Previous Page Next Page 
హిమసుందరి పేజి 34

    "ఈ తలనొప్పి మూడు నెలలక్రితం వచ్చింలాంటిదే కదూ!"

    "అవును. అదే తల - అదే తలనొప్పి అచ్చం అలాగే వచ్చింది."

    "మీకు శీత పైత్య జ్వరం కదూ!"

    "అవును..... అహ...... కాదు కాదు...... శీత పైత్యజ్వరం వచ్చేటట్లు వుంది. నోరంతా మంట..... అబ్బే..... కాదు కాదు చలి. భరించరాని చలి...... ఉహుహూ....."

    "ముందా ఉహుహూలు ఆపండి!" సీత గద్దించింది.

    "చలి...... ఉహుహూ- చలి......ఉహుహూ- కప్పుకుని పడుకుంటే గాని.....ఉహుహూ..... తగ్గదు....." అంటూ రామకృష్ణ కుర్చీలోంచి లేవబోయాడు.

    "కూర్చోండి!" మళ్ళి అరిచింది సీత.

    "చ.....చ.....చలి!"

    "గుప్పెడు లవంగాలు నమిలారు. ఇంకేం చలి. ఈ సరికి వంటికి బాగా వేడి వచ్చి వుంటుంది."

    "అది..... అది....."

    "చాలించండి మీ నాటకాలు!" మళ్ళి అరిచింది సీత.

    రామకృష్ణ నోరు మూసుకున్నాడు.

    "మీకు తలనొప్పి కదూ?"

    "నిజం సీతా!" ఆనందంగా చెప్పాడు రామకృష్ణ.

    "చాలా ఎక్కువగా వుంది కదూ?"

    "అవును సీతా!"

    "మీకు తలనొప్పి కదూ?" మళ్ళి అదే ప్రశ్న వేసింది సీత.

    "నిజం సీతా!"

    "చాలా ఎక్కువగా వుంది కదూ?"

    "అవును సీతా!"

    "మీకు తలనొప్పి కదూ?"

    "ఏమిటి సీతా! అడిగింది మళ్ళి మళ్ళి అడుగుతావ్! నిజంగా తలనొప్పి వచ్చేలా!....." అని రామకృష్ణ నాలుక కొరుక్కున్నాడు.

    "నేరస్తులచేత నిజం చెప్పించటానికి సాధారణ పోలీసులు ఉపయోగించే చిన్న ట్రిక్ యిది!" సీత వీలయినంత వ్యంగ్యంగా అంది.

    రామకృష్ణ ముఖం చిన్నబోయింది.

    "మీకు తలనొప్పి లేదు."

    "మీకు చలి లేదు."

    "మీకు శీత పైత్యజ్వరం వచ్చే సూచనలు అసలు లేవు."

    "మీరు అబద్ధం ఆడుతున్నారు."

    "ఆ అబద్ధం ఆడుతున్నారు."

    సీత టక టక అడిగింది.

    రామకృష్ణ రెండు గుటకలు మింగి చాతగాని నవ్వొకటి నవ్వాడు. "నిన్ను ఏడిపిద్దామని, చాలా పెద్ద తమాషా చేద్దామని గొప్ప ప్లాను వేసుకున్నాను. ఇది జోక్ - అంతే!"

    "నమ్మమంటారా?" సీత తిన్నగా చూస్తూ అడిగింది.

    "నిజం సీతా! ఇదివరకు నిజంగా తలనొప్పి వచ్చింది. ఈ రోజు ఆ రోజులాగా తమాషా చేద్దామని....."

    "రెండో తప్పు అబద్దాలాడటం - అవునా?" సీత అడిగింది.

    రామకృష్ణకి యింకేం మాట్లాడాలో తెలియకుండాపోయింది.

    "ఏం జరిగింది? ఎందుకు నాతో అబద్ధాలు చెపుతున్నారు? ఇలా తిన్నగా నా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి" అంటూ సీత రామకృష్ణ దగ్గరకు వచ్చింది.

    రామకృష్ణ ముఖం పక్కకు తిప్పుకుని "ఏం లేదు" అన్నాడు ఆ అన్న తీరు కూడా గొణిగినట్లు వుంది.
    "ఏం జరిగిందండీ?" సీత రామకృష్ణ భుజమీద చేయివేసి అడిగింది.

    రామకృష్ణ పెదవులు బిగించుకుని వుండిపోయాడు.

    "మీ పెదవులకేమయింది?" సీత అనుమానంగా అడిగింది.

    ఏమీ కాలేదు - అన్నట్లు రామకృష్ణ తల అడ్డంగా తిప్పాడు.

    సీత కళ్ళముందు ప్లాష్ వెలిగింది. "అదన్నమాట అసలు విషయం" అనుకుంది.

    "మీరెందుకిలా అబద్ధాలు ఆడటం - నాటకాలుపోవటం! మీరు నిజం చెప్పకపోయినా మీ నోరు చెప్పింది.జరిగింది నాకు తెలుసు. దాచాలన్నా వాసన దాగదు!" గాంభిర్యంగా అంది.

 Previous Page Next Page