Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 36

                                           16  
    "ఇప్పటికిది సినిమా కథకు పనికొచ్చేలా తయారయింది" అన్నాడు రాయుడు తృప్తిగా అయితే ఆయనకు బెంగా పూర్తిగా వదల్లేదు. సుభద్రమ్మ ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా అని?   
    రచయిత నవ్వాడు. "మన కథలో ఎంత కొత్తదనమో చూడండి! సుహాసిని సుబ్బారావును ప్రేమించింది. కానీ తన వాళ్ళ మనసుకు కష్టం కలుగుతుందని ఆమె ఈ పెళ్ళి చేసుకో లేదు. సాధారణంగా ప్రేమికులు ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేస్తారు. కానీ మన కథానాయిక బామ్మ కోసం ప్రాణత్యాగం చేస్తానంది. ఆ ప్రాణత్యాగమే ఆమెను కధా నాయకుడికి దగ్గరగా తీసుకొస్తోంది. ఇంకా మిగిలిందల్లా ఒకే ఒక్క అడ్డంకి! ఇన్ని దాటిన వాళ్ళం అది మాత్రం దాటలేమా? ఈ రాత్రే మన ముఠావాళ్ళు సుభద్రమ్మ యింటికి వెడతాను. రేపు దీక్షితులు వాళ్ళింటికి పెళ్ళి కబురుతో వెడతాడు."   
    ఆ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నలుగురు రౌడీల్లాంటి వాళ్ళు సుభద్రమ్మ ఇంటికి వెళ్ళారు. ముందోసారి చుట్టూ తిరిగారు. సుభద్రమ్మ అన్ని తలుపులూ పకడ్బందీగా వేసేసింది. లోపలకు వెళ్ళేదారిలేదు. ఏ కుళాయి గొట్టమైనా పట్టుకుని ఎగబ్రాకుదామంటే-ఇంటికి అలాంటి సదుపాయాలు లేవు. అసలది పెంకుటిల్లు. ఇల్లెక్కి లోపలకు వెళ్ళే అవకాశమేలేదు. ఆఖరికి వాళ్ళు కిటికీ చువ్వలు వంచడానికి ప్రయత్నించారు. అదీ వాళ్ళవల్ల కాలేదు.   
    "అయితే ఏం చేయాలి?" అని నలుగురూ ఆలోచన మొదలుపెట్టారు.   
    "తలుపు తడదాం" అన్నాడు మొదటివాడు.   
    ఈ ఆలోచన నలుగురికీ వచ్చింది. వెళ్ళి వీధి తలుపు తట్టారు.   
    ఆ సమయానికి సుబ్బరావు నిద్రపోతున్నాడు. అరుణ నిద్రపోతోంది. ఇద్దరికీ కూడా తలుపు తట్టిన చప్పుడు వినపడలేదు. సుభద్రమ్మ మాత్రం మెలకువగానే ఉంది. ఎందువల్లనో ఆవిడకా రోజు అంత బాగా నిద్రపట్టలేదు. 'ఈ సమయంలో ఎవరు చెప్మా?" అనుకుంటూనే ఆవిడ వెళ్ళి తలుపు తీసింది.   
    నలుగురిలో ఒకడు కత్తి చూపించి, "ఇష్! అరవకు" అంటూ ముందడుగు వేశాడు. సుభద్రమ్మ కొయ్యబారిపోయింది. వాళ్ళు నలుగురూ లోపలకు అడుగుపెట్టి తలుపులు వేశారు.   
    సుభద్రమ్మ నెమ్మదిగా, "ఎవరు మీరు?" అంది.   
    "కనబడ్డంలేదూ? దొంగలం!" అన్నాడొకడు.   
    "ఇష్...నెమ్మది..." అన్నాడో దొంగ.   
    "మా ఇంట్లో ఏమీ ఉండవు" అంది సుభద్రమ్మ నెమ్మదిగా.  
    "ఇంట్లో  ఇంకెవరైనా ఉన్నారా? అన్నాడు మొదటి దొంగ.   
    మొత్తంమీద సుబ్బారావునీ, అరుణనూ కూడా లేపడం అయింది. ముగ్గుర్నీ పక్క పక్కగా నిలబెట్టి, ఓ మనిశిని కాపలాపెట్టి, మిగతా ముగ్గురూ గదుల్లోకి వెళ్ళారు.   
    "ఆ సుహాసిని నా కోడలయుంటే ఈ పాటికి ఈ నలుగుర్నీ తన్ని పంపించి ఉండేది. మగ పుట్టుక పుట్టావు. ఏం లాభం? ఇప్పుడీ దొంగలు మొత్తం ఇల్లంతా దోచేస్తారు. ఉన్న కాస్త బంగారం పట్టుకుపోతారు" అంటూ ప్రారంభించింది సుభద్రమ్మ.   
    సుబ్బారావు ఆవిడ మాటలకు ఆవేశపడి దొంగల మీదకు వెళ్ళాడు. దొంగ కత్తి ఝుళిపించాడు. సుబ్బారావు ఆవేశం ఇంకా తగ్గలేదు. అతను ముందుకు వెళ్ళాడు. దొంగ చేతిని గాలిలోకి లేపి ఆపేశాడు. ఇది చూసి సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. అతను ఎత్తిన దొంగ చెయ్యిని పట్టుకున్నాడు. దొంగ కత్తిని వదిలేశాడు.   
    అతి సులభంగా వాణ్ణి లొంగదీసి తల్లికీ, చెల్లికీ అప్పజెప్పాడు. వాళ్ళు వాడి చేతులు కట్టేశారు.   
    సుబ్బారావు ఛాతీ ఉబ్బింది. ఒక దొంగను తానింత సులభంగా బంధించగలనని అతడనుకోలేదు. అతడు గది లోంచి బయటకు నడిచాడు. అలికిడి విని ముగ్గురు దొంగలూ వచ్చారు అక్కడికి ముగ్గురి చేతుల్లోనూ ఆయుధాలున్నాయి. విశేషమేమిటంటే ముగ్గురూ ఒక్కసారిగా సుబ్బారావు మీదకు రాలేదు. ఒకరి తర్వాత ఒకరు మాత్రం వస్తున్నారు. దొంగల చేతిలో ఆయుధాలున్నప్పటికీ వాళ్ళగురి ఎప్పటికీ తప్పుతూనే ఉంది. సుబ్బారావు చాలా సులభంగా ఆ ముగ్గుర్నీ చిత్తు చేశాడు.   
    "బాబ్బాబు...మమ్మల్ని వదిలిపెట్టు! నీ మేలు మరిచి పోలేం. ఇంకెప్పుడూ ఈ ఇంటి ఛాయలకు రాము" అన్నారు దొంగలు.   
    "మీరు దొంగలు. మిమ్మల్ని పోలీసులకు అప్పగించడం నా విధి" అన్నాడు సుబ్బారావు. "ఒక్కటే నాకు ఆశ్చర్యంగా వుంది. మీకు చేతిలో ఆయుదాలున్నప్పటికీ అంతా కలిసి నా మీదకు రాలేదు. ఆయుధాలతో నన్ను గాయపరచకుండా పోరాడ్డానికి ప్రయత్నించారు. నేనంటే మీకు అభిమానమా?"   
    "అదేం కాదు. మేము సినిమాల్లో రౌడీల వేషాలు వేసి బ్రతికేవాళ్ళం. నిజ జీవితంలో\కూడా అలాగే చేద్దామని ఇలా బయల్దేరాం. అయితే ఏ ఫైటింగ్ లోనైనా హీరోకి దెబ్బతగలకుండా మేము ఓడిపోతూండడం అలవాటు. ఆ అలవాటే మా కొంపముంచింది. సినిమా ఫైటింగు అలవాటై పోయి మామూలు ఫైల్సు మర్చిపొయ్యాం" అన్నాడో దొంగ.   
    సుబ్బారావు వీధిలోకి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు పోలీసులు పోతూ కనిపించారు అతడికి. అతను వాళ్ళని పిలిచి నలుగురు దొంగల్నీ అప్పగించాడు. పోలీసులు దొంగల్ని తీసుకుని బయల్దేరారు.
    దొంగలు దిగులుగా, "రాయుడుగారొచ్చి మనని విడిపించకపోతే, ఈ పోలీసోళ్ళు మన్ని చితకదన్నినా తన్నగలరు. ఇలాగవుతుందనుకోలేదు" అని తమలో తాము అనుకున్నారు.   
    ఓ పోలీసు ఇది విని, "మీరేం కంగారు పడకండి! ఇలాంటిది జరిగినా జరగొచ్చునని ముందుగానే ఊహించారు రాయుడుగారు. మేమూ ఆయన మనుషులమే" అన్నాడు.

 Previous Page Next Page