Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 35


    "నేను ధనుంజయ్ ని కాదు"
    "మైగాడ్"
    "మైగాడ్ కూడా కాదండీ! నాపేరు సింహాద్రి"
    "సింహాద్రా?" ఆశ్చర్యంగా అంది శ్రీదేవి.
    "సింహాద్రా?" ఆశ్చర్యంగా అడిగాడు కల్నల్. "పేరెక్కడో విన్నట్లుందే" ఆలోచిస్తూ అన్నాడు.
    "వినే వుంటారండీ! నా పేరు కూడా అదే" అన్నాడు సింహాద్రి.
    "షటప్" అన్నాడు కల్నల్.
    "మోసం! ఇంపరసొనేషన్" అంది శ్రీదేవి కోపంగా.
    ధనుంజయ్ కి పరిస్థితి అర్ధమయిపోయింది.
    తనకంటే ముందే మరొకడు తన పేరుతో శ్రీదేవి బర్త్ డే పార్టీ కొచ్చి హోరా హోరీ యాక్షన్ చేసేస్తున్నాడన్న విషయం చాలా చిరాకు కలిగించింది.
    "దిసీజ్ టెరిబుల్" అన్నాడు కల్నల్ తో.
    కల్నల్ శ్రీదేవి వేపు చూశాడు. శ్రీదేవి సింహాద్రి వేపు చూసింది. సింహాద్రి చిరంజీవి వేపు చూశాడు. చిరంజీవి కల్నల్ వేపు చూశాడు.
    "వెంటనే పోలీసులను పిలిపించండి" అన్నాడు ధనుంజయ్.
    "పోలీసులా?" అడిగాడు చిరంజీవి.
    "అవును"
    "పోలీసులెందుకు?"
    "ఎందుకేమిటి? ఇది చీటింగ్ కింద వస్తుంది. సెక్షన్ ఐ.సి.సి. 420"
    "రాదు" అన్నాడు చిరంజీవి.
    "రాదా?" కోపంగా అడిగాడు ధనుంజయ్
    "ఏమాత్రం రదు"
    "ఎందుకని?"
    "ఎందుకంటే ఇది చీటింగ్ కాదు కాబట్టి"
    "నీకెలా తెలుసు?"
    "నేను ఓ లాయరు ఇంటిపక్కన కొన్నాళ్ళు అద్దెకున్నాను"
    "ఆల్ రైట్ సెక్షనేదయినా కానీ! ముందు వాడిని అరెస్ట్ చేయాలి"
    "నాట్ నెసెసరీ"
    కల్నల్ కి పిచ్చెక్కిపోతోంది.
    "స్టాప్ దిస్ నాన్సెన్స్"అంటూ అరచాడు గట్టిగా.
    ధనుంజయ్ అదిరిపడ్డాడు.
    "మళ్ళీ మీరేనా అరచింది?" అన్నాడు గుండెలు చేత్తో పట్టుకుని కల్నల్ వంక చూస్తూ.
    "అవును"
    "మీకు చెప్పానుగదండీ అలా అరవగూడదని! చిన్నప్పుడు అంటే సెవెన్త్ క్లాసులో మా హిందీ మాష్టారు నేను కాపీ కొడుతూండగా చూసి..."
    "షటప్" మళ్ళీ పిస్టలు పైకి తీసి అరచాడు కల్నల్.
    అంతా నిశ్శబ్దం అయిపోయింది.
    కల్నల్ శ్రీదేవి వంక చూశాడు.
    "ఏం బేబీ? పోలీసులను పిలిచి వేడిని అప్పగిద్దామంటావా?" సలహా అడిగాడు.
    "ఏయ్ మిస్టర్" సింహాద్రి వంక చూస్తూ పిలిచింది శ్రీదేవి.
    "ఏమిటండీ"
    "ఎందుకీ నాటకమాదేవ్ నువ్వు?"
    సింహాద్రి ఈ అవకాశం కోసమే చాలా సేపటినుంచీ ఎదుర్చూస్తుండడం వల్ల అడగగానే ఠకీమని అందుకున్నాడు.
    "అసలు జరిగిందేమిటంటేనండీ. మీరు రాసిన లెటర్, పంపిన ఫోటో ధనుంజయ్ ఒరిజినలు అడ్రస్ ప్రకారం నాకు అంటే మా రూమ్ కి వచ్చింది..."
    "సైలెన్స్" సింహాద్రి వంక చూస్తూ అరచాడు కల్నల్.
    "వీడికి పిచ్చెక్కినట్లు నాకు చాలా అనుమానంగా ఉంది" అన్నాడు శ్రీదేవితో.
    "అబ్బే లేదండీ! యూ ఆర్ మిస్టేకన్" అన్నాడు చిరంజీవి.
    "డోంటాక్ నాన్సెన్స్"
    "సంగతేమిటంటే అదివరకు ఈ రచయిత ధనుంజయ్ ఉన్న ఇంట్లో సింహాద్రి అద్దెకు దిగాడండి! దిగాక శ్రీదేవిగారు ధనుంజయ్ కి పంపిన ఫోటో వీడి చేతిలోపడిందంతే! ఆ ఫోటో చూసి శ్రీదేవిగారిని గాఢంగా ప్రేమించాడండీ! ఆమె ప్రేమను పొందడానికి వేరేమార్గం లేక ఇలా ధనుంజయ్ గా యాక్షన్ చేశాడండీ'
    "వ్వాట్? ఈ డెకాయిట్ మా బేబీని ప్రేమించాడా?"
    "నేను డెకాయిట్ కాదండీ! క్రాఫ్ చెదిరిపోయింది. అంతే!"
    "టు హెల్ విత్ యువర్ క్రాఫ్. నువ్వు మా బేబీని ప్రేమించావా?"
    "అబ్బే. అది మిమ్మల్ని చూడకముందు సంగతండి"
    ధనుంజయ్ ఇంక ఆలస్యం చేయలేకపోయాడు.
    "ఇంకా చూస్తారేమిటి? ముందు అర్జంటుగా పోలీసులకు ఫోన్ చేయండి! మీ ఇంట్లో ఫోన్ లేదూ?" కల్నల్ నడిగాడతను.
    కల్నల్ కి ఆ ప్రశ్నతో వళ్ళు మండిపోయింది.
    "మిస్టర్! నువ్ మేడమీదకు పద ముందు" అన్నాడు కర్కశంగా.
    "నేనా?"
    "అవును?"
    "ఎందుకు?"
    "నినను ఇక్కడ షూట్ చేస్తే ఫర్నిచర్ పాడవుతుంది"
    "వ్వాట్?" అదిరిపడ్డాడు ధనుంజయ్ "నన్ను షూట్ చేస్తారా?"
    "అవును!"
    "నేనెవరనుకుంటున్నారు? ప్రఖ్యాత రచయిత ధనుంజయ్ ని."
    'అందుకే షూట్ చేయడం. బై ది బై నీకు ఏదంటే ఇష్టం? పిస్టలా, రివాల్వరా, త్రీనాట్ త్రీ రైఫిలా? దేంతో కాల్చమంటావో నువ్వే చెప్పు. ఛాయిస్ నీకే ఇస్తున్నా..."
    "ఇదన్యాయం! నన్నెందుకు కాలుస్తున్నారు?"
    "లేపోతే హిప్నాటిజం మీద నవలలు రాసి మా శ్రీదేవి బ్రైన్ పొల్యూట్ చేసేస్తావా?"
    "అందులో తప్పేముంది? అయ్ లైక్ హిప్నాటిజం! అయ్ లవ్ హిప్నాటిజం! అయ్ ఎడోర్ హిప్నాటిజం! అండ్ అయ్ ప్రాక్టీస్ హిప్నాటిజం'
    "హిప్నాటిజం- గిప్నాటిజం అంతా ట్రాష్" అరచాడు కల్నల్.
    "అవునండీ! అంతా ట్రాష్" అన్నాడు చిరంజీవి.
    "బోగస్" అన్నాడు కల్నల్.
    "రబ్బిష్" అన్నాడు చిరంజీవి.
    "నేనొప్పుకోను" అన్నాడు ధనుంజయ్.
    కల్నల్ కి అప్పటికప్పుడే అతనిని కాల్చిపారేద్దామన్నంత కోపం వచ్చింది. పిష్టల్ పైకితీశాడు గానీ పెరిగిపోయిన బులెట్స్ ధర గుర్తుకొచ్చేసరికి కొంచెం తగ్గాడు. ఇలా ఎవరికీ వారిని విడివిడిగా కలుస్తూ కూర్చుంటే బులెట్స్ ఖర్చు తడిసి మోపెడవుతుంది.
    "అయితే నన్ను అర్జంటుగా హిప్నటైజ్ చెయ్యి చూద్దాం" అతని దగ్గరగా నడుస్తూ అన్నాడు కల్నల్.
    "ఇప్పుడా?"
    "ఈ క్షణంలో"

 Previous Page Next Page