Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 39

    డిసిప్లిన్డ్ గా వుండే ఐపియస్ ఆఫీసరైనా విస్సూ విషయంలో కృషి ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నది మాధుర్ కి చాలా రోజుల క్రితమే అర్ధమైపోయింది.   
    "పెద్ద సంస్థల మధ్య జరిగే కార్పొరేట్ వార్స్ గురించి నేను అర్ధం చేసుకోగలను మిస్టర్ విస్సూ. కాబట్టే చౌదరి స్థాయి మనిషి మిమ్మల్ని విడిచి పెట్టడని నేను ముందే గెస్ చేసాను.....అయితే మీకు రక్షణ కావాలని మీ పరంగా ప్రపోజల్ రావాలిగా. మీరు అడగలేదు. కాని మీ తరపున కృషి అలాంటి యినీషియేటివ్ తీసుకుంది."    
    విభ్రమంగా చూసేడు "అంటే"   
    "మీరీ మధ్యన సృష్టించిన సంచలనంతో మీకూ ఈ ఆశ్రమంలో వున్న మీ మదర్ కి ఇంకా వివరంగా చెప్పాలీ అంటే మొత్తం ఆశ్రమానికి చౌదరి మూలంగా ప్రమాదం జరగబోతుందని మిస్ కృషి థానే కమీషనర్ కి రిటెన్ కంప్లయింటికొచ్చింది. తనకున్న పలుకుబడినుపయోగించి సెక్యూరిటీ గా పాతికమంది పోలీసుల్ని ఆశ్రమం పరిసరాల్లో ఏర్పాటు చేయించింది....అఫ్ కోర్స్ నన్ను పర్సనల్ గా రిక్వెస్టు చేసింది కూడా...చుట్టుపక్కల కాపలాగా వుంచాను. ఇదంతా గోప్యంగా జరగటానికి కారణం మీరిలాంటివి యిష్టపడరన్నది ఒకటైతే పోలీసుల మూలంగా ఆశ్రమ ప్రశాంతతకి భంగం కలగకూడదన్నది మరొకటి ఇది కూడా కృషి ఆలోచనే"    
    సాలోచనగా చూసాడు విస్సూ.    
    "ఈ రోజుతో మేం మా కాపలాని ముగించడం లేదు మిస్టర్ విస్సూ. ఆశ్రమం సేఫ్టీ దృష్ట్యా యింకా కొనసాగిస్తాం. అయితే అది గోప్యంగానే వుంటుంది. చౌదరి లాంటి వ్యక్తి యికనుంచి మరీ రెచ్చిపోయే అవకాశముంది కాబట్టి మీరు జాగ్రత్తగా వుండటం మంచిది."    
    "థేంక్స్" అన్నాడు విస్సూ.    
    అలా చెప్పింది ఎసిపి మాధుర్ అయినా విస్సూ మనసులో మెదిలింది కృషి....నిన్నగాక మొన్నటిదాకా తను ఆకతాయిగా అల్లరి పెట్టిన అమ్మాయి-    
    ఎదని యెరలా కొరుక్కు తినగలిగేది 'ప్రేమ' అయితే ఆ భావం అలసిన మనసుని సైతం మంచు మైధనంలా మారుస్తుంది....ఏకాకి అనుకున్న వారికి స్వాప్నిక లోకాల్ని సృష్టిస్తుంది.    
    గోళ్ళతో గుండెను చీల్చి గాయపరిచినా పగిలిన ఆ మనసు పొరల్లో నుంచి వినిపించే ఆక్రందన ప్రణవం అంత మధురంగా అనిపిస్తే అంతటి విశ్వజనీనమైన మార్పుకి కారణమైన ;ప్రేమా' నీకు కాక మరెవరికమ్మా జోహార్లు అర్పించేది.    
                                    *    *    *    
    "విస్సూ ఓడి గెలిచానో గెలిచి ఓడానో తెలీని సందిగ్ధస్థితిలో రాస్తున్న ఉత్తరమిది....    
    ఓ నిజం చెప్పనా....ఒంటరితనపు ఒంటి స్థంభపు మేడపై ఏకాంతపు గదిలాంటి జీవితంలో బ్రతికిన ఆడపిల్లని నేను. అలా అని నాకు అనుభూతులు లేవనుకోకు....ఉన్నాయి. కాబట్టే ఆస్తులూ అంతస్తులూ అనే గ్రాండ్ పా ఆలోచనలను దూరంగా పారిపోయి అక్కడ మిగిలిన జీవితం గడిపేయాలనుకున్నాను గడిపేసేదాన్నే కాని దగ్గర కావాలనుకున్న ఓ వ్యక్తి దూరమై మనసు గాయమైంది. దానికి కారణం ఎవరన్నా కాని ఏమైనా కానీ నాకీ ప్రపంచంలో వున్నది తాతయ్యే కాబట్టి మళ్ళీ ఈ దేశంలో అడుగుపెట్టాను.    
    శాశ్వతంగా ఉండిపోవాలని కాదు తిరిగి వెళ్ళాలనే అనుకున్నాను. కాని కొన్ని సమస్యలు నన్నిక్కడ కట్టేశాయి తాత్కాలికంగా అయినా అదిగో నువ్వు సరిగ్గా అప్పుడు పరిచయమయ్యావు చిత్రంగా. ముందు మోసగాడివనుకున్నాను. తర్వాత మేధావివనీ తెలుసుకున్నాను. నువ్వు సరిగా అర్ధం కాకపోయినా నీలో నేకోరుకునే సరిగమల సవ్వడినీ చూసాను. అది ఖచ్చితంగా ఇష్టమని చెప్పలేనుగాని నువ్వు నన్ను రెచ్చగొడుతున్నా పూర్తిగా ద్వేషించలేకపోయాను. ఎందుకో అప్పటికీ నాకు అర్ధం కాలేదు. అర్ధం చేసుకోవటానికి రోజుల తరబడీ శ్రమించాను విస్సూ.... తెలిసింది నువ్వు కూడా ఓ గాయపడ్డ మనిషివని అందుకే నా పరిచయం కోరుతున్నావని.    
    ఆ తర్వాతైనా నిన్ను వదిలించుకోవడం నిజానికి నాకు పెద్ద సమస్య కాదు. బహుశా నీకు దూరం కాలేకనో నిన్ను దూరం చేసుకోలేకనో చేయాల్సిన ప్రయోగాల్ని వదిలి యోగ నిద్రలోకి జారినట్టు నీతోకాక నా మనసుతో పోరాటం ప్రారంభించాను.
    మనసు పొరల్లో ఆకారం లేని నాదం - క్రమంగా సాకారమైంది. ఆనక అది నీ రూపంగా కనిపించింది. మేధ ఆత్మలో అంతర్భవించినప్పుడు జరిగే రసాయనిక చర్యల గురించి నాకు అనుభవం లేదు విస్సూ. కాని నువ్వనే 'వింత' పాలపుంతలా నన్ను ప్రభావితం చేస్తూండేది. నిన్ను ద్వేషంగా చూడాలనుకునే నా కనురెప్పల కౌగిట్లో ప్రేమో బెంగో తెలీని చూపులు నా మీద తిరగబడి నన్నే ప్రశ్నించేవి. ఏం చేయను. అంతరంగం రెండుగా చీలిపోతుంటే ముందు కనిపించే మెలిరెక్కల్ని పట్టుకుని మనసు గోపురంపై రాలే నీ ఆలోచనల్ని విదిల్చుకోవాలో తెలీకుండానే చాలా దూరం నడిచేసాను.    
    అర్ధరాత్రి నిద్రపట్టని నా ఏకాంతంలోకి నిశ్శబ్దంగా పయనించే కడలి అల అనుకున్నానుగానై నువ్వు విజ్రుంభిస్తే మహార్ణవాలే అని ఆలస్యంగా తెలుసుకొని నీ ముందు ఓడిపోవాలని నిర్ణయించుకున్నాను.    
    మల్లెపూల వాల్జడతో నిన్ను నా యింటికి ఆహ్వానించలేను సిగ్గిలిన సోగళ్ళతో నీలో రగులుతున్న తుఫానుకి వారధి వేయలేను. ఈ క్షణములో నన్ను నేను మోసం చేసుకోలేను విస్సూ. మనసు తెరలన్నీ జారిపోయిన ఈ క్షణాలలో నిన్ను నేను ప్రేమిస్తున్నానూ అని చెప్పకుండా ఉండలేను.    
    నా ప్రేమకన్నా నీలో రగిలే ద్వేషమే నీకు ముఖ్యమని నాకు తెలుసు...    
    చివరిగా నాదో విన్నపం విస్సూ...    
    నువ్వు అసహ్యించుకునే గ్రాండ్ పా నిన్నటిదాకా నువ్వు తోడుగా నిలిచిన చౌదరి లాంటివాడు కాదు. అంతస్తు కాపాడుకోటానికి ఏదన్నా చేయగలరేమో కాని హత్యలు చేయించలేడు నిజానికి నీ తండ్రిని హత్య చేయించింది చౌదరి కారణం అతని లక్ష్యం గ్రాండ్ పా మీద గెలుపు సాధించడం. అయితే తాతయ్య చేసిన పొరపాటు ఒక్కటే. తనమీద హత్యానేరం వస్తున్న సమయాన అది తప్పించుకునే మార్గంలేక నీ తండ్రిది ఆత్మహత్యగా నిరూపించారు తనకున్న డబ్బు పరపతి దానికి ఉపయోగించి వుంటే అది పొరపాటే. అయితే ఆ క్షణంలో అంతకుమించి ఆయన ఆలోచించలేకపోయారు.    
    ఇద్దరు ప్రత్యర్ధులమధ్య జరిగిన పోరాటంలో నాశమైంది నీ కుటుంబమే అని నేను అంగీకరిస్తాను. ఇప్పటికీ మించిపోయింది లేదు. 'దేవి' అనబడే ఓ సన్యాసిని ద్వారానే తను అంతా నడిపించిన చౌదరి గురించి ఆ 'దేవి' ద్వారానే వీలైతే తెలుసుకో అప్పటికీ హత్య చేయించింది మా గ్రాండ్ పా అని నువ్వు నిరూపిస్తే నిన్ను ఆనందంగా ఆహ్వానిస్తాను. తాతయ్య పై నువ్వు చేయాలనుకునే ప్రయోగానికి నేనే నీకు సహకరిస్తాను.   
    ఆవేశంతో కాక మనసున్న ఓ మనిషిగా నా యీ చివరిమాటని విశ్వసించి వాస్తవాన్ని తెలుసుకోగలవని నమ్ముతూ...    
                                                                                                                                       "కృషి"    
    ఉత్తరం మడిచిన విస్సుకి ముందు గుర్తుకొచ్చింది కృషి కాదు దేవి.    
    ఉదయం పదిగంటలకల్లా ఆశ్రమంనుంచి బయలుదేరబోయిన విస్సు టక్కున ఆగిపోయాడు.    
    కుటీరం ద్వారం దగ్గరే ఎదురొచ్చింది కృషి.    
    "మీరు" తడబాటుగా గొణిగాడు.    
    నీటిలో నీడలాగా వూగివూగిన కృషి ఆలోచనలు స్థిరరూపాన్ని చేసుకోటానికి అరక్షణం పట్టింది. "ఇంతదాకా వచ్చాక నువ్వు కాస్త మీరుగా మారిపోయిందా"    
    "అదికాదు కృషీ" తన వేగాన్ని నిరోధించే అడ్డుగోడలా ఆమె ఎదురు రావడం అతడికి నచ్చలేదు.    
    "సూరిద్వారా పంపించిన ఉత్తరం చదివాను". నిట్టూర్పులా అన్నాడు. "నిజానిజాలు తేల్చుకోవాలను కుంటున్నాను"    
    కృషి నొసలు చిట్లించి చూసింది 'ఎలా'    
    "అది నాకు వదిలిపెట్టండి"    
    "ముందు నువ్వు బహువచనంలో అడ్రసు చేయడం మానేయ్" ఏకవచనంలో సంబోధించింది.    
    "సాధ్యం కాదు"    
    "అదేం"    
    "ఇప్పుడు మీ మీద పగతీర్చుకోవాలనుకుంటున్న వ్యక్తిని కాదు"    
    "కాబట్టి 'మీరు' అయ్యనా"    
    "మీ ముందు నేనో మామూలు కలుపుమొక్కని కృషి ఆ విషయం ఆవేశం చల్లారాకకాని అర్ధం కాలేదు" గభాలున ద్వారం మూసింది. ఉలికిపడ్డాడు విస్సు.    
    "ఎవరన్నా చూస్తారు"    
    "ఏమిటి"    
    "మనం ఇద్దరం లోపల వుండటాన్ని"
    "ఊరికనే ఉన్నాం తప్ప మరేం చేసుకోవడం లేదుగా"    
    కృషి ఇలా మాట్లాడ్డం నచ్చలేదు.    
    "నా మాటవిని ద్వారం తెరవండి"    
    రెప్పలార్చకుండా చూస్తూ నవ్వింది.    
    "ఎందుకు నవ్వుతున్నారు"    
    "నవ్వక ఏం చేయాలి విస్సూ ఓ రాత్రి నాతో గడపగలవా అని నిన్న మొన్నటిదాకా వేధించైనా మగాడు నన్ను గుండెలపై లాక్కుని ఫోటోలు తీసి బెదిరించిన వ్యక్తి నేను ఈ దేశం నుంచి వెళ్ళకపోతే నన్ను అనుభవించి పరాభవిస్తానన్న వాడు ఇప్పుడు వూరకనే ద్వారం మూసినందుకు కంగారు పడుతుంటే నవ్వకుండా ఎలా వుండగలను"    
    "అప్పటి పరిస్థితులు వేరు"    
    "ఇప్పటి పరిస్థితులు కూడా వేరేగా"
    "అంటే" ప్రశ్నార్ధకంగా చూశాడు.    
    "అప్పుడు నువ్వు అడిగిన ప్రతిదానికీ కాదన్నాను. ఇప్పుడు నువ్వు అవునూ అనకముందే నిన్న రాత్రి నిన్ను ముద్దుపెట్టుకున్నాను."        
    ద్వారం తెరిచింది విస్సూని ఇంకా ఇబ్బంది పెట్టడం యిష్టం లేనట్టుగా.    
    "ఇంతపచ్చిగా నేను ఎలా మాట్లాడుతున్నానూ అన్నది ఆలోచిస్తున్నావా విస్సూ అలా మాట్లాడ్డం నీకు ఇష్టమని కాదు. ఎందుకో నాకే మాట్లాడాలనిపించింది. వయసుడిగిన వాళ్ళు యవ్వనం గురించి నెమరువేసుకుంటారు. యవ్వనంలో ఉన్నవాళ్ళు కలల్ని కనాలని కోరుకుంటారు. ఆ విషయం కూడా తెలిసింది నీ మూలంగా నీ ఆశలూ ఇలా పంచుకో"    
    "ఇప్పుడు అవన్నీ చర్చించుకోవడం మానేద్దాం" అన్నాడు విస్సు సీరియస్ గా.    
    "మానేయాలి అంటే నువ్వో పని చెయ్యాలి"    
    "చెప్పండి"    
    "నువ్వు అండీ అని అడ్రస్ చెయ్యటం మానెయాలి."    
    క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు "ఓకే"    
    "ఇప్పుడు చెప్పు....దేనినుంచి ఆ రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలను కుంటున్నావ్."    
    వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. నిజమే....దేవి ఓ మామూలు వేశ్యకాదు డబ్బుల్తో సులభంగా కొనేయటానికి. చాలా పరపతీ ఆలోచనా శక్తిగల స్వామిని రూపంలో వున్న బ్రోతల్.... అంత సులభంగా విషయం కక్కదు యుక్తిగా సాధించాలి.    
    సాలోచనగా అడిగాడు అరనిముషం తర్వాత "ఎసిపి మాధుర్ చౌదరి మనుషుల నుంచి వివరాలేమైనా రాబట్టగలిగాడా"    
    "లేదు....అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే తన కున్న డబ్బుతో చౌదరి నిరపరాధుల్ని కూడా అపరాధులుగా ఒప్పించి అవసరమైతే జైలుకి పంపగలడు కాబట్టి....కాని వాళ్ళు మాత్రం వెంటనే బయటికి రారు. రాకుండా నాన్ బెయిలబుల్ వారెంటుతో లోపలే వుంచగలడు మాధుర్."    
    "అది మాత్రమే చాలదు కృషీ....చౌదరి కావాలనుకుంటే లీడింగ్ లాయర్లని రంగంలోకి దింపగలడు. వాళ్ళని జుడీషియల్ కస్టడీలనుంచి బయటకి రప్పించగలడు. సో...ఇప్పుడు జరగాల్సింది మరొకటి."    
    "చెప్పు"    
    "చౌదరి ఈపాటికి లాయర్లని స్టేషన్ కి పంపి వాళ్ళని విడిపించే ప్రయత్నంలో వుండొచ్చు. కాబట్టి వాళ్ళని మరెక్కడికయినా రహస్యంగా తరలించాలి. అంటే నీకూ, మీ గ్రాండ్ పాకి వున్న పలుకుబడితో వాళ్ళని మరెక్కడికయినా తరలించి వాళ్ళని ఇప్పటికే విడిచిపెట్టినట్టుగా ఓ సీను సృష్టించాలి...."    
    "ఎందుకు?"    
    "చెబుతాను"
    ఏమిటి అని అడగలేదు కృషి. విస్సూ లాంటి మేధావి చాలా ముఖ్యమైతే తప్ప ఇలాంటి ఓ పథకం గురించి మాట్లాడడు.    
    "ఓ.కే విస్సూ...డబ్బుతో చాలా చేయగల చౌదరిలాగే అదే డబ్బు పరపతితో గ్రాండ్ పా కూడా చాలా చేయించగలడని నాకు తెలుసు. నువ్వడిగింది పెద్ద  ఇబ్బందికరమైందేమీ కాదుగా గ్రాండ్ పా చేత కమీషనర్ కి ఫోన్ చేయించి వెంటనే ఆ ఏర్పాట్లు చేస్తాను."    
    ఆమె వెళ్ళబోతుంటే "మరో విషయం" అన్నాడు.    
    "ఏమిటి"    
    "మనం ఇంకా ప్రత్యర్దులమే"

 Previous Page Next Page