డాక్టర్ గీతా, నర్సింగ్ హోమ్ సూపరింటెండెంటు స్వప్నా, మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లూ బయటికి వచ్చారు.
"గర్భం నిలవదు. ఈ రాత్రికే అబార్షన్ కావచ్చు" అన్నది డాక్టర్ గీత సునందతో.
"పెద్ద ప్రాణానికి...."
"ఏం భయం లేదు. అయితే కొంతకాలం ఆ షాక్ లోనే ఉండిపోయే అవకాశం ఉంది. న్యూరో ఫిజిషియన్ కు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడే కాదు. నేను మళ్ళీ రాత్రికి ఓసారి వస్తాను" అంటూ గీత ముందుకు నడిచింది.
"థాంక్యూ డాక్టర్!"
"వెల్ కమ్!"
డాక్టర్ గీత ముందుకు నడిచింది. ఆమెతోపాటు ఉన్న డాక్టర్లు ఆమెను అనుసరించారు.
ముగ్గురూ గది లోపలకు వెళ్ళారు.
అరుణ కళ్ళు తెరిచే ఉంది. అయితే ఆ కళ్ళు ఎవర్నీ చూడటంలేదు. గుర్తించడం లేదు. సీలింగును చూస్తున్నాయి.
ఇందుమతి మంచం దగ్గరకు వెళ్ళబోయింది. సునంద చెయ్యి పట్టుకొని వారించింది.
"ఏమ్మా!"
"వద్దు. గుర్తు పట్టకపోతే ఫర్వాలేదు. ఒకసారివచ్చిరాని గుర్తుతో సతమతమై పోతుంది. అప్పుడు ఆమె పడే బాధ ఇంతింత కాదు" అన్నది సునంద.
నర్సింగ్ హోమ్ సూపరింటేండెంట్ తో లోపలకు వచ్చిన వ్యక్తిని ముగ్గురూ కళ్ళు పెద్దవి చేసుకొని చూశారు.
"డాక్టర్! ఎలాగైనా నా బిడ్డ దక్కేలా చూడండి."
రవి మాటకు ముగ్గురూ నోళ్ళు తెరచుకొని చూశారు.
"ఆ ప్రయత్నమే నిన్నటినుంచీ చేశాం. కాని, లాభంలేదు. మిస్టర్ రవీ, రాత్రికి జరిగిపోవాలి. ఒకవేళ జరక్కపోతే మేమే చెయ్యాల్సి ఉంటుందేమో! లేకపోతే పెద్ద ప్రాణానికే మోసం."
"అరుణ బ్రతకాలి డాక్టర్! అరుణ ప్రాణానికి హాని జరక్కూడదు. నా అరుణ నాకు దక్కితే చాలు."
"హూఁ! నా అరుణ! రాస్కెల్! ఎంత నటన! నిలువునా చీల్చినా పాపం లేదు." ఇందుమతికి అరిచి అరిచి అనాలనిపించింది. కాని, తనలో తనే గొనుక్కుంది.
సునంద తన చెవుల్ని తనే నమ్మలేకపోతోంది.
"ఎంత లేదన్నా భార్య కదా? నిజంగా కష్టం వచ్చేసరికి భరించలేక పోయాడు. చిన్నతనం.....కసిగా ప్రవర్తించాడే గాని, అరుణ మీద ప్రేమ లేక కాదుగా?" ఇలా ఆలోచించసాగింది విమల.
నర్సింగ్ హోమ్ సూపరింటేండెంట్ డాక్టర్ స్వప్న వెళ్ళిపోయింది.
"ఏమిటి ఆంటీ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు?" నవ్వుతూ అడిగాడు సునందను.
సునందకు ఏం చెప్పాలో తోచలేదు.
"అరుణ అంటే నాకు చాలా ఇష్టం. మీ మీద కోపంతో కొద్దికాలందూరం పెడ్తామనుకొన్నాను. ఇంతలో ఈ దారుణం జరిగింది. మొదటిబిడ్డను దారుణంగా చంపుకొన్న తండ్రిని అయ్యాను" అని ఇందుమతి కేసిచూశాడు.
ఆమె కళ్ళలో తిరస్కారం, ముఖంలో ఏవగింపు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
"మీరంతా అరుణను ఆదుకుంటున్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావడం లేదు."
ఎవరూ సమాధానం చెప్పలేదు.
"ఆంటీ మీ గొప్పతనాన్ని ఇంతకాలం నేను గ్రహించలేకపోయాను." సునంద దగ్గరకు వచ్చి అన్నాడు.
సునంద విస్మయంగా చూసింది.
"నీకు తన, పరాయి అనే బేధం లేదు. అన్యాయం చేసినవాడెవడైనా వదిలి పెట్టవు....."
సునందకు ఏం మాట్లాడాలో తోచనట్టుగా ఇబ్బందిగా ముఖం పెట్టింది.
"వెరీ గుడ్____గో ఆన్ మిస్టర్ రవీ!" ఇందుమతి వ్యంగ్యంగా అన్నది.
"ఇందూ నీకు నా మాటల్లోని నిజాయితీ ఇప్పుడు అర్ధం కాదు. ఆంటీని నేను అర్ధం చేసుకోని మాట నిజమే. కాని తన కాబోయే అల్లుడి మీద పోలీసులకు రిపోర్టు ఇచ్చిందంటే-హాట్స్ అప్ టు ఆంటీ!"
"షట్ అప్ ఐ సే! ది సీజ్ టూ మచ్!" గట్టిగా అన్నది ఇందుమతి. "ఇందూ! ఇది ఆసుపత్రి__మరిచిపోకు!" విమల ఇమ్దుమతిని శాంతపరిచింది.
"ఇందూ! నీకో న్యూస్!" అన్నాడు తాపీగా రవి.
ఇందుమతి చీదరించుకుంటున్నట్టుగా చూసింది.
"సారీ! నీకే కాదనుకో అందరికీ న్యూసే!"
"ఏమిటది?" సునంద ఇప్పటికి నోరు తెరచింది.
"గౌతమ్ వచ్చాడు.
"వచ్చాడా? ఎక్కడున్నాడు?" ఆత్రుతగా అడిగింది సునంద.
పోలీసు స్టేషన్ లో!"
"ఓ!" నీరసంగా అన్నది సునంద.
ఇందుమతి నిటారుగా నిల్చుంది.
"పోలీసులు అరెస్టు చేశారా? ఎక్కడ దొరికాడు?" గౌతమ్ పరారీలో ఉన్నాడని భావిస్తున్న విమల అడిగింది.
"తనే స్వయంగా పోలీసులకు సరెండర్ అయాడట. తెలివైన పని చేశాడు" అన్నాడు రవి.
సునంద నిట్టూర్చింది.
"ఏ పోలీసు స్టేషన్ లో ఉన్నాడు?"
"సైఫా బాద్ పోలీసు స్టేషన్ లో."
ఇందుమతి గబగబ బయటికి వెళ్ళిపోయింది.
"ఇందూ! ఆగు." సునంద పిలుపుకు లక్ష్యంపెట్టకుండా వెళ్ళిపోయింది.
తిన్నగా పోలీసు స్టేషన్ కు వచ్చింది ఇందుమతి.
ఇన్ స్పెక్టర్ ను అడిగి గౌతమ్ తో మాట్లాడ్డానికి పర్మిషన్ తీసుకుంది. ఆ ఇన్ స్పెక్టర్ గౌతమ్ కు తెలిసినవాడు. గౌతమ్ అంత పని చేశాడంటే అతడికీ ఆశ్చర్యంగానే ఉంది.
ఇందుమతి బెంచీమీద కూర్చుని ఉన్న గౌతమ్ ను చూసింది.
గౌతమ్ ఇందుమతిని చూసి చిరునవ్వు నవ్వాడు.
ఇందుమతి బొమ్మలా నిలబడిపోయింది.
అదే నవ్వు! మల్లెపువ్వులా స్వచ్చమైన నవ్వు. మనసులోన నిర్మలత్వాన్ని వెదజల్లే చల్లటి నవ్వు.
"రా ఇందూ! కూర్చో! అలాగే నిలబడి పోయావేం?"
ఇందుమతికి దుఃఖం పెల్లుబికింది.
గౌతమ్ గుండెలకు హత్తుకుపోయి బావురు మని ఏడవాలనిపించింది.
"కూర్చో ఇందూ!"
ఇందుమతి చిన్నగా కదిలి బెంచీకి రెండో చివర కూర్చుంది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకొనే ప్రయత్నంలో పై పళ్ళతో కింది పెదవిని నొక్కిపట్టింది.
"ఇందూ! ఏడుస్తున్నావా?"
ఇందుమతి ఒక్కసారిగా రెండు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.
"ఛ! ఏమిటి ఇందూ! నువ్వుకూడా మామూలు ఆడపిల్లలాగే చిన్న చిన్న విషయాలకు ఏడ్చేస్తే ఎలా?"
"ఇది చిన్న విషయమా?" అని అడగాలను కుంది. కాని, గొంతులో నుంచి మాటలు బయట పడలేదు.
"గౌతమ్ ఎందుకిలా చేశావ్?" వెక్కిళ్ళ మధ్య అడిగింది ఇందుమతి.
గౌతమ్ త్రుళ్ళిపడ్డట్టు చూశాడు ఇందుమతిని.
"మాట్లాడవేం?" కళ్ళు తుడుచుకుంది. గౌతమ్ కేసి చూసింది. అతడు తననే విస్మయంగా చూస్తున్నాడు.
"చెప్పు! నాకు సమాధానం కావాలి."
"ఇందూ!" గౌతమ్ కంఠం వణికింది.
"చెప్పు!"
"నువ్వు కూడా....."
"నమ్మలేదు."
"మరి అయితే.....?