"నీకు ఈ శిక్ష పడటానికి వీల్లేదు."
"నువ్వు చెప్పింది ఎవరు నమ్ముతారు?"
"నమ్మిస్తాను."
"ఎలా?"
"ఆ ముందు రోజు నుంచే నువ్వు నాతో ఉన్నావు."
"నీ మాట నమ్మకపోతే?"
"అందుకు సాక్షులు చాలామంది ఉన్నారు."
గౌతమ్ మౌనంగా నడుస్తున్నాడు.
"అవసరం అయితే అపరంజినీ, వాణ్ణీ బోను ఎక్కిస్తాను. వారికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళున్నారు."
"వద్దు. విక్రమ్! ఆ పనిమాత్రం చెయ్యకు. పెళ్ళి కావాల్సిన పిల్ల."
"నాన్సెన్స్! మా పరువు ప్రతిష్టలకోసం ఒక నిరపరాధిని, అందునా నా ప్రాణ స్నేహితున్ని జైలుకు పంపించేటంతటి నీచున్ని కాదు. అదీ ఇంత ఘోరమైన బురదలో ముంచి...."
గౌతమ్ ఆలోచిస్తూ నడుస్తున్నాడు.
"గౌతమ్, నాకొక సందేహం!"
"నీమీద ఇందు తల్లి సునంద స్వయంగా పోలీసు రిపోర్టు ఇవ్వడం ఏమిటి? ఇంతదారుణానికి ఆమె ఎందుకు వడిగట్టినట్టు? ఇందును నువ్వు వివాహం చేసుకోవడం ఆమెకు ఇష్టంలేదా?"
"ఇందులో ఆమె తప్పేం లేదు. ఆమెను నేను ఎంతో గౌరవిస్తాను. తమ సిద్దాంతాలకు ఇంతగా కట్టుబడి ఉండేవాళ్ళు ఎందరుంటారు?"
విక్రమ్ తల తిప్పి గౌతమ్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు. విక్రమ్ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. గౌతం అతడి పక్కనే కూర్చున్నాడు.
"ఆఁ..... చెప్పు, ఒక నిరపరాధిమీద నీచమైన అపరాధం మోపడం ఆదర్సమా? ఏమిటి నువ్వు అంటున్నది?" కారు స్టార్ట్ చేశాడు విక్రమ్.
"ఆమె నా మీద అభాండం వెయ్యలేదు.
"అంటే......?"
"ఆ పని చేసింది నేనే అని నమ్మింది. అందుకే రిపోర్టు ఇచ్చింది. ఆమెకు నేనంటే ఎంతో ప్రేమ. ఒకరకంగా ఇందుకంటే కూడా నన్నే ఎక్కువ ప్రేమిస్తుంది. అయినా నేను ఆ పని చేశానని తెలిసినప్పుడు నామీద కూడా రిపోర్టు ఇవ్వడానికి జంకలేదు.
"ఆ పని చేశావని తెలుసుకోవడం ఏమిటి? నువ్వు చెయ్యలేదు."
"సారీ! నా ఎక్స్ ప్రెషన్ లోపం."
"ఇందుమతి కూడా ఆ పని నువ్వె చేశావని నమ్ముతోందా?"
"ఆమె కాదు, ఆ పరిస్థితుల్లో నువ్వూ, నేనూ కూడా నమ్ముతాం."
"నువ్వు ఆమెతో అసలు విషయం చెప్పలేదా?
"లేదు."
"ఎందుకు చెప్పలేదు?"
గౌతమ్ మాట్లాడలేదు.
"మా ఆకుటుంబం పరువు పోతుందనేనా?"
గౌతం కారు అద్దంలోనుంచి రోడ్డుకేసి చూస్తున్నాడు.
"ఇందుమతికి నువ్వు ఊరికి వెళ్తున్నట్టు తెలియదా?"
"తెలుసు."
"మరి?"
"నేను ఏ ఊరు వెళ్ళిందీ చెప్పలేదు. ఎందుకు వెళ్ళింది చెప్పలేదు. అందుకే ఆమెకు కూడా నామీద అనుమానం వచ్చింది.
"నువ్వొట్టి ఫూల్ వి!
గౌతం తల తిప్పి మిత్రున్ని చూశాడు. విక్రం ఎదురుగా ఉన్న రోడ్డును చూస్తూ కారు నడుపుతున్నాడు.
ఇందుకు చెబితే ఏం కొంపలు మునిగిపోతాయి?" రోడ్డుమీదనుంచి చూపులు తిప్పకుండానే ప్రశ్నించాడు.
"నీకు మాట ఇచ్చాను."
"ఇడియట్!"
గౌతం పెదవుల మీద హాసరేఖ ఓ క్షణకాలం కదిలి మాయమైంది.
కొన్ని నిముషాలు ఇద్దర్లో ఎవరూ మాట్లాడలేదు.
"అది సరే! అసలు ఇన్నిటికీ ఆ పని చేసిన వాడేవడంటావ్? నీ తమ్ముడి భార్య నీ పేరెలా చెప్పింది? ఆవిడ అంత దుర్మార్గానికి ఎలా పాల్పడింది?"
"ఆమె తప్పు లేదు.
"ఆమె తప్పు లేదనీ మీదే తప్పులేదు మరి తప్పెవరిది? నీదేనా? ఏంటి మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావటం లేదు.
"ఇంతమంది పొరపాటు పడడానికి కారణం అతడు నాలాగ ఉండటమే."
కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ తో ఆగింది.
"ఏమైంది?" గౌతమ్ ఆదుర్దాగా ప్రశ్నించాడు.
వెనకనుంచి ఒకటే హారన్ల రొద.
విక్రమ్ కారు స్టార్ట్ చేశాడు.
"ఎందుకు సడన్ బ్రేక్ వేశావ్?"
"నేను వెయ్యలేదు. నువ్వె వేశావ్!"
"నేనా?"
"అవును!" ఆగి మళ్ళీ అన్నాడు.
"అతను నీలాగా ఉంటాడా? అదెలా సాధ్యం విక్రం ఆశ్చర్యంతో తల మునకలై పోయాడు.
గౌతం సమాధానం ఇవ్వలేదు.
"అతన్ని నువ్వు చూశావా?"
"లేదు."
"మాస్కు వేసుకొని నీలా తయారౌతున్నాడంటావా సినీమాల్లోలాగ?"
"అతడు నాలాగే ఉంటాడు."
"చూడలేదన్నావుగా!"
"ఇతరులు చూసి నేననుకొని పొరపాటు పడటం ఈ మధ్య చాలా సార్లు జరిగింది."
"ఆశ్చర్యంగానే ఉంది."
గౌతం మౌనం వహించాడు.
"నేను నమ్మలేకుండా ఉన్నాను. గౌతం పోలికలుండవచ్చును కాని అచ్చం నీలా ఎలా ఉంటాడు?"
"అచ్చం నాలాగే ఉంటాడు."
"ఏమిటంత కచ్చితంగా చెప్తున్నావ్? నువ్వు చూడలేదన్నావుగా?"
ఇందుకూడా పొరపాటుపడింది."
"నిజంగా?" విక్రం కంఠంలో బోలెడంత ఆశ్చర్యం.
కొన్ని నిముషాలు ఎవరి ఆలోచనల్లో వాల్లుండి పోయారు.
"అన్నదమ్ములు అలాంటి వాళ్ళు ఉంటారని- అదీ చాలా అరుదుగా విన్నాను."
గౌతమ్ చివ్వున తల తిప్పి చూశాడు.
"కాని ఇద్దరు స్ట్రేంజర్స్ అలా ఉండటం అసంభవం! కొన్ని పోలిక లుంటే ముగాతాది మేకప్ తో పూర్తిచేసుకుంటున్నాడేమో! ఇవాళే నాన్నతో పోలీసు కమీషనర్ కు ఫోన్ చేయిస్తాను. అవసరం అయితే హోమ్ మినిస్టర్ తో మాట్లాడమంటాను. వాడెక్కడున్న పట్టేయ్యాలి. నిన్ను నిరపరాధిగా రుజువు చెయ్యాలి. అంతవరకూ నేను నిద్రపోను."
"విక్రం!"
విక్రం తల తిప్పకుండానే "ఏమిటి?" అన్నాడు.
"ఈ కేసులో నువ్వు కలగజేసుకోవడం నాకిష్టంలేదు!"
విక్రం తుళ్ళిపడ్డాడు. మరుక్షణం అతడి ఒళ్ళు మండిపోయింది. "మంచివాళ్లతో ఇదో బాధ. మంచితనం ఒకోసారి తనకు చేతగాని తనం అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఏమిటి? ఇలాంటి విషయాల్లో కూడా ఈ ఫూలిష్ సెంటిమెంట్స్ ఏమిటి?"
"ఏమిట్రా నువ్వనేది? నీ విషయంలో నేను కలగజేసుకోకూడదని నువ్వుమాత్రం నాకు ఏ సహాయమైనా చేస్తావా? నాకిచ్చిన మాటకోసం ప్రియురాలికి కూడా దూరం అవుతావా? నేను మాత్రం నీకు ఎలాంటి సహాయం చెయ్యకూడదా?" నాకోసం-అదే-మా ఇంటి పరువుకోసం నువ్వు ఎందుకు ఎక్కడికెళ్ళిందీ చెప్పకుండా అంత పెద్ద అపరాధాన్ని నెత్తి నెత్తుకుంటావా అంటే త్యాగం చెయ్యడం నీకుమాత్రమే తెలుసన్న మాట! నీ అంత త్యాగాధనులం కాకపోయినా మామూలు సహాయం చేసే అర్హత కూడా మాకు లేదనేగా నీ అభిప్రాయం?"