బిగుసుకుపోయి ఇదంతా వింటున్నాడు భరత్.
సారధి చెప్పడం ముగించి కూర్చున్న తరవాత భరత్ తరపు లాయరు రమణారావు లేచాడు.
సుదీర మోకాళ్ళు ఉన్నట్లుండి బలహీనంగా అయిపోయాయి. భరత్ తరపు అడ్వకేటు క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతొ రోజుల తరబడి బోను ఎక్కించి, ఒకే ప్రశ్నని పది కోణాల నుంచి అడిగి, సాక్షిని కన్ ఫ్యూజ్ చెయ్యడంలోను, పల్టి కొట్టించడంలోనూ నిష్ణాతుడు. అలాంటి ప్రశ్నలు అడగకుడదని ఎదుటి పార్టి లాయరు, కోర్టువారూ అభ్యంతరపెడుతున్నా సరే, మళ్ళీ అవే ప్రశ్నలకి కొత్త ముస్తాబు చేసి వదిలి, తనకు కావలసిన జవాబే రాబట్టుకుంటాడు .
ఇదంతా సుదీరకి ముందే చెప్పి ధైర్యంగా వుండమన్నాడు సారధి.
అయినా, సుదీర అరచేతులు చల్లబ్దిపోయాయి.
ఇప్పుడియన ఎంత జుగుప్సాకరమైన ఎంత లజ్జాకరమైన వివరాలు తన నోటితో చెప్పించాలని చూస్తాడో!
కానీ, సుదీరకి తెలియని విషయం ఒకటి ఉంది. సజావైన ప్రశ్నలూ న్యాయమైన పద్దతిలో అడగమని, ఎట్టి పరిస్థితులోను సుదీరకి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడగవద్దని తన లాయరుతో కచ్చితంగా చెప్పాడు భరత్.
రమణారావు చెప్పడం మొదలెట్టాడు.
"యువర్ అనర్! నా ఫ్రెండు శ్రీ సారధిగారు అయన క్లయింటు శ్రీమతి సుదీరగారి తరపున చెబుతున్నదంతా కేవలం కట్టుకధ! అభూత కల్పన! ఏ కధల పోటి కన్నా పంపితే ఈ రసవత్తరమైన ఫిక్షన్ కు ప్రధమ బహుమతి రావడం తధ్యం!"
వెంటనే కోపంగా లేచి నిలబడ్డాడు సారధి. "అబ్జక్షన్ యువర్ అనర్! డిఫెన్సు లాయరు గారు, చౌకబారు హాస్యరసాన్ని పోషించడానికి ఈ విషాదకరమైన విఫల యత్నాలు చెయ్యడం కన్నా లీగల్ పాయింట్స్ చర్చిస్తే బాగుంటుంది."
"ఎస్! కన్ ఫైన్ యువర్ ఆర్గ్యుమెంటు టు లీగల్ పాయింట్స్ ఓన్లీ!" అన్నారు జడ్జి రమణారావుతో.
రమణారావు మెల్లిగా నవ్వుకున్నాడు. ఎదుటి వారికీ కోపం వచ్చి తిక్క రేగేటట్లు చెయ్యడం తన స్ట్రాటేజీలలో ఒకటి. కోపంలో వున్న వాళ్ళు బాలెన్స్ డ్ గా ఆలోచించలేరు. తేలిగ్గా బోల్తా కొట్టేస్తారు.
తను ఒప్పుకున్న ఈ కేసులో ఎక్కువ పట్టులేదని ఆయనకి తెలుసు. పైగా రకరకాల షరతులు పెట్టి, అష్టదిగ్భంధనం చేసేసి తను మామూలు పద్దతిలో చెలరేగి పోకుండా చేసేశాడు ఈ భరత్.
అంతకు ముందు రోజు సాయంత్రం తన ఆఫీసు గదిలో భరత్ ని కూర్చోబెట్టుకున్నాడు రమణారావు.
"అబ్బాయ్! నువ్వు సదాశివరావుగారి కొడుకువన్న అభిమానంతో ఒప్పుకున్నాను గానీ, ఈ కేసులో పస లేదు. కేసులో పస లేనప్పుడు నసపెట్టి, జిత్తులూ గమ్మత్తులతో గెలవాలి. అట్లా చెయ్యడానికి నువ్వు ఒప్పుకోవడంలేదు. ఈ విడాకుల కేసులో నీ సతి గనక గెలిచిందంటే నా పరపతి నాకు విడాకులిచ్చి తిరపతి చెక్కేస్తుంది. పైగా, మరో విషయం!"
ఏమిటన్నట్లు చూశాడు భరత్.
"నువ్వు నాతొ పూర్తిగా నిజం చెప్పడం లేదు."
"అబద్దాలు చెప్పే అలవాటు నాకు లేదు."
"నువ్వు అబద్దాలు చెప్పవనడం లేదు. పూర్తి నిజాలు చెప్పలేదంటున్నాను"
"అంటే?"
"మీ పెళ్ళికి ముందు మీ ఇద్దరి మధ్యా సంబంధం వుందా?"
"అదేం ప్రశ్న!" అన్నాడు భరత్. మొహం పక్కకి తిప్పుకుంటూ.
"అబద్దాలు చెప్పన్నావు. నిజం చెప్పు మరి!"
"దీనికి జవాబు చెప్పడం నాకు ఇష్టం లేదు"
"ఎందుకని? నువ్వు తొందరపడి ఆ అమ్మాయిని బలవంతం చేసి లొంగదిసుకున్నావు. కాస్త ఏకాంతం దొరకగానే అమానుషంగా అనుభవించావు. ఇది అందరికి తెలిసిపోతే నీతి మంతుడు అని నీకు వున్న కీర్తి పోతుందేమో అని హడాలిపోతున్నావ్! యామ్ ఐ రైట్?"
త్రివ్రంగా చూశాడు భరత్.
"నేను అంత నిచుణ్ణి కాను. ఆ అమ్మాయి తొందరపాటు వల్ల మేమిద్దరం ఒకటై పోయాం!"
రమణారావు నవ్వాడు. అతని అస్త్రం పనిచేసింది. కోపం తెప్పించి నిజం కక్కించాడు.
"అప్పుడు సుదీర నీతో తృప్తి పడిందా?"
ఆ సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు భరత్.
అరమూతపడిన కళ్ళతో, అస్పష్టంగా వున్న గొంతుతో కలవరిస్తున్నట్లు సుదీర అనడం గుర్తొచ్చింది.
"మిమ్మల్ని మించిన మగాడు ఉండడు, వుండబోడు'
"అవును" అన్నాడు భరత్, రమణారావుతో.
'మరి ఇది ముందరే చెబితే ఎంత బాగుండేదయ్యా బాబూ! ఇది మనకు మంచి స్ట్రాంగ్ పాయింట్ కదా!"
"నో! ఇది కోర్టులో చెప్పడానికి వీల్లేదు.
"ఎందుకని"
"ఆ అమ్మాయి తొందరపడి పెళ్ళికి ముందే కాలు జారిందన్న చెడ్డపేరు వస్తుంది.
"చెప్పకపోతే నపుంసకడివని నీ మీద ముద్ర పడిపోతుంది."
"నాకేమయినా ఫర్వాలేదు. కానీ, సుదీరకి మాత్రం చెడ్డపేరు రాకూడదు. రమణారావుగారూ! దయచేసి ఈ కేసు మనకి అనుకూలంగా అయ్యేటట్లు చూడండి! సుదీర నా ప్రాణం! తనని వదులుకోలేను నేను."
తదేకంగా భరత్ వైపు చూస్తూ ఉండిపోయాడు రమణారావు. అతడ్ని చూస్తుంటే, అతని మాటలు వింటుంటే స్వాతంత్రం వచ్చాక తను మరిచిపోయిన విలువలూ, వదిలేసినా నీతి , సంస్కారం, సహనం, త్యాగం లాంటి లక్షణాలు అన్ని గుర్తు వచ్చాయి.
ఇవన్ని పట్టుకుని పాకులాడుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారన్న మాట.
అతనికి భరత్ తండ్రి సదాశివరావుగారు గుర్తుచ్చారు. దేశం కోసం ఆయన త్యాగాలు గుర్తొచ్చాయి. అయన లాంటి దేశభక్తులు మరెందరో గుర్తొచ్చారు. వాళ్ళని చూసి తమలాంటి వాళ్ళెందరో స్వాతంత్ర సమరంలోకి దూకడం గుర్తొచ్చింది.
ఏరి! వారేరి?"
చనిపోయివారు పోగా, మిగిలిన వారు వృద్దులై, ఆశక్తులై, అనాసక్తులై జీవచ్చవాలలాగా ఉన్నారా?
ఒకప్పుడు దేశం కోసం ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకున్న తనలాంటి వాళ్ళు ఇప్పుడు మారిన పరిస్థితులతో రాజి పడిపోయి దేశాన్ని దోచుకోవడంలో మునిగి ఉన్నారా? అప్పుడు వేటకుక్కల లాగా తెల్ల వాళ్ళని తరిమి తరిమి కొట్టిన తామే ఇప్పుడు సాటి నల్లవాళ్ళనే పందికొక్కుల లాగా పిక్కు తింటున్నారా?
నేరస్థుడిలాగా ఫీలయ్యాడు ఆయన.
"చిన్నవాడివయినా నువ్వు చాలా గొప్పవాడివి భరత్!" అన్నాడు నిజాయితీగా. "నిజం చెబుతున్నాను. ఈ కేసులో బలం లేదు. ఉన్న కాస్త బలాన్ని బ;బలవంతంగా దాచి పెడుతున్నావు నువ్వు! ఆడపిల్లని అల్లరి [పెట్టె ప్రశ్నలు అడగవద్దంటున్నావు. నా చేతులు, కాళ్ళు కట్టేసి శత్రువు ముందు పడేసి, యుద్ధం చెయ్యమన్నట్లు ఉంది ఇది!
కానీ, భరత్, ఇది ధర్మ యుద్ధం కాబట్టి, మనస్పూర్తిగా చేస్తాను. ధర్మం కోసం చేసే యుద్దంలో ఓడినా కూడా గెలిచినట్టే లెక్క!"
మర్నాడు కేసులో-
లాయరు రమణారావు చెప్పడం మొదలెట్టాడు.
"యువరానర్! జరిగిన దంతా టూకీగా చెప్పాలంటే, శ్రీమతి సుదీర భరత్ ను తన ఇష్టం మీదే వివాహం చేసుకుంది. హనీమూన్ కి వెళ్ళి నెల రోజుల పాటు హాయిగా ఇండియా అంతా తిరిగి ఎన్ జాయ్ చేసి వచ్చారు ఇద్దరూ.
"అప్పుడు మొదలయ్యాయి కుటుంబ కలహాలు. రైతుల మీద తన మామగారు చేస్తున్న దౌర్జన్యానికి అడ్డూపడ్డాడు భరత్. ఆ వైరంతో విడాకులకి పిటిషన్ పెట్టింది సుదీర.
"యువరానర్! ఇది కేవలం వ్యక్తిగత కక్షలవల్లా, కుటుంబకలహాలవల్లా జరుగుతున్న వ్యాజ్యమే గానీ, మరేమీ కాదు.
"వాది నా క్లయింటు మీద దుర్భరమయిన, దుస్సహమయిన అపవాదు వేస్తున్నది. ఈ విషయంలో నా క్లయింటు ఏ విధమయిన మెడికల్ ఎగ్జామినేషన్ కయినా తయారుగానే ఉన్నాడు. వైద్య పరీక్షలో అతను నూటికి రెండొందల పాళ్ళు మగాడే అని తేలడం ఖాయం!
"మెడికల్ ఎగ్జామినేషన్ జరిపించమని కోర్టు వారిని ప్రార్ధిస్తున్నాను."
-----------
రెండు రోజుల తరువాత-
డిఫెన్సు లాయరు రమణారావు లేచి నిల్చుని గొంతు సవరించుకున్నాడు.
"కోర్టు వారు అనుమతిస్తే గవర్నమెంటు ఫిజిషియన్ డాక్టరు మూర్తిగారిని కొన్ని ప్రశ్నలడుగుతాను.:
"ప్రొసీడ్!" అన్నారు జడ్జీగారు.