Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 35

 

     అందరి దృష్టీ....
    
    నాలుగు ఆలివ్ కలర్ కంటెస్సా కార్లమీదే ఉంది.
    
    విండ్ గ్లాస్ లు క్లోజ్ చేసున్న ఆ నాలుగు కార్లు మెరిసిపోతున్నాయి.
    
    ఆ నాలుగు కాంటెస్సా కార్లకు విచిత్రంగా ఒకే నెంబర్ ఉంది.
    
    అదే ఆ కార్ల స్పెషాలిటీ!
    
    ఒకే నెంబర్, రిజిస్ట్రేషన్ తో ఉండేది, ఒక్క రాష్ట్ర గవర్నర్ కారుకీ...
    
    అలాగే నెంబర్ లెస్ కార్లను ఉపయోగించే అధికారం, కేవలం....ప్రెసిడెంట్ ప్రైమినిస్టర్లకు మాత్రమే ఉంది.
    
    కానీ-
    
    ఇక్కడ నాలుగు కార్లు....ఒకే నెంబర్ తో.
    
    "ఎవరెళుతున్నారు ఆ కార్లలో.... చీఫ్ మినిస్టరా? ప్రైమినిస్టరా?" బస్టాండ్ లోని ఓ వ్యక్తి ఆశ్చర్యంగా పక్కనున్న వ్యక్తిని అడిగాడు.
    
    "అబ్బయ్యనాయుడు... తెలీదా... చూడు... ఇంత బందోబస్తు చీఫ్ మినిస్టర్ కి కూడా ఉండదు" నోరెళ్ళబెడుతూ అన్నాడు పక్కనున్న వ్యక్తి.
    
    "ఏ కార్లో ఉన్నారాయన..." ఆసక్తిగా మళ్ళీ అడిగాడు మొదటి వ్యక్తి.
    
    "అదే సస్పెన్స్... నువ్వూ... నేనే కాదు.... ఇంటిలిజెన్స్... డిపార్ట్ మెంట్ కూడా చెప్పలేదు.... ఆ నాలుగు కార్లలో ఏదో కారులో ఆయనుండొచ్చు...ఒక్కొక్కప్పుడు ఉండకపోవచ్చు కూడా..." నవ్వాడు ఆ వ్యక్తి.
    
    "ఎందుకలాగ..." ప్రశ్నించాడు మొదటి వ్యక్తి.
    
    "అదంతే- సారాకింగ్ అంటే మాటలనుకున్నావా....ప్రతీ రెండోవాడూ శతృవే... ఆ శతృవుల్నించి- తప్పించుకోవాలంటే, ఆ మాత్రం జాగ్రత్త ఉండొద్దూ!"
    
    కార్లు సర్ర్ సర్ర్ మని ముందుకు దూసుకుపోతున్నాయి.
    
    తడ గ్రామానికి, మూడు కిలోమీటర్ల దూరంలో-
    
    ఎడంపక్కన సరుగుడు తోట, ఆ తోట మధ్యన సిమెంట్ బాట-
    
    ఆ దారికి రెండు వేపులా-
    
    గ్రీన్ సోల్జర్స్ లా అశోక వృక్షాలు- అందమైన....గార్డెన్...ఆ గార్డెన్ పక్కన నీళ్ళధారలు చిమ్ముతున్న ఫౌంటెన్... ఆ ఫౌంటెన్ కు...ఎదురుగా...అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ లాంటి బిల్డింగ్....మిల్క్ వైట్ బ్రైట్ నెస్ తో లైట్ హౌస్ లా మెరుస్తోంది.
    
    దూరంనుంచే కార్ల రాకను గమనించిన, లైట్ బ్లూ యూనిఫార్మ్ లోని సెక్యూరిటీ గార్డ్స్, చేతుల్లో రైఫిల్స్ తో ఎక్కడి వాళ్ళక్కడ ఎలర్ట్ అయ్యారు అప్పటికే-
    
    అబ్బయ్యనాయుడు కోసం ఎదురుచూస్తున్న జనం గబగబా మెట్లమీంచి కిందకు దిగిపోయారు.
    
    పైలెట్ జీప్ సర్రున వచ్చి పక్కకెళ్ళిపోయింది.
    
    వచ్చిన కార్లన్నీ ఎడం పక్కకెళ్ళిపోయాయి. అంబాసిడర్ కార్లలోంచి దిగిన బాడీగార్డ్స్, అటూ ఇటూ వరసగా క్యూలో నిలబడ్డారు.
    
    విశాలమైన పోర్తికోలో, నాలుగు కాంటెస్సా కార్లు వచ్చి ఆగాయి.
    
    అందరి దృష్టి ఆ కార్లమీదే ఉంది.
    
    అబ్బయ్యనాయుడు ఏ కారులో ఉన్నాడో తెలీని జనం... ఆ కార్లవేపు కన్నార్పకుండా చూస్తున్నారు.
    
    కార్ల వరసలో-
    
    మూడో కాంటెస్సా కారు డోర్ ఆటోమేటిగగా టక్ మని తెరుచుకుంది.
    
    కారు వెనక సీట్లోంచి కుడికాలు ముందుకుపెట్టి దిగాడు....
    
    అబ్బయ్యనాయుడు.
    
    రాటుదేలిన రాజకీయపు సిమెంటుతోను, కుంభకోణాల కరెన్సీతోను....
    
    పోతపోసిన వెండిప్రతిమలా వున్నాడు అబ్బయ్యనాయుడు.
    
    పొడవాటి ఆకారం, బలమైన దేహం, ఆకర్షణీయమైన వత్తు మీసాలు....
    
    ఫీలింగ్ కనబడని ముఖం, కళ్ళకు రెబాన్ గ్లాసెస్....చేతివేళ్ళ మధ్య పొగలుకక్కుతున్న సిగార్-
    
    పాలరంగులో మెరుస్తున్న ఫాంట్, షర్ట్.
    
    ఠీవిగా నిలబడి అందరివైపూ ఒకసారి చూసాడు.
    
    గబగబా మెట్లెక్కి లోనికి నడుస్తున్నాడు అబ్బయ్యనాయుడు.
    
    అబ్బయ్యనాయుడు కంట్లో పడాలని ప్రయత్నిస్తున్న చోటా- మోటా ఇండస్ట్రియలిస్టులు...సారా కాంట్రాక్టర్లు...
    
    నేరుగా కాన్ఫరెన్స్ హాల్లోకి దారితీసాడు అబ్బయ్యనాయుడు.
    
    వెండి జరీపూతల అద్దకపు సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు అబ్బయ్యనాయుడు.
    
    అనుచరగణం తమ తమ సీట్లలో కూర్చున్నారు.
    
    అదొక లిక్కర్ సిండికేట్ మహాసభ.
    
    ముఫ్ఫై ఏళ్ళుగా అవిచ్చిన్నంగా సారా వ్యాపారాన్ని చేస్తున్న సారాజుల మయసభ అది.
    
    పార్టీల్నీ, ప్రభుత్వాల్నీ, పార్టీనేతల్నీ, ప్రభుత్వాధినేతల్నీ, కోట్ల కరెన్సీలతో కొనగలిగి తమ మాటనే శాసనంగా, తమ ఉనికినే రాజముద్రికగా చేసుకున్న అతి పవర్ ఫుల్ లిక్కర్ మాఫియా నెలవారీ సమావేశం అది.
    
    అబ్బయ్యనాయుడు బావమరిది- సీరాములునాయుడు బావగారి ముఖ కవళికల్ని పరిశీలిస్తున్నాడు.
    
    చిత్తరంజన్ రెడ్డి అనే సారా కాంట్రాక్టరు లేచి నిలబడ్డాడు.
    
    "ఏంది అబ్బయ్యన్నా... ఏంటిది? లిక్కర్ ప్రొహిబిషన్ మీద.... స్టే తెచ్చుకున్న సంతోషం ఇంకా మిగల్లేదు. సడన్ గా చీఫ్ జస్టిస్ ఆ స్టేని తీసేసా రేమిటి? మనమెలా ప్రొసీడవ్వాలి.... దారీ తెన్నూ దొరక్క పరిగెత్తు కొచ్చాం-"
        
    "సడన్ గా చీఫ్ మినిస్టర్ ఇలా దెబ్బకొడతాడని నేననుకోలేదు.... కల్తీ సారా తాగి అంతమంది చచ్చిపోవడానికి మనవా కారకులం....మనం తయారు చేస్తున్న సారా ఒక చుక్కయినా మన రాష్ట్రంలో అమ్ముతున్నావా....కోర్టు కూడా స్టేట్ గవర్నమెంటుతో కుమ్మక్కయిపోయింది. మనం ఇలాగే సహిస్తూ వూరుకుంటే కుదరదంతె" బాలరాజు అనే సారా కాంట్రాక్టరు అన్నాడు ఆవేశంగా.
    
    గజపతిరాజు అనే సారా కాంట్రాక్టరు లేచి నిలబడి-
    
    "అయ్యా! నాయుడుగారూ! మేం మరి యూనిట్లు నడపలేవండీ! ఈ సి.ఎం. అంచెలంచెలుగా మనల్ని నొక్కేస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ అట! దానికో ఆఫీసరట....ఎక్సయిజ్ డిపార్టుమెంట్ జనం కూడా మనకు హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు సర్! ఇవాళే మా పరిస్థితి ఇలా వుంటే రేపు మా సంగతి ఏవిటంటారు?"
    
    "అదికాదండీ....ఎవరో పనిలేక తీరిగ్గా కూర్చున్న ఆడవాళ్ళు సారాని నిషేధించాలి, నిషేధించాలని మూడు ఊరేగింపులు తీసేస్తేనో....గాంధీగారు తన జీవిత కథలో సారా మహా పాపం అని రాసుకున్నంత మాత్రాన సారాని నిషేధించేస్తానని అంటే ఎలాగండీ బాబూ....ఇంతకీ ఆ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్: ఆఫీసర్ ఆ శతృఘ్న గాడెవడండీ... ఎయిర్ పోర్టులో చుట్టూ మన మనుషులుండగా మన శ్రీరాములు నాయుడ్ని నేలమీద పడేసి చంపుతానని బెదిరించాడంటే... సార్! అబ్బయ్యనాయుడుగారూ...ఈ ముసలం మన కోటల్ని పెకలించటానికే వచ్చినట్లుంది" చిన్నారెడ్డి అన్నాయన అన్నాడు.
    
    "ఇన్నాళ్ళబట్టి మనం ఫీల్డులో వున్నాం ఒక్కనాడు....ఒక్కనాడు ఏ ఒక్క ఆఫీసరయినా మన జోలికి వచ్చాడా... ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ అంటే అబ్బయ్యనాయుడింట్లో వాచ్ డాగ్స్ లాంటి వాళ్ళు అలాంటి డిపార్ట్ మెంటు లోని ఆఫీశ్రాలు ఇప్పుడు మనల్ని లెక్క చెయ్యడంలేదు సర్!"
    
    "ఇప్పుడు ఆ డిపార్ట్ మెంట్ కు పవర్స్ లేవయ్యా బాబూ.... మన మీద స్పెషల్ గా ఓ స్పెషల్ మిషన్ ని వేసారయ్యా బాబూ....ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ అట.... చూడండి శ్రీరాములునాయుడుగారూ! మీమీద చెయ్యెత్తిన ఆ శతృఘ్నగాడ్ని అలా వదిలేసి వచ్చేయడం నాకయితే ఏం నచ్చలేదు.
    
    ఆ మాటకు శ్రీరాములునాయుడికి కోపం వచ్చింది.
    
    "చేతకాక, వాడికి భయపడి వచ్చేసానయ్యా.... మీరిక్కడ కూర్చొని కబుర్లాడినట్టు కాదు. అబ్బయ్యనాయుడు గారిని పర్మిషన్ ఇవ్వమని చెప్పండి. ఐదునిమిషాల్లో వాడ్ని లేపెస్తాను" అబ్బయ్యనాయుడు వైపు చూస్తూ అన్నాడు శ్రీరాములునాయుడు.

 Previous Page Next Page