Previous Page Next Page 
మనసున మనసై పేజి 35


    ఓ ఐదారు నిముషాల తరువాత అటెండరు వచ్చి జయంతిని సార్ పిలుస్తున్నారని పిలిచాడు. వాళ్ళకి పరిచయం చేయడానికేమో, ఆ రోజు పెళ్ళిలో కలిశాం అని చెప్పాడేమోనని విప్పారిన మొహంతో లోపలికి వెళ్ళి మనీషాని చూసి పలకరింపుగా నవ్వబోయింది. ఆ అమ్మాయి అది గుర్తించనే లేదు. ఈలోగా దివాకర్ చాలా దర్పం చూపిస్తూ జయంతి ముందుకు కొన్ని కాగితాలు తోసి 'ఇది వీళ్ళు లోనుకి అప్లై చేసిన కాగితం, ఇవి ష్యూరిటీ పేపర్లు... అంతా సరిగా వున్నాయో లేదో చూసి, చెయ్యాల్సినవి చేసి సంతకానికి పట్రండి. ఐవాంట్ దట్ పేపర్స్ విత్ ఇన్ టెన్ మినిట్స్ ఆన్ మై టేబిల్' అన్నాడు చాలా అధికారం చూపిస్తూ. 'ప్రొజెక్ట్ రిపోర్ట్ అది స్టడీచే...'ఏదో అనబోయింది.
    'ఐనో ఆల్ ద ఫార్మాలిటీస్....ఎవ్విరిథింగ్ ఈజ్ ఓకే, జస్ట్ ఎంటర్ ఇట్ ఇన్ ది బుక్స్-డూ ఇట్ క్విక్లీ.... వెంటనే కాషియర్ ని పంపండి' కరెక్ట్ గా అన్నాడు అసహనంగా చూసి-జయంతి మొహం మాడిపోయింది. పెద్ద ఆఫీసరు ఫోజు గొట్టి తన గొప్ప చూపిస్తున్నాడు. పెదాలు కొరుక్కుని మాడిపోయిన మొహంతో వచ్చి సీట్లో కూర్చుంది. కనీసం మనీషాకి తన పేరు కూడా చెప్పలేదు.
    గోపాలకృష్ణ ఉన్న చుట్టరికమైన చెప్పలేదు. భావిక పెళ్ళికి వచ్చినట్టు చెప్పలేదు. పెద్ద అథారిటీ చూపించాడు ఆవిడ గారిని ఇంప్రెస్ చేయడానికి. దెబ్బతిన్న అహంతో కాగితాలు ముందేసుకుంది. 'ఎవరావిడ' పక్క టేబిల్ అమ్మాయి అడిగింది కుతూహలంగా-'ఏమో నాకేం తెలుసు. విసురుగా అంది జయంతి. వాళ్ళు ఉన్నంతసేపు పెద్ద హడావిడి చేసి స్టాఫ్ ని పరిగెత్తించి, క్యాషియర్ ని వెంటనే మనీషా బ్యాంక్ అకౌంట్ నెంబరుకి ఎనిమిది లక్షలు ట్రాన్స్ ఫర్ చేయమని ఆర్డరు ఇచ్చి, మధ్యలో జయంతి మీద ఇంకా అవలేదా అంటూ విసుగు ప్రదర్శించి పెద్ద షో చేశాడు. వాళ్ళతో గల గల నవ్వుతూ మాట్లాడుతూనే వున్నాడు. పని అంతా అరగంటలో చేయించి వాళ్ళని బయటిదాకా వచ్చి సాగనంపాడు. వానజల్లు వెలిసినట్టయింది ఆఫీసులో. తరువాతైనా జయంతిని పట్టించుకోలేదు. 'సారీ వాళ్ళు తొందరలో వున్నారు. మంచి కస్టమర్ అందుకు అలా తొందరపెట్టాను అనైనా అంటాడనుకుంది. కనీసం తన వంకన్నా చూడకపోవడంతో ఆమె ఇగో దెబ్బతింది. ఏమనుకుంటున్నాడు తన గురించి తను, మనీషాతో పరిచయం అయిందగ్గిర నుంచి ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫోజులు కొడ్తున్నారు-కసిగా అనుకుంది. దివాకర్ పట్ల సదభిప్రాయం స్థానంలో ఏదో అయిష్టత చోటుచేసుకుంది ఆమెలో.
    
                                 * * *
    
    మరో నాలుగు రోజులలో మూడో నెల వచ్చీ రాగానే బాబుని తీసుకుని వాసంతి వెళ్ళిపోతుంది. 'ఇవాళ వెడుతున్నాను ఆదివారమేగా పొద్దునే వచ్చేయ్' అంది వాసంతి. ఆమాత్రం పిలుపు వుంటే చాలు, కాస్త ఈ ఏకాంతం నించి ఓ రోజన్నా తప్పించుకోగలిగితే చాలన్నట్టు ఉదయం పది గంటలకి ఇంటికి వెళ్ళింది.
    జయంతి వీధి గుమ్మంలోకి అడుగుపెడ్తుండగా వాసంతి అంటుంది. "ఇదిగో దమ్మూ, మీ ఆయన దివాకర్ తో జయంతి విషయం మాట్లాడినట్టు చెప్పకు సుమా, అది ఫీలవుతుంది' ఆ మాత్రం నాకు తెలియదా అక్కయ్యా, శుభవార్త అయితే ఎప్పుడో చెప్పేవాళ్ళం. అందుకేగా గప్ చిప్ గా వూరుకున్నాం....' అంది దమయంతి. ఓ! ఇదా సంగతి. తనకెవరూ ఏం చెప్పలేదు-అసలు గోపాలకృష్ణ మాట్లాడలేదా అన్న సందిగ్ధతలో తను సతమతమవుతుంది. అంటే, దివాకర్ ఇష్టపడలేదన్న మాట! మనీషాని చూసిన కళ్ళతో ఆయన గారికి ఇంకెవరు నచ్చుతారు! కోతికి కొబ్బరికాయ దొరికినట్టు దాని వెంట కుక్కలా తిరుగుతున్నాడు....ఈడియట్ పెద్ద అందగాడిననుకుంటున్నాడు. కాస్త ఎర్రగా బుర్రగా వున్నాడని విర్రవీగుదు అక్కసుగా అనుకుంది. ఎంత దులిపేసుకుందామన్నా ఈ వార్త ఆమెని ఓ కుదుపు కుదిపింది. ఆమెకి తెలియకుండానే ఆమె మొహం కళ తప్పింది. వెంటనే వెడితే తను వాళ్ళ మాటలు విన్నాననుకుంటారేమోనని కాసేపు నిలబడి లోపలికి వెళ్ళింది.
    'రావే వాసంతి ఆప్యాయంగా పిల్చింది. కాస్త నలిగినట్టు, మొహం కొంచెం  వాడినట్టు వున్న జయంతిని చూసి 'జయంతి చిక్కింది కదూ అక్కయ్యా ఇదివరకు కంటే' అంది దమయంతి. 'ఆ మరి అమ్మచేతి వంట తిని చల్ల కదలకుండా ఉన్నట్టేమిటి వేరే వుండమంటే, కాస్త ఉషారాణి వున్నప్పుడు అయితే చెరిసగం పని చేసుకునే వారు. ఇటు ఇంట్లో, అటు ఆఫీసు మాటలా ఏమిటి?' అంది వాసంతి.
    జయంతి నిర్లిప్తంగా ఓ నవ్వునవ్వి వూరుకుంది. "ఏమిటి నీ వొక్కర్తివే వెడ్తున్నావా బాబుతో' అంది- 'నాన్నగారు వస్తున్నారు దిగబెట్టడానికి, నీకు చెప్పలేదా' అంది బాబు మూడో నెల వచ్చిందేమో కాస్త వళ్ళుచేసి, రూపురేఖలు దిద్దుకుని ముద్దుగా వున్నాడు. 'ఇలాతే వాడిని' అంటూ అందుకుంది జయంతి. జయంతి కెపుడూ పిల్లలు ముద్దుముచ్చట్లు ఇలాంటి వాటి మీద కోరికలేదు. చంటి పిల్లలని ఎప్పుడూ దగ్గరగా చూడలేదు. ఎత్తుకోలేదేమో ఈ రోజు బాబుని ఎత్తుకుని వాడి మెత్తటి వళ్ళు, ఆ పాల బుగ్గలు, సాంబ్రాణి, పౌడరు - పాలవాసన అన్నీ కలిపి వస్తున్న కమ్మటి వాసన....జయంతిలో ఏదో తెలియని చిన్న కదలికను కల్గించింది. 'ఫరవాలేదే బాగానే ఎత్తుకున్నావే- చంటి పిల్లలంటే ఆమడదూరం పరిగెత్తే దానివి' అంటూ వచ్చింది పద్మావతి- కూతుర్ని చూసి 'ఏమిటలా వున్నావు, వంట్లో బాగాలేదా' అంది ఆరాగా చూసి.
    'ఏం బాగానే వుంది' అంది తలదించుకుని జయంతి. 'ఏం బాగున్నావు- కట్టెపేడులా తయారయ్యావు. ఇది వరకు బొద్దుగా, నిగారింపుగా వుండేది. ఏం వాసంతీ ఇది బాగా చిక్కలేదు....' అంది పెద్దకూతురి వంక చూసి. 'నేనూ అదే అన్నానమ్మా' అంది దమయంతి. 'నీవు చిక్కావు-నీ మొహం చూసుకో ఎలా వుందో' అంది జయంతి.

 Previous Page Next Page