"నువ్వెక్కడకు వెళ్ళిందీ నా కెందుకు చెప్పలేదు. అందువల్లనే కేసు నీ మీదకు వచ్చింది.
"నేను ఫలానా ఊరు వెళ్ళానని చెబితే నమ్మేవాళ్ళా? కేసు నామీదకు వచ్చేది కాదా?"
"అయినా....."
గౌతమ్ మాట్లాడలేదు.
"నీ అంతట నువ్వు ఎందుకు సరెండర్ అయ్యావు?"
"నేను పరారీలో ఉన్నాననే కలర్ ఇచ్చారు. అందుకే."
"నీకు ఎప్పుడు తెలిసింది?"
ఉదయం పేపరు చదివాను వెంటనే బయలుదేరి వచ్చేశాను."
"ఇన్నింటికీ నువ్వు ఎక్కడి కెళ్ళావ్?"
గౌతమ్ సమాధానం ఇవ్వలేదు.
ఇందుమతి అనుమానంగా చూసింది.
"చెప్పవేం?"
గౌతమ్ అసహాయంగా చూచాడు.
"గౌతమ్ ప్లీజ్ చెప్పు."
"ఒక స్నేహితుడి పని మీద వెళ్ళాను."
"ఏమిటా పని? అంతరహస్యంగా ఉండాల్సిన రాచకార్యాలేమిటి?" అనుమానంగా అన్నది.
"ఇందూ! నన్ను నమ్ము, నా మిత్రుడు చాలా కష్టంలో ఉన్నాడు. అందుకే....."
"అబద్దం!"
"ఇందూ!"
"నీ అసలు రూపం ఇప్పుడు బయటపడింది!"
"ఇందూ!"
"అలా పిలవకు. నాకు అసహ్యం వేస్తోంది."
దెబ్బతిన్న జంతువులా అసహ్యంగా చూశాడు గౌతమ్.
"ఇంత రోగ్ వి అనుకోలేదు. డాక్టర్ జకిల్ అండ్...."
"ఇందూ! నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?" మధ్యలో అందుకొని అన్నాడు గౌతమ్. అతని కంఠంలో కోపం లేదు. ఆవేదన ఉంది.
"ఆఁ- బాగా తెలుసుకొనే మాట్లాడుతున్నాను. నువ్వొక రోగ్ వి. నువ్విక పిచ్చివాడివి. దుర్మార్గుడివి. ఇక నీ ముఖంకూడా చూడను. నీకు ఉరి శిక్ష పడేలా నేనే చేస్తాను. ఎలా తప్పించుకుంటావో చూస్తాను."
ఇందుమతి దిగ్గున లేచింది.
బయటికి పరుగు తీసింది.
గౌతమ్ కూర్చున్న చోటునుంచి కదల్లేదు.
ఆమెను ఆపడానికి ప్రయత్నించలేదు.
ఆమె వెళ్ళినవైపే కొంతసేపు చూశాడు.
అతడి పెదవులమీద అదోలాంటి హాసరేఖ ఒక చివరినుంచి బయలుదేరి రెండో చివరలో ఆగిపోయింది.
ఇన్ స్పెక్టర్ గౌతమ్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.
గౌతమ్ పెదవుల మీద కడలిన హాసరేఖలో ఏ భావం ఉందో అతడికి బోధ పడలేదు.
13
గౌతమ్ ను రెండో రోజు మేజిస్ట్రేటు ముందు హాజరుపర్చారు పోలీసులు.
గౌతమ్ మిత్రుడు విక్రమ్ అతడికి జామీను ఇచ్చాడు. జామీనుమీద అతణ్ణి విడుదల చేశారు. అయితే గౌతమ్ హైదరాబాద్ దాటి వెళ్ళకూడదనే ఆంక్ష విధించి విడుదల చేశారు.
విక్రమ్ గౌతమ్ క్లాసుమేటు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు విక్రమ్ తండ్రి చాలా ధనవంతుడు. పెద్ద కాంట్రాక్టరు. విక్రమ్ బి.ఇ. చేశాడు. అతడు ఉద్యోగం చేయడానికి తండ్రి అంగీకరించలేదు. తండ్రికి ఒకేకొడుకు తండ్రి కాంట్రాక్టులే చూసుకుంటూ ఉన్నాడు. విక్రమ్ పుట్టాక ఏడేళ్ళకు కూతురు పుట్టింది. ఆ పిల్లకు అపరంజి అని పేరు పెట్టారు. అపరంజి ఆ ఇంట్లో అందరికీ అపురూపం. అన్నకు ప్రాణం. అల్లారుముద్దుగా పెరిగిన అపరంజికి లోకం పోకడ తెలియదు. అందర్నీ నమ్ముతుంది. ప్రపంచం అంత అపన్చారంగుల స్వప్నం ఆమెకు.
సమాజంలో పెద్ద అంతస్థు ఉన్న కుటుంబం వారిది. పుట్టినప్పటినుంచీ అన్నీ అందుబాటులో ఉన్న అపరంజికి ఏదో అడ్వెంచర్ చెయ్యాలనికోరిక. ఎందరో అందగాళ్ళూ, శ్రీమంతులూ అయిన యువకులు ఆమె చుట్టూ తిరుగుతారు. అయినా వాళ్ళలో ఆమెకు ఎలానతి ఆసక్తిగానీ, ఆకర్షణగానీ కనిపించలేదు. తను చెయ్యదల్చుకున్న అడ్వెంచర్ కు వాళ్ళు తగరు.
అపరంజి తనను కావాల్సిన వ్యక్తికోసం వెదకసాగింది. తల్లితండ్రులకుగానీ, అన్న విక్రమ్ కు కానీ ఆమె పిచ్చి ఆలోచనల గురించి తెలియదు.
అపరంజీ మూసలో పోసిన అపరంజీ బొమ్మ.
విక్రమ్ వెనకే గౌతమ్ యమత్రికంగా కోర్టు బయటికి నడిచాడు.
"విక్రమ్, నువ్వు చేసిన పని అంత మంచిది కాదేమో?"
నడుస్తున్న విక్రమ్ ఆగాడు. గౌతమ్ ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మీ నాన్నగారికి ఇష్టం ఉండదేమో? ఆ మాటకొస్తే ఏ తండ్రీ తన కొడుకు ఇంత నీచమైన పని చేసిన వాడికి జామీన్ ఇవ్వటాన్ని అగీకరించడు."
"ఏమిటి నువ్వనేది?" ఆశ్చర్యంగా అన్నాడు విక్రమ్.
గౌతమ్ పలక్కుండా ముందుకు నడక సాగించాడు. నడుస్తున్న గౌతమ్ తను గట్టి సిమెంటు రోడ్డుమీద నడుస్తున్నట్టుగా లేదు. ఇసుక దిబ్బలమీద్ఘ నడుస్తున్నట్టుగా ఉంది. ఇసుకలో కూరుకుపోతున్న పాదాన్ని లాగి అతి కష్టం మీద రెండో అడుగు వేస్తూ నడుస్తున్నాడు.
"నువ్వు నీచమైన పని చేశావా?"
"ప్రపంచం అలాగే భావిస్తున్నది."
"నాకు నిజం తెలుసు. అసలు విషయం రాత్రి మానాన్నతోచెప్పాను. చాలా బాధపడ్డాడు. వెంటనే వెళ్ళి జామీను మీద నన్ను విడిపించి తీసుకురమ్మని తొందరచేశాడు.
గౌతమ్ మౌనంగా నడుస్తున్నాడు.
"అపరంజి ఒకటే ఏడుపు. తనవల్లనే ఇంత జరిగిందని ఏడుస్తోంది."
గౌతమ్ మౌనంగా నడుస్తున్నాడు.
విక్రమ్ అపరంజిని గౌతమ్ కు ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఉండేది. గౌతమ్ ఇందును ప్రేమిస్తున్నాడని తెలిసి తన మనసులోని అభిప్రాయాన్ని మనసులోనే తుంచేసుకున్నాడు.
"విక్రమ్!"
"ఏమిటి?"
"ఒకవేళ నేను పరారీ అయితే?"
"అంతకంటే సంతోషకరమైంది నాకు మరోటి ఉండదు.
గౌతమ్ ఆశ్చర్యంగా విక్రమ్ ముఖంలోకి చూశాడు.
"అవును......గౌతమ్!"
"అప్పుడు నీకు శిక్ష విధిస్తారు."
"ఆనందంగా స్వీకరిస్తాను."
"నువ్వు చెయ్యని తప్పుకు నాకోసం శిక్ష అనుభవిస్తావా?"
"నువ్వు మాత్రం తప్పు చేశావా? నువ్వు తప్పు చెయ్యలేదు. అది.....అది..... నా కొక్కడికే తెలుసు నావల్లనే...."
"నువ్వేం చేశావు మధ్యలో?"
"నేను నిన్ను హైదరాబాదు నుంచి తీసుకువెళ్ళి ఉండకపోతే....."
"పొరపడుతున్నావు, విక్రమ్ నన్ను నిరపరాధిగా నిరూపించడానికి ఇదొక్కటే మార్గం ఉంది. ఆ రోజు నేను ఊళ్ళో ఉంటే వెంటనే అరెస్టు చేసేవాళ్ళు. నేను ఆ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడనికి అవకాశంకూడా ఉండేది కాదు. ఇప్పుడైనా ఆ అవకాశం ఉందో లేదో! కాని కనీసం మనకు వాదించడానికి, నేను తప్పు చెయ్యలేదని చెప్పుకోడానికి అవకాశం ఉంది." అన్నాడు గౌతమ్.