రచయిత ఓసారి వెనక్కు తిరిగి, "రాయుడుగారూ? పది తరాలుగా మీరు కాపాడుకుంటూ వస్తున్నది. పవిత్రత కాదు, అజ్ఞానం. ఆ జ్ఞానాంధకారంలోకి శంకర్ కారణంగా ఓ కాంతికిరణం రాబోయింది. కానీ మీరు చెయ్యి అడ్డుపెడుతున్నారు. ఇంతవరకూ మీరు చాలా సినిమాలు తీశారు. కానీ ఇప్పుడాగిపోయిన కధను ఆపకుండా సినిమాగా తీస్తే, ఆ సినిమా తరతరాలుగా మీ వంశం సంపాదించుకోలేకపోయినా నవ్యోత్కృష్టత సాధించి, ఇకముందునుంచి మీ సినిమాల్లోంచి జాతి, జాతీయ నాయకుల కధిగమించగల్గుతుంది. సందేశాలు నేర్చుకుంటుంది. ముత్యాలసరాలు, మహా ప్రస్థానాలు మీ సినిమాల్లోంచి పలుకుతాయి. అందుకు శ్రీకారం చుట్టడానికి కొద్దిక్షణాలు మాత్రమే ఉంది. మీ ఇష్టం" అని మళ్ళీ ముందడుగు వేశాడు.
"ఆగు" అన్నాడు రాయుడు.
* * *
ఆ రోజే శోభనం ముహూర్తం.
మంచంమీద కూర్చున్నాడు సుబ్బారావు తలుపులు బయట నుండి మూసుకోగానే నెమ్మదిగా నడుచుకుంటూ సుబ్బారావును సమీపించింది సుహాసిని.
గది బయట ఉన్న మోనికా, రామగోపాల్ వంక చూసింది. రామగోపాల్ రాయుడువంకచూశాడు. రాయుడు నవ్వి, "మీ పని అయిపోయింది" అన్నాడు.
గదిలోపల సుబ్బారావు సుహాసినిని చూసి, "మన పెళ్ళి నిజంగా జరిగిపోయింది" అన్నాడు.
సుహాసిని సుబ్బారావు పక్కన కూర్చుని, "ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉందా?" అంది.
"ఎంతో ప్రశాంతంగా ఉంది" అన్నాడు సుబ్బారావు.
"ఐతే శకారుడి కధ పూర్తి చేయరూ?" అంది సుహాసిని.
"ఈనాటి సమాజంలో అర్ధంలేని మూఢాచారమై శకారుడు. మనకు సంబంధించి నంతవరకూ శకారుడు చచ్చిపోయాడు గనుకనే, ఈనాడిలా కలుసుకున్నాం" అన్నాడు సుబ్బారావు.
* * *
మద్రాస్ లో రాయుడు, సినిమా చర్చలో ఉన్నాడు.
"సినిమా ఏ సీనుతో అంతమవుతుందీ?" అంటున్నాడు దర్శకుడు.
"శోభనం సీను."
"ఐతే పాట రాస్తాను" అన్నాడు పాటల రచయిత.
"వానలో తడిస్తేనే పాట పాడుకోరు మా హీరో హీరోయిన్లు ఇంక శోభనం గదిలో పాడుకుంటారా?" అన్నాడు రాయుడు.
"మరి శోభనం సీను ఎలా చూపిద్దామనీ!" అన్నాడు దర్శకుడు.
"ఇలా!" అంటూ రాయుడు లేచివెళ్ళి గదిలోని లైటు ఆర్పేశాడు. ఒక్కసారి గదిలోగాడాంధకారం అలుముకుంది.
"శభాష్!" అన్నాడు రచయిత. "ఇది అచ్చంగా రాయుడుగారి సినిమా కధ!" గదిలో అందరి నవ్వులూ వినిపించాయి.
"నవ్వండి__శోభనం సీన్ లో యాక్ట్ చేసేది మనం కాదు" అన్నాడు రాయుడు.
నవ్వులు ఆగలేదు. ఇంకా పెద్దవయ్యాయి. రాయుడు చటుక్కున దీపం వేసేసరికి అందరూ విరగబడి
నవ్వుతున్నారు,
"సినిమా విడుదలైనాక నాప్రేక్షకులూ, నేనూకూడా ఇలా నవ్వగలగానే ఎంతో కష్టపడ్డాను. ఇంకా మీ కృషి ప్రారంభించాలి" అన్నాడు రాయుడు తన చిత్ర సాంకేతిక వర్గాన్నుద్దేశించి!
_:అయిపోయింది:_