రెండుచేతులూ ఆమె భుజంమీద వేశాడు. ఆమె ఇంకా కదల్లేదు.
మొహం ముందుకు వంచాడు. ఒక్కక్షణం ప్రకృతి పరాకులో పడినట్లు స్తబ్దుగా వుండిపోయింది.
పెదిమలు భగ్గుమన్నాయి.
చిన్మయి త్రుళ్ళిపడినట్టయి యీ లోకంలోకి వచ్చింది.
వెనక్కి తిరిగి అతని చెంపమీద చెళ్ళుమని కొట్టింది.
చెంప కందిపోవడంతోబాటు కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.
"మూర్ఖుడా! ఏమిటిది? కల్మషం లేకుండా స్నేహం చెయ్యడమంటే యిదా? నిర్మలత్వం, ఆరాధన అంటే యిదా? ఎవరనుకున్నావు నన్ను? పరపురుషుడి భార్యనని చెప్పాను. ఓ చిన్నారికి తల్లినని చెప్పాను. వినిపించుకోవేం? ఇది స్నేహమా? అభిరుచితో కూడిన ఆరాధనా? నువ్వు... నువ్వు... యూ ప్లీజ్ గెటవుట్."
ఒక్కక్షణం ప్రళయాన్ని దాచుకుంటోన్న నిశ్శబ్దం...
అతను తలవంచుకుని బయటకు వెళ్లిపోయాడు.
* * *
ఒళ్ళంతా మంటలు, మనసులో వేదనల సెగలు.
ప్రక్కమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది.
ఎందుకిలా జరుగుతోంది? తనకేమి తక్కువైందని? తనేమి ఆశించిందని? తాను దేనికోసం ప్రలోభపడుతుందని?
సరళరేఖగా సాగవలసిన జీవితం ఎందుకు వంకర్లు తిరగడనికి ప్రయత్నిస్తోంది?
తనెక్కడ అన్యాయానికి గురిచేయబడింది?
తనకేదో లోటు జరుగుతోందనుకోవడం ఆత్మవంచన కాదా?
వినాశనాన్ని ఆహ్వానిస్తున్న తన అవివేకం మన్నించతగునా? నో...
ఇది క్షమించరాని నేరం.
పిచ్చిపట్టినదానిలా జుట్టు పీకేసుకుంది. తల మంచానికేసి బాదుకుంది.
అయినా మంటలు చల్లారలేదు. గుండెను నొక్కేస్తున్న బరువు భరించలేనంత కష్టంగా వుంది.
కంపోజ్!
మెల్లగాలేచి శక్తిలేనిదానిలా ఒక్కొక్క అడుగేసుకుంటూ వాడ్రోబ్ దగ్గరకెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంది.
ఒకటి... రెండు... మూడు... నాలుగు... అయిదు...
సాయంత్రం కిరణ్మయి స్కూల్ నుండి ఇంటికి వచ్చి తల్లిరూపం చూసి భయపడింది.
కూతుర్నిచూసి ప్రక్కమీదనుండి లేద్దామనుకుందిగాని వంట్లో శక్తి చాలలేదు.
"మమ్మీ! మమ్మీ" అని కిరణ్మయి తల్లిభుజం పట్టుకుని కుదిపింది.
"ఊ..."
"లే మమ్మీ నేను స్కూల్ నుండి వచ్చాను మమ్మీ."
లేవడానికి మళ్ళీ ప్రయత్నించి విఫలురాలైంది."
"కిరణ్" అంది ఆమె కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
"నాకు ఒంట్లో బాగాలేదమ్మా ఫ్రిజ్ లో పాలుంటాయి. తీసుకొని త్రాగేస్తావా?"
"ఒంట్లో బాగాలేదా మమ్మీ."
"అవునమ్మా."
"నీకు బాగాలేపోతే నేను పాలు త్రాగను మమ్మీ."
"ప్లీజ్ త్రాగమ్మా!"
కిరణ్మయి తల్లివంక చూసి జాలిగా బుగ్గమీద ముద్దు పెట్టుకొని లోపలకెళ్ళి పోయింది.
* * *
సాయంత్రం కష్టంమీద లేచి కిరణ్మయికి కొంచెం అన్నం వండిపెట్టింది.
శరీరమంతా ఏమిటోలా వుందనిపించింది. ఓ వైపు మగత. మరోవైపు గుండె రాపిడి...
బాత్ రూమ్ లోకి వెళ్లి అరగంటసేపు షవర్ క్రింద స్నానంచేసింది.
కిరణ్మయి నిద్రపోతోంది.
జుట్టు విరబోసుకుని అద్దంముందు నిలబడి తన రూపంకేసి వెర్రిగా చూసుకుంది.
తానో ఉన్మాదిని.
ఫ్యాన్ క్రింద నిలబడి జుట్టు తడి ఆరేదాకా తూలుతూ అటూ ఇటూ తిరిగింది.
బాహ్యస్మృతిలోకి వస్తున్నకొద్దీ మళ్ళీ ఎటో వెళ్లిపోవాలని వుంది.
కాంపోజ్!
చేతులు టాబ్లెట్స్ ని ఆతృతగా అందుకున్నాయి.
ఒకటి... రెండు... అయిదు...
సోఫామీద ఎప్పుడు వాలిపోయిందో తెలీదు.
బజర్ మ్రోగుతుంటే మెలకువ వచ్చి కళ్ళు విప్పి చూసింది. హాల్లో లైటు వెలుగుతూనే వుంది. వాల్ క్లాక్ లోని ముళ్ళు మసక మసగ్గా పన్నెండైనట్టు చూపిస్తున్నాయి.
ఆ అర్దరాత్రి... పూట... ఎ...వ...రు?"
బజర్ మళ్ళీ మ్రోగింది.
మెల్లిగా సోఫాలోనుండి లేచింది. జుట్టు ఇంకా విరబొయ్యబడి భుజాల మీదుగా ప్రక్కలకు వ్రాలివుంది. పమిట స్థానంలో లేదు.
"ఎ...వ...రు?" అంది తలుపుదగ్గర నిలబడి.
"నేను" బయటనుండి ఆనందమోహన్ గొంతు.
"మళ్ళీ..."
"ప్లీజ్! ఒక్కసారి తలుపు తియ్యి ఒక్కమాట చెప్పి వెళ్లిపోతాను."