Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 34

    "చౌదరిగారూ" హర్టయినట్టుగా చూశాడు విస్సు "మీ అభియోగానికి మొదటి జవాబు ఇంకా మీరిచ్చిన గడువు పూర్తిగాలేదని....ఇకపోతే కృషి అనే ఆడపిల్లని మానసికంగా హింసించడంలో నా పరిధిలు దాటి వెళ్ళాను. ఇంచుమించు ఓ శాడిస్ట్ లా ఆమెను ప్రతిక్షణమూ హింసిస్తూనే వున్నాను. అయితే కృషి మీరూ నేను అనుకున్నంత బలహీనురాలు కాదు... తెలివిలోగాని ధైర్యంలో గాని..."    
    "ఆపేయ్" అర్దోక్తిగా అరిచాడు చౌదరి "నీకోసం అయిదు లక్షలు పెట్టుబడి పెట్టడంలో గాని నిన్నక్కడకు పంపడంలో గాని నా వుద్దేశ్యం కృషిని ఇండియా నుంచి తరిమేయాలని....ఆమె గుణగణాల్ని శక్తి యుక్తుల్ని స్టడీ చేయమని గాదు."    
    విస్సూకి పట్టలేనంత కోపంవచ్చింది. అతడి అనుచరుడిలానో చేతికింద పనివాడిలానో చౌదరి శాసించడం నచ్చలేదు. అయినా తమాయించుకున్నాడు.    
    "మీకు కృషి ఈ దేశం నుంచి వెళ్ళిపోవడం కావాలి. అంతేగా"    
    "యస్"    
    "ఆ ప్రయత్నంలో మీరు నాకు సహకరించటానికి సిద్దంగా వుంటానని ముందే మాటిచ్చారు కదూ"    
    "అవును"    
    "అయితే ఓ పనిచేయండి" అతని రెస్పాన్స్ కోసం ఎదురు చూడకుండా అన్నాడు విస్సూ. "మీ అబ్బాయి రాజేంద్ర మూలంగా మోసపోయిన జీవితని మీ కోడలుగా చేసుకోండి"    
    విస్మయంగా చూసాడు చౌదరి. రాత్రి కృషి ఏ ప్రపోజల్ గురించి మాట్లాడిందో యిప్పుడు సరిగ్గా ఆ విషయమే చర్చిస్తున్నాడు విస్సు.    
    "మిస్టర్ విశ్వనాథ్" కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు చౌదరి. "నువ్వు అయిదు లక్షలూ వెనక్కి తిరిగి చెల్లించనవసరం లేదని నేను చెప్పింది నేను చెప్పిన పని నువ్వు చేస్తావని, చేయాలని....కాని ఇప్పుడు నువ్వు నేనేం చేయాలో సలహా ఇస్తున్నావ్"    
    "ఇది సలహా కాదు చౌదరిగారూ....ఇండియా విడిచి ఆ కృషి వెళ్ళటానికి తను పెట్టిన షరతు"    
    "ఆ షరతుకి నేను అంగీకరిస్తే నువ్వేం సాధించినట్టు"    
    "కోట్లరూపాయల డిఫెన్స్ కాంట్రాక్టు మీకు వచ్చేట్టు చేశాను. మీ మీద ఉద్వేగంగా దూకే కృషి చైతన్యాన్ని పక్కలో బాంబులా నిలబడి సగం అదుపు చేసాను"    
    "సారీ విస్సూ నీకూ నాకూ ఒప్పందం నువ్వు కృషి ఈ దేశం వదిలివెళ్ళేట్టు చేయడం. అంతవరకే మిగతా విషయాల్లో నీ జోక్యం నేను హర్షించలేను"    
    షాక్ తిన్నట్టుగా చూసేడు "అంటే జీవితనే ఓ ఆడపిల్ల జీవితానికి సంబంధించి న్యాయం చేయనంటారు."        
    "డబ్బుకోసం ఏ గడ్డి అయినా కరిచేవాడు యిలాంటి న్యాయాన్యాయాల గురించి మాట్లాడకూడదు."    
    చెళ్ మనిపించింది చౌదరి స్టేట్ మెంట్. ఒకనాడు కృషి తనగురించి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందో ఇప్పుడు చౌదరి అదే చెబుతున్నాడు కాకపోతే కృషిమాటల్లో ఆర్తివుంది. ఇతని స్టేట్ మెంట్ లో అధికారం ధ్వనిస్తూంది.    
    ఒక అవసరంకోసం ఓ సామ్రాజ్య పరిధిలో అడుగుపెట్టిన విస్సు లాంటి తెలివైనవాడికి అభిమానవంతుడికి ఈ మాత్రం షాక్ చాలు జ్ఞానోదయం కావటానికి తనకున్న వ్యక్తిగతమైన కక్షకి తనను చౌదరి ఆయుధంలా వాడుకుంటున్నాడని ఇంతకుముందే తెలిసినా విస్సూ ఈ రోజు దాకా ఇంతగా రియాక్టు కాలేదు కారణం విస్సూకి ఉపాధ్యాయ కుటుంబం పై వున్న కసి.....    
    "ఇంతవరకూ వచ్చింది కాబట్టి ఈ క్షణంలో నేనో విషయం మీకు చెప్పక తప్పదు చౌదరిగారూ" నిర్భీతిగా గొంతులో అణువంత హెచ్చరికని ధ్వనింపచేస్తూ అన్నాడు. "మీకు కావల్సింది కృషి ఈ దేశం వదిలి వెళ్ళటమే అయితే జీవితకీ రాజేంద్రకీ పెళ్ళిచేయండి. లేదూ మీకు నేను ఐదు లక్షలు చెల్లించడమే ముఖ్యమనుకుంటే..."    
    "చెప్పు"    
    "ఆ అయిదులక్షలూ కృషినుంచి తీసుకుని మీకు యివ్వాల్సి వస్తుంది"    
    అప్రతిభుడయ్యాడు చౌదరి "కృషి నీకెందుకిస్తుంది"    
    "జీవితనే ఓ ఆడపిల్ల జీవితాన్ని నేను చక్కదిద్దితే కృషి నాకు పదిలక్ష లైనా ఇవ్వటానికి వెనుకాడదు కాబట్టి".    
    చౌదరి నుదుట స్వేదం పేరుకుంది. అతడ్ని తెలివిగా కృషే ఈ పనికి నియోగించిందని బోధపడిపోయింది. అంటే తనతో పోరాటానికి విస్సుని ప్రేరేపిస్తూంది. అదికాదు ఆమె మేధస్సుకి చౌదరి ఆ క్షణాన కంగారుపడింది తను ఈ దేశం వదిలి వెళ్ళటానికి కృషి ఇలాంటి పెళ్ళి అనే కండిషన్ పెట్టడం ద్వారా ఓ ప్రముఖుడితో తను వియ్యమందే అవకాశానికి విఘాతం కలిగించబోతూంది. తన పరపతికి ముప్పు తేబోతుంది. కృషి ఎంత పటిష్టమైన పథకం అమలుచేయతున్నది అర్ధమైన చౌదరి తగ్గడం తప్పనిసరన్నట్టుగా ఓ అడుగు వెనక్కి వేశాడు. "చూడు విస్సూ...ఇకక్డ నువ్వు ఆలోచించాల్సిన విషయం మరోటుంది. రాజేష్ పెళ్ళి సెటిలయింది సామాన్యుడి కూతురితో కాదు ఓ కేంద్రమంత్రి బిడ్డతో. అది తెలిసిన కృషి నిన్ను ట్రాప్ చేయబోతూంది"   
    "ఇది ఓ ట్రాప్ గా నేను భావించడం లేదు చౌదరిగారూ" కృషి మాటలు అతడిపై ఎలాంటి ప్రభావం చూపించిందీ స్పష్టంగానే వ్యక్తం చేశాడు విస్సు. "నేను ఉపాధ్యాయ కుటుంబంపై కక్షకట్టింది నా తండ్రిని హత్యచేసి అది ఆత్మహత్యలా అతడు నిరూపించాడని నా తల్లి మతి భ్రమించి నా కుటుంబం చిన్నాభిన్నమైందని. ఇప్పుడు మీ అబ్బాయి మూలంగా మరో ఆడపిల్ల జీవితం అన్యాయం కాబోతూంది అంటే మరో కుటుంబం అశాంతికి మీరు కారణమవుతున్నారు అప్పుడు మీకూ ఉపాధ్యాయకీ తేడాలేదు. అలాంటి మీకు నేను సహకరించడంలో అర్ధం లేదు."    
    చౌదరి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అయినా నిభాయించుకున్నాడు. "అంటే నా ఒప్పందం కన్నా నీకు క్రుహ్సి ప్రపోజలే ముఖ్యమంటావు"    
    "నేను కసితో ఆ కుటుంబంలో అడుగుపెట్టడానికి మీ సహాయం తీసుకున్నవాడ్నే తప్ప డబ్బు తీసుకొని ప్రొఫెషనల్ క్రిమినల్ గా ఆలోచించే మనిషిని కాదు. దయుంచి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో....నా అయిదులక్షలే అనుకుంటే మీ ప్రత్యర్ధిగానైనా ఆ డబ్బుని నన్ను సంపాదించనివ్వండి. మీ నిర్ణయం వెంటనే తెలియ చేయనవసరం లేదు. ఇరవై నాలుగు గంటల టైమిస్తున్నాను"    
    వెళ్ళిపోయాడు విస్సు...    
    చౌదరికి చెమట్లుపట్టాయి. ఈ కథ యిలాంటి మలుపు తిరుగుతుందని అతడూహించలేదు. చివరి గెలుపు సరిహద్దులదాకా నడిచిన విస్సు ఇప్పుడు ఇలాంటి 'అల్టిమేటమ్' ఇవ్వడంతో ఆవేశం హద్దులు దాటుతున్నా ఏం చేయాలి అన్నది వెంటనే స్ఫురించలేదు....    
    అదిగో సరిగ్గా ఆ సమయంలో రాజేంద్ర వచ్చాడు తండ్రి దగ్గరికి....    
    "అంతా విన్నాను డాడీ"   
    "నికృష్టుడా..." అరిచాడు చౌదరి "నన్ను నాశనం చేసావ్"    
    నవ్వాడు రాజేంద్ర "నేను నీ కొడుకుని డాడీ నిన్నెలా నాశనం చేస్తాను....జీవితాని శాశ్వతంగా కడతేర్చబోతున్నాను"    
    "అప్పుడు నువ్వు జైల్లో సెటిలైపోతావు"    
    "ఆ భయం మీకు అక్కరలేదు..." క్షణం ఆగి ఓ పథకంలా అన్నాడు "మీరు విస్సు ప్రపోజల్ కి అంగీకరిస్తారు. అంటే అతడ్ని పిలిచి ఈ విషయం తెలియచేస్తారు. కాని ఈ లోగా నేను జెవెఇథ మరెక్కడికో పారిపోతాం జంటగా..."    
    "అర్ధం కావడం లేదు"    
    "సింపుల్ డాడ్ ఈ సాయంకాలానికల్లా నువ్వు విస్సుని పిలిచి జీవితకి నాకూ పెళ్ళి చేయటానికి ఒప్పుకుంటున్నట్టు నీ నిర్ణయం తెలియచేస్తావ్., కాని అప్పటికే నేను జీవితతో కలిసి ఓ హోటల్ రూంలో దాగుని వుంటాం మీ మొండితనంతో బ్రతుకుతో కలిసే అవకాశం లేని మేం యిద్దరం విషం తాగేసి అమర ప్రేమికులమై మిగిలిపోదామనుకుంటాం ....నిజంగా విషం తాగుతాం కూడా....అలా నోరు తెరవకండి.....తాగిన వెంటనే జీవిత చచ్చిపోతుంది. నేను తాగింది చాల స్వల్పం కావడంతో హాస్పిటల్లో కోలుకుంటాను.    
    ఇంకా చాలా వివరంగా చెప్పాడు రాజేంద్ర.    
    మతిపోయింది చౌదరికి. "తన వారసుడు బుర్రలో ఇలాంటి అనూహ్యమైన ఓ పథకం రూపు దిద్దుకోవడం చౌదరిని ఎంత ఉత్తేజపరిచిందీ అంటే అమాంతం కొడుకుని కావలించుకున్నాడు. "గర్వపడుతున్నాన్రా....ట్రిగ్గర్ నొక్కకుండా బులెట్ లా దూసుకుపోయి కృషి పథకంపై చావుదెబ్బ తీయగలిగే నీ ఆలోచన్ని మనసారా అభినందిస్తున్నాను"    
    అంతే-    
    అమర ప్రేమికుడిల నటించిన ఓ అమ్మాయి జీవితంతో ఆడుకున్న రాజేంద్ర పోలీసుల ఊహకి సైతం అందని ఓ హత్యకి పథకం వేసాడు.  
                                          *    *    *    *    
    అగ్ని నాలుకతో అసుర సంధ్యని స్పృశిస్తూ సూర్యుడు అస్తమిస్తున్న సమయాన-    
    ఎవరో తరుముతున్నట్టుగా కృషి ఇంటికి వచ్చాడు విస్సు.    
    అదే సమయానికి జీవితకూడా కృషితో బాటు అక్కడే వుంది.    
    "మీతో మాట్లాడాలి కృషి" అన్నాడు విస్సు ఉద్వేగాన్ని అదిమిపెడుతూ...   
    విస్సు వెంట మరో గదిలోకి నడిచి అంది "చెప్పండి"    
    "చౌదరి యీ పెళ్ళికి అంగీకరించడం లేదు. కాని రాజేంద్ర సుముఖంగా వున్నాడు."  
    "అలా అని మీకు చెప్పాడా"    
    "యస్....కేవలం తండ్రికి భయపడి జీవితని మోసం చేయటానికి సిద్దపడ్డట్టు నా దగ్గర ఒప్పుకున్నాడు. కాని జీవిత ఆత్మహత్యా ప్రయత్నం తెలిసాక బాగా రియాక్టయ్యాడు..."    
    "ఇప్పుడు తండ్రినెదిరించి ఆ పెళ్ళి చేసుకుంటానంటున్నాడా"    
    "అవును....జీవితతో బాటు కొన్ని రోజులపాటు ఎక్కడికయినా వెళ్ళిపోతానంటున్నాడు. ఆ తర్వాత పెళ్ళి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకువస్తానంటున్నాడు. ఉన్నదీ ఒక్కకొడుకే కాబట్టి ముందు కాదన్నా తర్వాత దారికి వస్తాడన్నది రాజేంద్ర నమ్మకం...."    
    వెంటనే జవాబు చెప్పలేకపోయింది కృషి.    
    "తప్పదు కృషి....మన పందెం మాట అటుంచితే జీవిత జీవితం చక్కబడాలి అంటే యిలాంటిదేదో జరగాలి పైగా రాజేంద్ర తనంతట తానుగా రియాక్టయి యిలాంటి ప్రపోజల్ కి సిద్దపడినప్పుడు నువ్వు సహకరించాలి"    
    "అంటే"   
    "రాజేంద్రతోబాటు వెళ్ళటానికి జీవితాని ఒప్పించాలి"    
    చాలా సేపు నిశ్శబ్దంగా వుండిపోయిన కృషి "రాజేంద్ర సిన్సియారిటీ మీద మీకంత నమ్మకం వుందా" అంది నిశితంగా చూస్తూ...    
    "రాజేంద్రమీద కాకపోయినా ప్రేమన్న పదం మీద నాకు నమ్మకం వుంది."    
    "అది నీ నోటినుంచి రావడం అసాధ్యం" అనబోయి ఆగిపోయింది కృషి "సరే" అంది ఆ తర్వాత జీవిత గదిలోకి వెళ్ళి ఏం చెప్పిందో మరో అయిదు నిముషాలలో జీవిత బయటికి నడిచింది.    
    బయట కారులో వెయిట్ చేస్తున్న రాజేంద్రని చూస్తూ కంట తడిపెట్టుకున్న జీవిత ఎందుకో దిగులుగా వెనక్కి మరలింది.   
    "నేను నీకు అన్నలాంటివాడ్ని" నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు విస్సు.... "వెళ్ళు" వెళ్ళిపోయారిద్దరూ....    
    ఆ క్షణంలో తన గురించి ఏమనుకుంటున్నదీ ఆలోచించలేదు విస్సు....గెలుపులాంటి అనుభూతికన్నా ఓ ప్రేమకథని గెలిపించిన అనంత సంతృప్తితో విస్సు వెనక్కి మరలబోయేటంతలో హాల్లో ఫోన్ రింగయింది.
    చౌదరి ఫోన్ చేసాడు.    
    "నీ ప్రపోజల్ కి అంగీకరిస్తున్నాను విస్సు. జీవితని నా యింటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను"    
    విస్మయంగా నిలబడిపోయాడు విస్సు.    
    సరిగ్గా అదే సమయానికి నగరంలోని ఓ ఖరీదయిన హోటలు గదిలో అడుగుపెట్టారు రాజేంద్ర జీవితలిద్దరు.    
    అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు...    
    "ఎందుకా కన్నీళ్ళు"   
    తలవంచుకుని నిలబడ్డ జీవిత కళ్ళు తుడిచాడు రాజేంద్ర. ఆ క్షణంలో అతడు తప్ప ఆమెను ఓదార్చగల వ్యక్తి శక్తి మరొకటి లేదన్నంత నమ్మకంతో రాజేంద్ర గుండెలపై వాలి బావురుమంది.    
    ఒక నమ్మకపు పునాదిపై నిలబడ్డ ఏ ఆడపిల్లయినా చాలా సులభంగా బేలన్స్ తప్పే అవకాశముందనే సత్యం తెలిసినవాడిలా బెడ్ పైకి లాక్కున్నాడు.    
    ఆమె ప్రతిఘటించలేదు.    
    ఆ శక్తి ఎప్పుడో కోల్పోయింది. మరోసారికి లొంగనిది మొదటి సారి జాగ్రత్త పడినప్పుడే అన్న నిజం తెలీని జీవిత ఈ క్షణాలే యిక శాశ్వతమన్నంత ఆర్తిగా అతడ్ని చుట్టేసింది.    
    పది నిముషాల పాటు పరిసరాల్ని మరిచిపోయింది కేవలం జీవిత మాత్రమే...మరో పది నిముషాల్లో జరిగే అనర్ధం గురించి ఆమెకు తెలీదు....    
    "నాకు భయంగా వుంది" ఈ మాట అన్నది జీవితకాదు రాజేంద్ర "నీకు తెలీదు మాడాడీ మనస్తత్వం....ఒకవేళ మనం మొండిగా పెళ్ళి చేసుకున్నా నిన్ను నాతో కలిసి బ్రతకనివ్వరు"    
    కంపించిపోయింది జీవిత కొన్ని క్షణాల క్రితం దాకా వున్న ధైర్యం సడలిపోయింది అంతలోనే 'నాకు అన్యాయం చేయకండి"    
    "పిచ్చిపిల్లా" ఆప్యాయంగా అభినయిస్తూ ఆమె తలని నిమిరాడు రాజేంద్ర "నిన్నిలా తీసుకొచ్చింది నీకు అన్యాయం చేయాలనికాదు...మనిద్దరికీ ఒకేసారి న్యాయం జరగాలనే చెప్పు....ఒకవేళ రేపు మన పెళ్ళయ్యాక డాడీ నన్ను నీకు దూరం చేయాలని ప్రయత్నిస్తే..."

 Previous Page Next Page