Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 37

   "ఏమిటి డల్ గా వున్నావ్" విస్సుని చూస్తూ అడిగాడు చౌదరి.   
    హాల్లో అప్పటికే చాలా సందడిగా వుంది...అదంతా రేపు నెలలో కేంద్ర మంత్రిగారి కూతురితో రాజేంద్రకి జరగబోయే పెళ్ళి సందడిలా వుంది తప్ప నిన్న జరిగిన ఓ దారుణానికి సంబంధించి జరుగుతున్న చర్చలా లేదు...    
    "బహుశా నిన్నటి షాక్ నుంచి విస్సు ఇంకా తేరుకున్నట్టులేదు" అన్నాడు లాయర్ రంగధాం అదో జోకులా....    
    మరెక్కడో జీవిత యింటిలో బహుశా ఈపాటికి జీవిత శవానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయమది.    
    "కరెక్టుగా గెస్ చేసారు లాయరుగారూ...." నిర్వేదంగా అన్న విస్సూ మొహంలో ఆ బాధ పూర్తిగా వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు....."ఒకవేళ చౌదరిగారు నిన్న కనుక అడగ్గానే ఆ పెళ్ళికి అంగీకరించింది వుంటే...."    
    "ఈ పాటికి కృషి అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యేదంటావ్" చౌదరి జోక్ లా నవ్వాడు.    
    "కనీసం జీవితనే ఓ అమ్మాయి బ్రతికేదిగా"    
    "మరిచిపో విస్సు....దేనికైనా ప్రాప్తం వుండాలిగా.....అప్పటికే నేను ఒప్పుకున్నాగా....కాకపోతే కాస్త ఆలస్యమైంది...." చౌదరి ఈజీగా అనేసాడు.    
    మరేదో చెప్పేవాడే యింతలో ఎమ్మెల్యే రాజారావు వచ్చి ఓ రహస్యంలా అన్నాడు చౌదరితో "అవతల గదిలో పెద్దమనుషులు మీకోసం ఎదురుచూస్తున్నారు సర్."    
    విస్సూని పట్టించుకోలేదిక చౌదరి...    
    లోపలికి వెళుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోయాడు....మరో అర నిముషం తర్వాత బయటికి వెళ్ళబోతుండగా పలకరించాడు రాజేంద్ర "హాయ్ విస్సూ...."    
    నిన్న ఆత్మహత్య నుంచి తేరుకున్నట్టు కాక ఓ హత్య చేసి తప్పించుకున్న ఉత్సాహంలా వుంది.    
    చౌదరిలాంటి వ్యక్తిని ఢీ కోవాలి అంటే ఓ బలమైన ఆయుధం కావాలి....జీవితనే ఓ ఆడపిల్ల జీవితాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కాలరాసిన రాజేంద్ర సుఖంగా బ్రతక్కూడదు.....ఈ లోగానే చౌదరి సామ్రాజ్యం పునాది కదపగలగాలి కేవలం అదే ఆశలో ఆవేశాన్ని దిగమింగుకుని యిలా వచ్చాడు.    
    అదిగో అప్పుడు చూసాడు యింటి లోపల అడుగుపెడుతున్న డాక్టర్ సక్సేనాని....అతడితో బాటు మరో యిద్దరు పార్లమెంటు సభ్యులు లోనికి వచ్చి లాయర్ రంగధాం సాధరంగా ఆహ్వానిస్తూంటే లోపలి గదిలోకి వెళ్ళారు.    
    డాక్టర్ సక్సేనా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారతదేశానికి చెందిన పర్యావరణ సంఘానికి ప్రతినిధి....ఇక్కడి కెందుకొచ్చాడు...   
    కేంద్ర మంత్రిగారు రాజేంద్రకి మామ కాబోతున్న సందర్భంలో యిలాంటి ప్రముఖులు యిక్కడ అడుగుపెట్టడంలో ఆంతర్యం అర్ధం కావడం లేదు విశ్సూకి.    
    రాజేంద్ర ద్వారా తప్ప విషయాన్ని రాబట్టే మార్గం లేనట్టుగా విస్సు రాజేంద్రని రెచ్చగొట్టి పార్టీకోసమన్నట్టుగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ రెస్టారెంట్ కి తీసుకువెళ్ళాడు.    
    అతిగా తాగేక రాజేంద్ర ఎంత వాగేది అర్ధమైన విస్సు మొత్తం విషయాన్ని రాబట్టగలిగాడు. ఇక్కడ రాజేంద్రకి తెలీనిది విస్సు ఇప్పుడు తన తండ్రి హత్యలో చౌదరిని అనుమానిస్తున్నాడన్న విషయం.    
    "ఇందాక నువ్వు చూసింది డాక్టర్ సక్సేనా ఒక్కడ్నే విస్సూ....అంతకుముందే మా యింటిలో అతడికోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి లక్నోకి చెందిన ఇండస్ట్రియల్ టాక్సీకాలజీ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ సైంటిస్ట్ డాక్టర్ మోహతా..."    
    "నీ పెళ్ళికి వాళ్ళు రావటానికి సంబంధం ఏమిటి"
    "మాకు చాక్ లెట్ కంపెనీ ఒకటుందని అది దేశంలో ప్రముఖ కంపెనీగా ఎదిగే ప్రోసెస్ లో యీ మధ్య విదేశాలకు కోట్ల రూపాయల చాక్ లెట్స్ ని ఎగుమతి చేస్తూందన్న విషయం నీకు తెలుసుగా....ఈ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో మా కంపెనీ చాక్ లెట్స్ లో 'నికెల్' వున్నట్టు కనిపెట్టింది. ఆ విషయం బయటపడితే ఎగుమతులు ఆగిపోవడమే కాదు మన దేశంలోనూ చాక్ లెట్స్ డిమేండ్ తగ్గి కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి రావచ్చు..."    
    రాజేంద్ర చెప్పకపోయినా కంపెనీ అధిపతి అయిన చౌదరి జైలుకి వెళ్ళాల్సి వుంటుంది. పసిపిల్లలు తినే చాక్ లెట్స్ లో నికిల్ రుచిపెంచే అవకాశం వున్నా అది ప్రాణహాని కలిగించే జబ్బులకి కారణం అవుతుంది.    
    "ఇది మా డాడీకి తెలిసింది ఈ మధ్యనే. అదీ నాకు కాబోయే మామగారైన కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ యిప్పటికే హెల్తు మినిస్టర్ కి రిపోర్టు పంపింది. ఇప్పుడు డాక్టర్ సక్సేనా డాక్టర్ మెహతాలు ఇంతవరకూ ఉత్పత్తయిన మా చాక్లెట్స్ లో నికెల్ లేదని లేబరేటరీస్ లో నిరూపించాలి. దానికి సంబంధించిన లావాదేవీలు మాట్లాడటానికే వాళ్ళు మా ఇంటికి వచ్చింది. "వాళ్ళని పంపింది నాక్కాబోయే మామగారే - వాళ్ళు మాకు సహకరిస్తే దానికి బదులుగా నేను కేంద్ర ఆరోగ్య శాఖామంత్రికి అల్లుడ్ని కావాలి. అదీ సంగతి"    
    అభినందనగా రాజేంద్ర భుజం తట్టాడు విస్సు. అలా అభినందించింది మంత్రిగారికి అల్లుడవుతున్నందుకు కాదు ఓ అద్భుతమైన 'క్లూ' అందించినందుకు......    
    ఇక్కడ రాజేంద్ర మొత్తం కక్కేసి ఎంత పొరపాటు చేసిందీ ఆ మరుసటి రోజుకిగానీ అర్ధం కాలేదు.    
    ఆ మరుసటి రోజే విస్సు హోటల్ ఎమరాల్డులో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశాడు. ఆ కాన్ఫరెన్స్ కి వినియోగదారుల సంఘం ప్రతినిధుల మహిళా సంఘాలతో బాటు పౌరహక్కుల సంఘం నాయకుల్ని ఆహ్వానించాడు.    
    అంతే...    
    ఏదైతే గోప్యంగా జరగాలని చౌదరి ప్రయత్నించాడో అది కాస్త పత్రికలదాకా వెళ్ళడంతో బాటు 'చౌదరి చాక్ లెట్స్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తేల్చిన వాస్తవాల్ని ప్రభుత్వం ఎందుకు నొక్కిపెడుతుంద'ని పార్లమెంటులో సైతం చర్చించబడింది మరునాడే.    
    కోట్లాది మంది పసిపిల్లల ప్రాణాలకు హాని కలిగించే చౌదరి చాక్ లెట్స్ గురించి ప్రయోగశాలలో పరిశీలించి తగుచర్యలు తీసుకుంటామని ప్రతిపక్షాలకు హామీ యిచ్చాడు దేశ ప్రధాని.
    ఒకేసారి సెంట్రల్ ఫుడ్ లేబరేటరీస్, హైద్రాబాద్ కి చెందిన కేంద్ర పౌష్టికాహార సంస్థ, మైసూర్ లోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చి లేబరేటరీలలో చాక్ లెట్లలో 'నికెల్' శాతం గురించి తెలుసుకొమ్మని స్వయంగా ప్రధానమంత్రే ఆదేశాలిచ్చాడు.
    కేవలం నాలుగురోజుల వ్యవధిలో రామనాథ చౌదరికి చెందిన సగం సామ్రాజ్యం సమస్యల్లో చిక్కుకుంది. అంతేకాదు కాబోయే పెళ్ళి సైతం నిరవధికంగా వాయిదా పడిపోయింది.    
    ఒక అణువు విస్ఫోటనం ఎలాంటి భీభత్సానికి కారణమయ్యిందీ తెలిసిన చౌదరి వెంటనే తన బలగానికి ఆదేశాలిచ్చాడు.    
    ఇరవై నాలుగు గంటల్లో విస్సు కడతేరిపోవాలి.    
    ఆ విషయం ముందు తెలుసుకున్నది కృషి.    
    పత్రికల, రేడియో, దూరదర్శన్ ల ద్వారా విస్సు ఒంటరిగా సాగిస్తున్న పోరాటం గురించి తెలుసుకుంటూ అమితమైన ఆనందంతో బాటు అనూహ్యమైన టెన్షన్ కి గురైన కృషి విస్సుని కలుసుకునే ప్రయత్నంలో విఫలమైంది మొదటి ఆరు రోజులు.    
    ఆ తర్వాత ఓ అర్దరాత్రి అతడ్ని  కలుసుకుంది ఆశ్రమంలోనే.    
    మాసిన గెడ్డంతో కనిపించిన విస్సు ఇప్పుడు యోధుడిలా అనిపించలేదు.    
    ఓ యజ్ఞం ప్రారంభించిన రుషిలా వున్నాడు.
    ఆమెను చూడగానే ముందు అవాక్కయ్యాడు.    
    తర్వాత నా పరిచయం సైతం మీకు ప్రమాదమే అని చెప్పాలనుకున్నాడు.   
    అసలు ఆమెను కలుసుకోవడమే తనకు ఇష్టం లేనట్టు తల తిప్పుకోబోయాడు.    
    కాని...    
    కృషి అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు.    
    నెమ్మదిగా ఓ చిరుగాలి అలలా అతడ్ని సమీపించింది.    
    ఘనీభవించిన ఏ ఆలోచనల పొరలో ఉన్నట్టుండి ద్రవించినట్టు హఠాత్తుగా అతడ్ని చేరి పెదవులపై బలంగా ముద్దుపెట్టుకుంది.    
    ఇద్దరికీ తెలీదు చౌదరి మనుషులు అప్పటికే ఆ కుటీరాన్ని చుట్టుముట్టారని.    
                                  *    *    *    *    
    సరిగ్గా అదే సమయంలో...    
    పది నిముషాలుగా చౌదరి ఫోన్ లో కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి గంగాధరంతో మాట్లాడుతున్నాడు చాలా ఆవేశంగా...    
    "మనం వియ్యంకులం కావాల్సిన ఆఖరి క్షణంలో పెళ్ళి కేన్సిల్ చేయడం నేను భరించలేని విషయం గంగాధరం ఇంత పరపతిగల నేను రేపు తలెలా ఎత్తుకోను"    
    "సారీ చౌదరీ....నీతో వియ్యానికి సిద్దపడితే నేను ఇరుక్కుపోతాను....పార్లమెంటులో సైతం నీ చాక్ లెట్ ఫ్యాక్టరీ విషయం చర్చించబడింది. అంటే నువ్విప్పుడు పూర్తిగా వూబిలో కూరుకుపోయావు."    
    "ఇవన్నీ చాలా మామూలు విషయాలు గంగాధరం"    
    "నువ్వంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నావో నాకు అర్ధం కావడంలేదు - రేపు చాక్ లెట్స్ లో 'నికెల్' వున్న విషయం మన లేబరేటరీస్ లో నిరూపించబడితే వినియోగదారుల సంఘాలు నష్టపరిహారాల కోసం కోర్టులో దావావేస్తే నీ ఆస్థి మొత్తం హరించుకుపోవడమే కాదు, నువ్వు జైలుకెళ్ళడమూ తప్పనిసరి అవుతుంది."    
    "నాకా భయం లేదు"    
    "ఇది చిన్న విషయం కాదు చౌదరీ...ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దారించిన ప్రమాదకరమైన నిజం. అంటే నువ్వెంత దారుణమైన నేరానికి సిద్దపడ్డదీ జాతీయస్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడుతుంది. అప్పుడు నీ చాక్ లెట్స్ ఎగుమతి చేసిన దేశాల ప్రభుత్వాలు మన ప్రభుత్వం ముఖ్యంగా దేశ ప్రధాని మీద ఒత్తిడిని తీసుకొచ్చి ఎక్స్ ట్రేడిషన్ ట్రిటీ ప్రకారం నిన్ను ఆయా దేశాలకు నేరస్థుడిగా అప్పగించవచ్చు కూడా"    
    "పసిపిల్లల్ని బెదిరించినట్టు మాట్లాడుతున్నావ్"    
    "నేను చెప్పేది అతిశయోక్తి కాదు చౌదరీ... పచ్చి నిజం. ఇప్పటికే కేంద్ర రాజకీయవర్గాలు మాట్లాడుకుంటున్న విషయం యిది...."    
    చౌదరి నుదుట స్వేదం పేరుకుంది. అంటే తన సువిశాల సామ్రాజ్యం కుప్పకూలిపోయే క్షణాలు దగ్గరపడుతున్నాయా....దశాబ్దాల కృషితో సంపాదించుకున్న ప్రతిష్టకి తిలోదకాలిచ్చి జైలులో గడిపే పరిస్థితి దాపురించ బోతూందన్నమాట.

 Previous Page Next Page