అందరికీ ఆ అయిడియా నచ్చింది.
వాళ్ళంతా మీటింగ్ ముగించ వస్తోంటే మేము ఏమీ తెలీనట్లు, వేరే టాపిక్ మాట్లాడుకుంటూ వాళ్ళకి ఎదురువెళ్ళాం-
"హలో షైనీజీ! ఏమిటి? ఏదో మీటింగ్ కండక్ట్ చేసినట్లున్నారూ" అడిగాడు విజయ్ యాదవ్.
"అదే- లై డిటెక్టర్ ఒకటి కొందామని డిసైడ్ చేశాం కదా! ఆ విషయమే డిస్కస్ చేసుకున్నాం-" అంది షైనీ మా అందరివంకే అనుమానంగా చూస్తూ.
"ఓ! లై డిటెక్టరా! నిజంగా కొంటున్నారా అది?" అడిగాడు శంకరమూర్తి ఆశ్చర్యం నటిస్తూ.
"నిజంగా ఏంటి? మేము మీ మగాళ్ళులాగా అబద్దాలకోర్లనుకున్నారా? మేము అన్నీ నిజమే మాట్లాడతాం!" అంది జూరీ.
"కానీ అంత డబ్బు పెట్టి ఆ పనికి రాని మిషన్ కొనే బదులు- ఆ డబ్బుతో మన అపార్ట్ మెంట్స్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఉపయోగపడే వస్తువులెన్నో కొనుక్కోవచ్చు! ఫరెగ్జాంపుల్ - కంప్యూటర్లు, ఇంటర్నెట్, డి.టి.పి. ట్రైనింగ్- ఇలాంటివి లేడీస్ కి చాలా ఉపయోగపడతాయ్" అన్నాడు కృష్ణమూర్తి.
షైనీ మండిపడింది.
"చూడు కృష్ణమూర్తీ! నువ్ ముందు తెలుసుకోవలసిందేంటంటే నీ ఉచిత సలహాలు ఇక్కడెవరికీ అవసరం లేదు. రెండోదేంటంటే మా లేడీస్ కి ఏది అవసరమో ఏది అనవసరమో మాకు తెలుసు! ఆ విషయం మీలాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళనుంచి తెలుసు కోవాల్సిన ఖర్మ మాకేం పట్టిలేదు-" అంటూ షార్ప్ గా కట్ చేసేసరికి ఇంక ఎక్కువ మాట్లాడితే పరువుపోతుందని అక్కడి నుంచి బయటపడ్డాం.
"అన్నట్లు ఇంకో విషయం! ఈ లై డిటెక్టర్ వస్తే మీ గుట్టంతా ఎక్కడ రట్టవుతుందో అనే భయంతో మీరంతా కూడా సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకున్న విషయం కూడా తెలుసు ఆ లై డిటెక్టర్ ని మేము కొనకుండా మీ ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగించి అడ్డుపడాలని ప్లాన్ వేసుకున్న విషయం కూడా నాకు తెలుసు. ఎలా తెలిసింది అంటూ ఆశ్చర్యపోకండి! మా సీక్రెట్ ఏజెంట్స్ మాకూ ఉంటారు-" సి.బి.ఐ. చీఫ్ లాగా ఫోజు కొడుతూ మాట్లాడింది షైనీ!
ఇంకొక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటకు నడిచాం అందరం!
ఆ మర్నాడు లై డిటెక్టివ్ రానే వచ్చింది. దాని చుట్టూ లేడీస్ మూగిపోయారు.
షైనీ వాళ్ళందరికీ ఆ మిషన్ వర్కింగ్ గురించి చెప్తోంది.
"ఆ మిషన్ కి సాధారణంగా మూడు ఇండికేషన్స్ ఉంటాయ్- హార్ట్ రేట్స్ బట్టి ఒక పద్దతి. ఒప్పిరి పీల్చే పద్దతిని బట్టి ఇంకోరకం గానూ! చర్మంలో మార్పుల ద్వారా మరోరకంగానూ- అవతలి వ్యక్తి అబద్దాలాడుతున్నాడా, లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఎవరికి తమ ఫామిలీ మెంబర్స్ ఎవరయినా అబద్దాలు చెప్తున్నారని అనిపించినా ఇక్కడికి వాళ్ళని తీసుకొస్తే- ఆ మిషన్ ద్వారా వాళ్ళ జాతకం బయట పెట్టవచ్చు-" అంటూ వివరించిందామె.
అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.
సరిగ్గా అప్పుడే చాముండేశ్వరి హడావుడిగా కన్నీళ్ళతో వచ్చింది.
"షైనీ! నాకు తెలుసు ఖచ్చితంగా అబద్దం చెప్తున్నాడు! ఇవాళ ఎలాగయినా అతని అబద్దం బయట పెట్టాల్సిందే-" అంది ఆవేశంగా.
ఎవరికీ టాపిక్ అర్ధంకాలేదు.
"ఎవరి గురించి- నువ్ మాట్లాడుతోంది?" అడిగింది షైనీ.
"రమేష్ గురించి"
"రమేష్ ఎవరు?"
"నా హజ్ బెండ్-"
"ఓ! ఏం చేశాడతను?"
"ఆర్నెల్ల క్రితం చేసిన పనే మళ్ళీ చేశాడు-"
"నిన్న చేసిందే- ఆర్నెల్ల క్రితం చేశాడు-"
"వాళ్ళాఫీసులో పనిచేసే సుచిత్రతో కలసి ఆఫీస్ ఎగ్గొట్టి హోటల్లో కనిపించాడట మా బంధువులకి-"
"ఓ- ఎఫైరా?"
"అలాంటి దేమీలేదని- ఏదో పార్టీకెళ్ళానని అబద్దం చెప్తున్నాడు." అప్పుడర్ధమయింది షైనీకి.
"ఒరే ఓకే- సో- ఇప్పుడు మనం రమేష్ కి లై డిటెక్టర్ తగిలించి అతను చెప్పేది అబద్దమో నిజమో తేల్చుకోవాలి- అంతేనా?"
"యస్- ఇంతకాలం రమేష్ చెప్పినవన్నీ అనుమానంగా ఉన్నా నమ్మక తప్పేదికాదు- ఇప్పుడు అటో ఇటో తేలిపోవాలి-" అంది చాముండేశ్వరి.
"అవును! రమేష్ సంగతి తేల్చెయ్యాలి" అంటూ అరచారు కొంతమంది లేడీస్.
వెంటనే సెల్ ఫోన్లో రమేష్ కి ఫోన్ చేసింది చాముండేశ్వరి-
"హలో- ఎక్కడున్నావ్?" అడిగింది షార్ప్ గా.
"ఆఫీస్ లో- ఇంకెక్కడుంటాను?"
"హోటల్లో కూడా ఉండొచ్చుగా- సుచిత్రతో-"
"చాముండీ! అక్కడ పార్టీకెళ్ళామని చెప్పాను కదా"
"నేన్నమ్మను-"
"అయ్ కాంట్ హెర్పిట్-"
కాసేపు ఇద్దరూ ఫోన్లో గొడవపడ్డారు.
"ఓకే- అదంతా నాకనవసరం! నువ్ ఇప్పుడు వెంటనే ఇంటికి రావాలి-".
"ఎందుకు?"
"వచ్చాక చెప్తాను-"
"సరే-"
ఓ గంటలో ఇంటికి చేరుకున్నాడు రమేష్.
ఈలోగా ఆ మెషిన్ ఎలా పనిచేస్తుందో 'యూజర్ మాన్యువల్'లో చదివి బైహార్ట్ చేసింది షైనీ.
"ఇవిగో- వీటిని న్యూమోగ్రాఫ్స్ అంటారు. వీటిన్ని ఛాతీకి చుట్టి అప్పుడు మనం ప్రశ్నించటం మొదలుపెట్టాలన్నమాట! ప్రశ్నించటంలో కూడా రకరకాల పద్ధతులుంటాయ్.
సాధారణంగా ఎక్కువమంది వాడే పద్దతి పేరు 'కంట్రోల్ కొశ్చెన్ టెస్ట్' అంటారు. అంటే సడెన్ గా, డైరెక్ట్ గ కొశ్చెన్ చేయటమన్నమాట-"
తనకు లై డిటెక్టర్! టెస్ట్ చేయబోతున్న విషయం తెలుసుకునేసరికి రమేష్ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశాడు.
"నేనేదో క్రైమ్ చేసినట్లు ఈ టెస్ట్ లేమిటి? నేనొప్పుకోను-" అన్నాడు గాబరాగా.
"వప్పుకోపోతే నీకూ ఆ సుచిత్రకూ ఎఫైర్ ఉందని వప్పుకో" అంది చాముండేశ్వరి ఆవేశంగా.
"యస్- లై డిటెక్టర్ టెస్ట్ జరగాల్సిందే" అంది రమేష్ అత్తగారు. మగాళ్ళెవరకూ ఏమీ మాట్లాడటం లేదు. ఎవరి మనసుల్లో వాళ్ళు రేపు మన పరిస్థితేంటి?' అనే షాక్ లో కెళ్ళిపోయారు.
చివరకు రమేష్ లై డిటెక్టర్ టెస్ట్ కి వప్పుకోక తప్పలేదు.
ఆ మిషన్ చైనాలో తయారయిన చౌక రకందయినా- అందులో సైరన్ ఫెసిలిటి ఉంది.
"ఆ మిషన్ తగిలించాక మనం వేసిన ప్రశ్నకి ఎవరయినా అబద్దం చెప్తేచాలు- మిషన్ వెంటనే ఫాక్టరీ సైరన్ లాగా శబ్దం చేస్తుంది.