ఇప్పుడేం చెయ్యాలి?
మనసులో ఈ ప్రశ్న కొన్ని లక్షల కోణాలలో, ఎన్నో రూపాలలో సందర్సన మిచ్చింది. సరైన జవాబు లభించడంలేదు.
ఇద్దరిమధ్యా ఏ మాటా పలుకూ లేకుండా అయిదారు రోజులు గడిచిపోయాయి. అతని హృదయంలో మౌనంగా అగ్నిపర్వతాలు బ్రద్దలవుతూనే వున్నాయి.
ఒకరోజు వుండబట్టలేక చిన్మయి అడిగేసింది.
"మీరు... ఏం నిర్ణయించుకున్నారు?"
"...ఊ!"
"మన గురించి ఏం నిర్ణయానికి వచ్చారు?"
"...మనమిద్దరం విడిపోక తప్పదు."
"నో!" అని ఒక్క అరుపు అరిచింది చిన్మయి. ఇన్ని రోజులనించి కూడదీసుకొని వుంటోన్న నిగ్రహం, మనోశక్తి అతనన్న ఈ ఒక్కమాటతో పటాపంచలై పోయినాయి.
ఉద్వేగం, దుఃఖం, ఆవేదన గుండెల్లోంచి ఒక్కసారిగా దుమికాయి.
"ఏమండీ!" అంది దీనంగా కళ్ళనీరు కారుస్తూ "ఒక స్త్రీ పురుషుడు భార్యాభర్తలుగా జీవించే ఎన్నో సంవత్సరాల దీర్ఘకాలంలో అతనుగాని, ఆమెగాని, ఎక్కడో అక్కడ, ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చెయ్యటం, చెయ్యవలసి రావటం అసహ్యమైన విషయమైతే కావచ్చుగాని, అసహజమైన సంగతేం కాదండీ. ఒక తప్పు జరిగినంత మాత్రాన ఆ వ్యక్తిని చెడ్డవారుగా, అవినీతి పరులుగా భావించకూడదండీ. అమాయకత్వం వల్లనో, అజ్ఞానం వల్లనో, ఆ క్షణంలోని చాంచల్యం వల్లో, మానసిక బలహీనతలోని చాపల్యం వల్లో, పరిస్థితుల ప్రభావం వల్లో ఓ తప్పు జరిగి వుండవచ్చు. నేను చేశాను. చేశానని నా అంతట నేనే ఒప్పుకున్నాను. ఒక దశలో చచ్చిపోవలని కూడా అనుకున్నాను. ప్రయత్నంకూడా చేశాను. కాని మన కిరణ్ కోసం ఆఖరి క్షణంలో ఆ ప్రయత్నం విరమించాల్సి వచ్చింది. ఒక్కనిజం వినండీ. నాకు నేను అర్ధంకాని స్థితిలో ఏమి జరుగుతున్నదో కూడా తెలీని స్థితిలో ఆ దుర్ఘటన జరిగిపోయిందండీ. నాకు యిష్టమై, తెలిసీ ఏ మాత్రం కాదండీ."
"నేను తప్పు చేశాను. అలా జరిగిపోయింది. కాని మిమ్మల్ని యింకా.... యింకా గాఢంగా ప్రేమిస్తూనే వున్నానండీ. మీరు నాకు ఇంకా కావాలండీ. మీరు లేకుండా, మీకు దూరమై బ్రతుకుతానన్న నమ్మకం, బ్రతకగలనన్న ఆశ నాకు లేదండీ. నాకు నిజంగా... నిజంగా.... మీతో కలిసి జీవించాలని వున్నదండీ. మిమ్మల్ని వదలుకోవాలనీ, ఈ అందమైన జీవితాన్ని ధ్వంసం చేసుకోవాలనీ లేదండీ అందరిలాగే, చాలామంది సంసారాల్లాగే మనమూ ఆనందంగా బతకాలనే కోరిక చావటం లేదండీ.
"మీ మనసు అతి దారుణంగా గాయపడిందని నాకు తెలుసు. మీకు అనూహ్యమైన ఒకానొక భయంకరమైన దుర్ఘటన జరిగిపోయిందని తెలుసు. కాని నేను తప్పు చేశాననీ, గుండెల లోతులోంచి నరనరాల్లోని ప్రతి అణువులో నుండీ పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాననీ, తెలిసీ తెలియనిస్థితిలో జరిగిపోయిన ఓ ఆటవిక చర్యగా, పీడకలగా మరచిపోయి, నన్ను... నన్ను... మనసారా... పోనీ... ఎలాగైనా సరే... ఆత్మవంచన చేసుకునైనా సరే... మిమ్మల్ని మీరు బాధపెట్టుకొనైనా సరే... నాకోసం నామీద ప్రేమకోసం....మన పాపకోసం... మన బంగారు భవిష్యత్తు నాశనం కాకుండా వుండటం కోసం... మీ పాదాలు పట్టుకుని వేడుకుంటాను. నన్ను.... క్షమించండి.... నన్ను... దూరం చెయ్యకండీ!"
ఆమె నిజంగా అతని పాదాలమీద వ్రాలిపోతూ, స్పృహతప్పి పడిపోయింది.
రాజీవ్ ఆమెవైపు ఆందోళనగా చూశాడు. "చిన్మయీ! చిన్మయీ!" అని పిలిచాడు. ఆమె పలకలేదు. రెండుచేతులతో ఆమెను లేవదీసి బెడ్ రూంలోకి తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టాడు. తర్వాత కిచెన్ లోకి వెళ్ళి ఓ గ్లాసుతో నీళ్ళు తీసుకొచ్చి మొహంమీద జల్లాడు.
ఆమెముఖంలోకి చూస్తూ ప్రక్కనే కూర్చున్నాడు.
ఆమెను చూస్తోంటే జాలి కలుగుతోంది. ఆమె పడుతూన్న ఆవేదనకు కడుపు తరుక్కుపోతోంది. ఆమెలోని నిజాయితీ తనని కుదిపిపారేస్తోంది.
అయినా...
రాజీపడలేకపోతున్నాడు.
చిన్మయి కదిలింది. కొద్దిగా కళ్ళు విప్పి ఎదురుగా అతను కనిపించగానే "మీరు... ఇక్కడే వున్నారా?" అంటూ చెయ్యిచాపి అతనిచేతిని పట్టుకుని గుండెల మీదకు లాక్కుంది.
తాత్కాలికంగానైనా మనసులో ఏదో ఊరట...
ఎంత చల్లగా, హాయిగా వుంది!
అడక్కుండా-ఆ ప్రశ్న ఎల్లకాలం అలా గుప్తమగా వుండిపోతే బావుండును. కాని అడగక తప్పదు.
"మీరు... ఏం నిర్ణయించుకున్నారు?"
ఒక్క నిముషం ప్రపంచంలోని అతి బరువైన నిశ్శబ్దం.
"సారీ, రాజీపడలేకపోతున్నాను. మనం విడిపోక తప్పదు."
ఆమె ఆశలన్నీ కుప్పకూలి పోయినాయి.
* * *
ఇంత భయానకంగా, నిర్దాక్షిణ్యంగా ఎందుకిలా తన జీవితం మలుపు తిరిగింది?
రాజీవ్ వెర్రివాడిలా అయిపోయాడు.
అతనెవరో... ఆరాధించాదలచుకుంటే దగ్గరగా రావాలనుకుంటే చక్కగా కాపురం చేసుకునే పిల్లతల్లి అయిన ఓ గృహిణే దొరికిందా? అనవసరంగా ఇతరుల బంగారు జీవితంలోకి జొరబడుతున్నాననీ, దాని సుందర రూపాన్ని ఛేదించివేస్తున్నాననీ కొంచెమైనా అనిపించలేదా?
అయినా ఈ ఆరాధనలూ, మనుషుల్లో ఏ ఏ ఆకర్షణలో చూసి క్రేజ్ పెంచుకోవటం, దగ్గర కావాలని తాపత్రయం పడటం, కొంతకాలానికి ఒకరి మీద ఒకరు హక్కులు పొందినట్లు ఫీలవ్వటం, యీ ఎన్ క్రోచ్ మెంట్... ఇదంతా ఏమిటి?
జీవితంలో నూటికి తొంభై పాళ్ళు వికృతమేమోననిపిస్తుంది.