"స్టాపిట్...." ఆవేశంగా అరిచాడు విస్సు. "ఇంకేం మాట్లాడకు"
"మాట్లాడకు విస్సు.... మాట్లాడినా ప్రయోజనం లేదని నాకు తెలుసు. ఎందుకంటే ఏ ఉపాధ్యాయ పతనాన్ని నువ్వు కోరుకుంటున్నావో ఆ ఉపాధ్యాయ నాకన్నా నీ మాటకే ఎక్కువ విలువ యిస్తారని నాకు తెలుసు కాబట్టి. అయితే ఒక్క నిముషం.... మన రాజకీయ చదరంగంలో నువ్వూ నేనూ ప్రత్యర్దులం అయినా రాజకీయాల్లో ఆలోచించాల్సింది ఎవరూ, ఏమిటీ అని కాదు....ఎవరు ఎవరి మనిషి అన్న విషయం....అది నువ్వు తెలుసుకునే దాకా నువ్వు చౌదరిని నమ్ముతుంటావు, ఉపాధ్యాయని ద్వేషిస్తూనే వుంటావు...."
"అసాధారణమైన నీ మేధస్సుకి, అమోఘమైన నీ విశ్లేషణకి నా అభినందనలు కృషి...ఇప్పుడు మనం వెంటనే ఆలోచించాల్సింది తాత్కాలికమైన ప్రజ్ఞలగురించి కాదు - జీవితని నిజంగా హత్య చేశారా అన్న విషయం గురించి" ఆమె మాటల్ని ఖండిస్తున్నట్టుగా అన్నాడు.
రెప్పవాల్చకుండా చూసింది. "ప్రిజుడీస్ తో ఈ ఇంట అడుగుపెట్టిన నీకు చౌదరి దుర్మార్గం గురించి చెప్పినా నమ్మకమేర్పడదు."
అతడు బయటికి నడవబోయాడు.
"ఆగు మిస్టర్ విస్సూ...ఎప్పుడో కాదు నీ మిత్రుడు చౌదరి ఏమిటో అన్నది ఇప్పుడే నిరూపిస్తాను"
"నువ్వది నిరూపించగలిగితే చౌదరికి నేను శత్రువునౌతాను."
"శత్రువుగా మారతావో లేక యింకా మిత్రుడిగా కొనసాగి నీ భ్రాంతిలోనే నువ్వు బ్రతుకుతావో నీ యిష్టం" తన ఆలోచనల్ని అమలు పరుస్తున్నట్టుగా చూసింది. "నీ గదిలో వున్న ఫోన్ ద్వారా పేరలర్ గా నాకూ చౌదరికీ జరిగే చర్చ వింటే జరిగింది నీకు అర్ధమవుతుంది."
అరనిముషం వ్యవధిలో తన రూంలోని ఫోన్ అందుకుని చౌదరికి డయల్ చేసింది కృషి.
"చౌదరి హియర్"
"నేనే"
ఫకాలున నవ్వాడు చౌదరి కృషి కంఠం వినగానే.
"మొత్తానికి అందర్నీ ఫూల్ చేయగలిగావు చౌదరీ"
"పాపం షాక్ తిన్నట్టున్నావు కదూ"
"నిజమే చౌదరీ.....నిన్ను నేను తక్కువగా అంచనా వేసాను. అందుకే విస్సూని నీకు ప్రత్యర్ధిగా మార్చాలని ఓ పథకం వేసి దారుణంగా ఓడిపోయాను. జీవితనే ఓ పిచ్చిక మీద మీరు ఇంత పెద్ద బ్రహ్మాస్త్రాన్ని సంధించగలుగుతారని ఆలోచించలేకపోయాను."
"దటీజ్ చౌదరీ... ఇక నా కొడుకు పెళ్ళికి అడ్డం తొలిగిపోయిందిగా. ఇప్పుడేం చేస్తావ్"
"ఆత్మహత్య ప్రయత్నంలో నీ కొడుకు కొంచెం విషం తాగి జీవితచేత ఎక్కువ తాగించి పోలీసుల్ని మభ్యపెట్టి సులభంగా జీవిత అడ్డం తొలగించుకోగలిగావేమో కాని-"
"ఆగిపోయావేం..."
"విస్సు తండ్రి మోహన్ గాంధీని నువ్వే హత్య చేయించావని నేను నిరూపించటానికి చేస్తున్న ప్రయత్నం నుంచి తప్పించుకోలేవు చౌదరీ"
చౌదరి పక్కనుంచి జవాబు లేదు.
"ఏం.... కంగారుపడుతున్నావా చౌదరీ.....గెట్ రెడీ మన పోరాటంలో చివరి ఘట్టానికి చేరుకుంటున్నాం కాబట్టి కటకటాలు లెక్క పెట్టటానికి ప్రిపేరై వుండు"
"పిల్లకాకివి నువ్వెంత"
నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నావు"
"రాబందును చూసినట్టు బెంబేలు పడుతూ కూడా నన్నో పిల్లకాకినని ఎడ్రసు చేస్తున్నందుకు..."
"నీ సమాధికి పునాదుల్ని సిద్దం చేస్తున్నాను కృషి"
"చూద్దాం చౌదరీ.... ఎవరి సమాధి శంఖుస్థాపన ముందు జరుగుతుందో కాలానికే వదిలేద్దాం."
ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు.
అప్పుడు చూసింది కృషి విస్సు జేవురించిన మొహాన్ని.
ఈ యింట ఎందుకు అడుగుపెట్టినా గాని ఏం చేయాలని యింత కాలమూ ఆలోచించినా గాని ఒక్క రోజులో ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అతడి గమ్యం మారిపోయినట్టుగా అంతసేపూ పట్టుకుని వున్న రిసీవర్ని హుక్ చేసి బయటికి నడిచాడు వేగంగా.
చాలా రోజుల తర్వాత కృషి రిలాక్స్ డ్ గా సోఫాలో కూర్చుంది.
ఇంత వరకూ జరిగినదాని గురించి కాక యికముందు జరగబోయే దాని గురించి ఉత్కంఠగా ఆలోచిస్తూందామె.
విస్సు సరాసరి చౌదరి దగ్గరకు వెళ్ళలేదు....ఆశ్రమానికి వచ్చాడు.
తన మీద తనకే జుగుప్సలాంటి భావం పేరుకుపోతుంటే ఆలయంలోని ప్రశాంతతలా నిశ్శబ్దంగా వున్న కుటీరాల మధ్య మతి భ్రమించిన వాడిలా తిరిగాడు చాలా సేపటిదాకా...
ముకుళించుకున్న కాలం మౌనంగా రేకులు విప్పుకుని సరికొత్త మార్గాలనే నిర్దేశిస్తుందో లేక మేధాకేదారంలోని నిశ్చల సమాధికే భంగమైనట్టు అనిపిస్తూందో కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.
జీవితని ఒప్పించి నమ్మించి పంపింది తనేగా...అన్నయ్యలా నేనున్నానని హామీ యిచ్చి మృత్యు గహ్వారంలోకి నెట్టింది తనే అయినప్పుడు ఈ పాపానికి నిష్కృతి ఎక్కడ - ఉనికిలేని కిటికీ ఆ పసి జీవితకి తను మిగిల్చింది ఏమిటి శిథిలమైన ఒక కుటుంబంలో వారసుడిగా ఏదో చేయాలని యాత్ర ప్రారంభించిన తను మరో తల్లి కడుపు కోతకి కారణమైపోయాడే. దీనికి జవాబుగా తానేమివ్వగలడు.
"విస్సూ"
సమీపంలో చైతన్యానంద నిలబడి వున్నాడు.
"ఏమైంది"
ఆ కొద్దిపాటి పరామర్శకే విస్సు కళ్ళనుంచి జలజలా నీళ్ళు రాలాయి. "నేను ఓడిపోయాను బాబా"
ఆప్యాయంగా స్పృశించారు "ఉరకలు వేస్తూ పరుగులిడే నదీ ప్రవాహం చివరికి లయమయ్యేది కడలిలోనే అయినా అది ఓటమికాదు విస్సూ - ప్రాణులకి వెలుగుని ప్రకృతి పృష్టాల సౌరభాల స్ఫూర్తికి కాంతినీ అందించే సూర్యుడు ప్రతిరోజూ అస్తమిస్తున్నా అదికూడా ఓటమికాదు. జీవితం జీవిత సత్యాలకది సంకేతం సంఘాన్ని సంస్కరించాలనుకునే వ్యక్తులకి సైతం తప్పని మానసిక గ్లాని మామూలు మనుషులకి తప్పనిదేగా - తప్పనిదనుకోవాలి. తప్పయితే తెలుసుకోవాలి. అదే మనిషి చేయగలిగేది"
ఎంత ఊరటగా అనిపించింది.
ఆ తర్వాత బాబా నుంచి శలవు తీసుకున్న విస్సు తన కుటీరం వేపు నడిచాడు.
"ఏమిటి ఇంత అర్దరాత్రి - "సూరి పలకరించాడు. ఈ మధ్య విస్సు వుంటున్నది ఉపాధ్యాయగారి ఇంటిలోనే అని తెలిసిన సూరి విస్సు ముఖకవళికల్ని గమనిస్తూ అడిగాడు "ఏమైంది"
జవాబు చెప్పలేదు.
"పాపం జీవితనే అమ్మాయి చనిపోయిందటగా"
"కాదు చంపబడింది" అంతటితో ఆగకుండా సూరికి అంతా వివరంగా చెప్పాడు.
సూరి మౌనం విస్సుని మరింత గాయ పరుస్తూంటే ఇక సంభాళించుకోలేనట్టుగా ఉద్రేకంగా సూరి భుజాల్ని పట్టుకున్నాడు. సూరి కంపించిపోతుంటే "చెప్పరా - ఒకనాడు నేను గాయాలతో హాస్పిటల్లో అడ్మిటైతే నా గురించి డబ్బు ఖర్చు చేసింది నేను బ్రతకాలని డాక్టర్లని అర్ధించింది కృషే కదూ."
సూరి గొంతు తడారిపోయింది.
"నాకు జవాబు కావాలి సూరీ. నాకు నిజంగా స్నేహితుడివే అయితే నువ్వు నిజం చెప్పాలి."
ఏ సంఘటనతో విస్సు యిలాంటి మార్పుకి గురైనా కాని తన గురించి అతడే మనుకున్నా రేపు చౌదరి మూలంగా తనకి హాని జరిగినా కాని యిక పెదవి విప్పక తప్పదు.
"అదొక్కటే కాదు విస్సూ" సూరి కళ్ళలోనూ యిప్పుడు నీళ్ళు తిరుగుతున్నాయి. "ఆ రోజు క్విజ్ పోటీలో అమ్మని కిడ్నాప్ చేయించిందీ చౌదరీయే."
విస్సు షాక్ తిన్నట్టుగా చూసాడు. ఆమె ఓడితే పోగొట్టుకోవాల్సిన శీలంకోసం కృషే ఆ పని చేయించిందని తను నమ్మేడు. కాదు చౌదరి నమ్మించాడు.
"ఎందుకీ విషయం దాచావ్"
"నీతో నిజం చెబితే అమ్మ ప్రాణాలకి హాని తలపెడతానని చౌదరి బెదిరించాడు కాబట్టి.....అసలు నీ ఓటమి కోరింది కృషి కాదు విస్సూ...చౌదరి ఐదు లక్షల అప్పుతో నిన్ను రుణగ్రస్తుడ్ని చేసి మానసికంగా శారీరకంగా హింసించి ఆమెను ఈ దేశం నుంచి పంపించడమే చౌదరి లక్ష్యం."
ఆ రాత్రి నిద్రపోలేదు విస్సు.
ఎన్ని సార్లు యెన్ని విధాలుగా కృషిని అవమానించిందీ మానసికంగా హింసించిందీ గుర్తుకొచ్చి బిడియంగా కదిలిపోయాడు.
నిజానికి తనకున్న కక్ష ఉపాధ్యాయపై అది సాధించడానికి ఓ మార్గం కావాలి. ఉపాధ్యాయ స్థాయి వ్యక్తికి చేరువ కావాలి అంటే కృషితో పరిచయం తప్పనిసరైంది.
తెల తెలవారుతుండగా నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు తన ప్రత్యర్ధి ఉపాధ్యాయ ఒక్కడే కాక చౌదరి కూడా అని....అసలు తన తండ్రి మరణానికి కారకులు ఖచ్చితంగా ఎవరైనా గాని యిక ముందు తనకు తానే ముఖా ముఖీ పోరాటానికి సిద్దపడాలి తప్ప కృషిని డిస్టర్బ్ చేయడు...అసలు ఆమెను ఇక ఎప్పటికీ కలుసుకోకూడదు...
దృఢంగా తీసుకున్న నిర్ణయం అది.
* * * *
"మిస్ కృషి...మాటలతో, చేతలతో హింసించడమే అలవాటైన ఈ మనిషి యింత ఒద్దికగా ఉత్తరం రాస్తున్నాడేమిటి అని ఆశ్చర్యపోతున్నారా....దుర్మార్గుల జీవితాల్లోనూ కొన్ని దివ్య క్షణాలుండడం నిజమైతే అలాంటి క్షణమే నా జీవితంలో మీ పరిచయం.
మేధస్సు పరంగా ఏ కొద్దిగానో నేను ఎదిగినా నాది చాలా చిన్న ప్రపంచం కృషి.... అందుకే చిన్న పొదిరింటిలో పుట్టిన నేను అమ్మా, నాన్నల ఆశయాల మేరకు ఎదగాలని అహోరాత్రులు శ్రమించి ఎదగటానికి అకుంఠిత దీక్షతో కృషి చేశాను. కొద్దిగా ఎదిగానేమో కూడా కాని ఇంతలోనే నాన్న హత్య చేయబడ్డాడు అమ్మ పిచ్చిధైంది కూలిన పొదరింటిలో నేను ఒంటరి వాడ్నయిపోయాను....ఆ తర్వాత దురదృష్టవశాత్తూ కక్ష తీర్చుకోవడమే జీవిత ధ్యేయమైంది. అందుకు తొలిమెట్టుగా నీ పరిచయాన్ని పెంచుకున్నాను.....ఇప్పుడు నాకు పూర్తిగా జ్ఞానోదయమైందని చెప్పడం లేదు కృషి....నా తండ్రి హత్యలో చౌదరి భాగస్వామే అని అణువంతైనా అర్ధం చేసుకున్నాను....అంటే లక్ష్యం కొంత మారింది తప్ప పగ తీర్చుకోవాలనే ఆలోచన మాత్రం విరమించుకోవడం లేదు...
ఈ క్షణంలో మీకు క్షమార్పణ చెప్పుకోవటం తప్పు కాదు. ఇంకా ఆరని భాస్వర స్వప్నాల మధ్య నిలబడి నిన్న చచ్చిపోయిన బ్రతుకు పచ్చదనాల గురించి ఆలోచించే నేను మీకు మళ్ళీ కలవను. కలిసి ఆరడిపెట్టను...
మీ పరిచయం వాన కౌగిటి అంత స్వచ్చదనాన్ని అందించినా దాన్ని విస్మరించి వరద గోదావరిలో కొట్టుకుపోవటానికే సిద్దపడుతున్నాను. నా పిడికెడు చీకటి గుండెల్లో ఆరని ఆశల దివ్వెల్ని రగిల్చిన మీ పరిచయాల అక్షర జ్యోతుల్ని నేను రాలిపోయే దాకా గుర్తుంచుకుంటాను. నేననుకునే కథ సుఖాంతం కాకపోయినా ప్రత్యర్ధుల అశుభం దాకా ఒంటరిగా పోరాడుతూనే వుంటాను....
ఎందుకు ఇంకా నేను ఇలానే ఆలోచిస్తున్నానూ అంటే అశోకంలా ఎంత నిటారుగా పెరిగితే మాత్రం ఏం లాభం ఎప్పుడో ఒకనాడు విరిగి పోవాలిగా. గరికనైతే చాలదూ...గాలివాటుకి గాయపడినట్టు తలవాల్చినా విడవకుండా మళ్ళీ తెలెత్తుకుని సాధించానన్న సంతృప్తితో కడతేరిపోవచ్చు. సమస్యల వరదల భీభత్సంలో కొట్టుకుపోతున్న నేను బ్రతుకు కెరటాల కొరడా దెబ్బలకి కలత చెంది ఏ క్షణాన్నైనా మిమ్మల్ని బాధ పెడితే క్షమించమని మరో మారు అర్దిస్తూ శలవు తీసుకుంటున్నాను.
నన్ను మన్నిస్తారు కదూ...
క్షమార్హుడ్ని అవునో కాదో తెలీని
విస్సు..."
ఆమూలాగ్రం చాలా ఏకాగ్రతగా ఉత్తరాన్ని చదివిన కృషి కొన్ని క్షణాల దాకా బెడ్ పై పడుకుని ఆలోచిస్తూ వుండిపోయింది...
ఆ ఉత్తరాన్ని సూరి తెచ్చిచ్చింది గంట క్రితం...
ఇప్పటికి చాలా సార్లు చదివింది...
పెదవులే విచ్చుకున్నాయో లేదో మనోగ్రహాంతరాల్లో అరమరికలు చెరిగిన బాలికల్లా వూసుల గుస గుసల్తో గుండె చప్పుళ్ళే ఆమెను వివశత్వానికి గురిచేస్తాయో పైకి లేచింది చప్పుడు చెయ్యని శబ్ద కిరణానికి తను అందించే సజీవ ఆహ్వానంలా ఆశ్రమానికి బయలుదేరింది.
ఇంత కాలమూ ఏమైనా గాని విస్సు ఇప్పుడు మనస్సుని పూర్తిగా ఆక్రమించుకుని ఆమె మస్తిష్కపు వాకిలి తెరిచి ఆలోచనల పొరల వెనుక అతడికోసం ఏర్పర్చిన నిద్రా రంగస్థలం పై అతడు కొంత విశ్రమిస్తే తప్ప తన సంగ్రామపు చివరి ఘట్టానికి తనూ అతడికి తోడు కాలేదు...
ఆశ్రమానికి వెళ్ళింది కాని విస్సు లేడు.
ఉదయమే వెళ్ళిపోయాడని తెలిసింది....
అప్పుడు భయపడింది విస్సు గురించి తొలిసారి.
* * * *