Previous Page Next Page 
సుహాసిని పేజి 35


    "పడుకో, నిద్రపో...." అంది సుభద్ర.

    "నువ్వూ పడుకో...."

    గదిలో దీపాలారిపోయాయి. హాస తన మంచంమీద పడుకుంది. చాలాసేపు సుభద్ర తన ప్రక్కనే తన మంచంమీదే కూర్చుందని ఆమెకు తెలియదు.


                           *    *    *    *


    ఒక రాత్రివేళ....

    ఆ భూతల స్వర్గంలో నిశీధ నిశ్శబ్దం ఆవరించుకుని ఉన్న వేళ....

    మంచి నిద్రలో ఉలిక్కిపడి లేచింది హాస.

    "హాసా! హాసా!"

    ఆ పిలుపు ఆమెకు సుపరిచితం.

    "ఊఁ" అందామె.

    "ఎంతోసేపటినించి నిన్ను పిలుస్తున్నాను. నువ్వు నిద్రపోతున్నావా"

    "ఊఁ"

    "ఇప్పుడు శ్రీనగర్లోనే ఉన్నావా?"

    "ఊఁ"

    "ఎక్కడ?"

    "బోట్ హౌస్ లో. నా బోట్ హౌస్ పేరు యాస్మిన్.

    "ఎలా వుంది?"

    "చాలా బాగుంది నాకు...."

    "నీ వంట్లో ఎలాగుంది?"

    "నిక్షేపంలాగుంది. కానీ మావాళ్ళేమో నన్ను జబ్బు మనిషిలా ట్రీట్ చేస్తున్నారు."

    "అభిమానం. అది నీ అదృష్టం...."

    "కానీ నాకేదో అనుమానంగా వుంది"

    "ఏ అనుమానాలూ పెట్టుకోకు. ట్రిప్పు ఎంజాయ్ చేయి...."

    "నువ్వెక్కణ్ణించి మాట్లాడ్తున్నావు?"

    "నువ్వెక్కడుంటే నేనూ అక్కడే!" 

    "అంటే....నువ్వూ శ్రీనగర్ వచ్చేశావా?"

    "ఔను....నీకంటే కాస్తముందుగా బయలుదేరి మరికాస్త ఆలస్యంగా చేరుకున్నాను...."

    "ఎందుకు?"

    "నా మనసెప్పుడూ నీ దగ్గరే వుంటుంది. కానీ నువ్వు నాకు దూరముగా వుంటే భరించలేనుగా....అందుకే నీతోపాటే నా ప్రయాణం...."

    "ఏయ్....ఎవరునువ్వు?"

    "అది నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. నేను చెప్పను"

    "అయితే నాతో మాట్లాడకు"

    "హాసా, ప్లీజ్! అలాగనవద్దు...."

    అప్పుడు గదిలో దీపం వెలిగింది.

    హాస కళ్ళు నులుముకుంది. ఎదురుగా తల్లిని చూసి_"హలో! మా అమ్మ చూస్తోంది. ఇక మాట్లాడ్డం ఆపు" అంది.

    "ఎవరితోనే మాట్లాడుతున్నావు?" అంది సుభద్ర.

    "ఎవరో తెలియదమ్మా! అతడి మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. ఎక్కడినుంచి పిలుస్తున్నాడో తెలియదు" అందామె.

    సుభద్ర వెనక్కు తిరిగింది. లైటార్పింది. కళ్ళు మూసుకుంటూ_ "అమ్మాయి మనలో లేదు" అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.


                           *    *    *    *


    హాసకు ఉదయం పెందరాళే మెలకువొచ్చింది. ఎందుకో ఆమె మనసుకు చాలా సంతోషంగా వుంది. గౌతమ్ కూడా శ్రీనగర్ వచ్చాడన్న విషయం ఆమెకు కొత్త ధైర్యాన్నిచ్చింది.

    హాస ఆలోచిస్తూండగా ఎవరో తలుపుతట్టారు. వెళ్ళి చూస్తే రమణ.

    "త్వరగా స్నానాలు చేసి రెడీ కావాలి! ఏడింటికల్లా బ్రేక్ ఫాస్ట్. ఎనిమిదింటికి టాక్సీ బయలుదేరుతుంది"

    "ఎక్కడికి?"

    "పహాల్ గావ్ వెడదాం"

    "ఎందుకు?"

    "కాశ్మీర్ వచ్చినవాళ్ళు తప్పకుండా చూసే ప్రాంతమది...."

    రమణ వెళ్ళిపోయాడు. తలుపు మూయగానే సుభద్ర లేచి కూర్చుని, "చాలా బద్దకంగా ఉందే!" అంది.

    "అయితే నేను స్నానం చేసి రానా?"

    "ఊఁ"

    "వేడినీళ్ళ తొట్టికోసం ఆమె మనసు ఉరకలు వేస్తోంది. నిన్న ఆ స్నానం ఎంత హాయిగా ఉందో!

    ఆమె స్నానం చేస్తూండగా "హాసా!" అన్న పిలుపు.

    "ఏయ్! నన్ను పిలవడానికి వేళాపాళా లేదూ" అందామె.

    "ఏం చేస్తున్నావ్?"

    "స్నానం చేస్తున్నాను"

    "అయామ్ సారీ! మనం తర్వాత మాట్లాడుకుందాంలే"

    ఆమె విసుగ్గా_ "నువ్వు నన్నేం చూడ్డంలేదుగా, మాట్లాడుతున్నావంతే.... ఏంకావాలో చెప్పు__" అంది.

    "మీ ప్రోగ్రాం తెలుసుకుందామని!"

    "పహాల్ గావ్ వెడుతున్నాం కార్లో!"

    "థాంక్యూ హాసా! నిన్నక్కడ చూస్తా....!"

    "నువ్వు చూడ్డం సంగతి సరే! నేను నిన్ను చూడొద్దా?"

    ఆమె చెవుల్లో సన్నగా నవ్వు....


                                                               *    *    *    *


    హాస యిలా స్నానానికి వెళ్ళగానే పురోహితుడు గదిలో అడుగుపెట్టాడు. సుభద్ర అతణ్ణి సాదరంగా ఆహ్వానించింది.

    "దిక్కుమాలిన విగ్గు ఇదింకా ఎన్నాళ్ళు పెట్టుకోవాలో? అమ్మాయి పెళ్ళికొప్పుకుందామ్మా?" అన్నాడు పురోహితుడు.

    సుభద్ర తల అడ్డంగా వూపి. "దాని ధోరణి నాకు భయంపుట్టిస్తోంది. ఒక రాత్రివేళ అది ఎవరో కంటిక్కనిపించని మనిషితో మాట్లాడుతోంది" అంది.

    "పోయే ముందు మంచివాళ్ళకి దేవతలు కనిపిస్తారుట" అన్నాడు పురోహితుడు.

    "ఇది ఈ రోజు కథ కాదు. తనతో ఎవరో మాట్లాడుతున్నారని తమ్ముడ్ని ఏడిపిస్తూండేదింట్లో కూడా. కానీ నాతో ఎప్పుడూ యిలాంటి తమాషాలు చేయదు...."

    "ఏమోనమ్మా! పుణ్యాత్ములకు స్వర్గంలో సీటు బుక్కయినట్లే, స్వర్గవాసులు కూడా భూలోకంలో పుణ్యాత్ముల్ని అడ్వాన్స్ బుక్కింగు చేసుకుంటారు. త్వరలోనే తమ లోకం రాబోయే మీ అమ్మాయితో ఏ దేవతా పురుషుడో యిప్పుడే పరిచయం పెట్టుకుంటున్నాడని నా అనుమానం" అని అన్నాడు పురోహితుడు.

    "పంతులు గారూ!" అంది సుభద్ర కోపంగా.

    "పొరపాటైపోయిందమ్మా.... నెత్తిమీద ఈ హిప్పీ విగ్గు- నా చేత హిప్పీ మాటలే పలికిస్తోంది...." అన్నాడు పురోహితుడు.

    అప్పుడు బాత్రూం తలుపు తెరుచుకుంది, హాస వచ్చింది.


                          *    *    *    *


    బ్రెడ్, బటర్, జామ్, పాలు, కాఫీ, టీ - ఇదీ బ్రేక్ ఫాస్ట్.

    అదయ్యాక బోటు హౌస్ నుంచీ షికారాలోకి, షికారా ద్వారా అవతల గట్టుకి, అవతల గట్టునుండి టాక్సీలోకి మారారు రమణ బృందం.

    టాక్సీలో డ్రైవర్, పురోహితుడు, రమణ ముందు కూర్చున్నారు.

    హాస, సుభద్ర అటూ యిటూ కూర్చున్నారు వెనక సీట్లో!

    టాక్సీ జర్రున జారిపోతూంటే హాస ప్రకృతి సౌందర్యం చూస్తోంది.

    ఇరవై ఒక్క డిగ్రీలు టెంపరేచరు, వాతావరణం ఆహ్లాదకరంగా వుంది.

    ఎంతో దూరం వెళ్ళకుండానే టాక్సీ ఓ పురాతన కట్టడం ముందాగింది.

    రమణ ఆ కట్టడపు చారిత్రాత్మక ప్రాధాన్యత గురించి చెబుతూంటే, "నీకు చాలా తెలుసే!" అంది హాస.

    "నేనే ప్రాంతానికి వెళ్ళినా అక్కడి అణువణువు గురించీ తెలుసుకుంటాను. బయల్దేరే ముందునుంచీ...."

    అని అతడింకా ఏదో చెప్పబోతూండగా "అయితే నువ్వు మంచి రచయితవు కావచ్చు" అంది హాస.

    "ఎలా?" అన్నాడు రమణ ఆశ్చర్యంగా.

    "నీకు తెలియదా? ఇప్పుడు తెలుగులో అలాంటి నవలలకే గిరాకీ. ఏదైనా ఒక ప్రాంతం గురించో, విషయం గురించో క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుని వాటిని పాఠకుల కందిస్తూ మధ్యలో కొంత కథ కలపడం...."

    "అలాంటి నవల్లు ఇంగ్లీషులో అర్థర్ హెయిల్ రాశాడు. చాలా బాగుంటాయి. మొదలుపెడితే వదల్లేం.... నీకూ అలాంటివి ఇష్టమేనా?" అన్నాడు రమణ ఉత్సాహంగా.

    టాక్సీ డ్రైవర్ రమణను హెచ్చరించాడు. మళ్ళీ సాయంత్రానికల్లా వెనక్కు రావాలి. ప్రయాణం చాలాసేపు పడుతుంది.

    అందరూ ముందడుగు వేశారు.

    వెంటనే ఓ గైడ్ వాళ్ళని తగుల్కున్నాడు. ఈలోగా టాక్సీ డ్రైవర్ టాక్సీ దిగి, "నేనే మీ గైడుని. వేరే గైడు అవసరం లేదు" అన్నాడు.

    "ఇదంతా నేను తిరగలేను. అటు తిరిగి ప్రకృతిని చూస్తాను" అంది హాస.

    సుభద్రనూ, పురోహితుణ్ణీ టాక్సీ డ్రైవర్ కి అప్పజెప్పి హాసతో వుండిపోయాడు రమణ.

    అక్కడికొచ్చిన వారు చాలామంది ప్రకృతి కన్యలా కనపడే హాసను ప్రత్యేకంగా చూశారు."

    "తెలుగులో కూడా ఆర్థర్ హెయిల్ అంతా బాగా రాసేవారున్నారా?" అన్నాడు రమణ సంభాషణను రచనల మీదకు మళ్ళిస్తూ.

    "ఆర్థర్ హెయిత్ ఎంత బాగా రాస్తాడో నాకు తెలియదుగా...."

    "ఆయన తన రచనల మీద లక్షలార్జించాడు."

 Previous Page Next Page