సృజన్ చేయి ఊపి బయట వున్న ఆటోలో కూర్చున్నాడు.
"ఎక్కడికి సార్?" అడిగాడు ఆటోవాడు.
"రైల్వే స్టేషన్ కి పోనీ-"
రైల్వే స్టేషన్ చేరుకునేసరికి తెల్లారుఝామున మూడవుతోంది. వెయింటింగ్ హాల్లో పడుకొని సూట్ కేస్ లోని న్యూస్ పేపరు తీసి చూడసాగాడు. ఉద్యోగావకాశాలు ప్రచురుంచే చోట పచ్చఇంకుతో రైట్ మార్క్ కనిపించింది. ఆసక్తితో ఆ ప్రకటన చూశాడతను. అన్నయ్య ఏదయినా ముఖ్యమయిన విషయం నోట్ చేసుకునే పద్దతి అది. పచ్చ ఇంక్ బాల్ పెన్ తో టిక్ పెడతాడు. "కావలెను. ప్రముఖ ఫార్మానుటికల్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేయుటకు ఈ ఫీల్డ్ లో ఎక్కువ అనుభవమున్న యువకులు కావలెను. అర్హతను బట్టి , అనుభవాన్ని బట్టి జీతం నిర్ణయించబడును.మరియు వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో బాటు వారం రోజుల్లోగా ఈ చిరునామాకు ఇంటర్ వ్యూకి రావాలి."
అడ్రస్ ఈశ్వర్ ఫార్మానుటికల్స్ , వైజాగ్--
సృజన్ ఈశ్వర్ పేరు చూడగానే మమత రాత్రి చెప్పిన "ఈశ్వర్ వర్మ' పేరు గుర్తుకొచ్చింది. అతనే అన్నయ్యను ఆ హోటల్లో ఉంచాడని అందరూ అనుకున్నారట. అతనికి చాలా ఫ్యాక్టరీలు , హోటళ్ళు సినిమాహాళ్ళు ఉన్నాయని మమత చెప్పింది. ఒకవేళ ఈ 'ఈశ్వర్ ఫార్మానుటికల్' కూడా అతనిదేనా? అంటే అన్నయ్య అతని ఫార్మానిటికల్స్ కంపెనీలో ఉద్యోగం కోసం ఇక్కడికొచ్చాడా! చప్పున సూట్ కేస్ తెరిచి - కాప్యుల్స్ ప్లాస్టిక్ స్త్రిపట్ తీసి చూశాడు. దానిమీద కూడా ఈశ్వర్ ఫార్మానుటికల్స్ అని రాసి ఉంది.
సృజన్ కి ఎంతో ఉత్సాహం పుట్టుకొచ్చింది. తప్పకుండా అన్నయ్య అక్కడే ఉద్యోగం చేయాటానికి వచ్చి వుంటాడు. కనుక తను ఈశ్వర్ ఫార్మానుటికల్స్ కి వెళ్లి వాకబ్ చేస్తే ఏమయినా యిన్ ఫర్మేషన్దొరకవచ్చు. ముందు భారతీకి విషయం చెప్పాలి. కానీ ఆమె ఇంటికి ఎక్కువసార్లు వెళ్ళటం వల్ల ఆమెకు ఇబ్బంది కలుగుతుందేమో నన్న ఆలోచన రావటం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఈశ్వర్ ఫార్మానుటికల్స్ కంపెనీ కెళ్ళి వివరాలు సంపాదించాక అప్పుడు భారతి ఆఫీస్ కెళ్ళి ఆమెతో మాట్లాడవచ్చు.
రైల్వే పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చారు లాఠీలు తీసుకుని.
"ఏయ్ లేవండి! బయటకు పొండి! తెల్లారిపోయింది పొండి" అంటూ లాఠీలు విదిలించసాగారు. అందరూ లేచి బయటకు వెళ్ళిపోసాగారు. సామాన్లు తీసుకుని, సృజన్ తన సూట్ కేస్ తీసుకుని ప్లాట్ ఫారం మీదకు నడిచాడు. అక్కడి బాత్ రూమ్ కెళ్ళి స్నానం వగైరాలు ముగించి సూట్ కేస్ తీసుకెళ్ళి క్లాక్ రూమ్ లో ఉంచాడు, అప్పటికే టైం అరవుతోంది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయ్ నడుస్తూనే జేబులోని ప్లాస్టిక్ స్ట్రిప్ తీసి చూశాడు. ఈశ్వర్ ఫార్మనుటికల్స్ , భీముని పట్నం, వైజాగ్ అని ఉంది దాని మీద అడ్రస్.
బస్ స్టాండ్ కెళ్ళి అక్కడే కాఫీ ఫలహారాలు ముగించి బస్ కోసం నిలబడ్డాడతను. అరగంట తర్వాత దొరికింది బస్. అద్భుతమయిన ప్రకృతి దృశ్యాల మధ్య నుంచి ప్రయాణం చేసి భీమిలీ చేరుకుంది బస్.
బస్ స్టాప్ దగ్గరే ఒక బోర్డు కనబడుతోంది. "ఈశ్వర్ ఫార్మానుటికల్స్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది" అని రాసి వుంది. కింద ఆ ఫాక్టరీ చేరుకునే దారి మ్యాప్ వేసివుంది. అంటే ఆ తోటల్లో మరో అయిదు కిలోమీటర్ల దూరం నడవాలన్నమాట! టైమ్ చూసుకున్నాడతను ఎనిమిదవుతోంది. చాలా ఫ్యాక్టరీలు ఉదయం ఎనిమిది గంటల నుంచే పనిచేస్తాయ్. కనుక తను తొందరపడి వెళ్ళనవసరం లేదు. దూరంగా కనబడుతున్న సముద్రతీరానికి నడిచాడతను. సముద్రతీరం దగ్గర చాలామంది వాకింగ్ చేస్తున్నారు . ఆడా, మగా , పిల్లలు.
ఓ చోట ఇసుకలో కూర్చున్నాడతను. సూర్యోదయసమయం కావటం వల్ల కెరటాలు ఉదృతంగా పైకి లేచి పడుతున్నాయ్ తను చేస్తున్న ఈ పనివల్ల ప్రయోజనం ఉందొ లేదో, అసలు తనే దిశలో ప్రయాణం చేస్తున్నాడో -- ఆ దిశ సరయినదో కాదో ఏవీ తెలీదు. అక్కడ యింటి దగ్గర వదిన పిల్లల విషయం పట్టించుకోకుండా ఎందుకొచ్చిన ప్రయాస ఇదంతా? భారతి చెప్పినట్లే పోలీసులకు కొంత సమయమిచ్చి అప్పటికీ వారేమీ చేయలేకపోతే అప్పుడే తను తన ప్రయత్నాలు చేయవచ్చు. తనకు తెలీకుండానే అతని మనసు గతంలోకి ప్రయాణించింది. ఎంతో సంతోషంగా, సరదాగా నడిచే జీవితం కళ్ళ ముందు మెదిలింది. ఆ ఆనందాలూ, ఆ ఐశ్వర్యం ఇంత తాత్కాలికాలన్న విషయం తనకు తెలీలేదు. అతని కళ్ళవెంబడి నీరు కారిపోతోంది. ఒక్కసారిగా వదిన మీద ప్రేమ పొంగిపొరలింది. తనే అన్నయ్య కోసం ఇంత బెంబేలెత్తిపోతుంటే పాపం వదిన యింకెంత బాధపడుతూందో? తక్షణం తన ఊరెళ్ళిపోవాలన్న కోరిక పెరిగిపోతోందతనికి.
ఎండ బాగా ఎక్కువయ్యేసరికి లేచి ఫ్యాక్టరీ కేసి నడవసాగాడతను. ఇవాళ సాయంత్రమే తను ఇక్కడి నుంచి తన యింటికి బయల్దేరాలి. బాగా గుబురుగా వున్న తోటల మధ్యనించి నడవసాగాడతను. చల్లగాలి ఆహ్లాదంగా వీస్తోంది. దూరంగా సముద్రపు హోరు వినబడుతూనే వుంది.
గంటసేపు వడివడిగా నడిచాక ప్యాక్టరీ చేరుకున్నాడతను. బాగా గుబురుగా ఉన్న వృక్షాల వెనుక అసలా ఫాక్టరీ ఉన్నట్లే ఎవరూ తెలుసుకోలేరు. గేటు దగ్గర సెక్యురిటీ గార్డు అపాడతన్ని.
"ఈ ప్యాక్టరీ మేనేజర్ ని చూడాలి" అన్నాడతను.
"పేరేమిటో చెప్పండి. ఫోన్ చేసి చెప్తాను. అయన రమ్మంటే వెళ్దురు గాని........"