Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 37

                                                  17   
    సుభద్రమ్మ మీద రాయుడి చిట్కాపని చేయలేదు, కొడుకు ఒక్కడూ దొంగలను నలుగుర్నీ బంధించడంతో ఆవిడ ధైర్యం ఇంకా పెరిగి సుహాసినితో సంబంధం ఆవిడ ససేమిరా వల్ల కాదంది. సుభద్రమ్మ ఆలోచనలిలాగున్నాయని తెలిసేక రచయిత దీక్షితుల్ని వెంటనే పంపడానికి భయపడ్డాడు.   
    ఈ సమస్యనుండి ఎలా బయటపడాలా  అని ఆలోచిస్తూండగా ఒకరోజున సుభద్రమ్మే స్వయంగా రాయుడింటికి వచ్చింది. రాయుడామేను మర్యాదగా ఆహ్వానించాడు.   
    సుభద్రమ్మ ముఖంలో దిగులు కనబడింది.   
    "బాబూ, రాయుడుగారూ! మీరు పెద్ద మనుషులు, గౌరవపాత్రులు, మా ఇంటి పరువు కాపాడాలి. మూడోకంటి వాడికి తెలియకుండా మా మర్యాద దక్కించాలి. అన్నిటికీ మిమ్మల్నే నమ్ముకున్నాను" అంది సుభద్రమ్మ.   
    "ఏం జరిగిందో చెప్పండి!" అన్నాడు రాయుడు.   
    సుభద్రమ్మ చెప్పింది. అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి సుభద్రమ్మను అమెరికా రమ్మని ఆహ్వానించాడని విన్నా రాయుడంత ఆశ్చర్యపోకపోను, కానీ సుభద్రమ్మ చెప్పిన వార్త ఆయన ఊహ కందనిది. నిన్నట్నింఛీ అరుణ ఇంట్లో కనిపించడంలేదట. మధ్యాహ్నం వెళ్ళిందట- కూరగాయలు తెస్తానని ఇంతవరకూ పత్తాలేదు.   
    "మామీద ఎవ్వరో పగబట్టారు. అసలా సుహాసిని మా అబ్బాయి చుట్టూ ఉచ్చులు బిగిస్తోందని నాకు తెలుసు. కానీ మరీ ఇంతకు తెగించిందని అనుకోలేదు. ఇదంతా దాని పనే అని నా అనుమానం. వయసులో ఉన్నపిల్ల. నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. అదెక్కడుందో ఆరాతీసి చెప్పాలి బాబూ!" అంది సుభద్రమ్మ.   
    ఆవిడ వెళ్ళిపోయాక రాయుడు, రచయిత ఆలోచనలో పడ్డారు.  
    "అరుణ ఏమైంది? ఆమెను ఎవరు ఎత్తుకునిపోయారు?"   
    "ఈ విషయంలో మనకు వనజ కొంత సాయపడగలదు, ఆరోజు జూకి వెళ్ళినప్పట్నించీ అరుణ, వనజ స్నేహితురాళ్ళయ్యారు. వాళ్ళు తరచుగా కలుసుకుంటుండేవాళ్ళు" అన్నాడు రచయిత.   
    మర్నాడుదయం వాళ్ళు వనజను కలుసుకున్నారు.   
    "కంగారుపడకండి! అరుణ, శంకర్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. ఇంట్లో ఐతే ఈ పెళ్ళికి ఒప్పుకోరని అరుణ ఇల్లువదలి వెళ్ళిపోయిందనుకుంటాను" అంది వనజ.   
    "నీకు చాలా తెలిసినట్లుంది. అసలు శంకర్ కీ, అరుణకీ పరిచయం ఎప్పుడు ప్రారంభమైంది?" అన్నాడు రచయిత. తనపక్కనే ఉన్నా రాయుడు. నిశ్చేష్టుడైన విషయం రచయిత గమనించలేదు.   
    "అందమైన ఆడది వల విసిరితే, ఆ వలలోపడ్డ మగాడు. ఆ తర్వాత ఆమెకోసం ఎంతకైనా తెగించగలడని నేనోసారి అన్న మాటలు అరుణను ఆకర్షించాయి. అరుణ చలాకీ అయినపిల్ల ఆమె తన అందమెంత గొప్పదో పరీక్షించాలనుకుంది. అప్పుడు నాకు మీరు గుర్తుకొచ్చారు. శంకర్ అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అతని కారణంగా సుహాసిని సుబ్బారావుల వివాహం ఆగిపోవచ్చు. అందుకని నేనే ఆమెకు శంకర్ పేరు చెప్పాను. ఆమె తనంతట తాను ప్రేమించానంది. శంకర్ కి కలిగిన ఆనందమింతా అంతాకాదు. వారి ప్రేమ సమాగమాలకు నేను సాయపడుతూ వచ్చాను. వారినెవ్వరూ అనుమానించలేదంటే, అందుకు కొంతవరకూ నేనే కారణం" అంది వనజ.
    "ఐతే నువ్వు వీళ్ళ ప్రేమ నాటకాన్ని ప్రారంభించి దర్శకురాలి వైనావన్నమాట" అన్నాడు రచయిత.  
    వనజ నవ్వి, "మంచిపనులు చేయడానికి నేనెప్పుడూ సిద్దమే! కులం, మతం పేరుచెప్పి ప్రేమకథలు పాడుచెయ్యడం నా కిష్టముండదు. నా శక్తికొలదీ వర్ణాంతర వివాహాలకు అనుకూలంగా పని చేస్తూంటాను" అంది.  
    "ఐతే నువ్వూ వర్ణాంతర వివాహం చేసుకుంటావా?" అన్నాడు రచయిత.  
    చేసుకోవాలనే నా ప్రయత్నం, అందులో కొంత విజయం నేను సాధించాను" అంది వనజ.  
    "ఎవరా అబ్బాయి?"  
    వనజ తమాషాగా నవ్వింది. "ఆడది ఎలాంటి మగాడి నైనా భర్తగా భరించగలదు. ఐతే ప్రతి ఆడదానికీ కొన్ని చిన్న కోరికలుంటాయి. మగాడు ఆ కోరికలు తీరిస్తే ఆడది అతన్ని ఆరాధిస్తుంది. చిన్నప్పట్నించీ నాకు డబ్బు పిచ్చి. డబ్బుంటే చాలు- ఇంకేమి అక్కర్లేదు నాకు. డబ్బున్న భర్తను పొందాలన్నది నా కోరిక. ఈ నా కోరికకు అందుబాటులో ప్రభాకరం ఉన్నాడు. అతన్ని నేను ప్రేమించానని చెప్పాను. చెయ్యికూడా పట్టుకోనివ్వలేదు. అందీ అంధకుండా ఉన్నాను. ప్రభాకరం నా ప్రేమను అనుమతించినట్లు నటించాడు. కానీ అతడి బుద్దులు వేరే ఉన్నాయి. నన్ను వంచించాలనుకున్నాడు. నేనతడి ఆలోచన కనిపెట్టాను. పెళ్ళి గురించి నొక్కించాను. నేను తనను ప్రేమిస్తున్నానని తెలుసు. ప్రభాకరం నన్ను ఆకట్టి ఉంచుకున్నాడు- ఎప్పటికైనా దొరక్కపోతానా అన్న ఆశతో! సుహాసిని ఉండగా  అతను నన్ను పెళ్ళి చేసుకోడని నాకు తెలుసు. సుహాసిని అతడిపై మనస్సు విరవాలని ప్రయత్నించాను. మొన్న మొన్నటిదాకా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవలే అంతా నాకు అనుకూలంగా జరుగుతోంది. సుబ్బారావుకీ, సుహాసినికీ పెళ్ళి జరిగితే- ప్రభాకరం నాతో పెళ్ళికి ఒప్పుకుంటాడని నా నమ్మకం!"  
    రచయిత ఆశ్చర్యంగా, "నీక్కూడా నీ భర్త దురలవాట్లు మాన్పించి పేరుప్రతిష్టలు సంపాదించాలని ఉందా?" అన్నాడు.  
    "ప్రస్తుతం డబ్బొక్కటే నా ఆలోచన. కొంతకాలం పాటు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టగలగాలి. ఆ తర్వాతే మిగతావన్నీ ఆలోచిస్తాను" అంది వనజ.  
    "ఇంతకీ నీకు అరుణ ఎక్కడుందో తెలుసా?"   
    "తెలియదు" అంది వనజ.   
    "మరి మనం వెడదామా?" అన్నాక అప్పుడు చూశాడు రాయున్ని రచయిత. రాయుడు నోరు తెరచి అలా ఉండిపోయాడు.   
    "ఏమైంది మీకు?" అన్నాడు రచయిత. రాయుడు మాట్లాడలేదు. వనజ కూడా రాయుడి పరిస్థితిచూసి కంగారు పడి లోపలకు వెళ్ళిగ్లాసుడు మంచినీళ్ళు తెచ్చి ఆయన ముఖాన జల్లింది.  
    అప్పుడు రాయుడు తేరుకుని, "ఏమిటీ! శంకర్, అరుణ ప్రేమించుకుంటున్నారా?" అన్నాడు.

 Previous Page Next Page