కాని...
ఈ హృదయ విదారకమైన, అసహ్యమైన అనూహ్యమైన స్థితివేరు. ఇప్పుడు తానో జీవచ్చవం తన జీవితాన్ని చేజేతులా బలి చేసుకున్న విషరూపిణి!
మనసులో ఏవేవో ఆలోచనలు రూపుచేసుకొంటున్నాయి.
* * *
ఆఫీసుకి ఫోన్ చేసి డ్రైవర్ని పిలిపించింది. ప్లేన్ టైమ ఫోన్ లో తెలుసుకొని ఎయిరో డ్రోమ్ కి వెళ్ళింది.
రావల్సిన సమయంకన్నా అరగంట ఆలస్యంగా వచ్చింది ప్లేన్.
రాజీవ్ సూటు, బూటుతో బయటకు వచ్చాడు. అంతదూరంనుంచి తండ్రిని చూసి కిరణ్మయి కేరింతలు కొడుతోంది. కొంచెం దగ్గరకు రాగానే తల్లినుంచి రాజీవ్ దగ్గరకు పరుగెత్తి ఆయన్ని చుట్టేసుకుంది.
రాజీవ్ కిరణ్మయిని రెండుచేతుల్తో ఎత్తుకొని చిన్మయి దగ్గరకు వచ్చాడు.
అతనప్పటిలాగే వున్నాడు. కొంచెం ఒళ్ళుచేసి తెల్లగా నిగనిగలాడుతున్నాడు.
"చిన్మయీ!" అన్నాడు.
కనురెప్పలు పైకెత్తి అతనివంక చూసింది. తన హృదయం ప్రాణం, రక్తం, ఊపిరి, తనలోని ప్రతి అణువూ, తన దైవం, తన సర్వస్వం...
కళ్ళనీళ్ళు చిమ్ముతున్నాయి!
ఒక్కసారిగా అతనికి అతుక్కుపోవాలని, అతన్ని దగ్గరకు తీసేసుకోవాలని, అతని గుండెలమీద తలవాల్చి ఏడ్చెయ్యాలని మనసు తహతహలాడిపోతోంది.
కాని...
"చిన్మయీ! మాట్లాడవేం?"
"మాటలు రావటంలేదు" అంటూ బలవంతాన నవ్వింది.
అతన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ఆఫీస్ నుంచి కూడా అయిదారుగురు కొలీగ్స్ వచ్చారు. వాళ్ళని ఆప్యాయంగా పలకరించి, కొద్ది నిముషాలు మాట్లాడి చిన్మయితోబాటు కారెక్కాడు.
ఇంటికి రాగానే, కిరణ్మయి కొంచెం కనుచాటైన సమయం చూసుకొని చిన్మయిని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు.
చిన్మయి విడిపించుకోలేదు. మౌనంగా, స్తబ్దుగా అలా నిలబడి వుంది.
"చిన్మయీ! అలా వున్నావేం?"
"ఎలా?"
"ఇన్నాళ్ళ తర్వాత కలుసుకుంటే ఎంతో సంతోషంగా వుంటావనుకున్నాను."
"సంతోషంగా లేకుండా ఎలా వుంటానండీ? కాని షాక్ ను తట్టుకోలేకుండా వున్నాను"
అతనర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాడు. చిన్మయి సున్నితమైన స్వభావం అతనికి తెలుసు. ఆమె మానసికంగా ఎంత అలజడికి గురయి వుంటుందో తెలుసు.
అమెరికాలో తాను చూసిన ప్రదేశాలు, అనుభవాలు, అనుభూతులు, టెక్నికల్ గా తనలో వహ్చిన అభివృద్ధి..... సందర్భానుసారంగా చెప్పసాగాడు.
"మా అమ్మా వాళ్ళింటికి వెళదాం. అక్కడో రెండురోజులుండి మీ పుట్టింటికి వెడదాం. అక్కడో రెండురోజులుండి మళ్ళీ తిరిగివద్దాం" ఇలా ఏమేమో చెబుతూనే వున్నాడు.
* * *
ఆ రాత్రి...
పదిన్నర దాటింది. కిరణ్మయి హాయిగా నిద్రపోతోంది.
గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది.
రాజీవ్ ఆ సన్ననికాంతిలో ఆమెవైపు తిరిగి కళ్ళార్పకుండా చూస్తున్నాడు. తనకోసం అవతరించిన సహజ సౌందర్యదేవత, ప్రేమమూర్తి, ఆరాధనా దివ్యజ్యోతి...!
ఆ కళ్ళలో ఎంత నిర్మలత్వం! ఎంత అమాయకత్వం!
"చిన్మయీ!"
"ఊ!"
"ఇలా మళ్ళీ దగ్గరయే క్షణాలకోసం ఎంతగా ఎదురుచూశానో తెలుసా?"
ఆమె భుజాలమీద చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు.
చిన్మయి మౌనంగా వుంది.
వెచ్చని రక్తంతో మిడిసిపడే అతని పెదవులు ఆమె చల్లని పెదవుల్ని తాకాయి.
"ఉహు" అని చిన్మయి ముఖం ప్రక్కకి తిప్పేసుకుంది.
అతనిముందు దాచిపెట్టి, అనుక్షణం మోసంచేస్తూ తనలోతాను మ్రగ్గిపోతూ కపట నాటకమాడలేదు. అతను తనని గాఢంగా నమ్మాడు.
ఆరాధ్యదేవతగా పూజించాడు. అలాంటి ఉన్నతమూర్తిని క్షణం క్షణం దగాచేస్తూ జీవితం గడపలేదు.
వచ్చేసింది. నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది.
"చిన్మయీ!" అంటూ ఆమెముఖాన్ని మళ్ళీ అందుకోబోయాడు.
"రాజీవ్!" అంది ఆమెగుండెల్లో ఇప్పుడు అగ్నిపర్వతాహాలు లేవు గొంతులో అపస్వరాలు లేవు చాలా ప్రశాంతంగా వుంది.
ఏదో చెప్పబోతోందన్న సత్యం రాజీవ్ కు బోధపడింది. ఇష్టంలేనిది ఏదో వినబోతున్నాడు.
ఆమెవంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
ఆ మసక కాంతిలో అమాయక జ్వలలా, వర్షించే మేఘంలా, ఆటు పోటులేని సముద్రంలా రకరకాలుగా కనబడుతున్నది.
చిన్మయి పెదవి విప్పింది.
"రాజీవ్!"
అతని గుండెల్లో విషాంకుశం గొప్ప పునీతత్వాన్ని కాలరాచిపారేసిన దుష్టశకునంలో దిగబడబోతోంది.
"నేను చెడిపోయాను."
15
జరిగిందంతా తనకు తోచిన భాషలో దాపరికం లేకుండా చెప్పేసింది చిన్మయి.
అప్రతిభుడై, నిశ్చేష్టుడై, నిర్ఘాంతపోయి యిది కలో నిజమో కూడా తెలీని స్థితిలో వుండిపోయాడు.
ప్రకృతి వికారంగా, వికృతంగా విలపిస్తోంది.
* * *