అబ్బయ్యనాయుడు, చూపుల్ని అర్ధం చేసుకున్న శ్రీరాములు నాయుడు మందస్మితం చేసాడు.
అబ్బయ్యనాయుడు వెనుదిరిగాడు.
మెట్లెక్కి వరండా మీద కొచ్చాడు- తలతిప్పి వెనక్కి చూసాడు.
శ్రీరాములునాయుడు సంజ్ఞ చెయ్యగానే-
ఇద్దరు వ్యక్తులు- జోసఫ్ ని పట్టుకున్నారు. ఒకడు కాళ్ళు, ఇంకొకడు చేతులు పట్టుకుని ముందుకు తీసికెళుతున్నారు.
అప్పుడర్ధమైంది జోసఫ్ కి.
స్వేద గ్రంధుల్లోంచి ఒక్కసారి నెత్తురు చిమ్మింది.
"సార్- సార్" భయోద్వేగ్నంగా అరుస్తున్నాడు.
ఆ ఆర్తనాదం భయంకరంగా ఉంది.
మూడుసార్లు గాల్లోకి ఊపి, జోనఫ్ ని పెనుకీలలపైన కుతకుత లాడుతున్న బానలోకి పడేటట్లుగా విసిరేసారు.
అంతవరకూ విన్పించిన అరుపులు ఒక్కసారిగా మాయమైపోయాయి.
అంతటా నిశ్శబ్దం....స్మశానం లాంటి నిశ్శబ్దం.
కన్పించని మానవ మృగాల వికటాట్టహాసాల నిశ్శబ్దం.
రిలీఫ్ గా సిగార్ వెలిగించాడు అబ్బయ్యనాయుడు. గబా గబా మెయిన్ బిల్డింగ్ లోకి అడుగులు వేసాడు.
నేరుగా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళాడు- సరుకునెలా తోలించాలో అన్న సందిగ్ధంలో ఉన్న కాంట్రాక్టర్ చిన్నారెడ్డి వైపు చూసాడు.
"నీ సరుకు మహారాష్ట్ర వెళ్ళాలి- అంతేకదా... మొత్తం ఎన్ని లారీలు" సీరియస్ గా ప్రశ్నించాడు అబ్బయ్యనాయుడు.
"మొత్తం పది లారీలు సార్."
ఒకే ఒక్క నిమిషం... సిగార్ ని పీల్చాడు. పక్కనే ఉన్న శ్రీరాములు నాయుడు వైపు చూసాడు.
"శతృఘ్న.....అంత 'టఫ్' ఆఫీసరా....బీహారులో మాఫియా ముఠాల్ని లొంగదీసుకున్నాడా ... చూద్దాం... అదీ చూద్దాం చిన్నారెడ్డీ... ఎంతమంది ఆఫీసర్లని మనం చూడలేదు... బెంబేలు పడకూడదయ్యా." అని శ్రీరాములు నాయుడు వైపు చూసాడు.
"హైద్రాబాద్ ఫోన్ చెయ్యమంటారా" వెంటనే అబ్బయ్యనాయుడు ఆలోచనని అర్ధం చేసుకున్న శ్రీరాములునాయుడు అన్నాడు.
చిరునవ్వు నవ్వాడు అబ్బయ్యనాయుడు శ్రీరాములు నాయుడు ఫోన్ వైపు నడిచాడు.
"చూడు చిన్నారెడ్డి- పది సరుకు లారీలతోపాటు ఇంకో పది ఖాళీ లారీల్ని పంపు మిగతా పని నేను చూసుకుంటాను."
హాల్లోంచి, పక్క రూమ్ లో కెళుతున్న అబ్బయ్యనాయుడు మెదడులో నిండిపోయిన వ్యక్తి శతృఘ్న!
అదే సమయంలో-
శతృఘ్న-
హైద్రాబాద్ లో సి.ఎమ్....త్రిభువనేశ్వరీదేవి రెసిడెన్స్ లో ఉన్నాడు.
* * * * *
సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి రెసిడెన్స్.
పార్టీ ప్రముఖులతో అధికారులు అనధికారులతోనూ హడావుడిగా ఉంది. కారులోంచి దిగిన చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ ని అందరూ 'విష్' చేస్తున్నారు.
అందరి దృష్టీ ఆయన వెనకున్న అపరిచిత వ్యక్తిమీదే వుంది.
గ్రే కలర్ ఫెమ్టు....లైట్ బ్లూ కలర్ షర్ట్.
విశాలమైన హాలు నిశ్శబ్దంగా ఉంది. విశాలమైన సోఫా మీద త్రిభువనేశ్వరీదేవి కూర్చొని వుంది.
ఠీవిగా నడుచుకుంటూ తన వేపు వస్తున్న శతృఘ్న వేపు సూటిగా చూసింది త్రిభువనేశ్వరీదేవి.
రాత్రి చాలాసేపు శతృఘ్న ఆలోచనలతోనే గడిపింది త్రిభువనేశ్వరీదేవి.
శత్ర... శత్రు- ఆ పేరుతో చాలా పరిచయం ఆమెకు- కానీ ఇసకలో ఇంకి పోతున్న నీళ్ళలాంటి జ్ఞాపకాల్ని తోసుకొని-
తన ముందుకొచ్చి సెల్యూట్ చేసి నిల్చున్న శతృఘ్నను చూసి తెప్పరిల్లింది త్రిభువనేశ్వరీదేవి.
శతృఘ్న పరిస్థితి కూడా అలాగే వుంది.
త్రిభువన... ఆ నాలుగు అక్షరాల్నీ ఆయన మరచిపోలేడు. హృదయం చుట్టూ నాలుగు గోడల్లా ఆ నాలుగు అక్షరాలు.
గోరింటాకు చేతులమీద జ్ఞాపకాల మెరుపు మరకలు.
నేరేడు పళ్ళకోసం, తెల్లవారకముందే పరుగెత్తిన మధురమైన క్షణాలు.
* * * * *
ఏటి గట్టుని తాకి అలలు ఒకదాన్నొకటి పెనవేసుకుని వెనక్కి వెళ్ళి పోతున్నాయ్.
"శత్రూ! పెద్దయ్యాక ఏం చేస్తావ్?" చిన్న పెదాల్ని చిత్రంగా తిప్పుతూ అడిగిన ప్రశ్న.
"నువ్వేం చేస్తావో చెప్పు?"
"నేనా! హెడ్ మాస్టర్ని అవుతా."
"మాస్టర్ వి అవుతావా! ఎందుకు?"
"అందర్నీ కొట్టొచ్చుగదా" ఆ మాటకు ఆ ఏడేళ్ళ పాప పెద్ద ఆరిందలా నవ్వింది. నవ్వి-
"నాకు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకుని వెళ్ళే వాళ్ళంటే ఇష్టం" నెమ్మదిగా అంది.
ఆలోచనల్లో పడ్డాడు ఆ కుర్రాడు.
"అయితే పెద్ద మిలట్రీ ఆఫీసర్నఉతా....యుద్దాలు చేస్తా."
"నువ్వేమో పిరికివాడివి....యుద్ధం చెయ్యాలంటే ధైర్యం కావాలి."
"నాకు ధైర్యముందిలే... నువ్వే పిరికిదానివి.... బల్లిని చూసి....మూడ్రోజులు జ్వరం తెచ్చుకున్నది నువ్వే" చిన్ననాటి శత్రు, చిన్నగా నవ్విన నవ్వు.
అవును....త్రిభువనకు, బల్లికి అసలు పడదు.
అకస్మాత్తుగా ఆ విషయం జ్ఞాపకానికొచ్చింది శతృఘ్నకు.
"హేపీ టు సీ యూ... మిస్టర్ శతృఘ్నా! ప్లీజ్ బీ సీటెడ్" ఆ గొంతులోని కాఠిన్యాన్ని మొట్టమొదటిసారి విన్నాడు శతృఘ్న.
ఈ త్రిభువన, ఆ త్రిభువన కాదు.... తన చిన్ననాటి త్రిభువన కాదు...తనతో కలిసిమెలిసి తిరిగిన త్రిభువనకాదు ఈ త్రిభువనేశ్వరి వేరు.
త్రిభువనేశ్వరికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శతృఘ్న.
సి.ఎమ్. చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ వేపు చూసింది.
వరదరాజన్ గొంతు సవరించుకున్నాడు. శతృఘ్నను ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో సంక్షిప్తంగా చెప్పాడు వరదరాజన్.
"మద్యనిషేధం ప్రభుత్వ పాలసీయే కాదు... సి.ఎమ్.గారి ప్రగాఢమైన కోరిఉక. మద్యాన్ని నిషేధించాలంటే... ముందుగా కల్తీ సారాని అరికట్టాలి. ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ప్రధాన లక్ష్యాల్లో అది ఒకటి- రెండోది లిక్కర్ సిండికేట్స్ ని... ఎదుర్కోవడం....ఎక్సయిజ్ డిపార్ట్ మెంటులోంచి కొంతమంది సీనియర్స్ ని ఎన్ ఫోర్స్ మెంటు సెల్ కి ట్రాన్స్ ఫర్ చేసాం."
పది నిముషాల తర్వాత పెదవి విప్పింది సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి.
"మిస్టర్ శతృఘ్నా! మీరు డైరెక్టుగా సి.ఎమ్. కంట్రోల్ లోనే ఉంటారు...మీకు వరదరాజన్ ఎడ్వయిజర్ గా వుంటారు. ఎన్ ఫోర్స్ మెంటు సెల్ కు సంబంధించి మీరు ఏ నిర్ణయమయినా తీసుకోవచ్చు.... ఫుల్ పవర్స్ మీకిస్తున్నాను.... మీ స్టాఫ్... మీ ఆపరేషన్.... మీ ప్లానింగ్ అంతా మీ ఇష్టం...స్పెషల్ ఐడెంటిటీ మీకిస్తున్నాను....ప్రూవ్ యువర్ సెల్ఫ్" చెప్పడం ఆపి శతృఘ్న ముఖంలోకి చూసింది త్రిభువనేశ్వరీదేవి.
నెమ్మదిగా పెదవి విప్పాడు శతృఘ్న.
"ఐకెన్ ప్రూవ్ మైసెల్ఫ్....దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హేవ్.... ఏ రాష్ట్రంలోనయినా మాఫియా ముఠాలు ప్రత్యేకంగా లేవు పొలిటికల్ సిస్టమ్ లో ఆ ముఠాలు ఒక భాగమై పోయాయి. మాఫియా ముఠాల అవసరం పొలిటీషియన్స్ కుంది. అందుకే పొలిటీషియన్స్ వాళ్ళని రక్షించేది. ఎక్కడయినా ఈ వ్యవస్థ ఒక్కటే.


