"ఈ వాతావరణం అలాంటిది. డిన్నరు రెడీ అని చెప్పడానికి వచ్చాను" అన్నాడు రమణ.
"డిన్నరా? వీళ్ళేం చేస్తారో, ఏం పెడతారో!" అంది సుభద్ర దిగులుగా.
"ఆ భయం లేదండి. మనం చెబితే ఎలా కావాలంటే అలా వండి పెడతారు" అన్నాడు రమణ.
"మరి మన తిండి అందరికీ సహిస్తుందా?"
"ఎవరికెలా కావాలో అలాగే చేస్తారు."
"అందరికీ తలోరకంగా చేస్తారా, పాపం కష్టం కదూ!"
"కష్టమేముంది? వూరికే చేయరు కదా, డబ్బు తీసుకుంటారు."
"ఎంత తీసుకుంటారేమిటి?"
రమణ నవ్వి, "మీకు తెలుసుకోవాలనుంటే చెబుతాను. మెహర్బానీకి కాదు"
"మొహమాట పడకు. నేనేమీ అనుకోను. నువ్వు మాయింట్లో మనిషికిందే లెక్క." అంది సుభద్ర.
"ఈ బోట్ హౌసులో మనం వారం రోజులుంటాం. మనం మొత్తం నలుగురం. మన నలుగురికీ ఈ వారం రోజులూ కావలసిన భోజనం పెడతారు. కావలసిన చోటుకి తిరగడానికి టాక్సి యిస్తారు. కావాలనుకున్నప్పుడల్లా బోటు షికారు చేయొచ్చు. అందుకు మొత్తం పన్నెండు వేలు."
"పన్నెండు వేలా?" సుభద్ర గుండె ఆగినంతపనైంది.
"కాశ్మీర్లో మనుషులెలా బ్రతుకుతున్నారో?" అంది హాస.
"బోట్ హౌసులోనే ఖరీదెక్కువ. ఈ బోట్లో ఇలాంటి రూమ్స్ వో నాలుగున్నాయి. ఈ బోటును అయిదేళ్ళక్రితం పదహారు లక్షలు ఖర్చు పెట్టి తయారు చేయించార్ట. అదంతా రాబట్టు కోవద్దు! అదీ కాక సీజనులో రేటు కాస్త ఎక్కువ. అస్తమానూ వీటికి గిరాకీ ఉండదు."
"ఏమైనా పన్నెండు వేలు ఎక్కువే!" అంది హాస.
"ఈ సదుపాయాలకు నాకేం ఎక్కువనిపించడం లేదు...." రమణ అన్నాడు.
"నాకూ అనిపిస్తోంది"
"నీకూ అనిపించదు కొన్నాళ్ళలో"
"ఈ రోజుకూ కొన్నాళ్ళకూ తేడా ఏమిటి?"
"నీకూ నాకూ ఉన్న తేడాయే!" అన్నాడు రమణ.
హాస అతడికి బదులివ్వకుండా, "అమ్మా! డిన్నరుకి వెళ్ళేముందు ముఖం కడుక్కుంటావా?" అంది.
"ముందు నువ్వు కడుక్కునిరా!" అంది సుభద్ర.
హాస బాత్రూంలోకి వెళ్ళిపోయింది!
"నువ్వేమీ అనుకోకు బాబూ! అందర్నీ తిరస్కారంగా చూసే మనిషి కాదు మా అమ్మాయి" అంది సుభద్ర.
"తిరస్కారానికి బాధపడనని తెలిసే అలా మాట్లాడుతుంది. ఆమెకు నేనంటే యిష్టమేనని నాకు తెలుసు" అన్నాడు రమణ.
హాస బాత్రూంలోంచి వచ్చింది. సుభద్ర తను వెళ్ళింది ఆమె వచ్చేదాకా రమణ, హాస ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
* * * *
డైనింగు హాల్లో నాలుగు టేబుల్సున్నాయి. ఒకో టేబులు దగ్గర నాలుగు కుర్చీలున్నాయి. ఆ టేబుల్సూ, కుర్చీలూ అలనాటి రాజరికాన్ని గుర్తు చేస్తున్నాయి.
హాల్లో టీ.వీ. వుంది. అందులోంచి ఏవో ఢిల్లీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి.
నడిచి వస్తూంటే సుభద్రకు కర్ర మీద నడుస్తున్న అనుభూతి కలుగుతోంది. తామొక పడవలో ఉంటున్నామన్న భావం ఆమెను విడవడంలేదు. కానీ లోపల ఏర్పాట్లన్నీ ఆమెకు వింతగా ఉన్నాయి. పడవలో అన్ని సౌకర్యాలు సాధ్యమా అని ఆశ్చర్య పడుతోందామె. యిలాగే అయితే మనుషులు నేలమీద మాని నీళ్ళలోనే వుండొచ్చు. అప్పుడే వూళ్ళో కావాలంటే ఆ వూళ్ళోనే యిల్లు మారిపోతుంది. ప్రయాణం కూడా మనింట్లోనే చేయొచ్చు.
నలుగురూ డైనింగ్ టేబులు చేరుకున్నారు. కుర్చీల్లో కూర్చున్నారు.
టేబుల్ మీద ఖరీదయిన అందమయిన పింగాణీ డిన్నరు సెట్టుంది.
బంగాళా దుంపలు, టమోటాలు కలపి వండిన కూర, సాంబారు పొడి వాసన వేసే ముక్కల పులుసు, నిమ్మకాయ, వూరగాయ, గడ్డ పెరుగు, ముత్యాల రాశుల్లా అన్నం.
వాళ్ళకు కాస్త దూరంగా నిలబడి వున్నాడో కాశ్మీరీ నడివయస్కుడు. వాడు రమణతో ఏదో మాట్లాడాడు.
"అతడు వంటవాడు. వడ్డించనా అనడుగుతున్నాడు." అన్నాడు రమణ.
సుభద్ర అతణ్ణి చూసింది. వాడు గంభీరంగా ఆమె వంక చూస్తున్నాడు.
"మనమే వడ్డించుకుందాం" అంది.
అందరికీ హాస, సుభద్ర వడ్డించారు.
"ఈ కూర బాగోలేదే!" అంది హాస.
"ఇది బాగానే వుందమ్మా, కొంచెం కారం తక్కువ అంతే" అంది సుభద్ర.
"ఏమిటో, చపాతీ కూరలా ఉంది" అందీ హాస.
వంటవాడు రమణ దగ్గరగా వచ్చి ఏదో చెప్పాడు.
"వేడివేడి చపాతీలున్నాయట కావాలా?" అన్నాడు రమణ.
హాస వంట వాడి వంక చూసింది. వాడు గంభీరంగా హాసనే చూస్తున్నాడు.
"అమ్మా! ఈ పులుసేమిటో వాడిని అడగవే?" అంది హాస.
వెంటనే రమణ వాడిని అడగబోతే, "అలాకాదు, మా అమ్మే అడగాలి" అంది.
"నాకు భాషరాదు కదే!"
"దీనికి భాషెందుకు? పులుసు చూపించి ఏమిటని అడుగు."
సుభద్ర అలాగే చేసి, "క్యా" అంది.
వంటవాడు జవాబు చెప్పకుండా నవ్వేశాడు.
"అలా నవ్వుతాడేమిటే?" అంది సుభద్ర.
"వాడి ముఖంలో నవ్వు చూడాలనే నిన్ను క్యా అనమంట" అంది హాస.
రమణ ముసిముసిగా తనలో నవ్వుకున్నాడు.
* * * *
భోజనాలయ్యాక బోటు మీదకు వెళ్ళారు.
ఇంటిముందు గార్డెన్లో కూర్చున్నట్లు అక్కడ విశాలమైన ఆవరణ వుంది. దాల్ సరస్సులో బోట్లన్నీ ప్రకాశవంతమై__సరస్సు వజ్రాల హారాలు వేసుకున్న దేవకన్యలా వుంది. దూరంగా రాత్రి కాంతులతో మెరిసిపోతున్న శ్రీనగర్.
"ఇది నిజంగా శ్రీనగరమే! ఇక్కడ పేదరికం కనబడ్డం లేదు." అంది హాస.
"అందుకే భాగ్యవంతులందరూ ఇక్కడికొస్తారు. పేదరికం వాసన తప్పించుకుందుకిలాంటి వూళ్ళే మంచి మార్గం" అన్నాడు రమణ.
"అలాగనుకుంటాం. ఇండియాలో కనపడినా కనపడకపోయినా ప్రతిచోటా పేదరికం ఉంటూనే వుంటుంది" అంది హాస.
"కానీ యిక్కడ లేదు" అన్నాడు రమణ.
"అందం రోగాన్ని దాచగలదు. కానీ ఏదో ఒకరోజున రోగం ఆ అందాన్ని కబళించగలదు. రోగాన్ని నిర్మూలించకుండా అదుపులో వుంచిన అందమయిన నగరమిది" అంది హాస.
"కనిపించని రోగం గురించి ఆలోచించకపోతే మన నవ్వులో జీవముండదు" అని నవ్వింది.
ఆమె ఎందుకు నవ్విందో అర్ధం కాలేదు రమణకి. కానీ ఎప్పుడు నవ్వినా, ఎందుకు నవ్వినా నవ్వామె ముఖానికి సహజంగానే వుంటుంది.
"బాగా చలిగా ఉంది, లోపలకు పోదాం!" అంది సుభద్ర.
అప్పుడే హాసకూ చలి వేసింది.
* * * *
రాత్రి పది గంటలు.
సాయంత్రం పడుకున్న మూలానో ఏమో హాసకు నిద్రపట్టటం లేదు. తల్లివేపు చూస్తే ఆమె తదేక దీక్షతో తననే చూస్తున్నట్లనిపించింది.
"అలా చూస్తున్నావేంటమ్మా?" అంది హాస.
"నిన్ను చూస్తుంటే నువ్వు నా కూతురివేనా అనిపిస్తోంది."
"ఎందుకు?"
"ఎలా వచ్చిందే నీకింత అందం?" అంది సుభద్ర. అంతే ఆమె గొంతులో తడి ప్రారంభమయింది.
"నీ అందమే నాకొచ్చింది" అందామె.
సుభద్ర తనను తాను తమాయించుకునేందుకు ప్రయత్నిస్తోంది. బదులిస్తే ఏడుపు గొంతు తెలిసిపోతుందని భయపడిందామె.
"అమ్మా! అమ్మలందరూ యింత అందంగా ఉంటారా? లేక నువ్వు మాత్రమే యింత అందంగా ఉన్నావా?"
"మంచం ప్రక్కనే స్విచ్ వుంది. సుభద్ర లైటార్పేసి, అతి కష్టమయిన గొంతు పెగిల్చి, "పడుకో, నాకు నిద్రొస్తోంది" అంది.
"బాత్ రూమ్ కెళ్ళి వచ్చి పడుకుంటాను" అందామె.
హాస లేచి బాత్రూంకి వెళ్ళిన కొద్ది క్షణాల్లో ఆగకుండా దగ్గొచ్చింది.
సుభద్ర కంగారుపడి లైటువేసి బాత్రూమ్ తలుపు తట్టింది.
దగ్గు ఆగింది. బాత్రూం తలుపు తెరుచుకుంది.
హాస ముఖం అదోలా వుంది. ఆమె చేతిలో రుమాలు.
"దగ్గాపుకోలేకపోయానమ్మా! రుమాలడ్డం పెట్టుకుంటే ఏమిటో ఇదిలా ఎర్రబడింది" అందామె.
సుభద్ర ఆత్రుతగా ఆ రుమాలందుకుని చూసింది.
ఆమె కళ్ళలో నీళ్ళు తిరగటం హాస గమనించింది.
"ఇలా ఇదివరకెప్పుడైనా జరిగిందా?" అంది సుభద్ర.
"లేదమ్మా_ఇదే మొదటిసారి...."
సుభద్ర తనలో తనే గొణుక్కుని_ "ఇప్పుడు తేలిగ్గా ఉందా?" అంది.
"ఊఁ" అని బుద్ధిగా, అమాయకంగా తలూపిందామె.