అబ్బయ్యనాయుడు చివరికంటా వచ్చిన సిగరెట్ ను యాష్ ట్రేలో కుక్కి-
"శ్రీరాములూ..."
మొట్టమొదటిసారి పెదవి విప్పాడు అబ్బయ్యనాయుడు. ఆ గొంతు గంభీరంగా ఉంది.
"మీ మెంబర్సేమో... ఇలా వెర్రెత్తిపోతారు.... మీరేమో అలా కూల్ గా గర్జిస్తారు. ఎలాగండీ .....ఇలాగయితే...?" విసుగ్గా అన్నాడు శ్రీరాములు నాయుడు.
అబ్బయ్యనాయుడు తలతిప్పి అందరివేపూ చూశాడు.
చప్పుడు కాకుండా నవ్వాడు.
సిగార్ వెలిగించాడు.
"మైడియర్ ఫ్రెండ్స్.... ఇప్పుడేం జరిగిపోయింది... స్టే తీసేసారు...ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ పెట్టారు దానికో ఆఫీసరొచ్చాడు....ఐతే మీరెందుకలా వర్రీ అయిపోతున్నారో నాకేం అర్ధం కావడంలేదు" నెమ్మదిగా అన్నాడు అబ్బయ్య నాయుడు.
"అయ్యా.... తమకి పక్కలో బాంబు పడినా తొణక్కుండా, బెణక్కుండా వుండడం అలవాటైపోయింది. మీకు లక్షా తొంభయ్ వ్యాపారాలున్నాయి. ఈ వ్యాపారంలో మీరు గడించుకున్నది ఎప్పుడో గడించేసుకున్నారు. ఇప్పుడిప్పుడే మా కుంపట్లు మేం పెట్టుకుని మా నాటుసారా మేం కాసుకుంటున్నాం. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఏం చెయ్యమంటారో చెప్పండి" అడిగాడో కాంట్రాక్టరు.
అదే సమయంలో-
లోనికొచ్చాడు అబ్బయ్యనాయుడు పి.ఎ. హృషికేశ్... నేరుగా శ్రీరాములు నాయుడు వేపు నడిచాడు. అతని చెవిలో గుసగుసలాడాడు.
అబ్బయ్యనాయుడు హృషికేశ్ వేపు చూస్తున్నాడు శ్రీరాములు నాయుడు తలెత్తి అబ్బయ్యనాయుడి వైపు చూస్తూ...
"ఆ జోసఫ్ గాడ్ని మనవాళ్ళు కర్ణాటక బోర్డర్ లో పట్టుకున్నారట. తీసుకొచ్చారు" చెప్పాడు శ్రీరాములునాయుడు.
"జోసఫ్..." అబ్బయ్యనాయుడు లేచి నిలబడ్డాడు. తన సీటులోంచి లేచి విశాలమైన హాల్లోంచి బయటకొచ్చాడు. అతని వెనక శ్రీరాములు నాయుడున్నాడు.
* * * * *
విశాలమైన బిల్డింగ్ వెనక దాదాపు ఎకరం ప్రదేశం నిప్పుల కొలిమిలా వుంది.
నాలుగువేపులా సెక్యూరిటీ స్టాఫ్ చేతులలో రైఫిల్స్.... వరసగా సారా బట్టీలు... కొంతమంది నిప్పును ఎగదోస్తున్నారు.... మరికొంతమంది గడకర్రలతో ఊటని కలుపుతున్నారు.
ఇంకొంతమంది మరిగిన సారాను కిందకు దించుతున్నారు.
అక్కడ మొత్తం రెండువందల యాభైమంది మనుషులు తమ తమ పనుల్లో మునిగిపోయున్నారు.
కొంతమంది తయారయిపోయిన సారాని సీసాల్లోకి మారుస్తూ పక్కనే వున్న లారీల్లోకి ఎక్కిస్తున్నారు.
సారా సీసాల లోడ్ ను నింపుకున్న నేషనల్ పర్మిట్ లారీలన్నీ మరుక్షణం అక్కడ నుంచి మాయమైపోతున్నాయి.
సాధారణంగా-
అబ్బయ్యనాయుడు ఆ ప్రాంతానికి ఎప్పుడో తప్ప రాడు.
రావిచెట్టుకింద ఓ లారీ ఆగి ఉంది ఆ లారీ ముందు ఓ వ్యక్తిని, ఇద్దరు పట్టుకుని నించున్నారు.
ఇంకో ఇద్దరు వ్యక్తులు....అతని వేపు రైఫిల్స్ ను గురిపెట్టి చూస్తున్నారు.
ఇద్దరు వ్యక్తుల చేతుల్లో బందీగా నిల్చున్న వ్యక్తి జోసఫ్!
దూరం నుంచి అబ్బయ్యనాయుడు రాకను గమనించిన జోసఫ్ నిలువెల్లా వణికిపోయాడు.
అబ్బయ్యనాయుడు దగ్గరగా సమీపించడంతో, జోసఫ్ చేతుల్ని ఆ ఇద్దరూ వదిలేసారు.
"లోడ్ ని లారీతో సహా మాయం చేసి గుల్భర్గా దగ్గర అమ్మకానికి పెట్టాట్ట.... మనవాళ్ళు పట్టుకున్నారు"
శ్రీరాములు నాయుడు కంప్లయింట్ చేసాడు.
"సార్... సార్... తప్పు నా ఒక్కడిదే కాదు సర్. సూపర్ వైజర్ నాచేత ఆ తప్పు చేయించాడు సార్."
"లారీ లోడ్ కాస్టెంత..." సీరియస్ గా అడిగాడు అబ్బయ్యనాయుడు.
"దాదాపు అయిదు లక్షలుంటుంది బావా." చెప్పాడు శ్రీరాములు నాయుడు....
"ఫైవ్ లాక్స్ కోసం ఆశపడ్డావా..." చేతిలోని సిగార్ ని పక్కకు విసిరేస్తూ అన్నాడు అబ్బయ్యనాయుడు.
"లేదు...సార్. కూతురు పెళ్ళి....అర్జంటుగా యాభైవేలు....అవసరమొచ్చింది."
"ఫిఫ్టీ థౌజెండ్..." నవ్వాడు అబ్బయ్యనాయుడు.
"అయిదు లక్షల రూపాయల సరుకుని యాభైవేలకు అమ్మకానికి పెట్టావా? ఆ సూపర్ వైజర్ ఎక్కడున్నాడు?"
"వాడు... తప్పించుకున్నాడు బావా ఇద్దరూ కలిసే కుట్ర పన్నారు బావా." అన్నాడు శ్రీరాములునాయుడు.
"లేదు.... సార్... లేదు" వణికిపోతూ అబ్బయ్యనాయుడు కాళ్ళ మీద పడిపోయాడు జోసఫ్.
"కాళ్ళమీద పడే వాళ్ళంటే... నా కసహ్యం... లే... ఈ వ్యాపారంలో యాభైవేల కోసం కక్కుర్తి పడడంలో తప్పులేదు... లే..."
"ఏంటి బావా..." శ్రీరాములు నాయుడు ఆవేశంగా ముందుకెళ్ళబోయాడు.
అబ్బయ్యనాయుడు అడ్డుగా చెయ్యి పెట్టాడు.
జోసఫ్ లేచి నిలబడ్డాడు.
"మరెప్పుడూ చెయ్యను సార్..." ప్రాధేయపడుతున్నాడు.
"నో.... వీడి మాటలు నమ్మొద్దు... వీడిలా చెయ్యడం రెండోసారి..." శ్రీరాములు నాయుడన్నాడు.
అబ్బయ్యనాయుడు అడుగులేస్తూ, ముందుకెళ్ళి జోసఫ్ కళ్ళల్లోకి చూస్తూ-
"శ్రీరాములూ... జోసఫ్ ఇంటి ఎడ్రస్ తీసుకో....రేపుదయం లోపుగా యాభైవేలు వాళ్ళింట్లో వాళ్ళావిడకు అందజెయ్యి... అర్ధవైందా...."
"అలాగే" ఆశ్చర్యపోతూ అన్నాడు శ్రీరాములునాయుడు.
జోసఫ్ లో అంతవరకూ ఉన్న టెన్షన్ స్థానంలో రిలాక్స్ చోటు చేసుకుంది.
గాఢంగా నిట్టూర్పు విడిచి-
"సార్.... మీరు చేస్తున్న హెల్ప్ ని నేను మరిచిపోలేను సర్."
ఆ మాటకు నవ్వాడు అబ్బయ్యనాయుడు.
కూల్ గా పసరికలో పాకుతున్న కొండచిలువ పసిపిట్ట వేపు చూసి నవ్వినట్టుగా నవ్వాడు.
నవ్వి నవ్వి అలిసిపోయాడు అబ్బయ్యనాయుడు.
కల్లనుమ్చి ఉబికిన నీటిని తుడుచుకుని శ్రీరాములు నాయుడువైపు చూసాడు.
"డబ్బు కన్నా, విశ్వాసం గొప్పది జోసఫ్...అందుకే నాకు కుక్కలంటే ఇష్టం."
మళ్ళీ నవ్వాడు అబ్బయ్యనాయుడు.
ఆ నవ్వులోని వికృతత్వం అర్ధం కాలేదు జోసఫ్ కి.
దూరంగా నిలువెత్తు బాన, బానకింద మంటలు- బానవైపు మంటల వైపు చూసాడు అబ్బయ్యనాయుడు.