"ఏమి...ట...ది?" ఎక్కడ్నుంచో మాట్లాడుతున్నట్టుగా అంది.
"ఇక్కడ్నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నిన్ను ఆఖరిసారిగా చూసి..."
"వెళ్ళి...పోతు...న్నావా?"
"అవును."
ఒక్కక్షణం నిశ్శబ్దంగా నిలబడింది. అది ఆలోచనకాదు. ఆలోచించే స్థితిలో ఆమె లేదు. ఎందుకో అలా నిలబడింది అంతే.
"చిన్మయీ!"
"ఊ"
"తలుపు తియ్యవా?"
"ఊ!"
ఆమె చెయ్యి గడియమీదకు వెళ్ళింది. తలుపు తీసేసింది.
బయటి చీకట్లో ఆనందమోహన్ నిలబడి వున్నాడు. పిచ్చిపట్టినవాడిలా అన్నిటికీ తెగించిన నిస్సహాయుడిలా నిలబడి వున్నాడు.
ఒకటి రెండు నిముషాలలా గడిచాయి. ఏమిటిది? ఎందుకు అలా నిలబడి వున్నాడు?
ప్రకృతి వికృతంగా ఘోష పెట్టింది..
ఉన్నట్టుండి లోపలకు దూసుకొచ్చాడు. తలుపు గడియ వేసేశాడు.
"చిన్మయీ! నువ్వు... నువ్వు..." అంటూ ఆమెను బిగియార కౌగిలించుకుని ముఖమంతా ముద్దులతో నింపేస్తున్నాడు.
పాలభాగం, కళ్ళు, చెంపలు, పెదవులు, మెడ-అన్నీ ముద్దులతో నిండిపోతున్నాయి.
ఆమె విడిపించుకోవడంలేదు. విద్పించుకొనే శక్తిలేదు. ఆమె తనలో లేదు. అప్రయత్నంగా అతనిచుట్టూ చేతులు బిగించి దగ్గరకు లాక్కుంది.
* * *
తెల్లవారుఝామున అయిదింటికి చిన్మయికి మెలకువ వచ్చింది. తాను నేలమీద పడివుంది. చీర, పమిట - ఏవీ యధాస్థానంలో లేవు.
ఏమిటిది? ఏం జరిగింది?
ఒక్కొక్కటీ గుర్తు చేసుకుంటోంది.
అర్ధమైపోయింది. ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేచింది. అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. తాను మలినమైపోయింది.
అంత శక్తి ఎలా వచ్చిందో తెలీదు. నన్నిలా చేస్తావా? నేనేం అపకారం చేశానని...?' అనుకొంటూ బయటకు పరుగెత్తింది.
అంతవరకు ఆనందమోహన్ ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. చాలా విసురుగా వెళ్లిపోయింది.
"చూడు తలుపు తియ్యి నిన్ను..." అంటూ తలుపు గట్టిగా బాదసాగింది.
లోపల్నించి జవాబు లేదు.
చాలాసేపు అలా చేసి, అలసిపోయి, అప్పుడు గమనించింది డోర్ బయట్నుంచి లాక్ చేసి వుంది. నిస్సహాయంగా ఓ నిముషం నిలబడి వెనక్కి తిరిగి వచ్చేసింది.
ఒళ్ళంతా. ఒంట్లోని ప్రతి అణువూ నిప్పురవ్వలా చెలరేగుతోంది.
ఆమెకు హఠాత్తుగా ఈ జీవితంమీద విరక్తి పుట్టింది. ముందూ వెనుకా ఆలోచించలేదు. కిచెన్ లోకి వెళ్లి డోర్ వేసేసుకొని, గ్యాస్ సిలెండర్ లోని గ్యాస్ రిలీజ్ చేసేసింది. కాసేపట్లో సిలెండరులోని గ్యాస్ గదినంతా ఆక్రమించసాగింది. కిటికీ తలూపులు బంధించబడి వుండడంచేత అక్కడే స్తంభించి పోయింది. గొంతులోకి గ్యాస్ వెళ్లిపోవటాన భగ్గున మండుతూ, శ్వాసకోశాన్ని చుట్టేస్తూ దగ్గు తెరలా క్రమ్ముకొస్తూంది. ఆ స్థితిలో అలాగే ముందుకు జరిగి అరుగుమీద ఎలక్ట్రానిక్ లైటర్ ని తీసుకుంది.
నొక్కడానికి సిద్దంగా వుంది.
ఒక్క కిరణం చాలు, భయంకరంగా పేలిపోయి గదంతా దద్దరిల్లిపోతుంది. తన శరీరం తునాతునకలై మాడి మసైపోతుంది.
ఆమె చేతివ్రేళ్ళు లైటరుమీద బిగుసుకొంటున్నాయి.
బయట్నుంచి ఎవరో డోర్ తట్టారు. "మమ్మీ! మమ్మీ!" అని కిరణ్మయి పిలుపు.
చిన్మయి చేయబోతున్న పని ఆపేసి బొమ్మలా నిలబడిపోయింది.
"మమ్మీ! మమ్మీ! ఏంచేస్తున్నావు మమ్మీ! నాకు భయంగా వుంది మమ్మీ! తలుపు తియ్యి మమ్మీ!"
కిరణ్మయి ఏడుస్తోంది.
చిన్మయి నిశ్చలంగా అలా నిలబడివుంది.
"మమ్మీ! మమ్మీ ప్లీజ్! నాకు భయంగా వుంది మమ్మీ!"
చిన్మయి ఇహ వుండలేకపోయింది. చేతిలోని లైటరుని దూరంగా విసిరేసి గభాల్న డోర్ తీసుకుని బయటికొచ్చి బిక్కమొహం వేసుకొని కళ్ళనీళ్ళు కారుస్తూ నిలబడివున్న కిరణ్మయిని కావలించుకుంది.
14
రెండు నెలలు గడిచిపోయాయి. రాజీవ్ అమెరికానుంచి వచ్చేరోజు దగ్గరకు వచ్చేస్తోంది. అతను పదిరోజులకోసారి ఫోన్ చేస్తూనే వున్నాడు. ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడేవాడు. తాను చూసిన విచిత్రాలు, కుటుంబంకోసం కొన్న వస్తువులగురించి అన్నీ చెప్పేవాడు.
చిన్మయి చాలా నిర్లిప్తంగా, ముభావంగా మాట్లాడేది.
ఆనందమోహన్ తర్వాత ఏమయ్యాడో తెలీదు. రాత్రికి రాత్రి యిల్లు ఖాళీచేసి వెళ్ళాడని అమ్మాజీ చెప్పింది.
తామిద్దరి వ్యవహారం గురించి ఇరుగూ పొరుగూ విడ్డూరంగా చెప్పుకుంటారని తెలుసు. అసలు ఇంట్లోంచి బయటకు రావడం మానేసింది.
* * *
రాజీవ్ రేపు రాబోతున్నాడు. ఇదే యింకో పరిస్థితిలో అయితే...? ఎంత పులకించిపోయేదో.... ఎన్ని స్వాగత సన్నాహాలు చేసేదో? ఛెంగు ఛెంగున ఎగురుతూ... ఉత్సాహం ఉరకలు వేస్తుండగా ఎలా పరుగులు తీసేదో?