ఆ డైలాగ్ తో అందరూ టెర్రరైజ్ అయిపోయాడు.
"అదేంటి? జైలు కెందుకెళ్తాం?" అడిగాడు కృష్ణమూర్తి కొంచెం భయపడుతూనే.
"ఎందుకేంటి? ఒక ఇమేజినేషన్ సీనేసుకో- డీ-302లో ఉండే టీచర్ రూపాదేవికి సంతకం పెట్టకుండా లవ్ లెటర్ ఎవరు రాస్తున్నాడో ఇంతవరకూ ఎవరికి తెలీదు- ఒక వేళ ఆ ఇద్దరు ముగ్గురు అనుమానితులకీ - వాళ్ళ భార్యలు లై డిటెక్టర్ కి తగిలించారనుకో! ఎవడొకడు దొరక్కా తప్పదు- దొరికాక జైలు కెళ్ళకా తప్పదు-"
ఇమేజిన్ చేసుకుంటూనే కృష్ణమూర్తి వణికిపోవటం మేమంతా గమనించాం!
మా అనుమానం నిజమయింది.
ఆ పనిచేసింది ఖచ్చితంగా వాడే అయుంటాడు.
"అలాగే షైనీ ఇంటిముందు ఆ అమ్మాయి ప్రతి బర్త్ డే కి గులాబీ పువ్వు పెట్టేవాడిని కూడా షైనీ ఆ లై డిటెక్టర్ సాయంతో పట్టేస్తుంది-" అన్నాడు విజయ్ యాదవ్.
కృష్ణమూర్తి ఇంకా బెదిరిపోయాడు.
"ఇంతకూ ఇప్పుడేం చేద్దామంటారు మరి? ముందు మన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయండి-" అసహనంగా అన్నాడు శంకరమూర్తి.
అందరికంటే శంకరమూర్తికి ఎక్కువ భయంగా ఉంది.
ఆ లై డిటెక్టర్ వస్తే తను రోజో ఆఫీస్ లో సిగిరెట్లు తాగుతున్న విషయం భార్యకు తెలిసిపోతుంది.
అడపాదడపా ఫ్రెండ్స్ తో కలసి మందు పార్టీల్లో కూర్చుంటున్న సంగతీ బయట పడిపోతుంది.
ఒక రకంగా చెప్పాలంటే సంసారం నరకమయిపోతుంది.
"మనం ఎవ్వరం ఏం చెప్పినా ఆ షైనీ వినిపించుకునే టైప్ కాదు. అసలే హెడ్ స్ట్రాంగ్ కాండిడేట్! పైగా మగాళ్ళ మీద ఒకలాంటి ద్వేషం! దానికి తగ్గట్లు ఒమన్స్ లిజ్ లో యాక్టివ్ మెంబర్-" అన్నాడు మొహిందర్ సింగ్.
"ఎవరయినా మంచి అయిడాలుంటే చెప్పండి - ఏదొక ప్లాన్ చేసి ఆ మిషన్ మన అపార్ట్ మెంట్స్ కి రాకుండా చూడాలి-" అన్నాడు విజయ్ యాదవ్.
అందరూ తెగ ఆలోచించారుగానీ ఎవరికీ ఏమీ తట్టటంలేదు.
"ఆ మిషన్ రాకుండా ఆపటం మన వల్లకాదు బాసూ! కాకపోతే వచ్చాక దాని బారినుండి తప్పించుకోడానికి ఉపాయాలు ఆలోచించటం బెటరు-" అన్నాడు కృష్ణమూర్తి.
హఠాత్తుగా శంకరమూర్తి లేచి నిలబడ్డాడు.
"మనందరం అనవసరంగా ఓవర్ రియాక్ట్ అవుతున్నామేమో అనిపిస్తోంది నాకు!" "అంటే?" అర్ధంకాక అడిగాడు రెడ్డి.
"అదే- ఆ లై డిటెక్టర్ అనేది లీగల్ గా, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన మిషన్ కాదు. అది సెంట్ పర్సెంట్ పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. కోర్టులో కూడా దానిని ఋజువుగా గానీ, సాక్ష్యంగా గానీ వప్పుకోరు-అలాంటప్పుడు మనం మాత్రం ఎలా యాక్సెప్ట్ చేస్తాం!"
అందరికీ ఆ పాయింట్ నచ్చింది.
కొంతమంది తప్పట్లు కొట్టారు.
"యా! శంకరమూర్తి నిజంగా జీనియస్! అందుకే ఫాక్ట్స్ ని తవ్వి బయటకు తీశాడు. కోర్ట్ వప్పుకోనిదే ఆ మిషన్ ని ఎవరు మాత్రం స్టాండర్డ్ గా తీసుకుంటారు? కనుక ఆ మిషన్ మనకు వ్యతిరేకంగా సైరన్ మోగించినా మనం టోటల్ గా రెప్యూట్ చేయవచ్చు-" అన్నాడు మొహిందర్ సింగ్.
హమీద్ మియా తలగోక్కున్నాడు.
"ఆ మాట నిజమే ఉన్నయ్! లేనిన్- మన లేడీస్ మన మాట నమ్మయ్! అని ఆ మిషన్ నే నమ్ముతయ్-"
ఆ డైలాగ్ తో అందరూ మళ్ళీ నిరుత్సాహ పడిపోయారు.
రాత్రి పదింటివరకూ మీటింగ్ జరిగింది గానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
"ఇప్పుడింక మనం చేయగలిగిందేమీ లేదు. ఆ మిషన్ ని రానీండి! వచ్చాక అప్పుడు పరిస్థితుల్ని బట్టి ఆలోచిద్దాం" అన్నాడు రెడ్డి.
అక్కడితో- అందరూ డిస్పర్స్ అయిపోయారు.
మరో రెండు రోజుల్లో లై డిటెక్టర్ ని రామ్ భరోసా అపార్ట్ మెంట్ సొసైటీ లేడీస్ వింగ్ ప్రెసిడెంట్ షైనీ కొనబోతోందన్న విషయం అపార్ట్ మెంట్స్ లో ఉన్న లేడీస్ అందరికీ ఎక్కడ లేని సంతోషాన్నీ కలిగించిందన్న విషయం వాళ్ళ మొఖాలు చూస్తేనే తెలిసిపోతోంది.
"ఈ మగాళ్ళు ఎంత. చీటర్స్ అంటే- వాళ్ళు అబద్దం చెప్పని విషయం అంటూ ఏమీ ఉండదే! రాత్రి లేటుగా ఇంటికొస్తారు కదా? ఏమిటంత లేటుగా వచ్చారని అడిగితే అబద్దం! ఆ సెల్ ఫోన్లో ఇందాక ఎవర్తో మాట్లాడుతున్నారు. అనడిగితే అబద్దం! ఇవాళ మందుకొట్టి వచ్చారు కదూ! అనడిగితే కొత్తరకం కిళ్ళీ వేసుకున్నానని అబద్దం- పేకాటలో డబ్బుపోయిందా, చికాగ్గా ఉన్నారని అడిగితే- ఇవాళ అయిదువేలు గెలిచానని అబద్దం! ఒకటేంటి- అసలు డిక్షనరీలో మగాడు అంటేనే అబద్దం అని అర్ధం రాయాలి-" ఆవేశంగా తన చుట్టూ చేరిన లేడీస్ తో చెప్తోంది కృష్ణవేణి.
వెంటనే మంజులత తన ఎక్స్ పీరియెన్స్ చెప్పటం మొదలుపెట్టింది.
ఒకసారేం జరిగిందో తెలుసా? ఆ మధ్య నాకు వంట్లో బాగోక హాస్పిటల్లో చేరాను కదా! ఎందుకో నేను చచ్చిపోతానేమో అని భయం వేసి మా ఆయనతో ఒక డెలికేట్ విషయం మాట్లాడాను.
"చూడండి! ఒకవేళ నేను పోతే ఇంకో పెళ్ళి చేసుకోనని ప్రామిస్ చేయండి అనడిగాను" ఛ! మనం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం కదే! ఇంకో పెళ్లి ఎలా చేసుకోగలను చెప్పు-" అని ఆయననేసరికి నాకు ఆనందం కలిగింది.
"చూడండి ఒకవేళ ఏ కారణంచేతనయినా ఇంకో పెళ్ళి చేసుకుంటే మాత్రం నా నెక్లెస్ దానికివ్వకండి! అది నా కూతురికే ఇవ్వాలి-" అన్నాను.
ఆయన వెంటనే కోపంగా నావంక చూసి "నీకేం పిచ్చా, వెర్రా! నేనసలు పెళ్ళే చేసుకోనని చెప్తున్నా కదా! అదీగాక ఆ అమ్మాయికి నెక్లెస్ లంటే ఇష్టం ఉండదు- చెయిన్ టైపే లైక్ చేస్తుంది-" అన్నారాయన.
"చూశారా! ఇంత అబద్దాలకోరుతోనా నేను సంసారం చేస్తోంది అని నాకు ఏడుపొచ్చింది-" అంది మంజులత కన్నీళ్ళు పెట్టుకుంటూ-
ఇలా అందరూ తలో ఎక్స్ పీరియన్స్ చెప్పుకోవటం మొదలు పెట్టేసరికి వాళ్ళల్లో వాళ్ళకి సంఘీభావం తెగపెరిగిపోయింది.
అంతవరకూ 'పతియే ప్రత్యక్షదైవం' అనుకున్న టైప్ కూడా మొగుడే పరోక్ష మాయల మరాఠీ" అనే కేటగిరీ లోకి మారిపోయారు.
వాళ్ళందరి సపోర్ట్ చూసుకుని షైనీ మరి రెచ్చిపోయి స్పీచ్ లివ్వటం మొదలుపెట్టింది.
"నిజానికి మగాడు మాట్లాడే ప్రతిమాట వెనుకా ఎంతోకొంత అబద్దం దాక్కుని ఉంటుంది. ముఖ్యంగా భార్యతో చెప్పే మాటల్లో నూటికి తొంభయ్ పాళ్ళు అబద్దాలే! మొన్నటికి మొన్న నేనూ, మా ఫ్రెండ్ సంధ్య నగల షాప్ కెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూశాము.
అతను ఒక ఖరీదయిన ఉంగరం తెచ్చి షాపతనికి ఇచ్చి దాని మీద 'రాధికకు ప్రేమతో' అన్న అక్షరాలు రాయిస్తున్నాడు. ఎంత దారుణమో చూశారా?" అందరూ ఆ సమయంలో అలాంటి మగాడికి మరణ శిక్షే ఉత్తమమన్న ధోరణితో మాట్లాడారు.
వాళ్ళవ్యవహారమంతా మా సొసైటీ మేల్ మెంబర్స్ అంతా రహస్యంగా కనిపెడుతూనే ఉన్నాం!
"నన్నడిగితే మనందరం కలసి వాళ్ళ మీటింగ్ దగ్గరకెళ్ళి అలాంటి కాస్ట్ లీ మిషన్ కొనటం వృధా అని చెప్పేద్దాం! ఆ డబ్బు మన అపార్ట్ మెంట్ లేడీ మెంబర్స్ కి ఇంకో రకంగా ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తే బాగుంటుందని సలహా ఇద్దాం!" అన్నాడు శంకరమూర్తి.