Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 34


    టైం అయిపోతోంది.
    
    "రాజీవ్! యు...ఆర్...మై..."
    
    "చిన్మయీ! బెస్ట్ ఆఫ్ లక్."
    
    "దే....ని....కి...?"
    
    టైమయిపోయింది.
    
    బయటనుంచి అమ్మాజీ బజర్ నొక్కుతోంది. చిన్మయి తలుపు తీసి తూలుకుంటూ వెళ్లి మంచంమీద పడుకుంది.
    
    కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మూతలుపడ్డ కనుదోయినుండి దీనమైన దుఃఖాశ్రువు.
    
                                               13
    
    మరో నాలుగయిదు రోజులు గడిచిపోయాయి. ఆనందమోహన్ ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు వెడుతున్నాడో కూడా తెలీటంలేదు. చిన్మయి కూడా అతన్ని గురించిన ఆలోచనలు మనసులోనికి రానివ్వకుండా అతన్ని పట్టించుకోకుండా వుండటానికి ప్రయత్నిస్తుంది. ఆ యింటివైపు కన్నెత్తయినా చూడటంలేదు.
        
    రాత్రుళ్ళు మాత్రం నిద్రపట్టటంలేదు. అలా పట్టకపోవటానికి కారణం ఆకర్షణ కాదు. అయోమయం ఇంకా చెప్పాలంటే ఆరాటం.
    
    కాంపోజ్!
    
    మనసు అటువైపు లాగేస్తోంది. ఒకటి రెండురోజులు మాత్రం నిగ్రహించుకుంది. తర్వాత ఆమెవల్ల కాలేదు. రాజీవ్ కు ప్రామిస్ చేసిన సంగతి గుర్తుంది.
    
    అయినా తప్పలేదు.
    
    ఒకటి... రెండు... మూడు... టాబ్లెట్స్ వేసేసుకుంటోంది.
    
    ఆ మగత ఆమెకు చాలా సుఖాన్నిస్తోంది.
    
    ఓ రోజు మధ్యాహ్నం...
    
    కిరణ్మయి స్కూల్ కెళ్ళింది. చిన్మయి ఒక్కతే హాల్లో సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని కూర్చుని వుంది.
    
    ఫోన్ మ్రోగింది.
    
    లేచి తూలుకుంటూ వెళ్లి రిసీవ్ చేసుకుంది.
    
    "నేను..." అంది అవతల్నుంచి ఆనందమోహన్ గొంతు.
    
    "ఏమిటి?" అంది తడబడే కంఠంతో.
    
    "మీకు... కోపమొచ్చిందా?"
    
    "దేనికి?"
    
    "నేను కనబడటంలేదని."
    
    ఒక్క నిముషం నిశ్శబ్దం.
    
    "చెప్పండి"
    
    "నువ్వు రాకుండా వుండాలనే కోరుకుంటున్నాను."
    
    "అంత నేరం చేశానా?"
    
    "ఇది నేరమో కాదో నాకు తెలీదు. నేను గృహిణిని. ఒక ఉదాత్తుడైన వ్యక్తి ఇల్లాలిని. ఓ చిన్నారి తల్లిని. పర పురుషుడితో స్నేహంగా వుండటం మంచిదికాదు."
    
    "కాని మన స్నేహంలో కల్మషంలేదు."
    
    "కావచ్చు. కల్మషం లేనివన్నీ మంచివనుకోవటం ఇంకో పొరపాటు."
    
    "మొన్న నీతో మాట్లాడదామంటే అవకాశమివ్వలేదు. మా వాళ్ళు నాకో సంబంధం చూశారు. ఆ అమ్మాయినిచ్చి పెళ్ళిచేద్దామని చూస్తున్నారు."
    
    "నిక్షేపంలా చేసుకో మీ ఇద్దరి మధ్యా ఎవర్నీ జొరబడనివ్వకు. ఈ ఇల్లు ఖాళీచేసి ఇక్కడ్నుంచి దూరంగా వెళ్లిపోయి హాయిగా కాపురం చేసుకో."
    
    "నేను చేసుకోను."
    
    "ఎందుకని?"
    
    "తెలీదు."
    
    "పోనీ ఇక్కడ్నుంచి వేరే ఇంటికి వెళ్ళిపో" అవతల్నుంచి జవాబు లేదు.
    
    "ఏమిటి మాట్లాడవు?"
    
    "నీతో మాట్లాడాలని వుంది."
    
    "వద్దు."
    
    "నిన్ను చూడాలని వుంది."
    
    "అక్కర్లేదు."
    
    "ప్లీజ్..."
    
    "వద్దు, వద్దు, వద్దు" అని ఫోన్ పెట్టేసింది.
    
    గుండెంతా చిక్కపట్టినట్లయింది. మరో కాంపోజ్ వేసుకుంది.
    
    ఓ పావుగంట గడిచింది. తల్లోని నరాలన్నీ తెగిపోతున్నట్లుగా వున్నాయి. మనసు ముక్కలై తునియలై ఎటో ఎగిరిపోతోంది.
    
    కాంపోజ్ టాబ్లెట్స్ ప్రభావంవల్ల చేతుల్లో, చేతివ్రేళ్ళల్లో చిన్న ట్రెమర్స్.
    
    బెడ్ మీదకెళ్ళి పడుకుందామనుకుంది. ఇంతలో బజర్ మ్రోగింది.
    
    తూలుకుంటూ వెళ్లి డోర్ తెరిచింది.
    
    బయట ఆనందమోహన్ నిలబడి వున్నాడు.
    
                                                                * * *
    
    చిన్మయి నిర్ఘాంతపోయినట్టు చూస్తూ నిలబడిపోయింది.
    
    "ఎందుకొ...చ్చావు?" అనడిగింది గొంతు పెగల్చుకుని.
    
    "రాకుండా వుండలేకపోయాను."
    
    ఏం చెయ్యాలి? "వెళ్ళిపో ఇక అట్నుంచి వెళ్ళిపో. నాకు మళ్ళీ జీవితంలో కనపడొద్దు" అని మొహంమీద  అనలేకపోతోంది.
    
    దీనంగా, అమాయకంగా, జాలిగా వుంది అతని మొహం.
    
    అలా చూస్తూ వుండిపోయి అప్రయత్నంగా దారిచ్చింది.
    
    అతను లోపలకడుగు పెట్టాడు.
    
    ఆమె కూర్చోమనలేదు. నీరసంగా, బాధగా వణికే మనసుతో, తూలే శరీరంతో అతనివంక రెప్పవాల్చకుండా చూస్తోంది.
    
    ఆమెవైపు ఓ అడుగు వేశాడు.
    
    కదల్లేదు. అలాగే వణికే బొమ్మలా నిలబడివుంది.
    
    ఇంకో అడుగు వేసి దగ్గరకు వచ్చేశాడు.
    
    రెప్పలచాటునించి కళ్ళు గ్రుచ్చి గ్రుచ్చి చూసుకుంటున్నాయి.

 Previous Page Next Page