"ఏం? ఎందుకని?"
"లా ఒప్పుకోదు."
"ఏమంటుంది లా?"
"హిందూ మారేజ్ యాక్ట్ 1955 చాప్టర్ నాలుగు - సెక్షన్ 14 ప్రకారం పెళ్ళి జరిగిన ఒక సంవత్సరం లోపల డైవోర్సు పిటిషన్ ని కోర్టువారు స్వేకరించడానికి లేదు."
దిగాలు పడిపోయింది సుదీర. తర్వాత తేరుకుని, "వాట్ నాన్సెన్స్! ప్రతి రూలుకి ఏదో ఒక రిలాక్షేషను ఉంటుంది అదేమిటో ఆలోచించు" అంది.
సారధి నవ్వాడు. "మీరన్నది నిజమే! వెంటనే విడాకులు దొరకని పక్షంలో ఫిర్యాదికి విపరీతమైన కష్టం కలుగుతుందని కానీ, ప్రతివాది దుస్సహమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడని గానీ, కోర్టుకి అర్జీ పెట్టుకుంటే వారు పరిశీలించి ఒక సంవత్సరం లోపలే పిటిషన్ ని అంగికరించవచ్చు. అయితే, అంత బలమైన కారణాలేమిటో మనం చెప్పాలి. అవేమిటో వివరించగలిగితే..........." అతని పెదిమలు నవ్వకుండా సరళ రేఖలా ఉన్నాయి. అతని మనసు మాత్రం పగలబడి నవ్వుతోంది.
కాసేపు మౌనంగా ఉండిపోయింది సుదీర. "ఏమేమి కారణాల మీద విడాకులు తీసుకోవచ్చు?"
తడుముకోకుండా గబగబ చెప్పడం మొదలు పెట్టాడు సారధి.
"ద హిందూ మారేజ్ యాక్ట్ 1955 చాప్టర్ నాలుగు , సెక్షన్ 13 క్రింద భార్య భర్తల్లో ఎవరినా సరే, తమ భాగస్వామి-
1) వివాహం జరిగిన తర్వాత తమ భాగస్వామితో గాక మరోక వ్యక్తితో ఇష్టపుర్వకంగా సంభోగించినా
1 ఎ) వివాహం జరిగిన తర్వాత తన భాగస్వామిని క్రూరంగా హింసించినా,
1 బి) అర్జి పెట్టుకున్న సమయానికి వరసగా రెండు సంవత్సరాలకి తక్కువ కాకుండా తన భాగస్వామిని వదిలేసి దూరంగా ఉన్నా,
2) మరొక మతంలోకి మారి, హిందువుగా చెలామణి కాకపోయినా,
౩) చికిత్సకు లొంగని మానసిక వ్యాధితో బాధపడుతున్నా, విడవకుండా లేదా, తరచుగా వస్తున్న మానసిక రుగ్మతతో బాధ పడుతూ ఉండగా భాగస్వామి అతనితో కాపురం చెయ్యలేని స్థితిలో ఉన్నా,
4) తీవ్రమైన అంటువ్యాధి రకానికి చెందినా కుష్టు రోగంతో బాధపడుతున్నా,
5) అంటువ్యాధి కోవకు చెందిన సుఖ వ్యాధులతో బాధ పడుతున్నా,
6) సన్యాసం స్వీకరించి ప్రపంచాన్ని త్యజించినా,
7) ఏడు సంవత్సరాల పాటు దగ్గర బంధువులతో కూడా ఆచూకి తెలియకుండా బ్రతికి వున్నాడో లేదో అంతుబట్టక పోయినా, కోర్టు వారు విచారించి విడాకులు అనుమతిస్తారు.
"అంతేనా? వేరే ఇంకే కారణం చెల్లదా?" అంది సుదీర ఆదుర్దాగా.
"చెల్లదు. ఆ వేరే కారణం ఏమిటో చెప్పలేదు మీరు."
సుదీర చెంపలు ఎర్రబడ్డాయి. కొంచెం సంకోచించి, "నపుంసకత్వం" అంది.
మదిలో మంగళ వాద్యాలు మోగినట్లయింది సారధికి. ఐ.సీ. నపుంసకత్వమా? అంటే భర్త వలన సుఖం దొరకడం లేదన్నమాట ఈ అందగత్తెకు? డైవోర్స్ ఇప్పించాక ఈ వేడి మీద ఉన్న బంగారు తీగెను తన వేలి చుట్టూ తిప్పుకోవడం ఎంత సేపు?
"యూ లక్కి బగర్!" అని తన భుజం తానే తట్టుకున్నాడు మనసులోనే.
"ఆ కారణం మీద అయితే విడాకులు తీసుకోనక్కర్లేదు."
"మరి?"
"అసలు పెళ్ళే రద్దు అయినట్లు కోర్టు చేత తీర్పు ఇప్పించవచ్చు."
"వివరంగా చెప్పు."
"నల్లిటి ఆఫ్ మేరేజెస్ లో వాయిడబుల్ మేరేజ్ అని ఉంది. భాగస్వామి నపుంసకత్వం వల్ల పెళ్ళయ్యాక శారీరకంగా ఒకటై సంసారం సుఖం అనుభవించకపొతే, ఆ వివాహాన్ని రద్దు చెయ్యమని పిటిషన్ పెట్టుకోవచ్చు. ఇంకా చాలా కారణాలున్నాయి. కానీ, ఇది చాలు మనకి. మిమ్మల్ని పెళ్ళయ్యాక ఒకసారి కూడా..........మీరు దగ్గరవలేదా?"
తల వంచుకుంది సుదీర. "ఉహూ!"
"ఒక్కసారి కూడా?"
తల అడ్డంగా ఆడించింది.
"ఫైన్! మనకి ఎక్సలెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి. కానీ, ఒక చిన్న ప్రాబ్లెం ఉంది."
"ఏమిటది?"
"విడాకులు అందులోను భర్త నపుంసకత్వం కారణంగా, అంటే ఎదుటి పక్షం లాయరు ఎన్నెన్నో సున్నితమైన విషయాల గురించి లోతుగా ప్రశ్నలడుగుతారు. మీరు తడబడకుండా, సంకోచించకుండా జవాబులు చెప్పగలగాలి."
ఒక్క గుటక వేసింది సుదీర. "ఏం అడుగుతారు?"
ఒక్క క్షణం సేపు సారధి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఈ అమ్మాయి తన దగ్గర సిగ్గు వదిలేసేటట్లు చేసుకుంటాడు ఇప్పుడు!
"మీరు తెలుసుకోవలసిన కొన్ని నగ్న సత్యాలు చెబుతాను" అంటూ అతను ఎదుటి పక్షం లాయరు అడగబోయే ప్రశ్నలూ, వాటికి సుదీర చెప్పవలసిన జవాబులూ రిహార్సల్ చేయించడం మొదలెట్టాడు.
"మీ భర్త మిమ్మల్ని సుఖ పెట్టలేకపోయాడంటూన్నారు అంటే ఏమిటి? అసలు అంగ ప్రవేశమే జరగలేదా? శీఘ్ర స్థలనమా? మీకు భావప్రాప్తి కలగలేదా? మీకు త్వరగా భావ ప్రాప్తి కలగదా? మీరు సెక్సువల్ గా ఫ్రిజిడా? జడత్వం వుందా? అంగ నిర్మాణంలో వైకల్యం వుందా? భావప్రాప్తి అంటే ఏమిటి? మీకెలా తెలుసు? ఇది తృప్తికరంగా లేదని అన్నారంటే ఇంతకంటే తృప్తికరమైన అనుభవం వేరే వ్యక్తుల దగ్గర పొందారా? లేకపోతే ఎలా పోల్చి చెప్పగలుగుతున్నారు? మానసిక వ్యభిచారం , వాయోరిజం, ఫెటిషెస్, నార్సిసీజమ్ - ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?...........
ఒక ఆడపిల్లని హడలగొట్టడానికి, అందరి ముందూ తలవంచుకునేటట్లు చెయ్యడానికి, అన్నిటి మీదా ప్రశ్నలు! లోతుగా తెరచి తెరచి చూస్తూ ప్రశ్నలూ, వాటికీ చెప్పవలసిన జవాబులు కూడా నేర్పించాడు సారధి. అతని మనసు వుప్పొంగిపోతోంది. సుదీరతో ఇంత సన్నిహితమైన సంబాషణ జరిపే అవకాశం వస్తుందని కలలో కూడా ఉహించలేదు తను!
వింటున్న సుదీర మొహం మొదట్లో ఎరుపు రంగుకి తిరిగింది. అతి గోప్యమైన ఈ విషయాలన్నీ కోర్టులో అడుగుతారా? అందరూ చెవులప్పగించి వింటుండగా తను నోరు తెరచి చెప్పాలా? అవన్నీ రికార్డు చేస్తారా?
ఈ ప్రశ్నల మీద మరికొన్ని ప్రశ్నలూ గుచ్చి గుచ్చి అడుగుతాడా డిఫెన్సు లాయరు?
కాసేపు సుదీరకి భయం వేసింది. అసలు ఈ విడాకుల ప్రసక్తే మానేద్దేమా అనిపించింది.
ఆమెలో జరుగుతున్న మానసిక సంఘర్షణని గమనించాడు సారధి. ఆ వేడిని చల్లారి పోనివ్వకూడదని నిశ్చయించుకున్నాడు.
ఇనుము వేడిగా ఉన్నప్పుడే సుత్తి దెబ్బ వేయాలి.
"మీకు ఒక్క ఆప్షన్ వుంది. చాలామంది మధ్య తరగతి ఆడపిల్లల్లాగా మీ కర్మని మీరు నిందించుకుంటూ ఇంకో యాబై ఏల్లో వందేళ్ళ ఆ నపుంసకుడితో కాపరం చెయ్యొచ్చు. మీకు ఏది తక్కువ కష్టమో, ఏది ఎక్కువ ఇష్టమో తేల్చుకోండి."
దెబ్బ సరిగ్గా తూకంగానే పడింది.
అహంభావంగా తల ఆడించింది సుదీర.
"నేను డైవోర్సు కి అప్లయ్ చేస్తున్నాను."
సారధి నవ్విన నవ్వు అతని పెదిమలు దాకా రానే లేదు.
ఆ రోజు సాయంత్రం దాకా సుదీరని ఎదుటి పక్షం లాయరు అడగబోయే ప్రశ్నలూ , వాటికి సుదీర చెప్పవలసిన జవాబులూ వివరిస్తూనే వున్నాడు సారధి.
ఆ విధంగా ఆ అమ్మాయి తన దగ్గర సగం సిగ్గు వదిలేసేటట్లు చేసుకోగలిగాడు. ప్రస్తుతానికి అంతకంటే ఎక్కువ ఆశించలేదు అతను.
అతను గోతికాడ కాపు వేసిన నక్కలాంటి వాడు.
నక్కలకి సహనం ఎక్కువ ఉండాలి!
-------------
విడాకుల కేసులు ఓపెన్ కోర్టులో అందరి ముందూ విచారించారు. 'ఇన్ కెమెరా' అన్న పద్దతి ఒకటి వుంది. అంటే జడ్జి, కోర్టు సిబ్బంది, కేసుతో సంబంధం వున్న వ్యక్తులూ, ఇరుపక్షాల ప్లీడర్లు మాత్రమే హాజరవుతారు. మిగతా వారెవ్వరిని అక్కడ వుండడానికి అనుమతించరు. ఇది దాదాపు రహస్య విచారణ లాంటిదని చెప్పవచ్చు.
అది చూసి కొద్దిగా తేరుకుంది సుదీర. అందరి ముందు ఎంత అసహ్యమైన ప్రశ్నలు అడుగుతారో అని భయపడుతోంది తను.
'ఇన్ కెమెరా' విచారణ అయితే కొంతలో కొంత మంచిది.
లేచి, గొంతు సవరించుకుని, తన కేసుని వివరించడం మొదలెట్టాడు సారధి. శ్రీమతి సుదీర భర్త భరత్ నపుంసకుడయి నందు వల్ల, పెళ్ళయిన తరవాత వాళ్ళిద్దరూ శరీరరకంగా ఒకటవలేదని, అందుచేత ఈ వివాహం చెల్లదని, దాన్ని రద్దు చేయాలని కోర్టు వారిని కోరాడు.