Previous Page Next Page 
షా పేజి 38

 

    "అవును"
    "ఏ మర్డర్ ? మా బాస్ కేమిటి సంబంధం?"
    "అది తెలుసుకోవటానికే వచ్చాను"
    "మీరెవరు? పోలీస్ డిపార్టుమెంటా?"
    కాదు! హత్య గావించబడ్డ వ్యక్తీ తమ్ముడిని-"
    ఆమెకేం చేయాలో తెలీటం లేదు.
    "ఓ.కే. ....కూర్చోండి ఒక్క నిముషం-"
    అతను కుర్చీలో కూర్చున్నాడు.
    ఆమె ఫోన్ తీసుకుని మాట్లాడింది. అతి రహస్యంగా -- నెమ్మదిగా, తరువాత ఫోన్ పెట్టేసి ముందుకు వంగింది మళ్ళీ.
    "సారీ - బాస్ మీరెవరో మీరేం మాట్లాడుతున్నారో తెలీదంటున్నారు . యుకేన్ గో నౌ"
    సృజన్ కి కోపం ముంచుకొచ్చింది.
    "సరే - మీ ఇష్టం.......రేపు మీ బాసే నా దగ్గరకు రావాల్సివస్తుంది పశ్చాత్తాపపడి . కానీ అప్పుడింక ఎంత బాధపడ్డా ఏ మాత్రం ప్రయోజనము ఉండదని చెప్పండి. సీయూ -- " బయటకు నడవబోయాడు.
    సరిగ్గా అప్పుడే లోపల్నుంచి ఫ్యూన్ పరుగుతో వచ్చాడు బయటకు.
    "సార్! మిమ్మల్ని జనరల్ మేనేజర్ గారు రమ్మంటున్నారు -" అన్నాడు పక్కకొచ్చి.
    అతను వెనక్కి తిరిగాడు.
    ఆ యువతి వేపు ఓసారి చూసి లోపలకు నడిచాడు.
    చాలా పాష్ రూమ్ అది. చాలా ఖరీదయిన అలంకరణలతో నిండిపోయి వుంది. సువాసనలతో కూడిన చల్లదనం. అర్ధచంద్రకారంగా ఉన్న టేబుల్ వెనుక కూర్చుని ఉన్నాడతను.
    "ఎవర్నువ్వు! ఏం కావాలి నీకు?" కొంచెం చిరాకుగా అడిగాడతను.
    "నా పేరు సృజన్! మా అన్నయ్య పేరు శ్రీధర్-'
    "ఏ శ్రీధర్?"
    "మీ కంపెనీ లో ఉద్యోగం కోసం ఇంటర్ వ్యూకి ఇక్కడికి వచ్చి వుంటాడని నాకు అనిపించింది. అయన హత్య చేయబడ్డాడు. ఎవరు చంపారో తెలీదు. కనుక మీకేమయినా తెలుసేమోనని......."
    "ఇక్కడి ఇంటర్ వ్యూకి వచ్చారా?"
    "అవును"
    "ఎవరు చెప్పారు నీకలా?"
    "నేనే అనుకుంటున్నాను."
    "ఎందుకనుకుంటున్నావలా?"
    "కొన్ని ఆధారాలను బట్టి."
    "ఏమిటా ఆధారాలు?"
    "నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవాడానికి వచ్చాను. అంతే గానీ మీరు నా గురించి తెలుసుకోటానికి కాదు."
    "శ్రీధర్ అనే పేరుగల వ్యక్తీ ఎవరూ మా దగ్గర ఉద్యోగానికి రాలేదు -"
    "ఖచ్చితంగా చెప్పగలరా ఆ విషయం?"
    "అవును! ఇంటర్ వ్యూకి వచ్చినవారిలో మాకు నచ్చినవారిని సెలెక్ట్ చేసి మా బాస్ దగ్గరకు పంపేది నేనే."
    "శ్రీధర్ అనే పేరుతొ ఎవరూ లేరా?"
    "ఊహూ! ఇంక నువ్ వెళ్ళవచ్చు. - "ప్యూన్ అతని పక్కకు వచ్చి నిలబడ్డాడు.
    సృజన్ బయటికొచ్చేశాడు?
    అతని మనసులో అనుమానం మొదలయింది. నిజంగా తన అన్నయ్య ఇక్కడకు రాకపోయినట్లయితే తనను ఇన్ని ప్రశ్నలేయవలసిన అవసరం లేదు వాళ్ళకు ఎక్కడో ఏదో లోపం వుంది. ఎక్కడో ఏదో దిక్కు వున్నట్లు అనిపిస్తోంది. అలాంటిదేమీ లేకపోతే అన్నయ్య అ న్యూస్ పేపరు మీద టిక్కుపెట్టటం, ఆ కాప్యుల్స్ స్ట్రిప్ ఆ రహస్యమయిన అరలో దాచటం --- ఇవేమీ అవసరం లేదు.
    భారతి ఆఫీస్ లో టైప్ చేసుకుంటోందల్లా తలెత్తి అతనివేపు చూసింది.
    "వచ్చేశారా! మీ గురించే ఆలోచిస్తున్నాను. ఉదయం నుంచీ నిజం చెప్పాలంటే రాత్రి కూడా మీ ఆలోచనలతోనే నిద్ర పట్టలేదు" నవ్వుతూ అందామె టైప్ చేయటం ఆపి!
    "ఎందుకని?"
    "భయం - మళ్ళీ ఏం చిక్కుల్లో పడతారో నని---"
    "మీకు ప్రామిస్ చేశాను కదా! ఏ చిక్కులల్లోను ఇరుక్కోనని."
    "థాంక్యూ --- నా మాటమీద అంత గౌరవం ఉన్నందుకు" ఆమె కళ్ళల్లో సిగ్గూ - అనందం రెండూ కనిపించినాయ్ అతనికి.
    "ఒక్కనిముషం కూర్చోండి ఇది టైప్ చేయటం ముగించేస్తే మనం కాంటీన్ కెళ్ళావచ్చు."
    సృజన్ ఆమె కెదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు.
    అయిదు నిమిషాలలో టైప్ చేయడం ముగించిందామే.
    "పదండి" అంటూ అల్మారాలో నుంచి చిన్న టిఫిన్ డబ్బా, తన బ్యాగు తీసుకుంది.
    ఇద్దరూ ఆఫీస్ వెనుక వేపునున్న కాంటీన్ కెళ్ళారు. కాంటీన్ వెనుక వేపున వరండాలో చాలా బెంచీలున్నాయ్. చాలా మంది వాటిమీద కూర్చుని కాఫీ ఫలహారాలు తీసుకుంటున్నారు.
    ఆమె వెళ్ళి రెండు గ్లాసుల్తో ఇద్దరికీ నీళ్ళు తెచ్చింది.
    టిఫిన్ ఓపెన్ చేసి మూతలో రెండు పూరీలుంచి అతని ముందుకి తోసింది.
    "తినండి?"
    "నాకెందుకు?"
    "నాకెందుకో, మీకూ అందుకే-

 Previous Page Next Page