"ఏం చేయను? నీ కారణంగా నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడంలేదు."
"ఇక పడుతుందిలే, పెళ్ళి కొప్పుకున్నానుగా...."
గౌతమ్ గొంతులో ఆశ్చర్యం, బాధ కలిపి ధ్వనించాయి. "ఎప్పుడు మీ పెళ్ళి?"
"రేపు...."
"అయాం వెరీ హేపీ!"
"నేనూ హేపీయే; నువ్వెవరో నాకు తెలిసిపోయింది...."
"అయితే చెప్పు...."
"నువ్వు రమణవి. నా ఎదుటపడి మాట్లాడలేక నీ ప్రేమ బలంతో ఇలా ప్రవర్తిస్తున్నావు. లేదా నువ్విలా పలకరిస్తున్నావని నేను భ్రమపడుతున్నాను. మన పెళ్ళి జరిగేక నాకిక నీ మాటలు వినిపించవు. అవునా?" అంది హాస.
"కాదు. నేను రమణని కాదు...."
"డోన్ట్ బ్లఫ్...."
"నేను బ్లఫ్ చేయటంలేదు. అయినా నువ్వు నేను రమణ అనుకోవడం వల్ల నాకేం నష్టం లేదు. కానీ నీకేవైనా ప్రమాదం వుంటే మాత్రం నేను రమణనని భావించక. నన్ను పిలిస్తే తప్ప నీ సాయానికి రాలేను. ఈ విషయం గుర్తుంచుకో"
"గుర్తుంచుకుంటాను. కానీ నాకు ప్రమాదమేముంటుంది?"
తనకై ఎన్ని వైపులనుంచి ఎన్ని రూపాల్లో ప్రమాదం పొంచి ఉందో ఆమెకు తెలియదు.
29
శ్రీనగర్ లోని ఒక హోటల్ గదిలో పరస్పరాభి ముఖులై కూర్చున్నారు రవీంద్ర, రాజేంద్ర, దేవేంద్ర. రవీంద్ర చేతులో పుస్తక మొకటుంది. అతను దాన్ని తెరిచి, "ఒక్కోసారి ఎరే చేపవుతుంది. అది చేప అదృష్టమా, ఎర మూర్ఖత్వమా?" అన్నాడు.
"అది తన తప్పుకాదు" అన్నాడు దేవేంద్ర.
రవీంద్ర పుస్తకం నుంచి దృష్టి మళ్ళించకుండా, "సంజాయిషీ తప్పును బలపరుస్తుంది. ఒప్పుగా మార్చలేదు" అన్నాడు.
ప్లీజ్, మాటలతో నన్ను వేధించకు. నేనేం చేయాలో చెప్పు" అన్నాడు దేవేంద్ర.
రవీంద్ర పుస్తకం మూసి, "ఏం చేశావని అడుగుతున్నావు. నేనేం చేశానో తెలిస్తే నువ్వు సిగ్గుపడతావు" అన్నాడు.
"ఏం చేశావ్?"
"రమణ హాస వెంట ఎందుకు పడుతున్నాడో తెలుసుకున్నాను."
"నిజంగా?" ఈ ప్రశ్న అడిగింది రాజేంద్ర.
"నిజం కాబట్టే మనమీ ఊరొచ్చాం."
"ప్రతిభ నుంచి పారిపోడానిక్కాదా?" అన్నాడు దేవేంద్ర.
"ప్రతిభ నుంచి పారిపోయే అవకాశం నీకు లేదు. ఆమె నీకు భార్య కావలసి ఉంది, తప్పదు. నువ్వో ఆదర్శ భర్తగా జీవించడమూ తప్పదు."
"అంటే?"
"నీ వయసు. మనసు ప్రతిభకు అంకితం చేయక తప్పదు. కానీ నీకీ గతి పట్టించిన ఆ రమణపై పగ తీర్చుకోవడం నీ కర్తవ్యం. అందుకు నేనుపాయం ఆలోచించాను" అన్నాడు రవీంద్ర గంభీరంగా.
"ఉపోద్ఘాతం చాలించి అసలు విషయం చెప్పు" అన్నాడు దేవేంద్ర విసుగ్గా.
"నీకు నాగరాజు తెలుసా?" అడిగాడు రవీంద్ర.
* * * *
నాగరాజు ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన పట్టిందల్లా బంగారమౌతుంది.
ఇరవై యేళ్ళ వయసులో అతనికి నా అన్నవాళ్ళు లేరు, నా అన్నదీ లేదు. ముందు కష్టపడి కూలిపని చేశాడు. ఆర్నెల్లు.... అంతే ఆ తరువాత రోడ్డు ప్రక్కన నూనె మరగించి వేడి వేడి పకోడీలు అమ్మాడు. ఆర్నెల్లు-అంతే! చిన్న పాక హోటలు.... ఆరునెల్లు....కాస్త పెద్ద హోటలు.
తన హోటల్ కు సరుకులు వేరేచోట ఎందుక్కొనాలని కిరాణా దుకాణం, కూరగాయల దుకాణం ప్రారంభించాడు. పాతికేళ్ళ వయసొచ్చేసరికి నాగరాజుకి వూళ్ళో ఫ్యాన్సీ, బట్టల దుకాణాలు కూడా ఉన్నాయి.
నాగరాజు అంతటితో తృప్తిపడలేదు. చెక్కపొడికి మంచి గిరాకీ ఉందని తయారీ ప్రారంభిస్తే అదో పరిశ్రమయింది. అగరొత్తులు తయారు చేస్తే అదీ పరిశ్రమయింది. ఆ విధంగా ఊరగాయలు, ఫలరసాలు కూడా పరిశ్రమలయ్యాయి.
ఇప్పుడతని వయస్సు యాభయ్ కి దగ్గరౌతోంది. ఆయన పిల్లలకొకటీ, పెద్దలకొకటీ రెండు పత్రికలు నడుపుతున్నాడు. రెండు బ్యానర్సు మీద ఏడాదికి రెండు సినిమాలు తీస్తున్నాడు. ప్రతి నెలా ప్రముఖ గాయనీ గాయకుల క్యాసెట్స్ రిలీజు చేస్తాడు.
అతని వద్ద కోట్లకు కోట్లున్నాయి. వాటికింకా కోట్లు జతపడ్తున్నాయి. ఆయనవద్ద తొడుక్కునే కోట్లకంటే రూపాయల కోట్లే ఎక్కువని అంతా చెప్పుకుంటారు. ఆయనకున్న తొడుక్కునే కోట్ల సంఖ్య తక్కువేమీ కాదు.
ఇన్ని ఉన్న నాగరాజు నిగర్వి, నిరాడంబరుడు.
ఆయనకు రాజకీయాల జోలి అవసరం లేదు. తన గురించి ప్రచారం ప్రదర్శన అవసరం లేదు.
ఆయనుండే బంగళా సకల సదుపాయాలూ కలిగున్నప్పటికీ, అసామాన్యంగా వుండదు.
అతనికి తీరని కోరిక లేదు. కానీ భయమొకటి వుంది.
తను జీవితంలో పైకి రావాలని ఎంతో కృషి చేశాడు. కానీ ఆ కృషికి అదృష్టం తోడు కావడంవల్లనే ఈ దశకు చేరుకున్నాడు. ఈ అదృష్టమెప్పుడూ ఇలాగే వుంటుందా?
అదృష్టం ఔన్నత్యానికి చేర్చినట్లే దురదృష్టం పతనానికి హేతువు కావచ్చు.
అదే అతని భయం. ఆ భయంలో ఆయన జ్యోతిష్కుడీ విషయంలో పదేపదే వేధించసాగాడు.
జ్యోతిష్య వంటి విద్యల్ని నమ్మడం మనిషి పతనావస్థకు దారి తీస్తుందని చాలామంది అనుకోవచ్చు. కానీ నాగరాజు తన కృషితో మెట్టు మెట్టుకీ జ్యోతిష్యం మీదనే ఆధారపడ్డాడు. తన కృషిని చించి ముహుర్తాలను నమ్ముకున్నాడు.
జ్యోతిష్కుడు నాగరాజుతో - "నీ ఆస్థిలోంచి యాభై లక్షలు వేరు చేయి. నీతో ఏమాత్రం పరిచయం లేని, నీకు బంధువుకాని, ఓ మామూలు మంచి మనిషికా ఆస్థిని కట్టబెట్టు. ఉన్న ఫళంగా అంత ఆస్థి కలిగిన అసామాన్యమైన వ్యక్తి అపురూపాన సాగరంలోని ప్రతి చెట్టూ నీ ప్రగతికి మెట్టౌతుంది. నీకింక పతనమే ఉండదు" అని చెప్పాడు.
అతను ఓ మామూలు మంచిమనిషి కోసం అన్వేషణ ప్రారంభించాడు.
తనిచ్చే డబ్బు ఒకే ఒక్క మనిషికి చెందాలి. ఆ మనిషి ఎక్కువ కాలం ఆ డబ్బుననుభవించాలంటే వయసులో చిన్నవాడయ్యుండాలి. ఆ డబ్బు సక్రమంగా వుపయోగపడాలంటే మగాడిక్కాక ఆడపిల్లకివ్వాలి.
ఓ మధ్య తరగతి ఆడపిల్లను యాభై లక్షల రూపాయల ఆస్థికి వారసురాలిని చేయాలని అతను సంకల్పించాడు. కానీ ఇక్కడే ఓ ఇబ్బంది వచ్చింది. నడిసంద్రంలో నలిగిపోతున్న దురదృష్టివంతుడికి నావలోంచీ చేయందిస్తే- చేయందించిన వాడు కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి నాగరాజు డబ్బు అదృష్టవంతులకే చెందాలి.
అందుకని నాగరాజు ఓ పథకం తయారుచేశాడు. ఆ ప్రకారం ఆయన తన పత్రికా విలేఖరుల ద్వారా వివిధ కళాశాలల్లో ఇంటర్వ్యూలు చేయించి కొంతమంది ఆడపిల్లల్ని, ఎన్నిక చేసి వాళ్ళనుంచీ ఓ అమ్మాయిని ఎన్నిక చేశాడు. ఆ అమ్మాయి హాస.
అతను హాస పేరున యాభయ్ లక్షల ఆస్థికి వారసురాలిగా వీలునామా వ్రాశాడు. ఆ వీలునామా జూన్ ఏడవ తేదీన, అంటే హాసకు ఇరవై సంవత్సరాలు నిండే రోజున అమలు జరుగుతుంది. అప్పటికామె వివాహం జరిగి ఆమె మరణిస్తే కనుక ఆ ఆస్థి ఆమె భర్తకు చెందుతుంది. వివాహం జరక్కుండా గనుక మరణిస్తే ఆ ఆస్థి హాసకు కాక మరో వ్యక్తికి చెందుతుంది. ఆ మరో వ్యక్తి నాగరాజు బావమరిది ఆదిశేషు.
చిన్నప్పటినుంచీ రామశేషు జీవన విధానం మంచిది కాదు. అతడికి అన్నిరకాల దుర్వ్యసనాలూ వున్నాయి. వాటికి తగ్గ తెలివితేటలు కూడా వుండటం వలన వక్రమార్గాల్లో డబ్బు బాగా సంపాదించాడు. అందులో కొంత డబ్బు నాగరాజుక్కూడా ఆదిలో ఉపయోగపడి షరతుగా రామశేషు చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు.
ఒకసారి ఆర్నెల్లు, ఇంకోసారి పదినెల్లు, మరోసారి ఏణ్ణర్ధం__మొత్తం మూడుసార్లు రామశేషు జైలుకి వెళ్ళొచ్చాడు. సమాజంలో అతడికంత గౌరవస్థానం లేదు. కానీ పెద్ద కాంటాక్ట్సున్నాయి. అతడి బంధువు కావడంవల్ల నాగరాజు క్కూడా కొంత చిన్నతనముంది.
రామశేషుకు దుర్వ్యసనాల కారణంగా ఖర్చెక్కువ. ఏడాదికి రెండు లక్షలు సంపాదిస్తే లక్షా యాభై వేలు అతడికే ఖర్చు. యాభై వేలలో సంసారం దర్జాగానే వెడుతుంది. కానీ నాగరాజు హోదా వాళ్ళకి లేదు.
జ్యోతిష్కుడి మాటలు విన్నాక నాగరాజు భార్య యాభై లక్షలూ తన అన్నకివ్వమని పట్టుబట్టింది. అప్పుడు నాగరాజు దురదృష్టవంతుడికి సాయపడటంలో వున్న ప్రమాదం చెప్పి- "వాడి అదృష్టాన్ని పరీక్షించడానికిదో ఉపాయం. ఇది నీకూ-నాకూ మధ్య రహస్యంగా వుండిపోవాలి" అన్నాడు.
పథకం కౄరమయినది కావచ్చు. కానీ ఆ యాభై లక్షలను వూరికే వదుల్తాడా నాగరాజు.
హాస అదృష్టవంతురాలయితే ఆ యాభై లక్షలతో సుఖపడుతుంది. ఆమె భర్త అదృష్టవంతుడయితే ఆమె మరణించి అతడా ఆస్థిని పొందుతాడు. రామశేషు అదృష్టవంతుడయితే ఆస్థి అతడికే చెందుతుంది, జూన్ ఏడులోగానే హాస మరణించి!
భార్య ద్వారా విషయం రామశేషుకు చేరుతుందని నాగరాజుకు తెల్సు- వీలునామా బైటపడగానే అతడు హాసను చంపడానికి పథకం వేస్తాడని కూడా ఆయనకు తెలుసు. కానీ అదృష్టం అంత సులభమా?
హాస దుర్మార్గుల బారి నుండి తప్పించుకోవాలి.
దుర్మార్గులు చట్టం బారినుండి తప్పించుకోవాలి.