టు, గుమ్మం ముందు పడేసిన పేపరు మధ్యాహ్నంవరకు అలాగే పడున్నాయి. ఆరోజు శనివారం హాఫ్ డే కనక జయంతి ఇంట్లో ఉంటుందని తెలిసి సాయంత్రం నాలుగు గంటలకి ఇస్త్రీ బట్టలు తెచ్చిన చాకలి గుమ్మం వద్ద పడి వున్న పాలప్యాకెట్టు, ఇల్లు లోపల గడియవేసి ఉండటం చూసి తలుపు తట్టినా జవాబు లేకపోవడంతో గాభరాపడి పోయింది. గబగబ కిందకెళ్ళి ఇంటివాళ్ళని పిల్చుకువచ్చింది. ఇంటి ఓనరు ముసలాయన - ఆయన, ఆవిడ గాభరాపడి పైకి వచ్చారు. అందరూ కలిసి తలుపులు బాధగా బాధగా తెలివి వచ్చిన జయంతి ఎలాగో లేచి తలుపు తీయగలిగింది. తూలిపోతున్న ఆమెని చాకలి గట్టిగా పట్టుకుంది. 'అయ్యబాబోయ్, ఈ అమ్మ వళ్ళు కాలిపోతూంది....' ఇంటావిడ, చాకలి కలిసి జయంతిని మంచం మీద పడుకోబెట్టారు. 'ఒళ్ళు కాలిపోతుంది- చాలా జ్వరంలా వుంది. అందుకే వంటిమీద తెలివిలేదు ఈ పిల్లకి.' ముసలాయన గాభరాపడి - 'ముందుకెళ్ళి ఓ క్రోసిను, కాస్త కాఫీ పట్రా - ఆయన భార్యకి పురమాయించాడు. - ఓమాత్ర, కాఫీ తాగించారు. 'అయ్యో ఒక్కర్తి వుంది. వాళ్ళ వాళ్ళు ఎక్కడ వున్నారో - కబురు ఎలా చెప్పడం...' ఇంటావిడ ఆదుర్దాగా అంది. ముసలాయన కాస్త ఆలోచించి 'ఉండు బ్యాంక్ కి ఫోను చేస్తాను' అన్నాడు. 'ఇవాళ శనివారం కాదండీ సగంరోజేగా' అందావిడ. 'అవునవును మర్చిపోయాను. చచ్చాం... రేపు ఆదివారం బ్యాంక్ సెలవు. ఆ అమ్మాయి ఇంటివాళ్ళు ఈ ఊర్లోనే వున్నారు కాని అడ్రసు తెలియదు ఎలా మరి...' ఆయన ఆందోళన పడ్డాడు.
'ఖర్మ, ఒక్కర్తే వుంది. ఎన్నిసార్లడిగినా వాళ్ళ వివరాలు ఏమీ చెప్పలేదు. ఇప్పుడేం చెయ్యడం, పోనీ ఓసారి బ్యాంక్ కి ఫోన్ చేసి చూడండి - వాచ్ మెన్, అటెండరు గాని ఎవరన్నా ఉంటారేమో...' అందావిడ. ఇంటాయన కిందికి దిగి ఫోను చేశాడు - వాచ్ మెన్ ఫోను ఎత్తాడు గాని జయంతి తాలూకు వాళ్ళ గురించి ఏం చెప్పలేకపోయాడు.
'సోమవారం వరకు మనం ఏం చెయ్యలేం' ఎలా వంటరిగా వదిలేయడం ఇంత జ్వరంలొ ఉన్నామెని- ముందు ఏ డాక్టరునైనా పిలిచి మందిప్పించాలి' ఆయన విసుక్కుంటూ కిందకి దిగి తనకి తెలిసిన ఓడాక్టరుకి ఫోను చేసి జయంతి సంగతి చెప్పి ఎలాగైనా వచ్చి చూడమని అర్ధించాడు. నర్సింగ్ హోమ్ కి తీసుకొచ్చే పరిస్థితిలొ లేదని చెప్పడంతో డాక్టరు సరు వస్తానని వచ్చి చూశాడు.
నూటమూడు టెంపరేచర్ ఉంది. వైరల్ ఫీవర్ లక్షణాలున్నాయని మరో రెండురోజులు గడిస్తే కాని టైఫాయిడ్, వైరల్ ఫీవరో వివరాలు చెప్పలేం, రక్తపరీక్ష అవి చేయించాలి. ముందు ఈ మాత్రలు మూడు పూటలా వేయండి రేపటికి కూడా టెంపరేచర్ తగ్గకపోతే చూద్దాం' అని వెళ్ళాడు డాక్టరు. మెడికల్ షాపు ఎదురుగా వుంది. ముసలాయన మాత్రలు కొని తెచ్చాడు. కాస్త హార్లిక్స్ కలిపి తాగించి మాత్ర వేశారు. రాత్రి ఎలా వంటరిగా వదలడం తర్జన భర్జన తర్వాత చాకలి అమ్మాయిని రాత్రి తోడు పడుకోబెట్టడానికి ఏర్పాటు చేశారు.
ఆదివారం అంతా పాపం ఇంటివాళ్ళే కాఫీ, హార్లిక్స్ వగైరాలు టైముకి కలిపిచ్చి మందులిచ్చారు. టెంపరేచర్ ఏమాత్రం తగ్గలేదు. సోమవారం బ్లడ్ టెస్ట్ మిగతా టెస్టులు చేయిద్దాం అని ఆ మందులే వాడమన్నాడు డాక్టర్. ఒళ్ళెరగకుండా నిద్రపోతూనే వుంది జయంతి.
సోమవారం పదిగంటలకి బ్యాంక్ కి ఫోన్ చేశాడు ఇంటాయన. దివాకర్ ఫోను ఎత్తాడు. ఆరోజు ఏదో పనివుండి తొందరగా వచ్చాడు. జయంతి గురించి చెప్పగానే 'అయ్యో వాళ్ళ వాళ్ళు నాకు తెలుసు, వెంటనే ఫోను చేస్తాను పంపిస్తాను అని అభయం ఇచ్చాడు. గోపాలకృష్ణ బ్యాంక్ కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. 'అరెరే అలాగా మాకు తెలియనే లేదు. వెంటనే వెడతాను దమయంతిని తీసుకుని' అని గాభరాపడ్డాడు. దమయంతి స్కూలుకి వెళ్ళి ఇద్దరూ కలిసి జయంతి గదికి వెళ్ళారు. 'ఏం ఖర్మ' అందరూ వుండి చూసే దిక్కులేకుండా రెండురోజులు పడివుంది' దమయంతి చాలా బాధపడింది జయంతిని చూసి- ఇంటివాళ్ళు డాక్టరు ఇచ్చిన మందులు, చీటీ అది ఇచ్చి ఆ డాక్టరుని కన్ సల్ట్ చేయమని చెప్పారు. ఆటో తీసుకొచ్చాడు గోపాలకృష్ణ - జయంతివి నాలుగు చీరలు జాకెట్లు, నైట్ గౌను అవి ఓ బ్యాగులో సర్ది, మందులు అవి ప్యాక్ చేసింది దమయంతి. ఈ హడావుడికి కళ్ళు తెరిచి అయోమయంగా చూసింది జయంతి. జయంతిని పట్టుకుని లేపి నడిపిస్తుంటే 'ఎక్కడికి' అంది నోట్లోంచి మాటరానట్టు- 'మాట్లాడకు పద, ఇంటికెడ్తున్నాం' అంది దమయంతి.... గది తాళం పెట్టి ఇంటి వాళ్ళకి థాంక్స్ చెప్పి జయంతిని తీసికెళ్ళారు ఇద్దరూ కలిసి.