Previous Page Next Page 
సుహాసిని పేజి 36


    "అయితే తెలుగులోనూ రచనలమీద లక్షలార్జించే వాళ్ళున్నారు. వాళ్ళకెంత పాప్యులారిటీ వుందంటే- సినిమా స్టార్స్ తో సమంగా వాళ్ళ బొమ్మలు పత్రికల్లో వస్తాయి. వాళ్ళకోసం ప్రాణాలిచ్చే ఫాన్సున్నారు. వాళ్ళ పేర్లు వింటూనే పులకరించిపోయే పాఠకులున్నారు...." అంది హాస.

    "నాకు తెలుగు సాహిత్యంతో అంతగా పరిచయం లేదు. నువ్వు సజెస్ట్ చేస్తే అలాంటి నవల్లు చదువుతాను...." అన్నాడు రమణ.

    "అలాంటివి నేను చదవను...." అంది హాస.

    రమణ తెల్లబోయి "ఏం?" అన్నాడు.

    "నీది మెజారిటీ అభిరుచి. నాది కాదు...."

    "అంటే?"

    "రాయాలని రాస్తే కథ కాదు. రాయాలనిపించి రాయాలి...."

    "నా కర్ధం కాలేదు" అన్నాడు రమణ.

    "ఇప్పుడు తెలుగుదేశంలో రచయితలు మనిషి రక్తం రుచిమరిగిన పులుల్లా కథా వస్తువుల మీద పడ్డారు. తమకు తోచిన కథా వస్తువును మరో రచయితో, పత్రికో కాపీ కొడతారన్న భయంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకుంటున్నారు. ఒకరు మాయమంత్రాల మీద రాస్తే, ఇంకొకరు గుర్రప్పందేల మీద! ప్రతి ఒక్కరూ కొత్త కొత్త సబ్జక్టుల్ని అన్వేషిస్తున్నారు. ఒక సంఘటన చూసి హృదయం స్పందించి రచనలు చేయాలనుకునేవారు తగ్గిపోయారు. ఓ కొత్త విషయం వెతికి పట్టుకుని దాంట్లోకి ఏదో కథ నిరికించే పద్ధతికి గిరాకీ పెరిగింది...."

    "ఆ నవల్లు చదవడానికి బాగుండవా?"

    "ఎందుకు బాగుండవూ! కాలక్షేపానికి చక్కగా పనికొస్తాయి. అయితే వాటిలో కథని మించిన ఇతర వివరాలు టెక్ట్స్ పుస్తకాల్లా నన్ను విసిగిస్తాయి. కాలక్షేపం కోసం పుస్తకం తీస్తే ఇదేం గొడవరా బాబూ అనిపిస్తుంది. అందుకే నేను చదివితే ఫర్తు కాలక్షేపం నావల్లేనా చదువుతాను. లేదా హృదయ స్పందన కలిగించేవి చదువుతాను."

    "ఇప్పుడొస్తున్న నవల్లు చదివి నీ అభిప్రాయం చెబుతున్నావా? లేక ఈ అభిప్రాయంతో చదవడం మానేశావా?" అన్నాడు రమణ.

    "ఏమైతే ఎందుకు? నాది మెజారిటీ అభిప్రాయం కాదని ముందే చెప్పానుగా...." అని నవ్వి "ఇదంతా ఎందుకొచ్చిందంటే కాశ్మీర్ గురించి నీకు బోలెడు వివరాలు తెలిస్తే గనుక నువ్వు మన ప్రయాణం గురించి ఓ నవల రాయొచ్చు. ఇక్కడి ప్రదేశాలను వర్ణిస్తూ, మధ్య మధ్య మన సంభాషణలుంచుతూ__" ఆగింది హాస.

    సుభద్ర, పురోహితుడు వచ్చారు.

    "చాలా బాగుందే, చూడ్డానికి నువ్వూ రావలసింది" అంది సుభద్ర.

    "అవి తర్వాత ఫోటోల్లో చూస్తాన్లే...." అంది హాస.

    "కాశ్మీరొచ్చిందెందుకు? తర్వాత ఫోటోలు చూడ్డానికా?"

    "ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నానమ్మా...."

    "అదీ ఫోటోల్లో చూడొచ్చుగా...."

    "గతాన్ని ఫోటోల్లో చూస్తాను. వర్తమానాన్ని కళ్ళతో చూస్తాను" అంది హాస.

    రమణ కలగజేసుకుని "గతం గురించి తెలుసుకోవడం భవిష్యత్ కు మంచిది" అన్నాడు.

    "నా భవిష్యత్తుకు గతం కాదు, వర్తమానం పునాది!" అంది హాస.


                        *    *    *    *


    టాక్సీ ముందుకు దూసుకుపోతోంది. క్రమంగా ఎత్తుకు వెడుతున్నామని ఆమెకు అర్ధమవుతోంది.

    కాశ్మీర్లో దుమ్మూ, ధూళి బాగా తక్కువని హాస అభిప్రాయం. కానీ శ్రీనగర్ నించి పహాల్ గాట్ వెడుతూంటే రేగే దుమ్ము నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు కారు అద్దాలు మూసేయాల్సి వచ్చింది.

    సుమారు గంట ప్రయాణం చేశారో లేదో టాక్సీ మళ్ళీ ఆగింది.

    "ఇదేనా పహాల్ గాట్?" అంది హాస చుట్టూ చూస్తూ.

    "కాదు, ఇది ఆపిల్ తోటలు...." రమణ మాటలింకా పూర్తి కాకుండానే కారు చుట్టూ బిలబిలలాడుతూ కొందరు పిల్లలు మూగారు.

    వాళ్ళ వయసులు పదినుంచి పదహారు వరకూ వుండొచ్చు. వారిలో ఆడ, మగ వున్నారు. అంతా ఆరోగ్యంతో మిసమిసలాడుతూ వున్నారు. పచ్చటి ఛాయతో మెరిసిపోతున్నారు. ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు.

    అంతా కారు దిగారు. అయిదారుగురు ఆడపిల్లలు దీదీ దీదీ అంటూ హాస చుట్టూ మూగారు. వాళ్ళేమంటున్నారో హాసకు తెలియలేదు. కానీ వాళ్ళామె చేతులు, చెవులు, ముఖం అన్నీ తడుముతూంటే హాస కాస్త కంగారు పడింది.

    వాళ్ళు దొంగలో, ఎవరో, ఏమిటో అర్ధంకాక ఆమె గట్టిగా కేక పెట్టింది.

    అప్పుడు రమణ అభిమన్యుడిలా వారిని ఛేదించుకుంటూ వచ్చి హాసను దగ్గరగా తీసుకున్నాడు. అప్రయత్నంగా హాస అతణ్ణి కౌగలించుకుంది.

    రమణకది అపూర్వానుభవం. కాలం కాసేపు స్థంభించిపోతే బాగుండుననుకున్నాడతడు.

    ఆమె వెచ్చటి ఊపిరి అతడికి వీవెనవుతోంది. మెత్తటి స్పర్శ దుస్తులు అవధులు దాటి శరీరానికి అనుభూతినిస్తోంది. ఆమె తనదన్న భావం ఈ ప్రపంచాన్నే జయించిన గర్వం అతడిలో కలిగిస్తోంది.

    అతడు తన చుట్టూ వున్నవారిని మరిచిపోవచ్చు. కానీ వాళ్ళతణ్ణి మరిచిపోరు కదా!

    "ఖుష్ కరో! ఖుష్ కరో!" అంటున్నారు వాళ్ళు.

    "ఏమిటి వీళ్ళ గొడవ?" అంది హాస రమణను వదలకుండానే. అయితే అప్పుడామె ప్రియుని ఒడిలో ప్రియురాలిలా కాక తండ్రి ఒడిలో పసిపాపలాగుంది. రమణ మాత్రం ఆ పసిపాపలో కన్నెపిల్లనే చూస్తున్నాడు. ఆమెను గట్టిగా పొదివి పట్టుకుని, "భయపడకు. వీళ్ళు ఆపిలుకొట్లో పనివాళ్ళు. యాత్రీకులు వచ్చినప్పుడు వీళ్ళకు టిప్పు ఇస్తూంటారు. బయటి ప్రపంచం తెలియని వీళ్ళకు మన మేమిచ్చిన సంతోషమే! టిప్పిచ్చి సంతోష పెట్టమని అడుగుతూండడం వీళ్ళ సంప్రదాయం. వీళ్ళకు మాయ, మర్మం తెలియదు, చనువుగా దగ్గరకొస్తారు. అంతే!" అన్నాడు.

    ఈ మాటలు వినగానే రమణను విడిపించుకుంది ఆమె. కాస్త దూరంలో నిలబడి నవ్వు ముఖాలతో తమనే చూస్తున్న వాళ్ళని చూసి తనూ నవ్వింది.

    ఈలోగా రమణ టాక్సీ దగ్గరకు వెళ్ళి తన బ్యాగులోంచి కొన్ని వస్తువులు తెచ్చాడు. రబ్బరు బాండ్సు. హెయిర్ క్లిప్సు, సెంటు రబ్బర్లు, బాల్ పెన్స్....ఇలా అందరికీ తలోకటి యిచ్చాడు. వాళ్ళవి తీసుకుని ఆనందంగా గెంతుకుంటూ వెళ్ళిపోయారు.

    "పద, పళ్ళతోటలు చూద్దాం" అన్నాడు రమణ.

    టాక్సీడ్రయివరు, పురోహితుడు, సుభద్ర కలిసి నడుస్తున్నారు.

    రమణ, హాస కలిసి నడుస్తున్నారు.

    "భలే మనుషులు" అంది ఆమె నిట్టూర్చి.

    "అవును. వాళ్ళ కారణంగా నాకు నీ కౌగిలి లభించింది" అన్నాడు రమణ.

    ఆమె ఉలిక్కిపడి "కౌగిలేమిటి?" అంది.

    "అమాయకత్వం నటించకు. ఆ అనుభూతి ఇప్పటికీ నాలో పరవశం కలిగిస్తోంది."

    ఆమె మాట్లాడలేదు.

    "హాసా! అప్పుడు అంటే నన్ను కౌగలించుకున్నప్పుడు నీకేమీ అనిపించలేదా?"

    "జారిపడబోయే సమయంలో ఆసరాకోసం ఓ స్థంభాన్ని గట్టిగా పట్టుకున్నాననుకో, అది కౌగలింత అవుతుందా?" అంది ఆమె.

    "కానీ నేను స్థంభాన్నికాదు. మనిషిని!"

    "అప్పుడప్పుడు మనిషి స్థంభంలా కూడా వుండాలి. ఎల్లవేళలా మనిషి మనిషిలాగే ఉంటే ఆ మనిషి పశువుగా మారే అవకాశముంది...." అంది ఆమె.

    ఆమె ఎంత లోతుకు వెళ్ళి మాట్లాడిందో రమణకు అర్ధమయింది.

    బిడ్డకు పాలిచ్చే తల్లి, బస్సు రద్దీలో వనిత, మరుగులేకుండా స్నానమాడే పేదరాలు....వీళ్ళందర్నీ జడభావంతో తిలకించలేని మనిషి పశువవుతున్నాడు. యాక్సిడెంటల్ గా ఆడదాని పైట జారవచ్చు, కౌగిలి లభించవచ్చు. అప్పుడు మగాడి భావాలెలాగుండాలో హాస చెబుతోంది.

    "అయాం సారీ హాసా!" అన్నాడు రమణ.

    "సారీ కాదు థాంక్స్ చెప్పాలి. నా డైలాగు నాకే గొప్పగా అనిపిస్తోంది. ఇది నా స్వంతం. ఇంత కష్టపడి నాకు కాశ్మీరు చూపిస్తున్నందుకు ఈ డైలాగుని నీకిచ్చేస్తున్నాను."

    "ఏం చేసుకోమని?" అన్నాడు రమణ. ఆమె నవ్వు ముఖం అతడికి సంతృప్తిని కలిగించింది.

    "కాశ్మీరు వివరాలతో నువ్వు నవల రాస్తావుగా! అందులో ఉపయోగించుకో...."

    "అలాంటి నవల్లు నీకిష్టం లేదన్నావుగా....నేను రాయను."

    అప్పుడు సుభద్ర హాసను సమీపించి, "ఇక్కడ యాపిల్సు అమ్ముతున్నారే, కిలో రూపాయిన్నరట....ఓ క్రేట్ వేయించుకుందామా....?" అంది.

    "కంగారు పడకండి. తిరుగు ప్రయాణంలో పుచ్చుకుందాం. కిలో రూపాయికే బేరమాడతాను నేను" అన్నాడు రమణ.

    అమ్మా! ఆ డ్రయివర్ తో నువ్వెలా మాట్లాడుతున్నావే?" అంది హాస నవ్వుతూ.

    "నేనేం మాట్లాడలేదు. అతడే వన్ కిలో వన్ రూపీ ఫిప్టీ పైసా అన్నాడు" అంది సుభద్ర.

    ఇంతలో ఓ వ్యక్తి రమణను సమీపించి హిందీలో ఏదో చెప్పాడు.

    "ఈ ఆపిల్ తోటలో నువ్వో ఆపిల్ పండులా ఉన్నావుట. ఇతడు ఈ తోటల్లో వాటాదారుడనుకుంటాను" అన్నాడు రమణ.

    హాసకు ఆపిల్ తోటలు చూడ్డానికి తమాషాగా ఉన్నాయి. చెట్లకు మామిడి పళ్ళో, జాంపళ్ళో, సపోటాపళ్ళో ఉంటే సహజంగా ఉంటుంది. ఆపిల్ పళ్ళు అసహజంగా చెట్లకు తగిలించినట్లున్నాయి.

 Previous Page Next Page