Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 34

    "ఎందుకు బాబూ మరీ అలా నవ్వుతావు?" అంది బామ్మ.   
    "నేనిలాగే నవ్వుతాను" అన్నాడు బాస్ - "ఇప్పుడు ప్రపంచమంతా నా గుప్పిట్లోకి వచ్చేస్తోంది. కొత్త ఫార్ములా నా చేతిలో ఉంది."   
    సుహాసిని ఆశ్చర్యంగా బాస్ వంక చూసి- "ఫార్ములా మీ కర్దమవుతోందా?" అంది.   
    చూసీ చూడగానే తెలిసిపోయింది. ఇది నీకు సుబ్బారావు ఇచ్చాడంటే అతనికి బామ్మగారి మీద అంతులేని భక్తి ఉండి ఉండాలి!" అన్నాడు బాస్.   
    సుబ్బారావు వెంటనే బామ్మగారిని సమీపించి ఆవిడ పాదాలను నమస్కరించి - "మీకోసం నేనేమైనా చేస్తానండి" అన్నాడు.   
    "ఒరేయ్! నా కోసం పదివేలూ తెచ్చావా?" అంది సుభద్రమ్మ.   
    "లేదమ్మా__దొరకలేదు. ఒక్కసారిగా అంత డబ్బు ఎక్కణ్ణించి తెచ్చేదమ్మా" అన్నాడు సుబ్బారావు.   
    "అయితే సుభద్రమ్మ ఇక్కడే ఉంటుంది. త్వరగా పోయి పదివేలూ తీసుకుని రా..." అన్నాడు బాస్.   
    "ఉన్నపళంగా పదివేలెవరిస్తారండి!" అన్నాడు సుబ్బారావు.   
    "ఉద్యోగం చేసుకుంటున్నావు. వయసులో వున్న కుర్రాడివి పెళ్ళి చేసుకుంటానంటే ఎవరో ఒకరు కట్నంగా నైనా ఇస్తారు. అర్జంటుగా పెళ్ళి చేసుకుని డబ్బు సంపాదించు. నువ్వు బామ్మగారికి ఉపకారం చేశావు. ఆవిడ నీకేమైనా సాయపడుతుందేమో అడుగు" అన్నాడు బాస్.   
    సుబ్బారావు బంగారంలాంటి కుర్రాడు. అసలు శాఖాంతరం అయిపోయిందని గానీ మా పాపనే యిచ్చి పెళ్ళి చేసేవాళ్ళం" అంది బామ్మగారు.   
    "కంఠంలో ప్రాణముండగా ఆ పెళ్ళికి ఒప్పుకోను. ఒరేయ్ సుబ్బారావు! నువ్వు మన శాఖలో వాళ్ళనే ఎవర్నయినా పెళ్ళి చేసుకుంటానని చెప్పి కట్నంముందు పుచ్చుకుని నన్ను విడిపించరా! ఇలాగన్నానని ఏకంగా పెళ్ళి చేసుకుని వచ్చేయకు. వియ్యపురాలి లాంఛనాలు పోతాయి నాకు" అంది సుభద్రమ్మ.   
    సుహాసిని ఓసారి చుట్టూ చూసింది. సుభద్రమ్మ ముఖంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకు సుభద్రమ్మపై జాలి వేసింది. ఇప్పుడిక్కన్నించి వెళ్ళిపోతే ముఠా ఈ స్థలం మార్చేస్తారు. తన విద్యను ఇప్పుడే ఉపయోగిస్తే!   
    సుహాసిని ఆలోచన అమల్లోకి రావడానికి ఎన్ని క్షణాలు పట్టిందో.అక్కడి మనుషులు నేలకూలడానికీ అన్ని క్షణాలు పట్టింది.   
    సుభద్రమ్మ చటుక్కున సుహాసినిని, దగ్గరగా తీసుకుని __"నా బంగారు తల్లివి నా ప్రాణాలు రక్షించావు" అంది.   
    "ముందిక్కన్నించి త్వరగా ఇంటికి పోదాం" అన్నాడు సుబ్బారావు.   
    అంతా కలిసి సుబ్బారావు ఇంటికి వెళ్ళారు. సుబ్బారావు ఇంటి తాళం తీస్తూంటే- "అరుణ ఏదిరా!" అనడిగింది.   
    "ఈ సంగతంతా దానికి తెలియడం ఇష్టంలేక నేనే దాన్ని సినిమాకి వెళ్ళమన్నాను" అన్నాడు సుబ్బారావు.   
    "ఆడపిల్ల నొకర్తినీ సినిమాకు పంపిస్తావుట్రా" అంటూ మండిపడింది సుభద్రమ్మ.   
    "ఆడపిల్ల బైటకు వెళ్ళి కరాటే నేర్చుకుంది. కాబట్టే ఈరోజు నువ్వు బ్రతికి బైటపడ్డావు. మగపిల్లాణ్ణి కూడా ఆడపిల్లలా పెంచావు కాబట్టే - నేను ఆ పిల్ల దొంగల్ను తన్నుతూంటే స్థంభంచాటున నిలబడి ఆతృతగా చూశాను" అన్నాడు సుబ్బారావు.   
    అతనలా నిష్ఠూరంగా అనగానే సుభద్రమ్మ ఆశ్చర్యంగా చూసింది. కొడుకు తనను ఎదిరించి మాట్లాడడం ఇదే మొదటిసారి.   
    అంతా మంచినీళ్ళు తాగి స్థిమితపడ్డారు.   
    "బాబూ సుబ్బారావు! నువ్వు నా ప్రాణాలు కాపాడే వయ్యా!" అంది బామ్మగారు ఆప్యాయంగా అతడి వంక చూస్తూ.   
    "అదే నాకు అర్ధం కావడం లేదండి. నిజానికి కాగితం మీద ఎన్నో పిచ్చిగీతలు గీసి ఓ కవర్లోపెట్టి ఇచ్చాం. అవే వాళ్ళు నిజం రహస్య పత్రాలంటున్నారు. పైగా ప్రపంచమంతా గుప్పిట్లోకి వచ్చిందంటున్నారు" అన్నాడు సుబ్బారావు.   
    "ఆఁవాళ్ళో పిచ్చి వెధవలయ్యుంటారు. అసలా బాస్ గాడి నవ్వూ అదీ చూస్తూంటే నాకు అనుమానంగానే ఉంది. పిచ్చివాడని! కానీ బలంగా ఉన్నాడుకదా తంతాడో ఏమోనని నోరెత్తలేదు" అంది బామ్మగారు.   
    "అసలు కాగితాల కోసమని వాళ్ళు కానీ మనింటి మీద పడరుగదా" అంది సుభద్రమ్మ కంగారుగా.   
    "లేనివి ఎక్కణ్ణించి పుట్టిస్తావమ్మా! ఈసారొస్తే వాళ్ళనే వెతుక్కోమందాం__లేదా సుహాసినిని మనింట్లో సాయముంచుకుందాం!" అన్నాడు సుబ్బారావు.   
    "మనింట్లో సాయముండడానికి ఆ అమ్మాయి యీ యింటి కోడలేమిట్రా?   
    "మరేదైనా ఉపాయం చూడు" అంది సుభద్రమ్మ.   
    "నువ్వూ, బామ్మగారూ తల్చుకుంటే ఆమె ఈ ఇంటి కోడలు కావడం ఎంతసేపు?" అన్నాడు సుబ్బారావు తల వంచుకుని.   
    వెంటనే బామ్మ, సుభద్రమ్మ విరుచుకుపడ్డారు.  
    "అదేంటమ్మా- అంతలా కోప్పడ్డావు? నేనేమైనా సుహాసినిని పెళ్ళి చేసుకుంటానని అన్నానా? నీ యిష్టానికి వ్యతిరేకంగా నేనెప్పుడైనా ప్రవర్తించానా?" అని సుబ్బారావు అనేసరికి ఇద్దరూ శాంతించారు.   
    "అయినా మన పిల్లలు బుద్దిమంతులు. ఇలాంటి పెళ్ళికి వాళ్ళొప్పుకుంటారనుకోను" అంది బామ్మగారు.   
    ఈ విషయమై వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోరాదని తీర్మానమయింది.   
    వాళ్ళంతా వెళ్ళిపోయాక, రాయుడు సమాచారం సేకరించి జరిగింది తెల్సుకున్నాడు. తాము ఎంతో కష్టపడి వేసుకున్న పథకం కూడా ఫెయిలయిందనగానే ఆయన బెంగ పెట్టుకున్నాడు  
    "ఈ ముసలాళ్ళింక మారరు" అన్నాడు రాయుడు.   
    "వాళ్ళు బ్రతికుండగా ఈ పెళ్ళి జరగదు" అన్నాడు రచయిత.   
    "అంటే వాళ్ళను చంపమంటావా? ఏమైనా చేస్తాను గానీ హత్యలు మాత్రం చేయలేను" అన్నాడు రాయుడు.  
    "హత్యలవసరం లేదండీ! కానీ వాళ్ళకు బ్రతుకు భయం కలిగించాలి" అన్నాడు రచయిత. అతను త్వరగా తన పథకం చెప్పాడు.   
    బామ్మగారికి జాతకాల పిచ్చి ఉంది. సుహాసినికి కూడా జాతకాల పిచ్చి వుంది. సుహాసిని జాతకంలో శాఖాంతార వివాహం రాసిపెట్టి వున్నదనీ, ఆ వివాహం జరుగనిపక్షంలో బామ్మగారికి మరణ గండమున్నదనీ చెప్పించాలి. పడుచు వాళ్ళకంటే ముసలివాళ్ళకు ప్రాణంమీద తీపి ఎక్కువ. ఆవిడ తప్పక ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది.

 Previous Page Next Page