అయినా నేను బ్రతికేది మాత్రం ఇంకెంత కాలంలే! ఇంకో రెండు మూడేళ్ళు" మళ్ళీ కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయ్ ఆమెకి.
సృజన్ ఆశ్చర్యపోయాడు.
"ఎందుకని?"
"మేముండేది ఎక్కువ విదేశీయులతోనే గదా! ఎప్పుడే మహానుభావుడు ఎయిడ్స్ తీసుకొచ్చి మాకు తగిలిస్తాడో తెలీదు. ఒకసారి అది అంటుకుందంటే అంతే! ఆ తర్వాత ఇంక రోజులేగా! చాలామంది ఇలాగే చచ్చిపోతారు ఇక్కడ! ఆఖర్లో వాళ్ళ బ్రతుకు చూస్తుంటే నాకెంత భయంగా వుంటుందో చెప్పలేను ----ఎవరూ దగ్గిరకు రానీరు! ఎవరూ సహాయం చేయరు. చాలామంది ఆకలికి మాడి ఆ బీచ్ లోనే చస్తుంటారు. మాకోసం పాపం 'ఈశ్వర్ దీన జనసమితి" వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళే తగలేస్తారు. అదొక్కటే సంతృప్తి మాకు."
సృజన్ హృదయమంతా బరువెక్కిపోయింది.
ఆమె మళ్ళీ డబ్బు అతని చేతికిచ్చేసింది.
"తీసుకో అన్నయ్యా! ఇంతకాలానికి ఒక మంచిపని చేశానన్న తృప్తి నాకు దక్కనీకుండా చేయకు! ఇంతకాలంగా ఎవరూ నన్నిలా జాలితోనూ, ప్రేమతోనూ చూళ్ళేదు. తలుపులు వేసిన దగ్గర్నుంచీ తీసేవరకూ తామిచ్చే డబ్బు! పూర్తీ ప్రతిఫలం పొందాలనే తాపత్రయం అందరికీ."
సృజన్ ఇంక మాట్లాడలేకపోయాడు.
ఆమె తలుపు తెరిచింది. "పద! వెళ్దాం" అంది తలుపు దగ్గిర నిలబడి.
సృజన్ మరోసారి గదంతా కలియజూశాడు. అప్పుడు గుర్తు కొచ్చిందతనికి. కిందటిసారి న్యూస్ పేపర్ సంగతి.......అన్నయ్య చదివిన న్యూస్ పేపర్ అయుంటుందది . తన చేతులతో తాకలనిపించింది. దానిని తీసుకుని దానిమీద తారీఖు చూశాడు . సరిగ్గా పదిరోజుల కిందటిదది. అంటే అన్నయ్య గుంటూరు వెళ్ళినరోజు విజయవాడ లో ప్రింటయిన "ఉదయం" పేపరది. సృజన్ ఆలోచనలు ప్రారంభమయినాయ్. ఆ పేపరు అన్నయ్య వైజాగ్ కి ఎందుకు తీసుకొచ్చినట్లు.
చదవగానే పేపరు అవతల పడేయటం అన్నయ్య అలవాటు. రెండోసారి దాని వంకయినా చూడడు. అంచేత ఇది ఇంతదూరం కూడా తేవడంలో ఏమయినా కారణం ఉండి ఉండవచ్చు.
సరిగ్గా అప్పుడు తలుపు తట్టిన చప్పుడయింది.
ఆ యువతి తలుపు తీయబోయింది. కానీ సృజన్ చప్పున ఆమెను ఆపేశాడు. తన సూట్ కేస్ తెరచి అందులో న్యూస్ పేపరూ ------ఆ కాప్యుల్స్ స్ట్రిప్ వుంచి మళ్ళా లాక్ చేసి మంచం మీద పడుకున్నాడు.
"ఇప్పుడు తలుపు తీయ్" చెప్పాడామే తో.
ఆమె తలుపు తెరిచింది.
ఎదురుగా హోటల్ బాయ్ నిలబడి వున్నాడు.
"త్వరగా ఖాళీ చేయమంటున్నారు." అన్నాడతను. సృజన్ వేపు అనుమానంగా చూస్తూ.
"ఇంకో అరగంటలో వెళ్ళిపోతాం" అన్నాడు సృజన్.
అతను వెళ్ళిపోయాడు.
"ఎందుకా మందులు తీసుకున్నావ్?" అడిగిందా యువతి.
"అన్నయ్య ఇక్కడి కొచ్చిన కారణం --ఏదయినా ఉద్యోగం దొరకడమే అని నా అభిప్రాయం. ఒకవేళ ఈ కాప్యుల్స్ తయారు చేసిన కంపెనీలో ఏమయినా ఉద్యోగం చేసాడేమో కనుక్కోవాలి కదా! అందుకే అది తీసుకున్నాను."
"నిన్ను చూస్తే నాకు నవ్వొస్తుంది. నాలాగానే నువ్వూ పిచ్చాడిలాగున్నావ్" అందామె.
"అది సరేగానీ ఇంతకూ నీ పేరేమిటో చెప్పలేదు నాకు?" అడిగాడతను.
"అసలు పేరా! ఈ హోటల్లో పేరా?"
"రెండూనూ."
"అసలు పేరు మమత! ఈ హోటల్లో పేరు లిల్లీ."
"మమతా! నువ్వో సహాయం చేయగలవా నాకు?"
"ఏమిటది?"
"నేనిలా ఆ సూట్ కేస్ తెరిచినట్లు, అందులో నుండి మెడిసిన్ తీసుకున్నట్లూ ఎవరికీ చెప్పకూడదు నువ్వు."
ఆమె పగలబడి నవ్వింది. "నువ్ చాలా ముదిరిపోయిన కేస్ లాగున్నావే! తీసుకుంటే తప్పేముంది? అదేమయినా దొంగతనమా ఏమన్నానా? అయినా అది మీ అన్నయ్య సామానేగా?"
"అయినా గానీ ప్రస్తుతం పోలీస్ కస్టడీ లో ఉంది గది. అందుకని మనం దానిని ముట్టుకున్నట్లు తెలిసిందంటే లేనిపోనీ చిక్కుల్లో పడతాం."
"సరే-"
"ఇంక వెళ్దామా?"
"ఊ--"
ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడతను,
"మమతా! ఇవాళ నాకెంతో సహాయం చేశావమ్మా! నీ మేలు ఎప్పటికీ మరిచిపోలేను -- మళ్ళీ ఏదొక రోజు తప్పక నీకు కనబడతాను వస్తాను.'
మమత చిన్నగా నవ్వింది.
"ఎవరయినా మీ అన్నయ్య పేరేమిటని అడిగితే ఏం చెప్పను?"
"అతను కూడా నవ్వాడు.
"సారీ! పేరు చెప్పలేదు కదూ, సృజన్."
ఇద్దరూ తలుపు తెరచుకొని బయటికొచ్చారు. "ఇదిగో యీ యాభై రూపాయలు గది అద్దె కు కట్టేసేయ్" ఆమెకు యాభయ్ నోటిచ్చాడతను. కౌంటర్ దగ్గర ఆగి తాళం చెవి ఇచ్చేసి అతనితో పాటు బయటవరకూ నడిచిందామె.