Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 38

    "అవునండి" అంటూ క్లుప్తంగా రచయిత రాయుడికి మళ్ళీ కథ చెప్పి, "అసలు మీరలాగైపోయారేమిటీ!" అన్నాడు.   
    "నా శంకర్ ఇంత పని చేస్తాడని నేననుకోలేదు" అన్నాడు రాయుడు. ఆయన ఇంకేమీ మాట్లాడలేదు. రచయిత భుజంమీద చెయ్యివేసి పోదామన్నట్టు సైగచేశాడు.   
    ఇల్లు చేరగానే రాయుడు, "శంకర్ ఎక్కడ?" అని అరిచాడు.   
    రాయుడు, చెల్లెలు లలిత, "ఏం జరిగిందన్నయా?" అంది కంగారుగా.   
    "ముందు శంకర్ ని పిలు" అన్నాడు రాయుడు.   
    "ఇప్పుడే బజార్లోకి వెళ్ళాడు. పది నిముషాల్లో వస్తాడు" అంది లలిత.   
    "నువ్వు పంపావా? వాడే వెళ్ళాడా?"   
    "నేనే పంపాను. ఏం?" అంది లలిత.  
    రాయుడు క్లుప్తంగా కథ చెప్పాడు. లలిత కళ్ళు ఎర్రబడ్డాయి. "అందులోనూ ఆ సుభద్రమ్మ కూతుర్నా? పేరా ఊరా? ఇది నేనూ సహించను" అంది. ఇంట్లో ఒక్కొక్కరే ఈ ప్రేమకు వ్యతిరేకంగా మారిపోతూంటే రాయుడు బలం పుంజుకుంటున్నాడు.  
    సరిగ్గా ఇరవై నిముషాల తర్వాత శంకర్ ఇంటికొచ్చేసరికి ఇల్లు అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అది తుఫాన్ కు ముందరి ప్రశాంతత లాగుంది.   
    ఈ ప్రశాంతతకు ఆశ్చర్యపోతున్న శంకర్ కు, "బాబూ శంకర్! ఇలా రామ్మా!" అన్న తల్లి పిలుపు ఓ గదిలోంచి వినిపించింది. ఆ పిలుపులో తల్లి ఆప్యాయత ధ్వనించడంలేదు. యుద్ద ప్రారంభాన్ని సూచించే రణభేరి లాగుంది.   
    శంకర్ గదిలో అడుగుపెట్టాడు. అదొక న్యాయస్థానం లాగుంది. అక్కడ మేనమామతో సహా మొత్తం పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళు చూసే చూపులతన్ని క్షణాలమీద ముద్దాయిని చేశాయి.
    "ఏమ్మా?" అన్నాడు శంకర్. అదొక్కటే అతడు మాట్లాడినమాట. ఆ తర్వాత ఇంట్లోని పెద్దలంతా మాట్లాడారు. వినేవాళ్ళకి అవి మాటలు కావచ్చు కానీ, శంకర్ కి మాత్రం అవి చివాట్లు.  
    అంతా అయిపోయాక, "అరుణ గురించి మీకెలా తెలిసిందీ?" అన్నాడు శంకర్.   
    "నేను తెలుసుకున్నాను" అన్నాడు రాయుడు.   
    "నేను చేసింది తప్పా?" అన్నాడు శంకర్.   
    "క్షమించరాని తప్పు!" అన్నాడు రాయుడు.  
    "మరి ఆ తప్పును సవరించుకునే అవకాశం లేదా?" అన్నాడు శంకర్.   
    "ఉంది. ఆ పిల్ల ఎక్కడుందో చెప్పు _ వాళ్ళింట్లో అప్పగించు. బుద్దిగా మన కులం పిల్లని పెళ్ళిచేసుకో, నువ్వు సుహాసినిని ప్రేమిస్తే, ఆ పిల్లను సుబ్బారావువైపు ఎందుకు మళ్ళించాననుకున్నావు? మన వంశ గౌరవం కాపాడ్డానికే" అన్నాడు రాయుడు.   
    "అసలీవేళ మధ్యాహ్నం మూడున్నరకి పెళ్ళిచేసుకుందామని కూడా అనుకున్నాం. అదే జరిగితే ఇంకా మీ రెవ్వరూ నా మొహం చూసి ఉండేవారు కాదు. నేను చాలా అదృష్టవంతున్ని" అన్నాడు శంకర్.   
    "ఈ రోజే పెళ్ళా? ఇంకా నయం. సమయానికి అన్నయ్య అంతా తెలుసుకున్నాడు. గనుక సరిపోయింది. అసలా పిల్లనెక్కడికి తీసుకుని వెళ్ళావు?" అంది లలిత.  
    "లలిత ఈ ఊళ్ళోనే వీరేశలింగం సేవాసంస్థలోవుంది. మాది వర్ణాంతర వివాహమనీ, పెద్ద లంగీకరించని భయంగా ఉన్నదనీ, ఆ సంస్థ నిర్వాహకులకు చెబితేవాళ్ళు లలితను అక్కడ ఉంచుకున్నారు. ఈరోజు వారు సాక్షిసంతకాలకు వస్తామన్నారు. మూడున్నరకు మేమంతా రిజిస్ట్రాఫీసు వద్ద కలుసుకోవలసి వుంది" అన్నాడు శంకర్.  
    "ఔరా, ఎంత తెగింపు!" అన్నాడు రాయుడు.  
    అంతవరకూ అక్కడే కూర్చుని వున్న రచయిత చటుక్కున లేచి, "రాయుడుగారూ! మరి నేను వస్తాను" అన్నాడు.   
    "ఎక్కడికి?" అన్నాడు రాయుడు.   
    "ముందు హైదరాబాదు అక్కన్నించి మద్రాసు!"   
    "అదేమిటి, మన కథ పూర్తి కాకుండానే..." అన్నాడు రాయుడు.   
    "ఈ కథ ఇక్కడితో ఆగిపోయిందండి" అన్నాడు రచయిత.   
    రాయుడు రచయిత వంక కోపంగా చూసి, "మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు నువ్వు" అన్నాడు.   
    "సుహాసిని, సుబ్బారావుల ప్రేమకథకు నేనూహించని అద్భుతమయిన మలుపు వచ్చింది. శంకర్ అరుణని పెళ్ళిచేసుకుంటే ఈ వర్ణాంతరం కలిగించిన షాక్ కి సుభద్రమ్మ తట్టుకోలేదు. ఆ షాక్ లోనే ఆవిడ సుబ్బారావు, సుహాసినిల పెళ్ళికి అంగీకరించి తీర్తుంది. ప్రేక్షకులందరూ హర్షించే అందమైన మలుపు అది. ఇంత చక్కటి ఊహ నా మట్టిబుర్రకు తట్టదనిపించి ఆ బ్రహ్మదేవుడే ఈ ఏర్పాటు చేశాడు. అయితే మీరది ఉపయోగించుకోవడం లేదు. శంకర్ నీ అరుణనీ వేరుచేస్తున్నారు. దాంతోనే సుబ్బారావూ, సుహాసినీ కూడా వేరయిపోతున్నారు. మీ కధను మీరే చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఇంక నేను చేయగలిగిన దేముంది?" అన్నాడు రచయిత.   
    రాయుడు రచయిత వంక అదోలా చూసి - "నువ్వు చాలా ఆవేశపడిపోతున్నావు. మరి ఇది నీ కుటుంబ విషయం కాదు గదా!" అన్నాడు.   
    "నా కావేశం కలగదూ మరి! ఇంతవరకూ తీసుకొచ్చినకధను ఇక్కడ మీరు అన్యాయంగా పాడుచేస్తూంటే అసహాయతతో బాధపడుతున్నాను. రాయుడుగారూ! మీ సినిమా కథకో నమస్కారం. సుహాసినీ, సుబ్బారావుని కలపడానికి మిగిలిన ఏకైక మార్గాన్ని మీరు మూసేస్తున్నారు. ఇంకా నేనేమీ చెయ్యలేను. సెలవు" అన్నాడు రచయిత.  
    రచయిత గది గుమ్మం సమీపించాడు.   
    రాయుడు 'ఆగు' అని అంటాడా? ఆయన ఆగు అంటే, అది ఒక్కసారిగా రెండు పెళ్ళిళ్ళు జరిపించడమేగాక...

 Previous Page Next Page