Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 34


    అతని వాలకం చూసి వంటమనిషి బయపడిపోయింది. కెవ్వున కేకవేసి వెళ్ళి కల్నల్ వెనుక దాక్కుంది.
    "స్టాపిట్" బిగ్గరగా అరచాడు కల్నల్.
    ధనుంజయ్ అదిరిపోయి మాట్లాడటం ఆపేశాడు.
    "ఎవరు అరచిందిప్పుడు?" అన్నాడు చుట్టూ అందరినీ కలియజూస్తూ.
    "నేను" అన్నాడు కల్నల్.
    "ఎందుకలా అరచారు?"
    "నా ఇష్టం!" ఇంకా కోపంగా అన్నాడతను.
    "అలా అరవకండి. చిన్నప్పటినుంచీ నాకు అరుపులంటే భయం. గుండెల్లో దడవస్తుంది. ఎప్పటినుంచీ అలా జరుగుతోందో తెలుసా? సెవెన్త్ క్లాస్ చదివే టప్పుడు మా హిందీ మాస్టారు నేను కాపీ కొట్టటం చూసి బిగ్గరగా అరచారు అప్పుడు..."
    "ఐసే షటప్" మళ్ళీ అరచాడు కల్నల్.
    ధనుంజయ్ నిస్సహాయంగా వంట మనిషివేపు చూశాడు.
    "శ్రీదేవిగారూ! నన్ను ఆహ్వానించి ఏమీ మాట్లాడరేమిటి?" అన్నాడు దీనంగా.
    "శ్రీదేవి నేను కాదు" అంది వంట మనిషి.
    "ఆ... మీరు కాదా?"
    "కాదు" చిరాకుగా అందామె.
    "మరెవరు?"
    "అదిగో ఆ అమ్మాయిగారు"
    "ఏ అమ్మాయిగారు? మీరా?" శ్రీదేవి వంక చూస్తూ అడిగాడతను.
    "అవును" అందామె ముక్తసరిగా.
    "ఓ! అయామ్ సారీ! ఆమెను చూసి మీరనుకున్నాను. సారీ! వెరీసారీ! గ్లాడ్ టు సీయూ- గ్లాడ్ టూ మీట్ యూ! నిన్నే మీరు పంపిన ఇన్విటేషన్ అందింది - కొంచెం లేట్ గా చేరిందనుకోండి! అయినా ఫర్లేదు. బెటర్ లేట్ దేన్ నెవర్!"
    బైది వే నేనిప్పుడు అదివరకటి ఇంట్లోలేను. అడ్రస్ మారింది ఇప్పుడు మా ఇంటి నంబరు 6-3-8-12-269-268-ఎహెచ్ ఎన్- ఎస్ హెచ్ ఎల్ ఆ తర్వాత..... ఆ తర్వాత సారీ! ఆ తర్వాత మర్చిపోయాను. రెండు నిమిషాలు టైమిస్తే డయిరీ చూసి చెప్పేస్తాను" అన్నాడు బ్రీఫ్ కేస్ తెరవబోతూ.
    "అక్కర్లేదు" అంది శ్రీదేవి హడావుడిగా.
    "అక్కర్లేదా?"
    "అక్కర్లేదు"
    "ఎందుకని? ఓకే.... ఓకే తర్వాత ఇస్తాను! అన్నట్లు ఇవాళ మీ పుట్టిన్రోజు కదూ! ముందు నన్ను గ్రీటింగ్స్ చెప్పనీండి! హాపీ బర్త్ డే టూ యూ.... హాపీ బర్త్ డే టూ యూ.....మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టూ యూ"
    కల్నల్ కి తిక్క పూర్తిగా రేగిపోయింది. ముందు ఆ బర్త్ డే స్లోగన్స్ కట్టించెయ్యకపోతే కోపంతో తనకి పిచ్చెక్కడం ఖాయమని అనుమానం వచ్చేసింది.
    "స్టాప్ దిస్ నాన్సెన్స్" ఇల్లెగిరిపోయేలా అరచాడు.
    "అలా అరవద్దని ఓసారి చెప్పాను గదండీ! నాకు గుండె దడ వస్తుంది. మీకిందాక చెప్పాను కదా- నేను సెవెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా హిందీ మాష్టారు....."
    "అయ్ సే షటప్" పిస్టల్ కిటికీలోంచి గాలిలోకి పేలుస్తూ అన్నాడు.
    అందరూ అదిరిపడ్డారు.
    ధనుంజయ్ నిశ్శబ్దం అయిపోయాడు.
    "నిజం చెప్పు! ఎవడివి నువ్వు?" అన్నాడు కల్నల్ పిస్టల్ అతని గుండెలకు గురిపెట్టి.
    "అదేమిటి? చెప్పాను కదా! నేను రచయిత ధనుంజయ్ ని" ఆశ్చర్యంగా అన్నాడతను.
    "నాన్సెన్స్" మళ్ళీ అరిచాడు కల్నల్.
    "ఏమిటి నాన్సెన్స్?"
    "నువ్ చెప్పేదంతా నాన్సెన్స్"
    "ఎందుకని?"
    "రచయిత ధనుంజయ్ ఇడుగో వీడు" సింహాద్రిని చూపిస్తూ అన్నాడు కల్నల్.
    "వ్వాట్?" అదిరిపడ్డాడు ధనుంజయ్.
    "యస్! రచయిత ధనుంజయ్ వీడు"
    "ఇంపాజిబుల్ ఇందులో మోసం ఉంది. రచయిత ధనుంజయ్ ని నేను"
    కల్నల్ కి చిరాకు పుట్టుకొచ్చింది.
    సర్వీస్ మొత్తంలో నాలుగు యుద్దాల్లో పాల్గొన్నాడు గానీ ఎప్పుడూ ఇంతటి క్లిష్టమయిన పరిస్థితి రాలేదు.
    "బేబీ" నెమ్మదిగా పిలిచాడాయన.
    "యస్ డాడీ!"
    "అసలీ ధనుంజయ్ పేరుగల రచయితలెంతమంది ఉన్నారు?"
    "ఎందుకు డాడీ?"
    "ఒక్కొక్కరినీ వెదికి కాల్చడంకంటే అందరినీ పోగుజేసి ఒకచోట వరుసగా నిలబెట్టి కాల్చేస్తే బులెట్స్ వేస్ట్ కావుకదా! బైదిబై ఇప్పుడు బులెట్ ధరలు పెరిగిపోయాయ్. నీకు తెలుసా?"
    "తెలీదు డాడీ! ఎంత పెరిగాయ్?"
    "ఫిఫ్టీ పర్సెంట్! కెన్ యూ ఇమేజిన్?"
    "మైగాడ్"
    "స్టీప్ రైజ్" అన్నాడు చిరంజీవి.
    కర్నల్ మెచ్చుకోలుగా చిరంజీవివేపు చూశాడు.
    "ఎకానమీ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్" అన్నాడు చిరంజీవి మరింత ఉత్సాహంగా.
    "ఎగ్జాట్లీ" అన్నాడు కల్నల్.
    శ్రీదేవి కోపంగా సింహాద్రి దగ్గరకు నడిచింది.
    "ఎవర్నువ్వు?" అంది అనుమానంగా.
    "నిజం చెప్పేస్తాను" అన్నాడు సింహాద్రి.
    "రెండు నిమిషాలు టైమిస్తున్నాను" అన్నాడు కల్నల్.
    "దేనికి?" అడిగాడు సింహాద్రి.
    "ఇద్దరిలో ఎవరు ఒరిజినలో ప్రూవ్ చేసుకోడానికి"
    "ఎలా ప్రూవ్ చేసుకోవడం?" భయంగా అడిగాడు ధనుంజయ్.
    "అదంతా నాకు తెలీదు! ఇప్పుడు టైమ్ పన్నెండూ నలభై రెండు నిమిషాలు" అన్నాడు కల్నల్.
    "ఒకవేళ ఇద్దరూ ప్రూవ్ చేసుకోలేకపోతే?" అడిగాడు చిరంజీవి.
    "ఓకే బులెట్ తో ఇద్దరి పనీ పూర్తవుతుంది! నిజానికి సేనదే జరగాలని కోరుకుంటున్నాను. బులెట్స్ ధర ఎంత పెరిగిపోయిందో నీకు చెప్పాను కదూ?"
    "అవునండీ! ఫిఫ్టీ పర్సెంట్ రైజ్"
    "కరెక్ట్! టైమ్ పన్నెండూ నలభై మూడు" అన్నాడు కల్నల్ టైమ్ చూసుకుని.
    సింహాద్రికి చెమటలు పట్టేస్తున్నాయ్. ధనుంజయ్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఏ క్షణంలోనయినా స్పృహ తప్పేట్లున్నాడు.
    "పన్నెండూ నలభై నాలుగు" అన్నాడు కల్నల్  పిస్టల్ పైకి తీస్తూ.
    "ఓ మాగజైన్ లో నా ఫోటో వుండాలి. చూస్తానుండండి' అంటూ తన బ్రీఫ్ కేస్ తెరిచాడు ధనుంజయ్.
    "శ్రీదేవిగారూ" నెమ్మదిగా మాట్లాడాడు సింహాద్రి.
    "ఏమిటి?"

 Previous Page Next Page