Previous Page Next Page 
మనసున మనసై పేజి 36


    'సరే అది చిక్కిందంటే అర్ధం వుంది. వేవిళ్ళు గనుక చిక్కుతారు' అంది పద్మావతి. జయంతి ఓక్షణం అర్ధం కానట్టు చూసి అంతలోనే తట్టి దమయంతివైపు తెల్లపోతూ చూసింది. 'అదేమిటే లా తెల్లపోతావు' పెళ్ళయి సంసారం చేస్తే వేవిళ్ళకేం భాగ్యం' అంది వాసంతి నవ్వుతూ. దమయంతి సిగ్గుపడి 'ఏమిటో ఓ ఏడాది వద్దనుకున్నాం, ఏదో సరిగా నిర్ణయం తీసుకునే లోపల"
    'సర్లే కానీ, ఒకరిద్దరిని తొందరగా కనేసి ఫుల్ స్టాఫ్ పెట్టేయడం మంచిది. మనం పెద్దయ్యేవేళకి, మగాళ్ళు  రిటైరయ్యే వేళకి పిల్లల బాధ్యతలు తీరిపోవాలి.' అంది పద్మావతి. తన చెల్లెలుకి తన కంటే ముందు పెళ్ళవడం, అప్పుడే పిల్లల్ని కనబోవడం జయంతికి ఏదో తను వంటరి దాన్ననే భావం మరింతగా చుట్టుముట్టింది. రెండు మూడేళ్ళ క్రితం చేసుకుని వుంటే తనకీ ఈ పాటికి పిల్లలు పుట్టేవారేమో! - తనేమిటి ఇలా ఆలోచిస్తుంది. తనలో మార్పుకి తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది. 'కంగ్రాచ్యులేషన్' అంది దమయంతిని చూసి నవ్వి.
    'అందరికీ శుభాకాంక్షలు చెపుతూ అలాగే వుండు. నీకంటే చిన్నది తల్లికాబోతుంది, నీవింకా ఇలాగే వుండు' అంది పద్మావతి కాస్త బాధగా.
    "అమ్మా! అది వచ్చినరోజు దాని పెళ్ళి మాట ఎత్తితే అదసలు రాదు" వాసంతి అంది.
    "బాగుందే! మీరూరుకున్నట్లు నన్నెలా చూస్తూ ఊరుకోమంటావే? తల్లిప్రాణం నాది'
    "ఔనమ్మా! కానీ నీవే అంటావుగా టైము రావాలని అది వస్తే ఆగదుగా" జయంతి తల దించుకుంది. అదే ఇదివరకైతే తల్లి ఇలా మాట్లాడితే ప్రొటెస్ట్ చేసేది. ఏం మిమ్మల్నందర్నీ చూస్తూ ఊరుకోమని నేనంటే ఎందుకూరుకున్నారు? నోరుమూసుకుని ఉండు అని దబాయించి సంబంధాలు చూడొచ్చుగా అని అడగాలనిపిస్తుంది. ఆరోజు... తల్లి ఇంకా మాట్లాడి తనచేత "ఊ" అని పించొచ్చుగదా తనని ఒప్పించే ప్రయత్నం చెయ్యొచ్చుగా ఈ అక్కయ్య ఒకర్తి ఇంకా తను పాత జయంతే అనుకుంటోంది. తనెక్కడ దెబ్బలాడితే రావడం మానేస్తుందో అనుకుంటోంది. ఈ ఆరునెలలలో తను ఎంత మారిందో వీళ్ళకి తెలియడం లేదు కాబోలు. తనలో వగరు, పొగరు సగం తగ్గిపోయాయని వీళ్ళు గుర్తించడం లేదెందుకో?" అనుకుంది జయంతి.
    "ఏమిటే ఆ ఆలోచన? అమ్మ బాధ అమ్మది, నీవిలా పెళ్ళి చేసుకోకుండా ఉన్నావని ఒకబాద, ఒంటరిగా ఉన్నానని ఇంకోబాధ, నా మాట విని ఇంటికొచ్చేయ్ జయంతి" వాసంతి చెల్లెలు చేయిపట్టుకుంది.
    జయంతి గొంతునిండింది. కళ్ళల్లో నీకు తిరిగింది. ఏం ఎవరో ఒకరు వచ్చి తన సామానులన్నీ కట్టి అవతల పడేసి "పిచ్చి వేషాలేయకుండా ఇంటికి పద" అనొచ్చుగా?' 'నాన్నగారు మగాళ్ళు, ఇంటికి పెద్ద, ఆయనలా చేస్తే తనెలా ఎదురుచెప్పగలదు? ఎందుకు చేయరలాగ? దానికి బుద్ది రావాలని కదా కోపంగా వదిలేసారు? బుద్ది వచ్చింది, వస్తున్నానని తనెలా చెప్తుంది, ఆమాత్రం వీళ్ళకి తెలియదా? అనుకుంది జయంతి.
    "అక్కయ్య మొగుడు లేకుండానే చక్కగా ఆ కాపురం పెట్టుకుంది మనం చేతకానివాళ్ళం పెళ్ళి మొగుడు ఉంటే కాని ఇల్లువదిలే ధైర్యం లేదు మనకు. అక్కయ్యా చక్కగా మంచి టూ బెడ్ రూం ఇల్లు తీసుకుని ఫర్నిష్ చెయ్యి. బ్యాంక్ వాళ్ళు అద్దెఇస్తారుగా? ఆ వంటరి గది ఖర్మ నీకెందుకు? చక్కగా ఇల్లంతా ఫర్నిష్ చెయ్యి మగాళ్ళు రాబోయే పెళ్ళాం కోసం సామానులన్నీ కొంటారు. నీవు చక్కగా రాబోయే బావగారు కోసం అన్నీ రెడీ చేసుకో.  పెళ్ళి చేసుకుని 'మేం ఏం తక్కువ తినలేదు మీరేనేమిటి? మేమూ చేసి చూపించగలం, మీరు కాపురానికి వచ్చేసరికి అన్నీ రడీచేసాను" అని చెప్పొచ్చు, దమయంతి నవ్వుతూ హాస్యంగా అంది.
    'గాడిద పెద్ద జోకులేస్తుంది పెళ్ళి, మొగుడు అన్నీ అముర్చుకుని మాట్లాడుతుంది పెద్ద' వాసంతి నవ్వి 'ఇదేదో బాగానే వుందే? స్త్రీ పురోగమనం స్త్రీ అంత ఎదిగిందో  చూపించొచ్చు మగాళ్ళకి నీ ఇంటికే నేను రావడం ఎందుకు. నీవే నా ఇంటకిరా!" ఈ కాన్సెప్ట్ బాగుందే! సంభాషణ హాస్యంలోకి దిగింది.
    'అవున్లే అమ్మా? అన్నీ అమరిన మీరంతా ఇలాగే మాట్లాడతారు. 'ఏడవలేని ఓ నవ్వు నవ్వింది జయంతి.
    రైలు టైం వరకు కూర్చుని మాట్లాడుతున్న జయంతి మనసు దివాకర్ తనని రిజెక్ట్ చేసాడన్న విషయాన్ని పదేపదే గుర్తు చేస్తోంది. దానికి తోడు తండ్రి తనని అసలు పలకరించలేదు. ఆయనసలు పట్టించుకోలేదు. కిందటి మాటు బారసాల నాడూ అంతే! అసలు పలకరించనేలేదు. ఏదో ఆరోజు హడావుడి అనుకుని పట్టించుకోలేదు. ఈరోజు సపష్టంగా అయన తనతో మాట్లాడటం లేదు. తననింకా క్షమించలేదు అన్నది తట్టి ఉక్రోషం వచ్చింది. తను మరిచిపోయి ఇంటికి వస్తున్నాఆయన తండ్రి అయి కూడా తన గురించి అసలేం పట్టనట్లున్నారు. అంటే తననంత వదిలేసి ఊరుకున్నారన్నమాట. 'ఊరుకోండి' అని తనేగా ఆనాడు చెప్పింది. 'మీరెవరూ నాగురించి నా పెళ్ళి గురించీ బాధపడక్కర్లేదు' అని తనేగా అంది. ఏదో కోపంలో తనంటే అలా వదిలేస్తారా ఏ తల్లిదండ్రులైనా? ఉద్యోగం చేసుకుంటోంది తనబతుకు బతుకుతోంది భారం లేకుండా అని నిశ్చింతగా వదిలేసారు'. జయంతికి అందరి మీదా కోపం వస్తోంది. ఏదో చెప్పలేని దిగులు నిర్వేదం చుట్టుముట్టింది.
    "చంటిపిల్లాడు వెళ్ళగానే ఇల్లు ఎలా బోసిపోయిందో? అమ్మాయి వచ్చి నాలుగైదునెలలు ఉండి వెళ్ళిందేమో ఇల్లంతా చిన్న బోయింది" తల్లి వాసంతి, పిల్లాడు వెళ్ళగానే దిగులుగా అంది.

 Previous Page Next Page