ఈ తఫా కొయ్యబారిపోవటం రామకృష్ణవంతయింది. తను సిగరెట్టు తగినట్లు సీత అనుకుంటున్నది. తనేమో అది గ్రహించక నిజం చెప్పేశాడు. సీతకి అలవాట్లు అంటే మహా భయం. ఓసారి ఓ చెడు అలవాటుకి బానిస అయితే ఆ అలవాటుతో ఇల్లు, వళ్ళు గుల్ల చేసుకుని మొత్తం శాల్తియే ఎగిరిపోతుందేమోనని మహా మహా భయం. సిగరెట్టు తాగడం చెడ్డ అలవాటు అంటుంది. ఇంక తాగుడు దాకా పోతే చెప్పేదేముంది?
సీత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గిరుక్కున వెనుతిరిగి ఆ గదిలోంచి వెళ్ళిపోయింది.
రామకృష్ణ నెత్తిన చేతులు పెట్టుకుని అలాగే కుర్చీకి అతుక్కుపోయాడు.
15
"షీతా!"
"ఏయ్ సీసా! చంపుతా! నా మాటకి ఎదురు షెప్పావంటే అంతే షంపి పారేస్తా!"
"ఏంటే పీతా! బిరడా తీసిన షీషాకాయ ముఖమూ నీవూను! ఇష్, నా మాటకి ఎదురు షెప్పావంటే, షావగొట్టి షెవులు మూషి. ఆయ్, మాటాడకు. నీకే షెప్పేది. లే లేచి ఈ గళాసులో ఆ సీసాకాయలోది వంపి యివ్వు. ఆ తర్వాత జయమాళిని నృత్యం చెయ్యి. పాట పాడాలి తెలుసా!
కౌగిళి కైలాసము.
నీ కౌగిళి భూలోకము.
రామా! కృష్ణా! రామకృష్ణా! రామకృష్ణా!
రామకృష్ణ మరో సీనులో తాగివచ్చి సీతని చావచితక కొట్టాడు పిల్లలు నలుగురు భయంతో ఆ మూల ఈ మూల నక్కి కూర్చున్నారు. ఎవరి వంటిమీద వున్నాయి. సీత కట్టుకున్న చీరమీద వంద చినుగులు.
రామకృష్ణ మరో సీనులో దగ్గుతున్నాడు. దగ్గి దగ్గి గిద్దెడు రక్తం భోల్లున వాంతి చేసుకున్నాడు. సీత రామకృష్ణని వళ్ళోకి తీసుకుంది. సీత ఏడుస్తుంటే "ఎందుకు సీతా! ఏడుస్తావు. వకరు వెనుక వకరు ముందు. నేనింకా బతికి వున్నానని భ్రమ పడుతున్నావా? పిచ్చిదానా! నేను ఎప్పుడో చచ్చిపోయాను. నా వంట్లో పారుతున్నది చీము, నెత్తురు కాదు, విస్కీ, బ్రాందీలు." అని మళ్ళి భళ్లు భళ్ళున దగ్గాడు. ఈ తఫా కూడా మళ్ళి గిద్దెడు రక్తం పడింది.
అలాగే మరో భయంకరమైన సీను.
ఇంకో సీను.
ఇంకో సీను.......
ఇదంతా నిజంగా జరిగింది కాదు
ఇదంతా ముందు ముందు జరగబోయేది కాదు.
ఇదంతా ముందు ముందు యిలా జరగవచ్చని వూహించుకుంటూ భయపడుతూ సీతామనోహరి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నది.
సీతకి మొదటినుంచీ అలవాట్లు అంటే చచ్చేటంత భయం. ఆ తర్వాత అసహ్యం. మనుషులు అలవాట్లకి తొందరగా బానిసలు అవుతారని యింట్లో లక్షాధికారులు కూడా బిక్షాధికారులు కావటం యిల్లు వళ్ళు గుల్ల కావటం, దీర్ఘరోగాలతో మరణించటం. సంసారం వీధికెక్కటం. చెట్టుకొకరు పుట్టకొకరు.......
ఇలాంటి ఆలోచనలు సీత నర నరాన జీర్ణించుకుని వున్నాయి.
రామకృష్ణకి ఏ అలవాట్లూ లేవని తెలిసి చాలా సంతోషించింది. అలాంటిది యిప్పుడు తాగి వచ్చాడు. మూడు నెలల క్రితం కూడా తాగి వచ్చాడు. నోరు వాసన రాకుండా వుండటానికి అమృతాంజనం ముఖమంతా పూసుకున్నాడు. అంతేగాని తాగానని నిజం మాత్రం చెప్పలేదు. సిగరెట్టే దరిద్రం అనుకుంటే అంతకన్నా దరిద్రం తాగుడు తాగటం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, అప్పుడే అబద్దాలాడటం నేర్చుకున్నాడు ఒకసారి తాగంగానే అలవాటు అయిపోయింది. తాగింది సిగరెట్టు కూడా కాదు బ్రందియో విస్కియో!