Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 35

    "సుభద్రమ్మ మీద కూడా ఇదే ట్రిక్కు వేద్దాం" అన్నాడు రచయిత.   
    రాయుడు క్షణం ఆలోచించి, "సుభద్రమ్మ మీద ట్రిక్కు మార్చాలి. లేకపోతే వాళ్ళకు అనుమానం వస్తుంది. అసలిప్పటికే ఏదో గూడుపుఠాణీ జరుగుతునట్లు వాళ్ళకు అనుమానం వచ్చి ఉండాలి" అన్నాడు.   
    రచయిత కాసేపు బుర్రకు పదునుపెట్టి - "ఓ పని చేద్దాం. ఓ రాత్రి మనవాళ్ళని నలుగుర్ని సుభద్రమ్మ ఇంటికి పంపిద్దాం. వాళ్ళు రహస్య పత్రాలకోసం వెతుకుతున్నారనొచ్చు. వాళ్ళు ఇల్లు నానా గత్తరాచేసి, మరోసారి వస్తామని బెదిరించి వెళ్ళిపోతారు. సుబ్బారావు వాళ్ళకు ఎదిరించలేడుగదా! అందుకని సుభద్రమ్మకు సుహాసిని ప్రయోజనం తెలిసొస్తుంది. అలాంటి కోడలుంటే ఇంటికి శాశ్వత రక్షణ గదా?" అన్నాడు.   
    "సరే, ప్రయత్నిద్దాం" అన్నాడు రాయుడు.   
    రచయిత వాకబుచేసి, బామ్మగారింటికి పురోహితుడు సుబ్రహ్మణ్య దీక్షితుల్ని పట్టాడు. సుహాసిని, సుబ్బారావుల ప్రేమకథ చెప్పి ఆయన నుంచి తనేం కోరుతున్నాడో చెప్పాడు.   
    "అయ్యయ్యో! నేను వారింటి పురోహితుణ్ణి. ఈ నాటకం నావల్లకాదు" అన్నాడు సుబ్రహ్మణ్యదీక్షితులు కంగారుగా.   
    "ఇందుకు తమకు వెయ్యినూటపదార్లు బహుమానం, నూటపదార్లు అడ్వాన్సు. ఫలితం పండైతే వెయ్యి పెళ్ళికి ముందే అందేస్తుంది" అన్నాడు రచయిత.   
    వెయ్యిన్నూటపదార్లు అనగానే దీక్షితులి ముఖకవళికలు మారాయి. రచయిత చేతిలో రెపరెపలాడుతున్న నోట్లు చూడగానే ఆయన గుటకలు మింగాడు. నెమ్మదిగా ఆ డబ్బు అందుకుని, "మంచి పని చేయడానికి నాదెప్పుడూ ముందడుగే" అన్నాడు.   
    "చాలా సంతోషం" అంటూ రచయిత. అక్కణ్నుంచి లేచాడు.   
    "తర్వాత సుబ్రహ్మణ్యదీక్షితులు పకడ్బందీగా పథకం అమలు జరిపాడు. ఏదో యధాలాపంగా చూసినట్లు జాతకాలు చూసి, కొంత కలవరపాటును సూచించి, ఎదుటి మనిశిలో ఉత్సుకతను రేకెత్తించి, ఇష్టంలేక చెబుతున్నట్లు ఆఖరికి చల్లగా విషయం చెప్పాడు. అది వింటూనే బామ్మగారి గుండె గుభేలుమంది. ఆవిడ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకుంది.   
    ఇది చెబుతున్నప్పుడు. బామ్మగారి పక్కన సుహాసిని మాత్రం ఉంది. ఆమె దీక్షితులు వెళ్ళిపోగానే బామ్మ ఒడిలో తల పెట్టుకుని భోరున ఏడ్చింది. బామ్మ ఆమె జుట్టులో వేళ్ళు పెట్టి నిమురుతూ, "పిచ్చిపిల్లా! నూరేళ్ళ జీవితం నీది. రేపో మాపో రాలిపోయే పండుటాకును నేను. నా కోసం నీకు శాఖాంతర వివాహం చేయిస్తానా?" అంది. సుహాసిని ఏడుస్తూ, "వద్దు భామ్మా! నువ్వు నా పెళ్ళి అయినా బ్రతికుండాలి. నీకు మరణగండముండే మాటైతే నేను పెళ్ళే చేసుకోను" అంది.   
    బామ్మ ఏమనాలో తెలియక ఊరుకుంది.   
    రోజులు గడుస్తున్నాయి. ఒక పర్యాయం సుహాసిని ఇంటికి పెళ్ళివారే వచ్చారు. పెళ్ళికొడుకు బాగున్నాడు.   
    సుహాసిని తండ్రి అన్నీ చెప్పుకుపోతున్నాడు - "మా అమ్మాయిది అంతా వాళ్ళ బామ్మ పోలిక. ఈ యిల్లంతా  మా అమ్మ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆ నాయకత్వపు లక్షణాలు మళ్ళీ సుహాసినికి వచ్చాయి..."   
    మగపెళ్ళివారు. మంచివారులాగున్నారు. పెళ్ళికొడుకు తండ్రి ఏ బెట్టూ లేకుండానే- "అమ్మాయి నాకు ఎంతో నచ్చింది. మా వాడికి నచ్చకపోతే వాడి దృష్టిలో ఏదో లోపముందనుకుంటాను తప్పితే, అమ్మాయిలో ఏ లోపమూ ఉందనుకోను. ఇంకా మనం పెళ్ళి ఎలా జరిపించాలీ అన్నది మాట్లాడుకోవచ్చు..." అని ఏదో అనబోతూండగా, బామ్మగారో పెద్ద కేక పెట్టి పడిపోయింది. నలుగురూ ఆవిడచుట్టూ మూగారు.   
    బామ్మకి స్పృహ తప్పింది. ఆవిణ్ణి పక్క గదిలోకి చేర్చారు.   
    "ఆవిడకేదైనా జబ్బా?" వరుడి తండ్రి సుహాని తండ్రిని అడిగాడు.   
    "ఎప్పుడూ జర్రున చీది ఎరుగదండీ! ఇలా జరగడం ఇదే మొదటిసారి" అన్నాడు సుహాసిని తండ్రి.   
    వరుడి తల్లి నెమ్మదిగా భర్తను గోకి, "ఆవిడకు జబ్బుంటే మాత్రం ఆడ పెళ్ళివారు చెబుతారా? వాళ్ళ మొహాలు చూస్తూంటే ఇది అలవాటైనట్లే కనబడుతోంది. అందులోనూ పెళ్ళికూతురికి అంతా బామ్మ పోలికని అంటున్నారు. పిల్లకేం మూర్ఛ రోగముందో ఏమటో? ఎందుకైనా మంచిది - ప్రస్తుతానికి ఈ సంబంధం గురించిఏమీ తేల్చద్దు" అంది. ఆయన కూడా అంగీకార సూచనగా తలాడించాడు.   
    తమ నిర్ణయం తర్వాత ఉత్తరం ద్వారా తెలియజేస్తామని మగపెళ్ళివారు. వెళ్ళిపోయారు. బామ్మగారికి కాసేపు పోయాక స్పృహ వచ్చింది.   
    "ఎలా ఉందమ్మా?" అనడిగాడు సుహాసిని తండ్రి.   
    "ఏమయింది బామ్మ?" అంది సుహాసిని.   
    "ఏమిటోనే, యముడు నావైపు పాశం విరిసినట్లయింది. భయంవేసి కేకపెట్టాను" అంది బామ్మగారు.   
    "చచ్చేముందు కొందరికి యముడు కనబడతాట్ట! ముసలావిడకు రోజులు దగ్గర పడ్డాయేమో!" అంది సుహాసిని వదిన కాస్త నెమ్మదిగా.   
    ఆ మాటలు సుహాసినికి వినబడ్డాయి. "నాన్నగారూ! బామ్మ బెంగెట్టుకుంది. అసలు విషయం దీక్షితులుగారికి తెలుసు" అంది.   
    సుహాసిని తండ్రి దీక్షితుల్ని నిలదీసి అడిగాడు. ఆయన జాతకంలోని మరణగండం గురించి చెప్పాడు.   
    "నాకంత శాఖ పట్టింపులు లేవు. మా అమ్మాయికి శాఖాంతరంలోనే మంచి సంబంధం చూడండి" అన్నాడు సుహాసిని తండ్రి.   
    "మీరు చెబితే అంతకంటేనా? వెంటనే చూస్తాను" అన్నాడు దీక్షితులు. ఆయన కళ్ళముందు తనకు రాబోయే వెయ్యి రూపాయలూ మెదుల్తున్నాయి.   
    "లాభంలేదు. నేను చావనైనా చస్తానుగాని, అలాంటి పెళ్ళికి ఒప్పుకోను" అంటూ అరిచింది బామ్మ. అప్పుడు సుహాసిని వెంటనే, "అయితే నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నువ్వు దీనికి ఒప్పుకోకపోతే దొడ్లో నూతిలో దూకేస్తాను" అంది.   
    బామ్మ తెల్లబోయి ఆగిపోయింది. దీక్షితులు తనలో తను ముసి ముసిగా నవ్వుకున్నాడు. అప్పుడు బామ్మ నెమ్మదిగా_ "దీక్షితులుగారూ! మీకు శ్రమ అక్కర్లేదు. నేనే ఓ సంబంధం చెబుతాను. అమ్మాయి పేరు సుబ్బారావు పిల్లాడు బుద్దిమంతుడు పెద్దల ఎడ వినయ విధేయతలు గలవాడు. మీదు మిక్కిలి పిల్లదాని పక్కన ఈడూ - జోడూగా ఉంటాడు. అడ్రసు చెబుతాను. వెళ్ళి కలుసుకుని ఎలాగో పెళ్ళి ఖాయం చేయండి" అంది.

 Previous Page Next Page