"సృజన్....."
అతను లోపలికెళ్ళి టేబుల్ మీదున్న ఫోన్ తీసుకుని మాట్లాడాడు.
"ఏమిటి పని అనడుగుతున్నారు"
"చాలా ముఖ్యమయిన విషయమని చెప్పండి"
మళ్ళీ మాట్లాడడతను ఫోన్ లో.
"అదేమిటో చెప్పందే లోపలకు వెళ్ళడానికి వీల్లేదు.........."
సృజన్ చకచక ఆలోచించాడు.
"నేను మాట్లాడవచ్చా ఫోన్ లో?"
అతను ఫోన్ లో మాట్లాడి సృజన్ వేపు చూశాడు "వెళ్ళు లోపలకు" అన్నాడు.
సృజన్ లోపలకు నడిచాడు. లోపల మరో కిలోమీటరు దూరంలో ఉందా భవనం! బయట మరో నలుగురు సెక్యురిటీ గార్డులు పేరు చెప్పగానే ఓ గదిలోకి పంపించారు వాళ్ళు. లోపల ఓ బట్టతల వ్యక్తీ కూర్చుని ఉన్నాడు రివాల్వింగ్ చైర్ లో.
"నమస్కారం సార్?" అన్నాడు సృజన్ వినయంగా.
"నమస్కారం- ఎవరు మీరు? ఏమిటి పని?"
"నాపేరు సృజన్ సార్! శ్రీధర్ తమ్ముడిని."
"ఏ శ్రీధర్?"
"మీ దగ్గర జాబ్ కోసం పదిరోజుల క్రితం వచ్చాడు సార్?"
"మా దగ్గరికా?"
"అవున్సార్?"
"మా దగ్గిర కెవరూ రాలేదు ఆ పేరుతొ. అదీ గాక మేమెప్పుడూ డైరెక్టుగా ఎవరినీ తీసుకోము.
"మరి పేపర్లో మీ అడ్వర్టయిజ్ మెంట్ ఒకటి చూశాను కదండీ! ఎకాబికినా ఇంటర్ వ్యులూ జరుగుతాయని......."
అతను ఉలిక్కిపడ్డాడు. అయితే తన ముఖంలోని కలవరపాటుని చప్పున కప్పిపుచ్చుకున్నాడు.
"అది మా ఫ్యాక్టరీ జాబ్ కాదు. మా సేల్స్ ఆఫీస్ లో ఉద్యోగం - దానికీ మాకూ ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి విషయాల్లో ."
"అంటే ఎవరి రిక్రూట్ మెంట్ వాళ్లదన్నమాట......."
"ఇంతకూ నీకెందుకివన్నీ?"
"మా అన్నయ్యను ఎవరో హత్య చేసారు. గుంటూరులో ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి వెళ్ళిన అన్నయ్య వైజాగ్ రోడ్డు మీద చంపబడ్డాడు. కనుక ఇది ఎవరిదో తెలుసుకోవాలంటే - అన్నయ్య ఇక్కడికెందుకొచ్చాడో, ఇక్కడ ఎవరెవరిని కలుసుకున్నాడో తెలుసుకుంటే గానీ కుదరదు. మీరీ విషయంలో ఏమయినా సహాయం చేస్తే.........."
"చూడు బాబూ! ఆయామ్ రియల్లీ సారీ ఫర్ యువర్ బ్రదర్! కానీ ఈ విషయంలో నేను ఏ రకమయిన సహాయమూ చేయలేననుకుంటున్నాను. నువ్ మా సేల్స్ ఆఫీస్ కెళ్తే ఏమయినా వివరాలు దొరకవచ్చు. ఒకవేళ నిజంగా మీ బ్రదర్ ఆ ఆఫీస్ లో ఉద్యోగానికి ప్రయత్నించి నట్లయితే........"
సృజన్ కింకేం మాట్లాడాలో తెలీలేదు. "సరే అక్కడికే వెళతాను సార్! వైజాగ్ లో ఆ ఆఫీస్ అడ్రస్ ఏమిటి సార్?"
"జగదాంబ సెంటర్ లోనే వుంది ఫోర్ స్తోరీడ్ బిల్డింగ్ ........"
సృజన్ నమస్కరించడతనికి. థాంక్యూ సార్"
బయటి కొచ్చేశాడతను. ఒక సెక్యురిటీ గార్డ్ అతనితో బాటు బయటి గేటువరకూ వెన్నంటి వచ్చాడు. సృజన్ జగదాంబ సెంటర్ చేరుకునేసరికి మధ్యాహ్నం పన్నెండయిపోయింది. ఆ ఆఫీస్ కనుక్కోవటం చాలా తేలికగానే జరిగిపోయింది. లోపల చాలామంది కూర్చుని పనిచేసుకుంటున్నారు. మరికొంతమంది తెల్లని సూట్ లు వేసుకుని అటూ ఇటూ పైల్స్ తీసుకుని హడావుడిగా తిరుగుతున్నారు.
ఆఫీస్ లోకి నడిచి రిసెప్షనిస్ట్ దగ్గర నిలబడ్డాడు సృజన్.
"యస్ ప్లీజ్" అతనివంక చూసి తీయగా అడిగిందామె.
"ఈ ఆఫీస్ ఇన్ చార్జ్ ఎవరో కొంచెం చెప్తారా?"
"ఎందుకు?"
"ఐ వాంట్ టూ సి హిమ్......."
"ఏ విషయంలో?"
"పరసనల్ మేటర్........."
"మీరు ఆయనకు తెలుసా?"
"తెలీదు."
"మీ పేరూ , మీరొచ్చినపని చెప్పందే అయన ఎవరినీ చూడరు.'
"నా పేరు సృజన్-----"
"పనీ?"
"పరసనల్ అని రాయండి"
"ఉద్యోగం కోసమా?"
"కాదు"
"బిజినెస్ విషయమా?"
"కాదు -"
"ఓ.కే---ఆయనేలాగూ వప్పుకోరు."
"ప్రయత్నించి చూడండి.'
"ఆమె కాగితం ఫ్యూన్ కిచ్చి లోపలకు పంపించింది ---"
అతను రెండు నిముషాల తర్వాత తిరిగి వచ్చాడు.
"నో ఇంటర్ వ్యూ" అందామె. "నేను ముందే చెప్పాను కదా?"
"ఆఫ్ కోర్స్ ! కానీ ఆయనతో నేను ఎలాగయినా మాట్లాడాలి. ఇది మర్డర్ కేస్ కి సంబంధించిన విషయం."
ఆమెలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది.
"మర్డర్ కేసా?"