గవర్నమెంటు ఫిజిషియన్ డాక్టర్ మూర్తి అప్పటికే బోను ఎక్కి నిలబడి వున్నాడు.
"డాక్టరు మూర్తి! మీరు శ్రీ భరత్ ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు. అవునా."
"అవును"
"ఏ సందర్భంలో?"
"అతనిలో పుంసత్వం వుందా లేదా అని నిర్ణయించడానికి."
"అందుకు ఏమేమి పరిక్షలు చేశారో వివరించగలరా?"
"ముందుగా స్పెర్మ టెస్ట్ చేశాను" అంటూ సాంకేతిక పదాలతో, తను చేసిన పరిక్షలు విశదికరించాడు డాక్టర్ మూర్తి.
"దానివల్ల ఏం తేలింది?"
"శ్రీ భరత్ ఇంద్రియంలో లోపం ఏమి లేదు. అతను పిల్లలని కనడానికి సమర్దుడే. అతని మగతనం గురించి శంకించవలసిన పని లేదు."
"దట్సాల్ డాక్టర్! థాంక్యూ వెరిమచ్!"
మూర్తి బోను దిగిపోయాడు.
రమణారావు విజయగర్వంతో భరత్ వైపు చూసి తరవాత జడ్జి వైపు తిరిగాడు.
"యువర్ అనర్! డాక్టర్ మూర్తి గారి మెడికల్ రిపోర్టు విన్నారు. భరత్ మొగతనం గురించి అనుమానించవలసిన అవసరం ఏమి లేదన్నారు డాక్టరు.
దీని మూలంగా తెలుస్తుంది ఏమిటంటే, వాది అయిన శ్రీమతి సుదీర ఆమె తండ్రి ప్రోద్బలంతో, నా క్లయింటు శ్రీ భరత్ మీద హినాతి హినమయిన అభాండం వేసింది. పవిత్రమైన వివాహబంధం తెగతెంపులు చేసుకోవాలని చూసింది.
యువర్ అనర్! నా క్లయింటు శ్రీ భరత్ కోటికి పడగ ఎత్తిన ధనవంతుడు కాకపోయినా, కూటికి గతిలేని దరిద్రుడు మాత్రం కాదు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న కళాకారుడు నా క్లయింటు. శ్రీమతి సుదీర తన తండ్రి దుర్బోదలవల్ల చేసిన దుందుడుకు పనితో సమాజంలో నా క్లయింటు పేరు ప్రతిష్టలకి తీరని నష్టం కలుగుతుంది. ఈ నష్టాన్ని ఎంత డబ్బు ఇచ్చినా పూడ్చలేము యువర్ అనర్! కళకు వెలకట్టే షరాబు ఇంతవరకూ పుట్టలేదు. అయినా, నా క్లయింటు తనకు జరిగిన పరువు నష్టానికి బదులుగా, శ్రీమతి సుదీరను ఈ పనికి ప్రోత్సహించిన శ్రీ రత్నాకరరావు దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు ఇప్పించమని కోరుతున్నాడు. పరువు నష్టం దావాకి పేపర్లు సిద్దంగా వున్నాయి. శ్రీ రాత్నాకరరావే శ్రీమతి సుదీరని విడాకులకు పురి గోల్పడని నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాలు వున్నాయి. తగిన సమయంలో వాటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది.
"డాక్టరు రిపోర్టు ఆధారంగా, శ్రీమతి సుదీర పెట్టుకున్న విడాకుల అర్జీ కొట్టి వెయ్యమని నేను ప్రత్యేకంగా విన్నవించవలసిన అవసరం లేదనుకుంటాను."
న్యూట్రాన్ బాంబు తన నెత్తిమీద పడినట్లు బెదిరిపోయింది సుదీర. ఉపీరందనట్లు ఫీలవుతూ సారధి వైపు చూసింది.
అతను కూడా, అనుకోని ఈ పరిణామానికి నిశ్చేష్టుడై కూర్చుని ఉన్నాడు.
----------
"ఎందుకలా చేశారు రమణారావుగారూ? నాకు డబ్బు ఎందుకు? పరువునష్టం దావా వెయ్యొద్దు మనం?" అన్నాడు భరత్, ఆ రోజు సాయంత్రం.
"నీకు తెలియదు భరత్. మనం ఆత్మరక్షణ కోసం ప్రయత్నించినట్లు కనబడకూడదు. ఎదురు దాడి చేస్తున్నట్లు అనిపించాలి. అప్పుడే వాళ్ళు అదుపులో ఉంటారు. నామీద భరోసా వుంచు. నువ్వు నిశ్చింతగా ఉండు."
అయిష్టంగానే ఒప్పుకున్నాడు భరత్.
"ఏడ్చినట్లుంది, నీ ప్రయోజకత్వం! పొద్దున పిటిషన్ పడేస్తే సాయంత్రానికి డైవోర్సు గ్రాంటయిపోతుంది అన్నంత ఈజీగా చెప్పావు. ఇప్పుడు మన పికెల మీదికి డేఫేమేషన్ సూట్ తీసుకొచ్చావు! ఎలాగ ఇప్పుడు? అంది సుదీర మండిపడుతూ. సారధి నోరు తెరవకుండానే ఆమె తిట్లు తింటున్నాడు.
పెద్ద చుట్ట నోట్లో పెట్టుకుని గుప్పు గుప్పు మని పొగ వదులుతూ, అసహనంగా పచార్లు చేస్తున్నాడు రత్నాకరరావు. సీత సిరియాస్ గా మొహం పెట్టుకుని ఆలోచిస్తుంది.
చటుక్కున సారధి ముందు ఆగాడు రత్నాకరరావు "ఎందుకిలా అయింది! నాకు గుర్తున్నంత వరకూ ఏ కేసులో కూడా నువ్వు ఓడిపోలేదు."
"అవును సర్! నేను చేపట్టిన కేసు ఏది చెయ్యి జరిపోలేదు. పోదు కూడా!" అని ఆప్రయత్నంగా సుదీర వైపు చూశాడు సారధి. "అప్పుడే ఏమి ముంచుకు పోలేదు సర్! ట్రంప్ కార్డ్ మన దగ్గరే వుంది."
నీటిలో మునిగిపోయి , ఏట్లో కొట్టుకుపోతున్న వాడికి దుంగ ఒకటి ఆసరాగా దొరికినట్లయింది రత్నాకరరావుకి. తెరిపిన పడ్డట్లు చూశాడు.
"చెప్పు" అంది సీత.
సారధి ఒక్కక్క మాటా తూచి తూచి మాట్లాడుతూ, తను ప్లాను చెప్పడం మొదలెట్టాడు. అతను చెప్పడం ముగించగానే కోపంగా లేచి నిలబడింది సుదీర. "నో!" అంది గట్టిగా. నోన్నోన్నో! నేను దీనికి ఒప్పుకోను! నెవర్."
రత్నాకరరావు మండిపడ్డాడు.
సుదీరా! నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను. నీకేది కావాలంటే అది తెచ్చి ఇచ్చాను. చివరికి కాళ్ళకి గజ్జెలు కట్టుకుని గంతులేసేవాడు మొగుడుగా కావాలంటే ఇష్టం లేకపోయినా వాణ్ణి ఇచ్చి నీకు పెళ్ళి చేశాను. నీ మొగుడు మగాడే కాదని తేలిపోయింది. ఈ అడి పాడే ఆడంగి వాడి పరువు యాభై లక్షలా! వాడి దగ్గర ఏదో సాక్ష్యం ఉండి ఏడిసిందంటున్నాడు! మన గ్రహచారం బాగుండక వాడు కేసు గెలిచాడంటే, వాడి మొహాన మనం డబ్బు కొట్టవలసివస్తే, ఎంత నష్టం! ఇంత డబ్బు జమ చెయ్యడానికి నేను జన్మంతా శ్రమపడ్డానమ్మా! ఎన్నో తప్పుడు పనులు చేశాను. ఒక గాడిదల మంద తినేంత గడ్డి నే నొక్కడినే తిన్నాను తల్లీ! ఇదంతా ఎవరి కోసం? నికోసమనే అమ్మడూ! యాభై పైసల విలువ చెయ్యని మనిషికి యాభై లక్షలుట. యాభై లక్షలు!"
"డాడ్......" అనబోయింది సుదీర.
"నువ్వింకేం మాట్లాడకు!" అంది సీత ఖచ్చితంగా.
విసురుగా అక్కడినుంచి వెళ్ళిపోయింది సుదీర. చీర అయినా మార్చుకోకుండా కార్లో కూర్చుని స్టార్ట్ చేసింది.
----------
అరుగు మీద కూర్చుని మోకాళ్ళలో తల పెట్టుకుని అలోచిన్స్తున్న భరత్ , చీర రెపరెపలు విని తల ఎత్తి చూశాడు.
ఎదురుగా సుదీర నిల్చుని ఉంది. అలసిపోయినట్లు ఉంది తన మొహం. ఆమె వదనంలో ఎప్పుడూ మెదిలే అహంభావానికి బదులుగా ఆందోళన కనబడుతోంది. నమ్రతగా కొంగు తల మీద కప్పుకుని, నేల చూపులు చూస్తూ నిలబడి ఉంది తను.
అతనికి ఏం మాట్లాడాలో తోచలేదు.
"కూర్చో!" అన్నాడు. తను లేచి నిలబడుతూ.
"నన్ను క్షమించండి! ఐ యామ్ సారీ!" అంది సుదీర వినినినబదకుండా.
భరత్ ఏమి జవాబు ఇవ్వలేదు.
ఆ సారధి గాడు....బాస్టర్డ్........వాడి మాటలు విని నేను డైవోర్సు అప్లయ్ చేశాను. నేను చాలా తప్పే చేశాను. క్షమించడానికి వీలవుతుందా?" అంది జాలిగా.
ఎదుటి మనిషి బాధ పడుతూ ఉంటే బిగుసుకుపోయి ఉండడం భరత్ కి చేతకాదు.
"ఫరవాలేదు! బాధ పడకు!" అన్నాడు ముక్తసరిగా.
సుదీర విశాల నయనాలు సజలమయ్యాయి. "పదండి! మన ఇంటికి వెళ్ళిపోదాం!" అంది దుఖాన్ని ఆపుకుంటూ.
భారతి బయటికి వచ్చింది.
"ఏవండి! బాగున్నారా?" అంది. ఆమె గొంతులో పలకరింపు లేదు. ఏహ్యభావం ధ్వనిస్తోంది.
"మీ అందరికి క్షమార్పణ చెప్పుకోవాలని వచ్చాను భారతీ! చెప్పుడు మాటలు విని తప్పుగా ప్రవర్తించాను నేను."
మాట్లాడకుండా ఉండిపోయింది భారతి. తనది భరత్ లా మరి నవనీతం లాంటి మనసు కాదు. క్షణాల్లో ద్రవించి పోవడానికి.
ఈజీ చెయిర్లో పడుకుని ఉన్న సదాశివరావుగారు కష్టం మీద మాట్లాడుతూ "కులాసాగా ఉన్నావా అమ్మా?" అని పలకరించారు సుదీరని. ఆమెని చూడగానే అయన మొహంలోకి చాలా కాంతి వచ్చింది.
"ఆయన్ని నాతో రమ్మని చెప్పండి మావయ్యగారు!" అంది సుదీర ప్రాదేయపుర్వకంగా.
"వెళ్ళు భరత్! కలకంఠీ కంట కన్నిరోలికిన సిరి ఇంట నుండ నొల్లదు" అన్నారు చిన్న చిన్న చికాకులు వస్తూనే ఉంటాయి. సర్దుకు పోవాలి నాన్నా" అన్నారాయన.
"భారతి మౌనంగా లోపలికి వెళ్ళి భరత్ సూట్ కేస్ ని తెచ్చి కారులో పెట్టింది.
సంకోచంగా కారెక్కాడు భరత్.
వికసించిన మొహంతో డ్రైవింగ్ సీట్లో కూర్చుంది సుదీర.
------------
ఆ రాత్రి సుదీర బెడ్ రూమ్ రెండో శోభనం కోసం అలంకరించిన గదిలా వుంది. పూలజల్లు కురిసినట్లు పరుపుమీద మల్లెలు, జల్లి ఉన్నాయి. తుమ్మెదలా ఝుంకారం చేస్తున్నది ఎయిర్ కండిషనర్. వెన్నెలలా ఉన్న కాంతిని రూమ్ అంతా పరుస్తోంది ట్యూబ్ లైటు.