Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 36


    "ఆల్ రైట్" ఉత్సాహంగా అన్నాడు ధనుంజయ్.
    "ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. మీరు నా వంకే చూస్తూండండి" అన్నాడు అతని కళ్ళల్లోకి చూస్తూ."
    "చూస్తున్నాను" అన్నాడు కల్నల్.
    "నాకళ్ళలోకే చూడండి"
    "చూస్తున్నాను"
    "మీరు నావంకే చూస్తున్నారు మీరు నావంకే చూస్తున్నారు మీరు నావంకే చూస్తున్నారు" అన్నాడు ధనుంజయ్ కల్నల్ కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూస్తూ.
    "అవును చూస్తున్నాను. ఇందాకే చెప్పానుగా ఆ విషయం?" చిరాగ్గా అన్నాడు కల్నల్.
    "మీరు నిద్రపోతున్నారు- నిద్రపోతున్నారు- నిద్రపోతున్నారు" తిరిగి అన్నాడతను.
    "ఏడ్చావ్! నేను మేలుకునే ఉన్నాను" అన్నాడు కల్నల్ కోపంగా.
    "మేలుకునే ఉన్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు ధనుంజయ్.
    "అవును!
    "కొంచెం కూడా నిద్రపట్టటం లేదా?"
    "అరవీసం కూడా లేదు"
    "పోనీ మగతగా ఉన్నట్లనిపిస్తోందా?"
    "రవ్వంత కూడా అనిపించటం లేదు"
    "అయ్ సీ" అన్నాడు ధనుంజయ్!"
    అతనికి ఎక్కడలేని చిరాకూ పుట్టుకొచ్చింది. తను చాలామందిని హిప్నటైజ్ చేశాడుగానీ ఎక్కడా ఇలా దెబ్బతినలేదు. కిక్కురుమనకుండా హిప్నటైజ్ అయిపోయి చెప్పిన పనల్లా చేసేవాళ్ళు.
    "ఆల్ రైట్" అన్నాడు ధనుంజయ్ అని మరింత తీక్షణంగా కల్నల్ కళ్ళల్లోకి చూస్తూ "మీరు కళ్ళుమూసుకున్నారు.. కళ్ళు మూసుకున్నారు..... కళ్ళు మూసుకున్నారు?" అన్నాడు.
    "మూసుకోలేదు. తెరచే ఉన్నాను. కనబడ్డంలా?" అడిగాడు కల్నల్.
    "ఎందుకని మూసుకోలేదు?"
    "ఎందుకు మూసుకోవాలి?"
    "ఇలా మీరు ఎదురుప్రశ్నలేయకూడదు" అన్నాడు ధనుంజయ్ ఉక్రోషంగా.
    "నాయిష్టం! నేను వేస్తాను"
    "అలా మీరు ఎదురుతిరగ్గూడదసలు"
    "నాయిష్టం! నేను తిరుగుతాను"
    ధనుంజయ్ కి కోపం వచ్చింది కాని అణిచేసుకున్నాడు.
    "ఆల్ రైట్! ఇంకోసారి ట్రై చేస్తాను" అన్నాడు.
    "మీరు నిద్రపోతున్నారు- నిద్రపోతున్నారు - నిద్రపోతున్నారు"
    "పిచ్చివాగుడు వాగకు! నేనేం నిద్రపోవటంలేదు"
    "అలా అయితే ఇంపాజిబుల్" అన్నాడు ధనుంజయ్.
    "ఏమిటి ఇంపాజిబుల్?"
    "మిమ్మల్ని హిప్నటైజ్ చేయడం సాధ్యంకాదు!"
    "ఏం... ఎందుకని?"
    "హిప్నాటిజంకి లొంగనివాళ్ళు చాలామంది వుంటారు. అందులో మీరొకరు"
    "ఎందుకని లొంగరు వాళ్ళు?"
    "అదంతేనండీ! దటీజ్ సైంటిఫిక్ లా"
    "ఆల్ ట్రాఫ్" అరచాడతను.
    "ట్రాష్ కాదు"
    "ట్రాష్ కాకపోతే రబ్బిష్! అదీగాకపోతే యింకోటి"
    "ఆల్ రైట్! మీ యిష్టం. ఎవరి అభిప్రాయం వాళ్ళది"
    "అవునా అందుకే నిన్ను మేడమీదకు రమ్మనేది"
    "మేడమీదకెందుకు? నా నవల మీద మీ అభిప్రాయం చెప్పండి చాలు- దేర్ ఎండ్స్ ది మేటర్!"
    "నా అభిప్రాయం కూడా అదే! నిన్ను మేడమీదకు తీసుకెళ్ళి కాల్చటం"
    "అయితే మేము యింక వెళ్ళిపోవచ్చు కదండీ?" అడిగాడు సింహాద్రి.
    "మీరెక్కడికి?"
    "మా ఊరికండీ"
    "పోలీసులు రాందే ఎట్లా వెళ్తారు. నోనో యిక్కడి నుంచి కదలడానికి వీల్లేదు" అంటూ ఫోన్ తీసి డయల్ చేశాడు. "హలో పోలీస్! అర్జంటుగా బాంబ్ నిలయానికిరండి. యిక్కడ యిద్దరు పిచ్చివాళ్ళున్నారు"
    సింహాద్రి దిగులుపడిపోయాడు.
    "మమ్మల్ని క్షమించండి సార్. రచయిత వేషాల్లో యింత రిస్క్ వుంటుందని తెలీదు. తెలుస్తే వేసేవాళ్ళం కాదు ఇంకోటేదేనా సెలక్ట్ చేసుకునేవాళ్ళం" అన్నాడు దీనంగా.
    "షటప్"
    సరిగ్గా అప్పుడే డోర్ తెరచుకొని లోపలికొచ్చాడు విశ్వనాథం. అతని వెనుకే భావయ్య.
    సింహాద్రీ, చిరంజీవి ఇద్దరూ ఖంగారు పడిపోయారు.
    "ఇప్పుడేమంటావురా! పిచ్చివున్నట్లు యాక్షన్ చేస్తావా? చెయ్ రా! చెయ్! యిదిగో భావయ్య ఎవరో తెలుసా? మేజిస్ట్రేట్! నీకు నిజంగానే పిచ్చివుందని సర్టిఫికెట్ యివ్వడానికి వచ్చాడు."
    కల్నల్ కి సహనం పూర్తిగా చచ్చిపోయింది.
    ముక్కూ మొఖం, అడ్రసూ తెలీని జనం అంతా ఇష్టమొచ్చినట్లు నటించడానికీ, వాగడానికీ తన ఇంటినే ఎందుకు ఎన్నుకుంటున్నారో ఏమాత్రం అర్ధం కావడం లేదు. తనిలా ఊరుకుంటే కాసేపట్లో ఇలాంటి పిచ్చివాళ్ళతో ఇల్లు నిండిపోయి "హౌస్ ఫుల్" బోర్డ్ పెట్టాల్సి వస్తుంది.
    "హూ ఆర్ యూ?" అన్నాడతను విశ్వనాథం వేపు చూసి.
    "నువ్వెవరు?" అన్నాడు విశ్వనాథం ఎదురుతిరిగి.
    దాంతో కల్నల్ కోసం బోర్డర్స్ దాటేసింది.
    "బ్లడీఫూల్! నా ఇంట్లో పర్మిషన్ లేకుండా జొరపడింది కాకుండా, "నువ్వెవరు" అని నన్నే అడుగుతావా? గెటవుట్"
    భావయ్య కంగారుపడ్డాడు.
    "ఏమి విశ్వనాథం! నిండా తప్పు సేస్తిని. "సారీ" సెప్పు పెద్దసార్ వాడికి" అన్నాడు.
    "ఎందుకు చెప్పాలి? నేను చెప్పను"
    "చెప్పకపోతే బయటకు నడవండి! లేకపోతే గెంటాల్సివస్తుంది"
    విశ్వనాథం అదేమీ వినిపించుకోలేదు.
    "ఇప్పుడు మా సింహాద్రి కండిషన్ చూశారుగా! త్వరగా సర్టిఫికెట్ రాయండి" అన్నాడు భావయ్యతో.
    "వాట్ సర్టిఫికెట్?" అరచాడు కల్నల్.
    "ఆ సింహాద్రికిదా సైకలాజికల్ కండిషన్ చాలా ప్రమాదంలో ఉండాది. అదిదా సర్టిఫికెట్ ఇస్తుండాను"
    అని భావయ్య అక్కడే సోఫాలో కూర్చుని సర్టిఫికెట్ రాయడం ప్రారంభించాడు.
    "దిసీజ్ టు సర్టిఫై....."
    "గెటప్" అన్నాడు కల్నల్ తన పిస్టల్ భావయ్యకు గురిపెట్టి.
    అది చూడగానే భావయ్య పెన్ను, పుస్తకం క్రిందపడి పోయినయ్.
    "వ్వా వ్వా వ్వా వ్వా...." అన్నాడు లేచి నిలబడి.
    "ఇద్దరూ బయటకు నడవండి"

 Previous Page Next Page