ఒకవేళ ఆ కాండేట్ నిజం చెప్తే- ఏ శబ్దమూ లేకుండా నిశ్శబ్దంగా ఊరుకుంటుంది.
మిగతావాళ్ళకెవరికీ ఎక్స్ పీరియన్స్ లేదు గనుక షైనీనే రమేష్ ని కొశ్చెన్ చేసే అధికారమిచ్చింది చాముండేశ్వరి.
రమేష్ పరిస్థితి చూస్తే మాకందరికీ చాలా జాలిగా ఉంది. అతనో బలిపశువులా కనిపించాడు మాకు.
"చూడు మిస్టర్ రమేష్! ఇప్పటికయినా మించిపోయింది లేదు. అందరి ఎదురుగ్గా అబద్దాల కోరుగా ఫ్రూవ్ చేసుకోవటం కంటే ముందే మీ మిసెస్ తో సీక్రెట్ గా మాట్లాడుకొని మీ ఇద్దరూ రాజీకి రావటం మంచిది. ఏమంటారు?" అడిగింది షైనీ- తనే పెద్ద పోలీసాఫీసరులాగా.
రమేష్ సంగతేమోగానీ- ముందు మామగాళ్ళందరికీ చెమటలు పట్టేస్తున్నయ్.
రమేష్ మొఖంలో కూడా భయం స్వప్నంగా కనబడుతోంది.
"సో-" అంది షైనీ తన వాచ్ చూసుకుంటూ-
"మీరు లై డిటెక్టర్ ని ఫేస్ చేయడానికే నిర్ణయించుకున్నారన్నమాట" అందామె.
"యా!" అన్నాడు రమేష్ జీరబోయిన గొంతుతో.
"కంగ్రాచ్యులేషన్స్ రమేష్! మన అపార్ట్ మెంట్స్ లో ఈ 'లై డిటెక్టర్' టెస్ట్ కి ఎన్నికయిన మొదటి కాండిడేట్ మీరే! మీ పేరు మన అపార్ట్ మెంట్స్ చరిత్రలో గోల్డ్ కలర్ అక్షరాలతో లిఖింపబడుతుంది" అందామె.
రమేష్ పరిస్థితి ఇంకొంచెం దిగజారింది.
షైనీ మిషన్ కున్న రెడ్ బటన్ ప్రెస్ చేసింది. వెంటనే మిషన్ చిన్న పాటి శబ్దంతో 'ఆన్' అయింది.
వెంటనే షైనీ కొశ్చెన్ ని ఘాట్ చేసింది.
"మిస్టర్ రమేష్! మీకూ మీ కొలీగ్ సుచిత్రకూ మధ్య అక్రమ సంబంధం ఉంది! కదూ?"
రమేష్ కంగారుగా "లేదు! అలాంటిదేమీ లేదు-" అన్నాడు.
అతని మాట పూర్తవ్వకుండానే మిషన్ నుంచి సడెన్ గా సైరన్ పెద్దగా మోత పెట్టింది.
షైనీ విజయగర్వంతో చాముండేశ్వరి వేపు చూసింది.
"చూశారా! మీ అనుమానం నిజమే! రమేష్ అబద్దం చెప్తున్నాడు-" అందామె.
"దిసీజ్ టూమచ్- అలా సైరన్ మోగినంత మాత్రాన నేను అబద్దం చెప్పాననటం అన్యాయం-" అన్నాడు రమేష్ గొడవ చేస్తూ.
"చూడండి రమేష్! మనిషి అబద్దం చెప్తాడు గానీ మిషన్ ఎప్పటికీ అబద్దం చెప్పదు-" అంది షైనీ.
"ఇప్పుడే మంటారు?" అంది చాముండేశ్వరి రమేష్ ని నిలదీస్తూ.
"ఇలాంటి అల్లుడిని ఉప్పులో పాతరవేయాలి" అంది అతని అత్తగారు కోపంగా.
"చాముండీ! ప్లీజ్ బిలీవ్ మీ! మన పెళ్ళయాక నేను ఎప్పుడయినా ఒక్కసారయినా అబద్దం చెప్పానా? ఒక్కసారి ఆలోచించు! ఇంతకాలం లేంది ఇప్పుడెందుకు అబద్దం చెప్తాను?"
"నువ్వెన్నయినా చెప్పు! నీ మాటలయితే నమ్మేదాన్నేమోగాని- ఈ లై డిటెక్టర్ ఇంత స్పష్టంగా చెప్పాక ఇంక నిన్ను ఛస్తే నమ్మను-"
"ఆ మిషన్ కరెక్ట్ కాదు చాముండీ!"
"అక్కడికి నువ్ కరెక్ట్ అయినట్లు" అంది అతని అత్తగారు.
ఇంక లాభం లేదని తను జోక్యం చేసుకున్నాడు హమీద్ మియా.
"మిస్టర్ రమేష్! ఇస్ దునియామే అందరూ తప్పులు చేస్తయ్! లేకిన్ ఆ తప్పులు మనం రిపీట్ చెయ్యవ్! తప్పు చేసినందుకు రిపెంట్ అవుతయ్! సారీ చెప్తుయ్! కాంప్రమైజ్ అవుతయ్-" అన్నాడు వచ్చే సొసైటీ ఎన్నికల్లో తనకు పడే లేడీస్ ఓట్లు దృష్టిలో పెట్టుకుని-
లేడీస్ అంతా తప్పట్లు కొట్టారు.
"మాకు సరిగ్గా అర్ధం కాకపోయినాగాని చాలా బాగా చెప్పారు హమీద్ గారు" అంది మంజులత.
షైనీ రమేష్ ఛాతీకి చుట్టిన వైర్లు తీసేసింది.
రమేష్ వాడిపోయిన మొఖంతో అక్కడినుంచి వేగంగా వెళ్ళిపోయాడు. లేడీస్ అంతా చాముండి చుట్టూమూగారు.
"పట్టుదలతో మీ హజ్ బెండ్ అబద్దాలు చెప్పాడని రుజువు చేశారు. యూ ఆర్ గ్రేట్" అంది సీతావరదరాజన్.
"మరి మీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షనేంటి?" అడిగిందొకావిడ.
"ఇంక డిసైడ్ చేసుకోలేదు-"
"ఈ ఒక్కసారికీ వార్నింగిచ్చి వదిలెయ్యండి. అంతమంచి మొగుడు ఇంకోడు దొరకాలంటే చాలాకష్టం" అంది షైనీ.
"నేనూ అదే అనుకుంటున్నా" అంది చాముండి.
ఆ రాత్రి అపార్ట్ మెంట్స్ లో మగాళ్ళెవరికి నిద్రపట్టలేదు. నెక్స్ట్ టర్న్ ఎవడికొస్తుందో అన్న భయంతోనే తెల్లార్లూ గడిపారు.
"వీలయినంతవరకూ మనం పెళ్ళాలతో నిజాలు చెప్పటమే మంచిది" అన్నాడు శంకరమూర్తి మర్నాడు ఉదయం విజయ్ యాదవ్ కలిసినప్పుడు.
"నేనూ అదే ఆలోచిస్తున్నా! కానీ అన్నీ నిజాలే చెప్తే- కొంపకొల్లేరయిపోతుందికదా!"
"ముందు నుయ్యి- వెనుక గొయ్యి" అన్నాడు కృష్ణమూర్తి.
అందరూ భయపడుతున్నట్లే- ఆ రాత్రి రెడ్ హాండెడ్ గా వాళ్ళావిడకి దొరికిపోయాడు. ఆ రాత్రి అతను ఇంటికి చేరుకునేసరికి పదకొండయింది.
"నిజం చెప్పండి! ఎక్కడున్నారు ఇంతసేపూ!" అంటూ నిలదీసింది వాళ్ళావిడ.
"ఆఫీస్ లో కొంచెం పనెక్కువుండి......" అంటూ గొణిగాడు రెడ్డి.
"ఆఫీస్ లో మీ పక్క సీటతనే ఇందాక మీ కోసం ఇంటికి ఫోన్ చేశాడు" అందామె. రెడ్డి షాకయ్యాడు.
"అలాగా! అదేంటి? నేను బాస్ రూమ్ లో కూర్చుని ఫైల్స్ గురించి డిస్కస్ చేస్తున్న విషయం అతనికి తెలీదేమో-"
"నిజం చెప్పండి మీరు కూర్చుంది బాస్ రూమ్ కాదు! బార్ రూమ్! బార్ కెళ్ళి మందుకొట్టి వచ్చారు కదూ?"
"మందా? ఏం మాట్లాడుతున్నావే- నేను మందుకొట్టటమా? అసలా టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు మనకి"
"అదుగో చూడండి! గప్పున వాసన కూడా కొడుతోంది-"
"ఛ ఛ! అంది కారాకిళ్ళీ వాసనే-"
"అలాగా! మరి మీ మొఖంలో అంత సంతోషం ఎందుకు కనబడుతోంది? ఇంటికొచ్చే ముందు డిప్రెస్ గా, చిరాకుగా వస్తారు కదా రోజూనూ! నన్ను చూస్తేనే మొఖం అదోలా పెడతారు కదా-"
రెడ్డి కంగారు పడ్డాడు!
"నామొఖంలో సంతోషం కనబడుతోందా? ఇంపాజిబుల్! నేను నార్మల్ గా- డిప్రెస్ గానే ఉన్నా-"
"సరే ఇదంతా ఎందుకు? మీరు మందు కొట్టలేదంటారు- అంతేకదా!
"ఎగ్జాక్ట్ లీ-"
"అయితే రేపు లై డిటెక్టర్ పరీక్ష జరుపుదాం-"
రెడ్డి అదిరిపడ్డాడు.
"ఏంటే? నాకు లై డిటెక్టర్ టెస్టా?"
"అబద్దాలు చెప్పారు కాబట్టి తప్పదు-"