Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 38

   "గంగాధరం...నన్ను కాపాడు" చౌదరి కంఠం వణికింది జరగబోయేది జ్ఞప్తికి వస్తుంటే "నేను నీకు వియ్యంకుడ్ని కావాలన్న ఆశలేదు. కనీసం నీ సహాయంతో ఈ గండం గట్టెక్కాలనుంది."    
    నిజమే....కృషి కోట బురుజుల్ని మాత్రమే పగలగొడితే ఒక్క దెబ్బతో విస్సు కోట పునాదికే డైనమైట్ పెట్టేశాడు - నమ్మకస్తుడిలా నటించి బయటకు రాలేని వూబిలోకి నెట్టేశాడు...    
    "చౌదరీ" గంగాధరం గొంతులోనూ అణువంత ఆందోళన ధ్వనించింది. "ముందు నన్ను కాపాడుకోవాలి. ఎందుకంటే నీకేదో సహకరించబోయానని ప్రధానమంత్రి కూడా గుర్రుగా వున్నాడు కాబట్టి. ఇది నిజం చౌదరీ. ప్రతిపక్షాల రాద్దాంతం ఇలానే కొనసాగితే నేను పదవి వదిలిపెట్టాల్సి వుంటుంది. కనీసం పార్టీ ప్రతిష్ట దక్కించుకోవడం కోసం"    
    "అయితే ఏమీ చెయ్యలేనంటావ్"    
    "నేనున్నదే అద్దాలమేడ ఈ అభియోగంతో పగలడం ప్రారంభించింది. నిన్ను నేను ఎలా కాపాడగలను"    
    "మీ పార్టీకి కోట్లు ఫండ్స్ గా ఇచ్చాను"    
    "కాదనను కాని ప్రభుత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఫండ్స్ ఇచ్చిన వాళ్ళకన్నా పదవుల్ని కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. అది సాంప్రదాయం" అసహనంగా అన్నాడు గంగాధరం "అసలు ఈ విషయం బయటికెలా వచ్చింది."    
    చౌదరి ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయాడు "మా కుర్ర వెధవ ఆ విస్సు గాడితో కక్కేసాడు. నాకొంప ముంచాడు."    
    "అలాంటి కొంపముంచే అలవాటు గలవాడ్ని నేను అల్లుడ్ని చేసుకుంటే మరి నా కొంపా ముంచేసే వాడుగా. అది గాకుండా మీ వాడు ఎంతో గొప్ప గ్రంధసాంగుడని కూడా తెలిసింది."    
    మరణించిన జీవిత అఫైర్ గురించి పరోక్షంగా వ్యక్తం చేస్తున్నాడని అర్ధమైపోయింది. ఆ క్షణంలో సైతం కొడుకు మీద ద్వేషం కన్నా దీనికంతటికీ మూలకారకుడైన విస్సూ మీద ఆవేశాన్ని ప్రదర్శించాడు చౌదరి "ఇంతచేసిన విస్సు గాడ్ని నేను విడిచి పెట్టడం లేదు గంగాధరం. ఈ రాత్రే వాడ్ని కడతేర్చ బోతున్నాను."    
    ఫోన్ క్రెడిల్ చేసిన చౌదరి అప్పటికి ఆశ్రమానికి వెళ్ళిన తన బలగం విస్సూని ఫినిష్ చేసేసి వుంటారని భావించాడు.    
    కాని అక్కడ పరిస్థితి వేరు.    
    హఠాత్తుగా గదిలోకి వచ్చిన కృషి వున్నట్టుండీ ముద్దుపెట్టుకోవడంతో ముందు కలేమో అనుకున్నాడు విస్సు.    
    కాని అది నిజమే అని తెలుసుకునే సరికి మెదడు మొద్దుబారిపోయింది.    
    స్వేదం చినుకుల జడి మేలిముసుగులా శరీరాన్ని తడిపేస్తుంటే మనోగీత సంకేతాల కేతనాల్లా ఆలోచనలు అతడ్ని వివసుడ్ని చేసాయి.    
    స్పందించిన హృదయం అందించిన చలిగాలిలో వెచ్చటిస్పర్శల ఆ క్షణం నిగ్రహాన్ని కోల్పోయాడు.    
    జరిగిన సంఘటనల స్మృతులు మురళీ సృతులై గతి తప్పిన స్వర జతులై క్షణాల వీక్షణాలై సుతారంగా మోగే సారంగ ధ్వనుల లయలై ప్రియా విదగ్ధ పరిష్వంగ అమృత జరులై ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే-    
    "ఏమిటిది" అన్నాడు గభాలున వెనక్కి జరిగి.    
    "మొన్న నువ్వు అడిగినా నేను ఇవ్వంది ఈ రోజు నువ్వు అడగవని తెలిసినా ఆనందంగా ఇచ్చింది." కృషి కంఠంలో మామూలు స్నిగ్ధదరహాసమే. నిన్న కాదన్నా వెచ్చని కోరికల ఇంద్రజాల పేటికనుంచి బయటపడి చేసిన ఆ సాహసంలో ఎంతటి లాలిత్యం వున్నా ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు విస్సు. రెప్పలార్పకుండా చూస్తున్న కృషి నేత్రాల్లో ఉద్రిక్త యౌవన శిఖరాగ్రాన్ని అధిరోహించిన భావం ద్యోతకం కావటం లేదు. నిన్న వర్షించనని మొరాయించిన ఓ మేఘం పులకింతగా వర్షించిన తొలకరి జల్లు వేళలో అణువంత ఆవిరితో పరిమిళింత భూదేవి స్వగంధంలా వుంది"    
    "నమ్మలేక పోతున్నాను" గొణుగుతున్నట్టుగా అన్నాడు.    
    "నా ఇష్టాన్నా"    
    "నన్ను ఇష్టపడగలవనే నిజాన్ని"    
    "ఇంకా ఏం చేసి నమ్మించను"    
    జవాబు లేనట్టుగా చూశాడు విస్సు...    
    "మనసు పడ్డ అమ్మాయి తన అభీష్టాన్ని క్షణంలో వ్యక్తం చేయటానికి వున్నది ఈ ఒక్క ఆధారమే అయితే నేను ఇప్పుడు చేసింది అదే విస్సూ....ఇందులో" క్షణం ఆగింది బిడియంలా తలవంచుకుని "నా ఓటమిలేదు - నిన్నటి ఓటమి పై నేను సాధించిన గెలుపులానే అనిపిస్తూంది. ఇది నటన కాదు విస్సు - కోరుకున్న మగాడి ముందు తన జీవితాన్ని పదిలంగా అందించటానికి నేను సిద్దమని చెప్పటానికి నాకు తెలిసిన మార్గం ఇదొక్కటే....హఠాత్తుగా ఎందుకిలా మారావూ అంటే నా దగ్గర జవాబు లేదనుకోకు. ఉంది. చౌదరి సామ్రాజ్యం మీద నేను దాడి ప్రారంభించి ఎన్ని నెలలూ రోజులూ గడిచినా ఎంత గెలిచావో నాకు స్పష్టంగా తెలీదు కాని నువ్వు సాధించైనా దాని ముందు నేను చేసింది చాలా స్వల్పమే అని మాత్రం అర్ధం చేసుకున్నాను.....అదొక్కటే కాదు విస్సు - నీలో ఇంకా చావని మానవత్వం, విలువలు నన్ను బలంగానే కదిలించాయి. ఈ మాట ఎందుకంటున్నానూ అంటే మా కుటుంబం మీద పగ సాధించాలని మాత్రమే మా ఇంట అతడు పెట్టిన నీకు జీవితనే ఓ అమ్మాయి కథకి అంతగా స్పందించాల్సిన అగత్యం లేదు. కాని మూవ్ అయ్యావు....అదే....సరిగ్గా అదే నీ ముందు నేను ఓడితేనేం అనిపించినా తొలిక్షణం....ఆ తర్వాత నిన్ను నువ్వు నిర్దేశించుకున్న మార్గం నుంచి పక్కకు జరిగి నువ్వు చౌదరిపై ఎలాంటి చావు దెబ్బ తీసావూ అంటే ఈ రోజు చౌదరి ప్రాణాలుగ్గ బట్టుకుని బ్రతుకుతున్నాడు - నీ మీద నేను ఇష్టం పెంచుకోవటానికి ఇదొక్కటే కారణం కాకపోయినా పెంచుకోకపోవటానికి అభ్యంతరం మాత్రం కనిపించలేదు విస్సు...అయితే చివరిగా మరో విషయం..." విస్సు వున్న ప్రస్తుత మానసిక స్థితిలో ఆ విషయం ప్రస్తావించడం ఎంతవరకూ సమంజసమో ఆమె ఆలోచించలేదు "నీ తండ్రి హత్యకి కారణం మా గ్రాండ్ పా మాత్రం కాదు."    
    "వద్దు.... ఇప్పుడా విషయం మనం మాట్లాడుకోవద్దు" విస్సు కంఠంలో ఇంకా అదే మొండితనం....    
    బాధగా చూసింది ఏం చెప్పి నమ్మించాలీ వ్యక్తిని, ఏం చేసి ఈ మనిషికి నిజాన్ని నిరూపించాలి.    
    "ఆవేశంతో కాదు విస్సు - కూల్ గా ఆలోచించు.... ఇలా అడుగుతున్నది నిన్నటి దాకా నీకు ప్రత్యర్ధిగా నిలబడ్డ ఉపాధ్యాయ మనవరాలు కృషికాదు....తన ఆడతనాన్ని నిర్లజ్జగా నీకు అర్పించటానికి సిద్దపడి వచ్చిన ఓ అమ్మాయి."    
    "కృషీ....." కాలిన ఏ చితిమంటల కాగడాలో అతడి కళ్ళలో ప్రతి ఫలిస్తుంటే బడలికగా కళ్ళు మూసుకున్నాడు. "నేను చేసిన పొరపాటు ఉపాధ్యాయగారి మీద ఆవేశాన్ని నీ మీద ప్రకటించడమూ నిన్ను హింసించటానికి సిద్దపడటమూను. కాదనను. అయితే నువ్వే ఓ విషయం అర్ధం చేసుకోవాలి. నేనిప్పుడు గాయపడి వున్న మృగాన్ని. అలా గాయమైంది కేవలం మీ గ్రాండ్ పా ఒక్కడి మూలంగానే కాదు. చౌదరి మూలంగా కూడా అని తెలుసుకోబట్టే ఇప్పుడు అటు కూడా ఓ అస్త్రాన్ని సంధించాను. దాని ఎఫెక్టు ఎంతన్నది వదిలేద్దాం"    
    వెయ్యి పేజీల ప్రేమకథని మనసుతో కుదించి నిర్వచిస్తే వట్టి రెండక్షరాల పదం 'ముద్దు' అయితే అది కూడా విస్సూని మార్చలేకపోయింది. కృషి టార్గెట్ కాదని అతడికెప్పుడో తెలుసు...ఆమె ద్వారా ఓ మార్గాన్ని కోరుకున్నాడు తప్ప ఆమెని ప్రేమించడమూ లేక ఆమె చేత ప్రేమించబడటమూ అన్నది అతడి అసలు లక్ష్యం కాదు - అందుకే ఇప్పుడూ నిక్కచ్చిగా మాట్లాడాడు.    
    మరో అర నిముషంలో ఓటమిలాంటి భావంతో ఆమె బయటికి నడిచేదే....    
    అదిగో అప్పుడు వింది తలుపు తట్టిన శబ్దాన్ని.   
    ముందు అవాక్కయిపోయింది విస్సూ.....    
    అలాంటి వేళలో అరుదుగా అయినా తనను వచ్చి కలిసేది సూరి మాత్రమే.    
    అందుకే నిర్భయంగా తలుపు తీశాడు.    
    అరక్షణంపాటు అజాగ్రత్తగా వుంటే ఓ కత్తి అతడి పొట్టలో గుచ్చుకునేదే.    
    సర్రున చీరుకుపోయిన విస్సూ అరచేతి రక్తం అతడి కదలికలో కృషి మొహంపై పడింది.    
    జరుగుతున్నదేమిటో గ్రహించిన కృషి వెనుకడుగు వేయలేకపోయింది.            
    లోనికి ఎందరు దూసుకొస్తున్నదీ ముందు అర్ధం కాలేదు....మరో వ్యక్తి చేతిలోని డేగర్ లాంటి ఆయుధం యిప్పుడు కృషిని తాకబోతుంటే ఒక్క వుదుటున ఆమెను వెనక్కి లాగేసిన విస్సు ఇందాక గాయమైన చేతితోనే ఆయుధాన్ని ఒడిసిపట్టుకున్నాడు.    
    మెరుపు వేగంతో కదిలిన వ్యక్తులు అదే వూపులో కృషిని విస్సునీ ముక్కలుగా నరికేసేవారే...    
    అప్పుడు వినిపించింది పోలీసుల బూట్ల చప్పుడు. వెనువెంటనే ఎసిపి మాధూర్ అక్కడ ప్రత్యక్షమై అగంతకులకి రివాల్వర్ గురిపెట్టాడు...    
    "డ్రాప్ యువర్ వెపన్స్" మాధుర్ కంఠం ఖంగుమంది.
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.    
    రామనాథ చౌదరికి చెందిన ఆరుగురు అనుచరుల్నీ కస్టడీలోకి తీసుకున్నాడు మాధుర్.    
    ఏమీ జరగనంత ప్రశాంతంగా వుంది ఆశ్రమం....చౌదరి అనుచరుల్ని వేన్ లోకి నెట్టి స్టేషన్ కి పంపేక వెనక్కి వచ్చిన మాధుర్ "మీ అంచనా తప్పుకాలేదు మిస్ కృషి..... యూ ఆర్ రైట్" అన్నాడు కృషిని చూస్తూ.    
    విస్సుకి వెళ్ళాలని లేకపోయినా బలవంతంగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది. చేతికి బేండేజ్ కట్టేక ఎసిపి మాధుర్ స్టేట్ మెంట్ తీసుకోవటం మరిచిపోలేదు.    
    కృషి వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా....ఎసిపి మాధుర్ విస్సుని ఆశ్రమం దగ్గర డ్రాప్ చేసాడు మరో అరగంటకల్లా...   
    "నాకో ప్రశ్నకి జవాబు చెబుతారా" అడిగాడు విస్సూ.    
    "ష్యూర్"    
    "కృషి అంచనా తప్పు కాలేదన్నారిందాక. అంటే నా మీద చౌదరి మనుషుల అటాక్ జరిగే అవకాశముందని కృషి మీకు ముందే చెప్పిందా"

 Previous Page Next Page