Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 35

   "ఆత్మహత్య చేసుకుంటాను" టక్కున అంది అదొక్కటే తనకు తెలిసిన మార్గమన్నట్టుగా.   
    ఒక మధ్య తరగతి ఆడపిల్ల బలహీనత గురించి బాగా తెలిసిన రాజేంద్ర "అలా అయితే నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలనని-" అన్నాడు తెచ్చి పెట్టుకున్న ఉద్వేగంతో.    
    "నన్నెందుకు తీసుకొచ్చినట్టు'    
    కొన్ని నిముషాల క్రితం శరశయ్యపై అతడి క్రింద నలిగిన జీవిత అశ్రుశిక్త నయనాలతో నిలదీసినట్టుగా అడిగింది.    
    "మాట్లాడండి" వణికిపోతూ అతడ్ని పెనవేసుకుపోయింది. "ఇప్పుడు నన్నేం చేయాలనుకుంటున్నారు."    
    "నిన్ను నేనేమీ చేయదలుచుకోలేదు జీవితా. నా చివరి క్షణాల్ని నీముందే గడపాలని ఇలా తీసుకొచ్చాను..." జేబులోనుంచి ఓ ప్యాకెట్ తీశాడు.    
    "ఏమిటది"   
    "నిద్ర మాత్రలు....నీ ఒడిలో శాశ్వతంగా నిద్రపోవాలని నేను తెచ్చుకున్న స్లీపింగ్ టేబ్లెట్స్."    
    "వద్దు" దుఃఖోద్విగ్నంగా వారించబోయింది.
    "నన్ను ఆపకు జీవితా....ప్రేమించిన ఆడపిల్లకోసం ప్రాణాలు వదిలిన పిరికి ప్రేమికుడిగా నీ కళ్ళముందే రాలిపోనియ్..." ఆయాస పడిపోతూ ఆవేశాన్ని ప్రకటించాడు.    
    "ప్లీజ్"    
    "జీవితా....మరో జన్మంటూ వుంటే ఓ మంచి తండ్రికి కొడుకుగా పుడతాను. నీ ప్రేమను గెలుచుకుంటాను".  
    సుమారు వంద నిద్రమాత్రలతో చేసిన పౌడర్ని గ్లాసులోని నీళ్ళలో కలిపాడు.    
    "మీరు లేకుండా నేనెలా బ్రతకగలననుకుంటున్నారు."    
    "వద్దు జీవితా-"    
    "మీతో బాటు నేను కూడా-"    
    జీవిత గభాలున గ్లాసు అందుకోబోతుంటే "ఆగు" అన్నాడు ఆవేశంగా....అప్పటికే రాసిన ఓ కాగితాన్ని ఆమె ముందుంచి "నాతో పాటు నువ్వూ చావాలి అనుకుంటే ఈ క్రింద నువ్వూ సంతకం చేయ్."    
    జీవిత ఆలోచించలేదు "బ్రతుకులో సాధించని ప్రేమ మరణంతో గెలుచుకోవాలని వెళ్ళిపోతున్న మా చావుకి ఎవరూ బాధ్యులు కారు" అని రాసివున్న కాగితంపై ఇద్దరూ సంతకం చేసారు.
    తాగబోయాడు.    
    "ముందు నేను" అంటూ జీవిత గ్లాసుని అందుకుని గడగడా తాగేస్తుంటే వారించలేదు రాజేంద్ర మూడు వంతులభాగం జీవిత తాగేక ఆమె చేతి నుంచి గ్లాసులాక్కుని తనూ తాగేడు.    
    అప్పటికే జీవిత గొంతు పిడచ కట్టుకుపోతున్నట్టు ఆర్తితో పెనుగులాడుతూంది.   
    కొద్దిపాటి మగతతో ఆమెను గమనిస్తున్న రాజేంద్ర పెదవులపై గర్వంగా నవ్వు మెరిసింది.    
    కాలిపోతున్న ప్రేమలిప్తల్లో ఆఖరి పోరాటంలో అంగలార్చుకుపోతున్న జీవితాని చూస్తూ స్వర్గ స్మృతుల్లో తలదాచుకుని అమర ప్రేమికుల్లా కడతేరిపోదామని అంతసేపూ చెప్పిన రాజేంద్ర ప్రపంచ ప్రేమ చరిత్రల పుటల్ని తినేసే చెదపురుగులా నవ్వుతున్నాడు ఇంకా....    
    జీవితకిదేమిటో అర్ధం కావడం లేదు- ఏదో అనిపించినా సరిదిద్దుకునే అవకాశం లేదు.    
    ఆ క్షణంలో సైతం ప్రియుడి పరిష్వంగాన్నే ఆమె కోరుకుని వుంటే ఆ తప్పు జీవితది కాదు. గొడ్డళ్ళతో గుండెల్ని వ్రయ్యలు చేసినా గోళ్ళతో గుండె పొరల్ని చీల్చినా సృష్టికి లయానికి నడుమ మిగిలే అస్థిత్వం పేరే ప్రేమని ఇంకా నమ్మే వేల కోట్ల ముగ్ధలకి ప్రతినిధిగా ఆమె అలాగే రాజేంద్ర గుండెలపై తలానించింది.    
    అదిగో...సరిగ్గా అప్పుడు గదిలో ప్రవేశించారు చౌదరి ముందే ఏర్పాటు చేసిన పోలీసులు చౌదరితో బాటు...    
    ఆ తర్వాత ఇద్దర్నీ హాస్పిటల్ కి తరలించారు.    
    జీవిత ప్రాణం పోయిందని డాక్టర్లు వెంటనే తేల్చేసినా రాజేంద్ర ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించారు.   
    "రాజేంద్రని రక్షించగలిగాం."        
    ఓ డాక్టరు చెప్పాడు థియేటరులో నుంచి బయటకి వస్తూ.    
    ఒక్క అంగలో రాజేంద్రని సమీపించిన చౌదరి అలవాటులేని దుఃఖాన్ని అభినయిస్తూ "ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. నేను కాదన్నంత మాత్రాన ఇలాంటి దారుణానికి ఎందుకు పూనుకున్నారు. ధైర్యంగా ఎదిరించి బ్రతకాల్సిన మీరు.....అయ్యో." రాజేంద్ర చేతులు పట్టుకుని కుదిపేస్తుంటే పోలీసు అధికారులు అతడ్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు...    
    అప్పుడు గదిలోకి ప్రవేశించింది కృషి విస్సుతో బాటు...    
    ఓ మూల జీవిత శవం.... ఎవరూ పట్టించుకొని అనాధ ప్రేతంలా కనిపిస్తుంటే స్తబ్దురాలైపోయింది.    
    శబ్ద రహిత భాషలా కళ్ళలో నిలిచినా బాష్పాలు మనసును కలవర పరుస్తుంటే నెమ్మదిగా శవం దగ్గరికి నడచింది కృషి.    
    నిన్నటి ఆత్మహత్యా ప్రయత్నంలోని భయం లేదిప్పుడు జీవిత నేత్రాలలో....ఇంకా చావని ఏ ఆశల నక్షత్రాలనో బ్రతుకు తోరణాలుగా పేర్చుకున్న పర్ణశాలలా వుంది.    
    ఎందుకు తను నిన్నకాపాడింది - ఈ రోజెందుకు తను నచ్చచెప్పి మరీ పంపింది.    
    సమీపంలోని చౌదరి అభినయం ఏ ఆలోచనలకి నేపధ్యమై కృషిని కదిలించిందో నెమ్మదిగా నడిచింది అక్కడ నిలబడ్డ పోలీసాఫీసరు దగ్గరికి.    
    చివర రాసిన ఉత్తరాన్ని అక్కడ దొరికిన ఆధారాలని అతడు వివరిస్తుంటే నిశ్శబ్దంగా వింది.    
    చీకటి ఆవరణలో కారు దగ్గరికి నడుస్తుంటే వచ్చాడు విస్సు "సారీ" తలవంచుకున్నాడు "ఇలా జరుగుతుందనుకోలేదు"    
    "కాని నేను అనుకున్నాను మిస్టర్ విస్సు.... అందుకే నీ మిత్రుడు చౌదరి కొడుకు సిన్సియారిటీ గురించి నేను ప్రశ్నించింది."   
    అప్రతిభుడై అతడు నిలబడి వుండగానే వెళ్ళిపోయింది కృషి.    
                                          *    *    *    *    
    రాత్రి పదకొండు గంటల సమయం....    
    అసహనంగా తన గదిలో పచార్లు చేస్తూ వుండిపోయింది ఆమె. జీవిత ఆత్మహత్య చేసుకోలేదు. తెలివిగా హత్య చేయబడింది. ఎలాగో ఆమెకీ తెలీదు. కాని అది ఖచ్చితంగా హత్యే అనిపిస్తూంది.    
    కృషి మనసు వికలమైపోయింది. ఏం సాధించింది తను.    
    ఏ డబ్బు విషయంలో గ్రాండ్ పాకి ఆసరాగా ఈ దేశంలో వుండటానికి నిర్ణయించుకుందో తిరిగి గ్రాండ్ పాని అదేస్థితికి నెట్టింది...ఒక చిన్న నిర్లక్ష్యం డిఫెన్స్ టెండర్ కోల్పోవటానికి కారణమైంది... ఇక్కడ సమస్య ఆర్ధికమైన నష్టం కాదు - పోగొట్టుకున్న పరపతికి సంబంధించి మానసికంగా అయినగాయం.    
    ఆ అశాంతి నుంచి తను ఇంకా తేరుకోకముందే ఇప్పుడు జీవితను కోల్పోయింది - ఆమె మరణానికి ప్రత్యక్షంగా తను కారణం కాదు. కాని చేజేతులా తనే పంపించి మృత్యురూపంలోకి నెట్టింది.    
    "కృషి" డాక్టర్ మహంతి నిలబడి వున్నారు ద్వారం దగ్గర. కృషి అడక్కముందే చెప్పాడు "గ్రాండ్ పాకి మళ్ళీ అటాక్ వచ్చిందేమో అని భయపడ్డానమ్మా.....బాగా టెస్ట్ చేశాక తెలిసింది ఇది....    
    Transient Ischaemic Attack కాదని మానసికంగా గాయపడ్డారు అంతే...."    
    ఒంటరి తనంతో బాధపడే ఓ వ్యక్తికి అణువంత ఉపశమనం అందించేది ఆత్మీయుల పరామర్సే అయితే ఇదిగో ఇప్పుడు అలాంటి వూరటనే అందించగలిగాడు డాక్టర్ మహంతి. అందుకేనేమో ఆమె కళ్ళు తడయ్యాయి. "ఓసారి వెళ్ళి తాతయ్యని కలుసుకోవచ్చుగా"    
    "దానివలన ఉపయోగం లేదు అంకుల్" బలవంతంగా నవ్వాలని ప్రయత్నించింది.
    "డిఫెన్స్ టెండర్ పోవటానికి నేనే కారణమనుకుంటున్నారు గ్రాండ్ పా. అఫ్ కోర్స్ అది నిజమే....."        
    "కాని ఆ వ్యక్తే అంతకుముందు నీ సమర్ధతకి పొంగిపోయేవాడు...."    
    బాధగా తల వంచుకుంది కృషి.    
    "ఎందుకలా బాధపడతావు"    
    "శక్తికి మించిన పోరాటంలో అడుగుపెట్టాను అంకుల్. అదీ కావాలనే...కాని ఏదో చెయ్యాలనే ప్రయత్నించిన నేను గ్రాండ్ పాని ఇంత నష్టానికి గురి చేసాను."    
    "ప్రత్యర్ధితో యుద్దానికి సిద్దపడ్డప్పుడు మనం కొన్ని గాయాలకి ప్రిపేర్ కావాలి కృషి- నీ మూలంగా చౌదరికి తగిలిన దెబ్బల కన్నా చౌదరి మూలంగా నీ గ్రాండ్ పాకి అయిన గాయం చాలా స్వల్పం కాబట్టి నువ్వు బాధ పడాల్సిన అగత్యం లేదు ఈ విషయం మీ గ్రాండ్ పాకి తెలీక కాదు...."    
    ఆ తర్వాత చాలా సేపటిదాకా నిశ్శబ్దం ఆవరించింది.    
    "అంకుల్"
     వెళ్ళబోయిన మహంతి ఆగాడు.    
    "నాకో క్లారిఫికేషన్ కావాలి" చెప్పింది జీవిత రాజేంద్రల ఆత్మహత్యా ప్రయత్నం గురించి క్లుప్తంగా "ఇద్దరూ విషం త్రాగారు కాని చనిపోయింది జీవిత మాత్రమే."    
    "విషం త్రాగాక ప్రభావం ఇద్దరిమీదా వుంటుంది కృషి. కాకపోతే ఎక్కువ విషం పుచ్చుకున్నవాళ్ళు చనిపోతారు. తక్కువ తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడతారు."    
    అంతే...    
    యధాలాపంగా డాక్టర్ మహంతి చెప్పిన జవాబులో చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది. అంటే ఓ పథకం ప్రకారం జీవితని హత్య చేశారు రాజేంద్ర, రామనాథ్ చౌదరిలిద్దరూ.            
    డాక్టర్ మహంతి వెళ్ళిన ఐదు నిమిషాల దాకా అదే విషయం గురించి ఆలోచించిన కృషి ఇక నిభాయించుకోలేక ఫోన్ అందుకోబోయి ఆగింది ద్వారం దాటి వస్తున్న విస్సుని చూస్తూ-    
    ఎప్పుడూ చాలా వుత్సాహంగా వుండే విస్సు ఆ క్షణంలో బిడియంగా తల వంచుకోవడాన్ని ఆమె గమనించినా నిశ్శబ్దంగా వూరుకోలేదు...    
    "సో ఓ కుందేలు పిల్లని కడతేర్చగలిగారు"    
    "మిస్ కృషి....నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధమౌతుందా"    
    "ఆవేశపడకు విస్సు....జీవితనే ఓ అమాయకురాలి ప్రాణాలు తీసే తమ పథకంలో చౌదరి నీకెంతిచ్చాడు"    
    విస్సు పిడికిళ్ళు బిగుసుకున్నాయి.    
    "డబ్బుకోసం నువ్వేదన్నా చెయ్యగల సమర్దుడివేగా విస్సూ అసలు నీకు ప్రపంచంలో చాలా ముఖ్యమైనది డబ్బేగా?"    
    "పిచ్చిపిచ్చిగా మాట్లాడకు"    
    "ఏం నీకూ కోపం వస్తుందా....అలా రావాల్సింది ఆత్మాభిమానం వున్న వాళ్ళకి" అతని మొహం వివర్ణమౌతుంటే క్రోధంగా అడిగింది. "చెప్పు విస్సు....కొన్ని రోజులపాటు అజ్ఞాతంగా వుండి తర్వాత పెళ్ళి చేసుకొని జీవితని ఇంటికి తీసుకుని వెళ్తానని నీకు హామీ ఇచ్చిన రాజేంద్ర వెళ్ళిన గంటలో ఆత్మహత్యకి ఎందుకు సిద్దపడ్డాడు. ఆ ప్రయత్నంలో కేవలం జీవిత మాత్రమే ఎందుకు ప్రాణాలు కోల్పోయింది."    
    షాక్ తిన్నట్టుగా చూశాడు అతను. ఇలాంటి విశ్లేషణకి ఆ క్షణం దాకా అతడు సిద్దపడలేదు.    
    "నీ హెచ్చరికతో చౌదరి కలవరపడ్డాడు. నీ ద్వారా నన్ను సాధించాలనుకున్న చౌదరి నీకు అనుమానం రాకుండా కొడుకుతో ఓ పథకం వేశాడు. ఆ పథకం జీవిత ప్రాణాలు తీయడం. అలా తను కోరిన మంత్రిగారి కూతుర్ని తన కోడల్ని చేసుకోవడం. అది నీకు అర్ధం కాలేదు. కాబట్టి రాజేంద్ర అడిగాడని నా దగ్గరకొచ్చావు. కేవలం నా మీద గెలుపు సాధించాలనే ఒకే ఒక్క ధ్యేయంతో నన్ను కూడా నమ్మించి జీవితని తీసుకెళ్ళిపోయావ్ "జీవిత ఆలోచనలతో మనస్సు ద్రవించిందేమో కళ్ళలో పేరుకున్న నీటి పొరల్ని దాచేసుకుంటూ అంది "ఇక్కడ పొరపాటు నీది కూడా కాదు విస్సూ నీ తండ్రి విషయంలో పగ తీర్చుకోవాలని ఈ ఇంట అడుగుపెట్టావే తప్ప నువ్వు డబ్బు కోసం హత్యలు సైతం చేసే హంతకుడివని నేను అనుకోకపోవడం. యస్ - అదే జీవితని నేను నీకు అప్పచెప్పటానికి కారణమైంది. అలా చూడకు విస్సూ. ఒక మేధావి ఆలోచనా సరళిలో సైతం ఒక్కోమారు అపశృతి ధ్వనించే అవకాశం వుంటుందన్న అరిస్టాటిల్ సూక్తి నిజమైతే చాలా తెలివైనదానిననుకున్న నేనూ ఓ మూర్ఖురాలిలా ప్రవర్తించాను....ప్రత్యేకించి నీకీ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే ఒకనాడు నాతో ఒకరాత్రి గడపాలనుకుంటున్నానన్న నువ్వు అలాంటి అవకాశం దొరికినా నన్ను మత్తులో ముంచి ఫోటోలకే నీ తెలివిని పరిమితం చేసుకున్నావు తప్ప నన్ను అనుభవించటానికి కాదుగా...నన్ను అనుభవించడమే నీ ధ్యేయమైతే అది ఆ రాత్రి నీకు సాధ్యమయ్యే విషయమేగా అదిగో అక్కడ నువ్వు ఓ పగతో ఈ ఇంట ప్రవేశించిన మనిషినే తప్ప అవకాశం దొరికినా ఓ ఆడపిల్లపై అఘాయిత్యం చేయవని అర్ధం చేసుకున్నాను. అసలు నీకు ఏం తెలుసని మా కుటుంబం మీద పగ తీర్చుకోవటానికి.. నీ తండ్రి హత్యకి ఉపాధ్యాయగాడే కారణమనుకుంటున్నావ్ తప్ప అది చేయించింది చౌదరి అని నీకు తెలుసా..."

 Previous Page Next Page