"ఆపిల్ పళ్ళు బుట్టల్లో బాగుంటాయి. కానీ చెట్లకు కాస్తే ఏదోలా గుంది" అంది హాస.
అప్పుడు వాళ్ళు పళ్ళేం కొనలేదు కానీ తోట వాటా దారుడివ్వగా తలో పండూ తిన్నారు.
పండు దొరకగానే రసం చిమ్మి హాస ముఖమంతా తడిసింది.
"మనవైపుకి వచ్చేసరికి రసం ఎండి కుండీల్లాగైపోతాయి కానీ ఇక్కడివి అప్పుడే దింపిన కొబ్బరి బొండాలు" అన్నాడు రమణ.
ఆమె పండు తింటుంటే కూల్ డ్రింకు తాగుతున్నట్లుంది.
* * * *
కారు పహాల్ గాట్ చేరుకునేసరికి టైము పన్నెండూ ఇరవై అయింది. ఇక్కడ శ్రీనగర్లో కంటే చల్లగా ఉంది.
ఊరేం పెద్దది కాదు కానీ అందమైన పూలతోటలో అక్కడక్కడ అందమైన బొమ్మరిళ్ళు కట్టినట్లుంది.
సెలయేరులా ప్రవహించే నది పక్కన ఓ కొండ.
ఆ కొండమీద పురాతన కాలపు శివాలయముంది. ఆలయం చిన్నదే!
అంతా ఆ ప్రాంతం దాకా నడిచి వెళ్ళారు. ఓ చోట పచ్చిక బయలు మీద కూర్చున్నారు.
"ఆలయం చూసి వచ్చి భోంచేద్దాం" అన్నాడు రమణ. వాళ్ళ భోజనం బోట్ హోసులో తయారై హాట్ ప్యాక్ లో దూరి కార్లో ప్రయాణం చేసి పహల్ గాట్ వచ్చింది.
"వద్దు భోంచేశాకే దైవదర్శనం చేద్దాం" అంది సుభద్ర.
పురోహితుడు తను కలగజేసుకుని, "మీరిద్దరూ కలిసి దైవదర్శనం చేసుకోండి. త్వరగా పెళ్ళవుతుంది" అన్నాడు రమణ, హాసల నుద్దేశించి.
వెంటనే హాస "పద. వెడదాం" అంది రమణతో.
రమణ, సుభద్ర కూడా సంతోషం పట్టలేకపోయారు. సుభద్ర అటు తిరిగి కళ్ళు తుడుచుకుంది.
వాళ్ళిద్దరూ కలిసి బయల్దేరగానే, "అమ్మా! నేనిక విగ్గు తీసేయొచ్చేమో" అన్నాడు పురోహితుడు సుభద్రతో.
"ఆ క్షణం కోసమే నేనూ ఎదురుచూస్తున్నాను" అంది సుభద్ర.
* * * *
పది నిముషాల్లో తిరిగొచ్చారు రమణ, హాస.
"దర్శనం బాగా అయిందా?" అంది సుభద్ర.
"పూజారి మమ్మల్నిద్దర్నీ కలిసి దీవించి ఖుష్ కరో అన్నాడు. బయటకొచ్చేక ఒకడు గుడి చరిత్ర చెప్పి ఖుష్ కరో అన్నాడు" అంది హాస.
"అంటే?"
"ఖుష్ కరో అంటే సంతోషపెట్టమని. అంటే టిప్పివ్వమని...."
"మీరు కూర్చోండి. మేమూ దర్శనం చేసుకుని వస్తాం" అన్నాడు పురోహితుడు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే "మనిద్దరికీ ఏకాంతం కల్పించాలని మీ అమ్మగారు తాపత్రయపడుతున్నారు" అన్నాడు రమణ.
"మా అమ్మ తాపత్రయం నీకు సాయపడాలని!" అంది హాస.
"పోనీ అలాగే అనుకో!" అని "హాసా....! మన పెళ్ళికి ఏమిటి నీ అభ్యంతరం?" అన్నాడు రమణ.
"ఎమ్మే!" అంది హాస.
"నీ ఎమ్మేకు మన పెళ్ళి అడ్డురాదు.... కావాలంటే కాగితం రాసిస్తాను,"
ఆమె నవ్వి. "ఎందుకూ నీకంత తొందర!" అంది.
"అది నీకెలా అర్ధమవుతుంది?" అన్నాడు రమణ బాధగా.
"నాకంతా అర్ధమయింది...." అంది ఆమె. "కానీ పెళ్ళయితే నేను మా వాళ్ళని మర్చిపోతాను. నాకింకా వాళ్ళ మీద మోజు తీరలేదు"
"నువ్వు నీ వాళ్ళను విడిచిపెట్టక్కర్లేదు."
"మా బామ్మకు తొమ్మిదో ఏట పెళ్ళయిందిట. పదకొండో ఏట కాపురానికొచ్చిందిట. ఆ తర్వాత వాళ్ళ వాళ్ళని ఏదో అప్పుడప్పుడు చుట్టపుచూపుగా చూడ్డమేనుట!"
"నీ విషయంలో అలా కాదు."
"మా అమ్మకు పదహారో ఏట పెళ్ళయింది. పుట్టింటి వారొచ్చి వెళ్ళటమేగానీ తను చూడ్డానికి వెళ్ళదు."
"నేనలా జరుగ నివ్వను...."
"హాస నవ్వి, "మా తాత గారు, నాన్నగారు దుర్మార్గులేం కాదు.... ఆడపిల్లకు పెళ్ళయ్యాక తన వాళ్ళందర్నీ మర్చిపోతూందిట. అందుకే నాకు పెళ్ళంటే భయం...." అంది.
"నువ్వు అందరాడపిల్లల్లాంటి దానివీ కాదు."
"అది నీకు తెలుసు నాకు తెలియదుగా!"
హాసా! ప్లీజ్! వేళాకోళంగా తీసుకోకు.... మన పెళ్ళి నాకెంత అవసరమో నీకు తెలియదు...."
"ఏమిటి నీ అవసరం?"
రమణ బదులివ్వలేదు.
"చెప్పు, ఏమిటి నీ అవసరం?"
"ప్రేమకోసం తపించిపోతున్నాను. నిష్కల్మషమైన నీ ప్రేమ లభిస్తుంది. నిన్ను పెళ్ళి చేసుకుంటేనే నాకు తృప్తి! తొందరగా పెళ్ళి చేసుకోకపోతే నీవు నాకు దక్కకుండా పోతావని నా భయం...."
"అంటే అడ్వాన్స్ బుక్కింగన్నమాట...."
"పోనీ అలాగే అనుకో!"
"అయితే నాకో వాగ్దానం చేయ్యి...."
"ఏమిటది?" కుతూహలంగా అడిగాడు రమణ.
"పెళ్ళయ్యాక ఎమ్మే అయ్యేదాకా నువ్వు నన్ను ముట్టుకోకూడదు. నీకూ నాకూ మధ్య ఎప్పుడూ ఏడడుగుల దూరముండాలి" అంది ఆమె.
"ఓకే...." అన్నాడు రమణ ఉత్సాహంగా.
ఆమె నవ్వింది.
* * * *
పహాల్ గాట్ వాళ్ళు చాలా దూరం నడిచి పార్కులు, పూలతోట చూశారు. ఓ పూలతోటలో బాబీ సినిమా షూటింగ్ కి గెస్టుహౌసుంది గైడొకడు వాళ్ళకా బంగళా వివరాలు చెప్పి "ఖుష్ కరో" అన్నాడు.
రమణ అతడికి ఐదు రూపాయలిచ్చాడు.
తిరుగు ప్రయాణంలో వాళ్ళు మధ్యలో ఆగి ఆపిల్ పళ్ళు కొన్నారు. అయితే తోట యజమాని నుంచి కాక రాలిన పళ్ళేరుకు వచ్చి పిల్లల దగ్గర బుట్ట నాలుగు రూపాయలక్కొన్నాడు. కొనుక్కోమని ఆ పిల్లలు అదేపనిగా బలవంతపెడుతుంటే హాసకు తన్ను ప్రాధేయపడే రమణ స్పురించాడు.
కార్లోంచి షికారాలోకి, అక్కణ్ణించి బోట్ హౌస్ లోకి....
డిన్నరయ్యాక, పెళ్ళి గురించి మీ అమ్మగారికి చెప్పవా?" అన్నాడు రమణ ఆమెతో.
"ఊఁ"
"ఎప్పుడని చెప్పను?"
"రేపు"
"నిజంగా?"
"ఊఁ" అని గదిలో కెళ్ళిపోయింది హాస. ఆమెననుసరించబోయే సుభద్రనుద్దేశించి, "ఒక్క నిముషమాగండత్తయ్యా!" అన్నాడు రమణ.
అత్తయ్య అన్న పిలుపు కులిక్కిపడింది సుభద్ర.
రమణ ఆమెకు విషయం చెప్పాడు.
* * * *
రాత్రి గదిలో సుభద్ర కూతుర్ని శ్రద్ధగా గమనించింది.
హాసలో ఆపూట ఎక్కువ ఉత్సాహం కనిపించింది.
"పెళ్ళికొప్పుకున్నావటగా" అంది సుభద్ర.
"ఊఁ" అంది హాస.
"నా బంగారు తల్లివి" అంది సుభద్ర.
"అమ్మా! ఈ భూతల స్వర్గంలో విహార యాత్ర ఎంతో బాగుంది. జీవితమంతా యింత చక్కగా విహారయాత్రలా గడిచిపోతే ఎంత బాగుండును?" అంది హాస.
"అలాగే జరుగుతుంది" అంది సుభద్ర.
"అమ్మా! నాకు నూరేళ్ళు బ్రతకాలనీ, నూరేళ్ళు యిలాగే ఉండాలనీ ఉంది" అని నవ్వడం మొదలు పెట్టింది హాస.
"ఎందుకే నవ్వుతావు?" అంది సుభద్ర భయంగా.
"కాశ్మీర్ ప్రకృతి సౌందర్యానికి మారుపేరు. ఇక్కడకు ఎక్కువగా ప్రేమ జంటలు వస్తాయంటారు. కానీ మన విషయం తీసుకో. నువ్వు నాన్నగారినొదిలి వచ్చావు. రమణ ఒంటరి. నేను ఒంటరి. రమణ స్నేహితుడు భార్యనొదిలి వచ్చాడు" మళ్ళీ నవ్వింది హాస.
"అందుకేనా పెళ్ళికొప్పుకున్నావు!"
"అవును. కానీ రేపటికి రేపు పెళ్ళెలా జరుగుతుంది.
"అన్నీ శాస్త్రప్రకారం జరుగుతాయి. పురోహితుడు కూడా తెలుగువాడే వస్తాడు...."
"ఎలా?"
రమణ ప్రేమ బలమైనది" అంది సుభద్ర.
ఆ సమయంలో రమణ బోట్ హౌసులో లేడని ఆమెకు తెలియదు. అతడున్నాడో ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. రమణ హాసకు బ్లడ్ కాన్సర్ మించిన ప్రమాదకారి అని ఆమె ఊహించలేదు.
"ఆ ప్రేమ బలమే నాలో మార్పు తెచ్చిందేమో!" అంటూ హాస నవ్వబోయింది. కానీ ఆ నవ్వు దగ్గుగా మారింది.
"ఎందుకే అస్తమానూ నవ్వుతావు?" మందలించింది సుభద్ర.
దగ్గెక్కువై హాస బదులివ్వలేదు. దగ్గాపుకుందు కామె రుమాలుతో నోటికడ్డం పెట్టుకుని బాత్రూమ్ లోకి పరుగు తీసింది. ఆమె తిరిగొచ్చేసరికి రుమాలు మీద రక్తపు చారికలున్నాయి.
సుభద్రకు మళ్ళీ ఏడుపొచ్చింది.
* * * *
"హాసా!"
హాస ఉలిక్కిపడి లేచింది.
"హాసా! నేను"
గౌతమ్ మాటలు ఆమె చెవుల్లో గింగురు మంటున్నాయి.
"ఊఁ" అందామె.
"ఈ రోజు నిన్ను చూశాను. మీ యిద్దరి జంటా ఎంతో బాగుంది..."
"ఆ విషయం ఇంత రాత్రిపూట చెప్పాలా?" అంది హాస.