మార్నింగ్ వాక్ కి వెళ్ళి బంగళాకొచ్చిన-
చీఫ్ జస్టిస్ సుఖరామ్ కారంత్, ఇంటిముందు ఆగిన కారుని చూసి గబుక్కున లోనికొచ్చారు.
లోన సోఫాలో కూర్చున్న చీఫ్ మినిస్టర్ త్రిభువనేశ్వరిని చూడగానే ఆశ్చర్యపోయారాయన.
చీఫ్ జస్టిస్ కారంత్ ని చూడగానే సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి లేచి నిలబడి నమస్కరించింది వినయంగా.
"వాట్ సి.ఎమ్. ఏమిటిలా వచ్చారు?"
ఆమె ఎందుకొచ్చిందో ఊహించడానికి ప్రయత్నిస్తున్నారాయన.
"మీరు మార్నింగ్ పేపర్లు చూసే వుంటారు" వెంటనే విషయంలో కొచ్చేసింది సి.ఎమ్.
"ఎస్-ఎస్ ఇట్స్ ట్రూ ట్రాజెడీ ఎట్లా జరిగింది?" ఆశ్చర్యంగా అడిగారాయన.
"లిక్కర్ ప్రొహిబిషన్ మీద మీరిచ్చిన స్టే ప్రభావం"
సుఖరామ్ కారంత్ సాలోచనగా ముఖం పైకెత్తి చూసారు త్రిభువనేశ్వరీదేవి వేపు.
"ఐ మీన్ ప్రభుత్వ సారా బారల్స్ లో, కల్తీ సారాని పంపించారు."
"ఎవరు?" వెంటనే సూటిగా అడిగాడాయన.
"ఎవరో మీకూ తెలుసు, నాకూ తెలుసు."
"నెక్స్ట్! ఏం చేస్తోంది గవర్నమెంటు? రేపు అసెంబ్లీలో ప్రతిపక్షాలు దీనిమీద గొడవ చేస్తాయనుకుంటాను" అన్నారాయన.
"ప్రతిపక్షాల వరకెందుకు- గవర్నర్- ఎర్లీ మార్నింగ్ గవర్నర్ నుంచి ఫోన్- ఈ సంఘటన మీద వెంటనే రిపోర్ట్ పంపమని."
"ఇలాంటి సంఘటన మరోసారి జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది బీ సీరియస్" పెద్దరికంతో అన్నారాయన.
ఆ అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు త్రిభువనేశ్వరి.
"అందుకే మీ సహాయం కోసం వచ్చాను నేను" వెంటనే అంది.
"యూమీన్ మై హెల్ప్" కనుబొమలెగరేసి ఆశ్చర్యం వ్యక్తం చేసారాయన.
"అవున్సార్. పేపర్ న్యూస్ ఆధారంగా అనుమానం వున్న కేసుపై మళ్ళీ ఎంక్వయిరీ చేయించే పవర్స్ మీకున్నాయి. లా హిస్టరీలో అలాంటి అరుదయిన సంఘటనలు జరిగిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వమయినా, న్యాయవ్యవస్థయినా అమాయక ప్రజల్ని రక్షించటానికేగా? వందలమంది అమాయకులు దారుణంగా చనిపోయారు. ఈ కారణం చూపి మీరు స్టేని వెకేట్ చేయాలని నా అభ్యర్ధన. లేదంటే సారా సిండికేట్స్ స్వార్ధానికి మరింత మంది అమాయకులు బలైపోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం, మా గవర్నమెంట్ తెచ్చిన ప్రొహిబిషన్ జీ.ఓ. మీద స్టే తెచ్చాడు ఆ అబ్బయ్యనాయుడు.
ఆ స్టేని వెకేట్ చేయించండి.... జరిగిన దారుణమైన సంఘటనకు సంబంధించి ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఇది నా రిక్వెస్ట్...." చెప్పి, ఆయన కళ్ళవేపు చూసింది సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి.
"నేను స్టేని వెకేట్ చెయ్యగలను... కేవలం.... రాష్ట్ర ప్రభుత్వం అనుమానాన్ని అభ్యర్ధనను కన్సిడర్ చేస్తూ మాత్రమే నేను స్టేని వెకేట్ చెయ్యగలను... కానీ... ఆ నేరాన్ని లిక్కర్ సిండికేట్స్ మీద మనం వేయడానికి సాక్ష్యాలు కావాలి."
ఆయన ఆ సంఘటనకి కదిలిపోయారు. ప్రజా సంక్షేమం కోసం స్టేని వెకేట్ చేయాలనే నిర్ణయానికొచ్చేసారప్పటికే.
"అందుకే అవసరమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటోంది. సార్- నేరస్తుల్ని హైకోర్టు విధించిన గడువు లోపల నేను ప్రజెంట్ చెయ్యగలను....ఈ విషయంలో డౌట్స్ ని మా అడ్వకేట్ జనరల్ తీరుస్తారు..." చెప్పింది త్రిభువనేశ్వరీదేవి.
ఆలోచిస్తున్నారు చీఫ్ జస్టీస్ సుఖరామ్ కారంత్.... కొద్ది క్షణాలు గడిచాయి.
"ఎడ్వకేట్ జనరల్ ని కోర్టులో కల్సుకోమనండి...." సి.ఎం. త్రిభువనేశ్వరి మనసు ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. లేచి నిలబడింది.
చేతులు ముకుళించి చీఫ్ జస్టిస్ కు నమస్కరించింది.
* * * * *
ఆ రోజే ఉదయం పదకొండున్నర గంటలకి స్టేని వెకేట్ చేసారు న్యాయమూర్తి.
ప్రజా సంక్షేమం దృష్ట్యా, మానవతా దృక్పథంతో ప్రొహిబిషన్ మీద విధించిన స్టేని వెకేట్ చేయటం జరిగింది.
అయితే ఆక్షన్ పిరిడ్ మధ్యలోనే ప్రభుత్వం ప్రొహిబిషన్ విధించింది గనుక, సారా కాంట్రాక్టర్స్ డిపాజిట్స్ ని వాపసు చేయవలసి ఉంటుంది.
వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది. అని తీర్పిచ్చింది హైకోర్టు ధర్మాసనం.
* * * * *
స్టే వెకేట్ అయిందన్న వార్త త్రిభువనేశ్వరీదేవిని అపరిమితమైన ఆనందానికి గురి చేసింది.
అధికారులంతా ఆమె చూపిన విజ్ఞతకు, చొరవకు, వేసిన ఎత్తుకు విస్మయపడ్డారు.
"సారా సిండికేట్స్- వాళ్ళకై వాళ్ళే మనకు అవకాశం ఇచ్చారు. జడ్జీగారు కల్తీసారా చావుల్ని చూసి కదిలిపోయారు. అందుకే మనం స్టేని వెకేట్ చేయించుకోగలిగాం... ఇప్పుడిక అసలు ఆట ప్రారంభమవుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. చెరువు ఎండినప్పుడే చేపలు బయటపడేది. సారా చెరువులు ఎండిపోయాయి- సిండికేట్స్ బయటకొస్తాయిప్పుడు" గర్వంగా అంది సి.ఎమ్.
"కంగ్రాచ్యులేషన్స్ మేడమ్....మీరు తీసుకున్న నిర్ణయం వేసిన ఎత్తు చూపిన చొరవా ప్రశంసనీయం. ఇటు ప్రొహిబిషన్ అమల్లోకొచ్చింది- అటు శతృఘ్న రంగంలోకొచ్చాడు... అసలు యుద్ధం ఆరంభం అయిపోయినట్లే...ఈ విషయంలో మా శక్తి మేరకు మేం మీకు సహకరిస్తాం..." వరదరాజన్ మనస్ఫూర్తిగా అన్నాడు.
"థాంక్యూ మిస్టర్ వరదరాజన్...థాంక్యూ..." అంది త్రిభువనేశ్వరీదేవి రెస్ట్ రూమ్ లో కెళుతూ.
* * * * *
ఆకస్మాత్తుగా డేంజర్ సిగ్నల్ మోగినట్టుగా ఆ ఊరు ఉలిక్కిపడింది ఊరిజనం, ఎక్కడివాళ్ళక్కడే సిమెంటు బొమ్మల్లా నిలబడి పోయారు వింతగా చూస్తూ.
సరిగ్గా సమయం నాలుగు గంటలు.
అప్పటివరకూ ఉన్న ఎండ, చటుక్కున మాయమైపోయింది.
ఊరి ప్రజల్లోనే కాదు. వాతావరణంలోనూ ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు విశాలమైన తారు రోడ్ మీద నాన్ స్టాప్ సైరన్ మోగించుకుంటూ సిమెంట్ కలర్ జీప్ ఆఘమేఘాల మీద వెళ్తోంది.
ఆ వెనక రెండు అంబాసిడర్ కార్లు ఆ కార్లలో వైట్ బ్లూ కలర్ యూనిఫార్మ్ తో చేతుల్లో ఎకె 47 రైఫిల్స్ తో కండలు దీరిన దేహాలతో ఎనిమిది మంది స్పెషల్ ట్రెయిన్డ్ బాడీగార్డులు...
ఆ వెనక-
నాలుగు ఆలివ్ కలర్ కంటెస్సా కార్లు...ఆ కార్ల వెనక మళ్ళీ మరో రెండు అంబాసిడర్ కార్లు.... ఆ కార్ల వెనక... రెండు జీపులు... వెనక ఓ అయిదు మారుతీకార్లు తడ గ్రామం-
ఆంద్రప్రదేశ్ కు, తమిళనాడుకు మధ్య ఎవరూ గీయని సరిహద్దు రేఖలా ఉంది- రోడ్ మీద పరుగులు తీస్తున్న కార్ల బారుని చూసిన- నడుస్తున్న జనం...రోడ్ పక్కన బస్టాండ్ లో చపటా మీద కూర్చున్న జనం... భయంతో లేచి నిలబడ్డారు.